కపుల్ చాలెంజ్: ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్తపడండి’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రమణికి (పేరు మార్చాం) తన స్నేహితురాలి నుంచి శారీ చాలెంజ్‌లో పాల్గొనమని ఫేస్‌బుక్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో పాల్గొనమని అడిగింది తన స్నేహితురాలే కావడంతో మరో ఆలోచనకు తావివ్వకుండా ఆమె తన ఫోటోను పోస్ట్ చేశారు.
తన స్నేహితురాలి సంతోషం కోసం ఆ పని చేస్తున్నానని ఆమె అనుకున్నారు.
రమణి తెలుగు టెలివిజన్ సీరియళ్లలో నటిస్తుంటారు కూడా. ఆమె ఫొటోలుసోషల్ మీడియాలో ఉండటం చాలా సాధారణమే.
కానీ, అకస్మాత్తుగా ఆమె ఫోటో చైనాకు చెందిన ఎఫ్ఏ చాట్ అనే ఒక కమర్షియల్ యాప్‌లో కనిపించింది. ఆ ఫొటో కింద "నాతో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి" అంటూ రాసి ఉన్న ప్రకటన కూడా కనిపించింది.
ఏం చేయాలో? ఎవరికి చెప్పాలో ఆమెకు అర్ధం కాలేదు.
గతంలో కూడా ఆమె ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు బీబీసీతో చెప్పారు.
“సెలబ్రిటీస్‌తో ఒక రాత్రి గడపాలనుకుంటే మాకు ఫోన్ చేయండంటూ ఒక వెబ్‌సైటులో నా ఫోటోలు కనిపించాయి” అని ఆమె అన్నారు.
తన భర్త వెంటనే ఆ నంబర్‌కి ఫోన్ చేసి తాను ఆ అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నానంటూ ఓ వినియోగదారుడిలా వారిని సంప్రదించారని ఆమె చెప్పారు.
‘‘వాళ్లు ‘ఆ అమ్మాయి ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉంది. కావాలంటే వేరే అమ్మాయిలు ఉన్నారు’ అంటూ వేరే అమ్మాయిల ఫోటోలను పంపించారు. లేదు ఆ అమ్మాయే కావాలని ఆయన రెట్టించి అడగగానే, లేదు సర్, ఆ అమ్మాయి ఈ మధ్యనే మానేశారు. కావాలంటే వేరే వారు ఉన్నారు వాళ్లు జవాబిచ్చారు’’ అని రమణి వివరించారు.
‘‘వాళ్ల అక్రమ కార్యకలాపాలకు మాలాంటి వాళ్ల ఫోటోలు వాడుతున్నారని అర్ధమై, పోలీసుల సహాయంతో ఆ ఫోటోలు అన్నీ సైట్‌లోంచి తొలగింపజేశాం’’ అని ఆమె చెప్పారు.
“కానీ, నా భర్త నన్ను నమ్మకపోయి ఉంటే ఏమై ఉండేది?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, REUTERS
ఫోటో ఛాలెంజ్ ఏమిటి?
దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి శారీ చాలెంజ్, కపుల్ చాలెంజ్, బ్లాక్ & వైట్ చాలెంజ్, డాటర్స్ ఛాలెంజ్ అంటూ వివిధ రకాల ఫోటో చాలెంజ్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. నెటిజన్లు ఆ ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు చాలెంజ్లో పాల్గొనమని మరో పది మందికి ఇదే సవాలు విసురుతుంటారు. ఇలా కొన్ని వేల ఫోటోలు వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్టు అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ఇటీవల కపుల్ చాలెంజ్ విపరీతంగా ప్రాచుర్యం పొందింది.
ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే కపుల్ ఛాలెంజ్ పేరుతో ఇప్పటి వరకు వేల ఫోటోలు షేర్ అయ్యాయి. ఇదే ఛాలెంజ్ ఫేస్‌బుక్, ట్విటర్లలో కూడా నడుస్తోంది.
దీన్ని విమర్శిస్తూ కూడా నెటిజన్లు అనేక రకాల ఫోటోలను, మీమ్‌లను పోస్టు చేస్తున్నారు. కొంత మంది సెలెబ్రిటీల ఫోటోలను తమ ఫోటోల పక్కన పెట్టి కూడా కపుల్ చాలెంజ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు.
ధైర్యం ఉంటే మీ ఎక్స్ తో ఫోటో పెట్టండి అంటూ ఇంకొంత మంది సెటైరిక్‌గా సవాలు విసురుతున్నారు.
అన్నిచాలెంజ్‌లూ చెడ్డవే కావు..
ఫేస్‌బుక్ పదో వార్షికోత్సవ సమయంలో యూజర్లను కూడా పదేళ్ల వ్యత్యాసంతో ఉన్న ఫోటోలను పోస్టు చేయమంటూ #10 యియర్స్ చాలెంజ్‌ని విసిరింది. దానికి కొన్ని లక్షల మంది యూజర్లు స్పందించి తమ ఫోటోలు పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇన్‌స్టాగ్రామ్‌లో జులై నెలలో “చాలెంజ్ ఆక్సెప్టెడ్” అంటూ ఒక బ్లాక్ & వైట్ ఫోటో చాలెంజ్ వైరల్ అయింది.
టర్కీలో జరుగుతున్న మహిళల హత్యలకు నిరసనగా గళమెత్తడం కోసం టర్కీకి చెందిన సమాజ సేవికురాలు జేసన్ రేచెల్ దీన్ని మొదలుపెట్టారు.
“మనం కూడా ఈ అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తూ , మహిళలే మహిళలకు మద్దతుగా నిలబడి ఐక్యం కావాలి" అంటూ ఆమె ఈ ఛాలెంజ్ ద్వారా పిలుపునిచ్చారు.
క్రిస్టెన్ బెల్, జెన్నిఫర్ గార్నర్ లాంటి సెలెబ్రిటీలు కూడా ఇందులో పాల్గొనడంతో ఈ చాలెంజ్ మరింత వైరల్ అయింది.
అయితే, మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఏ విధమైన పోరాటమూ చేయకుండానే చాలా మంది కేవలం బ్లాక్ & వైట్ ఫోటోలు పోస్టు చేసి ఫెమినిస్టులుగా చాటుకుంటున్నారని కొంత మంది మహిళా ఉద్యమకారులు విమర్శలు కూడా చేశారు.
ఈ ఫోటోలు పోస్టు చేయడంతో పాటు ఆ రంగంలో పని చేస్తున్న స్వచ్చంద సంస్థలకు తమ సేవలు అందించటం లాంటివి చేస్తే మంచిదని కూడా కొంత మంది సూచనలు చేసారు.
పోలీసుల హెచ్చరిక
అయితే ఇలాంటి చాలెంజ్‌లలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త వహించమంటూ పుణె సిటీ పోలీసులు ట్విటర్ వేదికగా హెచ్చరిక చేశారు.
"మీ భాగస్వామితో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఒక చిన్న చాలెంజ్ కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మీ చిత్రాలను మార్ఫ్ చేసి పోర్న్, డీప్ ఫేక్ సైట్లలో వాడే అవకాశం ఉంది” అంటూ హెచ్చరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దీని గురించి వారి దృష్టికి ఏమైనా కేసులు వచ్చాయా అంటూ పుణె పోలీసులను బీబీసీ సంప్రదించింది.
అయితే, కపుల్ చాలెంజ్ గురించి ప్రత్యేకంగా ఏమీ ఫిర్యాదులు రాలేదని, పుణె సైబర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జైరాం పాయ్ గుడే చెప్పారు. ప్రొఫైల్ పిక్చర్లను వాడుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులైతే వచ్చాయని ఆయన అన్నారు.
దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రజలను జాగ్రత్త వహించమని హెచ్చరించామని ఆయన చెప్పారు.
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏమంటున్నారు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఈ అంశంపై సంప్రదించగా ప్రత్యేకంగా కపుల్ ఛాలెంజ్ గురించి కేసులేవీ తమ దృష్టికి రాలేదని రాచకొండ పోలీస్ ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి మామిళ్ళ చెప్పారు.
తెలంగాణలో కొంత మంది పోలీసు ఆఫీసర్ల ప్రొఫైల్‌లను కూడా హ్యాక్ చేసి, కొందరు సోషల్ మీడియాలో వేరేవారికి రిక్వెస్ట్ లు పంపుతున్న అంశం గమనించామని ఆయన వివరించారు. దీనిపై పోలీసు శాఖలోని అందరినీ అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
బాధితులకు మోసం గురించి త్వరగా తెలియకుండా, సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించని వారి ప్రొఫైల్‌లను హ్యాక్ చేస్తారని ఆయన చెప్పారు. వారి ప్రొఫైల్‌లతో రిక్వెస్ట్‌లు పెట్టి డబ్బులు అడుగుతారని చెప్పారు.
ఈ కారణాల చేత సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు మానసికంగా చాలా ప్రభావితులవుతారని, ఆత్మ విశ్వాసం కోల్పోయి,నలుగురితో కలవడానికి ఇష్టపడరని సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తున్న చెన్నైకి చెందిన సోషల్ వర్కర్ శబరిత చెప్పారు.
ఇటీవల తమ దృష్టికి వచ్చిన ఒక ఉదంతాన్ని ఆమె ఉదాహరణగా చెప్పారు.
‘‘ఒక అమ్మాయికి ఆన్‌లైన్‌లో ఒక అబ్బాయితో పరిచయమైంది. ఇద్దరూ ఫోటోలు షేర్ చేసుకున్నారు. అయితే, అతనితో సెక్స్‌కి ఒప్పుకోకపోతే, ఆ అమ్మాయి ఫోటోలు బయట పెడతాననని అతడు బెదిరించడం మొదలుపెట్టాడు. మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు ఇలా ఫోటోలు షేర్ చేయరంటూ ఆమెను మానసికంగా వేధించాడు" అని శబరిత చెప్పారు.
ఇలాంటి ఘటనల్లో బాగా సున్నిత మనస్కులు అయనవారు ప్రాణాలు కూడా తీసుకునే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.
చివరకు పోలీసులు, సామాజిక కార్యకర్తల సహాయంతో ఆ అమ్మాయి సమస్యను తాము పరిష్కరించినట్లు చెప్పారు.
‘‘విషయం ఎవరికైనా చెబితే తమ గురించి ఏమనుకుంటారోననే భయంతో బయటకు చెప్పడానికి, ఫిర్యాదు ఇవ్వడానికి బాధితులు భయపడతారు. కానీ, వాళ్లు బయటకు వచ్చి నేరస్థుల వివరాలు బయట పెట్టినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’’ అని ఆమె అన్నారు.
ఇలాంటి సైబర్ వేధింపులకు గురైన మహిళల మానసిక వేదన ఎలా ఉంటుందో తెలియజెప్పేందుకు, నేరాల గురించి అవగాహన కల్పించేందుకు శబరిత బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ ద్వారా కృషి చేస్తున్నారు.
‘‘పబ్లిక్ డొమైన్‌లో వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయకుండా ఉండటమే మొదటి మార్గం. ఒకవేళ షేర్ చేయాలనుకుంటే, వచ్చే పరిణామాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి’’ అని నిపుణులు, సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చట్టం ఏం చెబుతోంది?
ఎవరివైనా వ్యక్తిగత ఫోటోలు కానీ, సమాచారం కానీ దుర్వినియోగం చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 67, 67 ఎ ప్రకారం కేసు పెట్టొచ్చని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల చెప్పారు.
కానీ, చట్టంలో చాలా అంశాలను సరిగ్గా నిర్వచించనందున ఇలాంటి నేరాలలో శిక్ష పడే అవకాశం చాలా తక్కువని ఆయన అన్నారు.
టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా చట్టాన్ని ఎప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (1946-2020): నాలుగు దశాబ్దాల్ని అలరించిన సుమధుర గాత్రం
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








