ఆంధ్రప్రదేశ్: మోదీని మెప్పించిన ఏటికొప్పాక రంగుల బొమ్మలు... ఆ రంగులు కళాకారుల జీవితాల్లో ఎందుకు లేవు?

ఏటికొప్పాక బొమ్మలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

వంటచెరకుగా కూడా పనికిరాని అంకుడు కర్రతో అద్భుత కళాఖండాలను తయారు చేస్తారు ఏటికొప్పాక కళాకారులు. భారతీయల సృజనకు, సంస్కృతీ సంప్రదాయాలకు వారి ప్రతిభ అద్దం పడుతుంది. ఓ చిన్న గ్రామంలో మొదలైన ఈ కళ ప్రధాని మోదీని సైతం ఆకట్టుకుంది.

విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక గ్రామం.. అంకుడు కర్రను అందమైన బొమ్మగా మలిచే కళాకారుల నిలయం. ఈ బొమ్మలకి 400 వందల ఏళ్ల చరిత్ర ఉంది. వరహానది పక్కనే ఉన్న ఈ గ్రామంలో నది ప్రవాహంతో సమానంగా చెక్కని చెక్కుతున్న శబ్దాలూ నిరంతరం వినిపిస్తాయి. సహజ రంగులతో తయారైన లక్క బొమ్మలు మనతో ముచ్చట్లాడతాయి. సూదిమొన పరిమాణంలోని కళాఖండాలను సృష్టించే ఏటికొప్పాక హస్త కళాకారుల నైపుణ్యం ఔరా అనిపిస్తుంది. జీవితకాలం అపురూపంగా దాచుకునేలా ఉండే ఈ బొమ్మలను తయారు చేయడం ఇక్కడి కళాకారులకి లక్కతో పెట్టిన విద్య.

ఏటికొప్పాక బొమ్మలు

ప్రధాని చెప్పారని ఇంత దూరం వచ్చాను

ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' లో ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను ప్రస్తావించారు. ఏటికొప్పాక బొమ్మలు పీచు లేకుండా, నునుపుగా ఉంటాయనీ దీని వలన పిల్లలకు ఎలాంటి గాయాలూ కావని చెప్పారు. ఈ పరిశ్రమ కోసం ఏళ్లుగా కృషి చేస్తూ... పలు పరిశోధనలు చేస్తున్న సి.వి.రాజు అనే కళాకారుడి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. దీంతో ఏటికొప్పాక గొప్పతనం తెలుసుకునేందుకు చాలా మంది ఈ గ్రామానికి వస్తూ...ఇక్కడి బొమ్మల ప్రత్యేకతలను, కళాకారుల పనితీరునూ తెలుసుకుంటున్నారు.

వీడియో క్యాప్షన్, వంటకు కూడా పనికిరాని కర్రతో జీవకళ ఉట్టిపడే బొమ్మలు.. 'ఏటికొప్పాక' విశేషాలు ఇవీ

ఏటికొప్పాక బొమ్మలు చూడటం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన లిఖిత లహరి బీబీసీతో మాట్లాడారు. "భారతీయ సంప్రదాయలను మేళవించి తయారు చేస్తున్న ఈ బొమ్మలను కొనడం గర్వంగా అనిపిస్తోంది. ప్రధాని మోదీ చెప్పిన తర్వాత ఇక్కడికి రావాలనిపించింది. వీటి క్వాలిటీ, డిజైన్‌ను మిగతా వాటితో పోల్చలేం. ధర కూడా తక్కువగానే ఉంది. స్థానిక కళాకారులు తయారుచేస్తున్న అద్భుతమైన ఈ బొమ్మలను కొనడం ఆనందంగా ఉంది" అని ఆమె అన్నారు.

ఏటికొప్పాక బొమ్మలు

400 ఏళ్ల కళకి...30 ఏళ్లుగా సహజ రంగులు

అంకుడు కర్ర ఎక్కువగా దొరికే ఏటికొప్పాక పరిసర ప్రాంతాలకు 400 ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు వచ్చి...బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాయి. క్రమంగా ఆ సంఖ్య పెరిగి ఊరివారంతా బొమ్మల తయారీని నేర్చుకునేలా చేసింది.

అయితే కాలంతోపాటు ఈ బొమ్మలకీ ఆదరణ తగ్గింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో చాలా మంది ఈ వృత్తిని విడిచిపెట్టారు. 1990 వరకు ఈ బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. అయితే ఆ గ్రామానికి చెందిన సీవీ రాజు (చింతలపాటి వెంకటపతిరాజు) అప్పటివరకు వినియోగిస్తున్న రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా సహాజ రంగుల తయారీని గ్రామంలోని కళాకారులు నేర్చుకుని బొమ్మలకు వాటిని అద్దడం ప్రారంభించారు. దీంతో ఏటికొప్పాక బొమ్మల అందం వంద రెట్లైయ్యింది.

"ప్రధాని నోట నా పేరు రావడం సంగతి అటుంచితే...ఈ కళ భవిష్యత్తులో కూడా ఉండాలంటే... సహజ రంగులను వాడుకోగలిగే సాంకేతికతను అభివృద్ధి చేయడంతోపాటు దీనికి సంబంధించిన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాదు దీన్ని ఒక విద్యగా కూడా అందించాలి. వీటి కోసం ఒక ఫ్లాట్ ఫామ్‌ని తయారు చేయాలి. 2017లో ఈ బొమ్మలకు జీయోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చింది. అయితే అది సరిపోదు. వ్యాపారపరంగా ఈ బొమ్మలు విదేశాలకు ఎగుమతి అవ్వాలంటే వీటి తయారీలో ఉపయోగించే రంగులు ప్రమాదకరం కావనే సర్టిఫికెట్ ఉండాలి. పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సీకాలజీ నుంచి ఈ సర్టిఫికేట్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడి కళాకారులతో కలిసి డిజైన్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి" అని అన్నారు.

ఏటికొప్పాక బొమ్మలు

రాంచీ నుంచి లక్క...తూర్పు కొండల నుంచి రంగులు

సాధారణంగా రసాయన రంగులతో పోలిస్తే సహజమైన రంగులే ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. కేవలం ఒక చిన్న పొయ్యి, మనకు లభించే ఉసిరి, కరక్కాయ, వేపవంటి వాటితోనే పరిశోధనలు చేసి...సహజ సిద్ధమైన రంగులను తయారు చేస్తారు.

"సహజమైన లక్క ఎక్కువగా రాంచీ నుంచి వస్తుంది. అక్కడ ఒక రకమైన సూక్ష్మక్రిమి విసర్జితాల నుంచి ఇది లభిస్తుంది. దాన్ని స్థానిక గిరిజనులు సేకరించి, అమ్మకాలు చేపడతారు. ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం, కలుపు నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతాం. 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లక్కని వేడిచేసి, రంగుని కలిపి...దాన్ని బొమ్మలకు అద్దుతాం. గది ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేస్తే ఈ రంగులు ఎంత కాలమైనా పాడవకుండా ఉంటాయి." అని సహజరంగులు ఎలా చేయవచ్చో సీవీ రాజు బీబీసీకి చెప్పారు.

ఏటికొప్పాక బొమ్మలు

ఆధునిక పరికరాలతో శిక్షణ కావాలి

ప్రధాని చెప్పినట్టు దేశీయ ఆట బొమ్మల తయారీని భారీగా పెంచాలంటే ప్రభుత్వాల నుంచీ చేయూత ఉండాలని ఏటికొప్పాక హస్త కళాకారులు అంటున్నారు. లక్కబొమ్మల తయారీకి ఉచిత విద్యుత్‌ను అందించడంతో పాటు... కీలకమైన అంకుడు కర్ర, లక్కను రాయితీ మీద సరఫరా చేయాలని ఏటికొప్పాక లక్కబొమ్మల కో-ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షుడు రమణబాబు బీబీసీతో అన్నారు.

"చాలా ఏళ్ల నుంచే ఏటికొప్పాక లక్క బొమ్మల సొసైటీ ఇక్కడ ఉంది. నిర్వాహణ కష్టమై 2010లో అది మూతపడింది. ఇప్పుడు మళ్లీ గ్రామంలోని కళాకారులు అంతా కలిసి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజనలో భాగంగా 2020 మే నుంచీ దీన్ని తిరిగి ప్రారంభించాం. ఈ సోసైటీ ద్వారా స్థానిక కళాకారులకు శిక్షణను ఇవ్వడంతోపాటు వారు తయారు చేసిన బొమ్మలను అమ్మకాలకు పెడతాం. ఈ సోసైటీ నిలదొక్కుకోవాలంటే అధునాతన యంత్రాలతోపాటు కళాకారులకి డిజైనింగ్‌లో శిక్షణ కూడా అవసరం. నిధులు ఉంటే కొత్త కొత్త ప్రయోగాలు చేసి మరింత సృజనాత్మకతో బొమ్మలను తయారు చేయగలం. అలాగే మార్కెటింగ్ కూడా మాకు మేమే చేసుకోగలం"అని ఆయన చెప్పారు.

ఏటికొప్పాక బొమ్మలు

బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ....

ఏటికొప్పాకలోని ప్రతి ఇంటిలో బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడు బొమ్మల తయారీ చేస్తుంటారు. మరికొందరు మాత్రం దీన్నే వృత్తిగా చేస్తున్నారు. క్రాప్ట్ వర్కర్స్‌గా పని చేస్తున్న రేవతి, లక్ష్మీలు బీబీసీతో మాట్లాడారు.

"మేం పెద్దగా చదువుకోలేదు. పెద్దోళ్ల నుంచి ఈ కళను నేర్చుకున్నాం. ఒక వైపు ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ...క్రాప్ట్ వర్క్ కూడా చేసి...ఇందులో వచ్చే ఆదాయంతో పిల్లలను చదివించుకుంటున్నాం. కర్ర నుంచి రంగుల వరకు అన్నీ మేమే తెచ్చుకుని... రోజుకు 500 రూపాయల విలువైన బొమ్మలను తయారు చేస్తుంటాం. అందులో అన్నీ పోగా మాకు 200 రూపాయలు మిగులుతాయి. కోవిడ్-19 కారణంగా స్థానికంగా అమ్మకాలు జరగడం లేదు. ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశమైనా ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది." అని చెప్పారు.

ఏటికొప్పాక బొమ్మలు

అంకుడే ఆధారం...

ఏటికొప్పాక బొమ్మలకు అంత పేరు రావడానికి ప్రధాన కారణం వాటి తయారీకి ఉపయోగించే అంకుడు కర్రే. నిజానికి అంకుడు కర్రని ఏటికొప్పాక బొమ్మల తయారీకి తప్పా...మరే పనికీ వాడరు. కనీసం వంటచెరకుగా కూడా దీన్ని ఉపయోగించరు. ఇది వెంటనే కాలిపోయి తక్కువ వేడిని ఇవ్వడమే ఇందుకు కారణం. కానీ ఏటికొప్పాక బొమ్మల తయారీకి మాత్రం ఇదే ప్రాణమని క్రాప్ట్ వర్కర్ నాగేశ్వరావు బీబీసీతో చెప్పారు.

"అంకుడు కర్రతో చేసిన బొమ్మలకు లక్కతో ఫినిషింగ్ చేస్తే చాలా బాగుంటాయి. కర్ర నునుపుగా ఉండటం, పీచు లేకపోవడం, గట్టిగా ఉంటూనే బరువు తక్కువ ఉండటం, కర్రంతా ఒకే రంగులో ఉండటం... మొదలైనవి దీనికి ఉన్న ప్రత్యేక లక్షణాలు. అయితే ఇప్పుడు అంకుడు కర్ర దొరకడం కష్టమైపోతోంది. ధరలు కూడా బాగా పెంచేశారు. దీని మీద రాయితీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం"అని ఆయన చెప్పారు.

ఏటికొప్పాక బొమ్మలు

తిరుమల వెంకన్నకు రంగేస్తే 40 రూపాయలు...

కర్రను బొమ్మగా మలచడం ఒక ఎత్తు. ఆ బొమ్మకు రంగులద్ది ప్రాణం పోయడం మరో ఎత్తు. ఏ బొమ్మకు ఏ రంగు బాగుంటుందో ఎంచుకోవడంతోపాటు దాన్ని ఒద్దికగా బొమ్మకు వేయడం కళాకారుడి ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. అయితే రంగుల ద్వారా ఏటికొప్పాక బొమ్మలకి చేకూరే వెలుగు...అది వేసే కళాకారుడి జీవితంలో మాత్రం ఉండటం లేదు.

"నేను ఈ బొమ్మలకు గత 30 ఏళ్లుగా రంగులేస్తున్నాను. పెద్ద వెంకటేశ్వరుడి బొమ్మకు రంగు వేస్తే 40 రూపాయలు ఇస్తారు. అదే చిన్న బొమ్మలైతే 20, కొంచెం పెద్దవైతే 30 రూపాయలు ఇస్తారు. దేనికి రంగేసినా... రోజు మొత్తానికి 200 నుంచి 300 రూపాయలు మాత్రమే మిగులుతోంది. ఏటికొప్పాక లక్కబొమ్మల సొసైటీ ద్వారా మాకు తక్కువ రేటుకి కలప, రంగులు అందజేస్తే పెయింటింగ్‌తోపాటు బొమ్మలను కూడా తయారుచేయగలుగుతాను"అని బొమ్మలకు రంగులద్దే కళాకారుడు రాంబాబు బీబీసీతో అన్నారు.

ఏటికొప్పాక బొమ్మలు

అవార్డులని పండించే కళ

ఏటికొప్పాక కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి.. మైక్రో ఆర్ట్స్ చేయడంలో నిపుణుడు. బొమ్మలో బొమ్మ అమర్చే విధంగా కర్రతో చేసిన 50 గుడ్లను ఒకదానిలో మరొకటి పెట్టేలా చేసిన కళాకృతికి 2003 జాతీయ హస్త కళల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. అలాగే అనేక అవార్డులు పొందిన బియ్యపు గింజమీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్ మహల్, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామ పట్టాభిషేకం, 5.5 మీమీ పరిమాణంలో తయారుచేసిన అతి చిన్న చెస్ బోర్డు, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మినీయేచర్ ఆర్టులను ఆయన తయారు చేశారు. ఇవి కంటికి కనిపించవు. కెమెరాకి చిక్కవు. మెక్రో స్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం. సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012 లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది.

ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2016లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్‌ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి తన ఫోటో పెట్టి తయారు చేసిన లక్క డబ్బాని చూసి ముచ్చటపడి దాని మీద సంతకం కూడా చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు ఇక్కడి కళాకారులకు చాలానే వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)