మాన్సాస్ ట్రస్టు: విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?

మాన్సాస్ ట్రస్టు

ఫొటో సోర్స్, mansasedu.org

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కవులూ కళాకారులు, విద్యావంతులతో వెలిగిపోయిన విజయనగర సంస్థానాన్ని 300 ఏళ్ల పాటు పూసపాటి వంశీయులే పాలించారు.

రాజులూ రాజ్యాలూ కనుమరుగైపోయినా... పూసపాటి వంశీయులు విజయనగరం జిల్లాలో రాజకీయంగా ఇంకా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే, కొంతకాలంగా వారి కుటుంబంలో తలెత్తుతున్న వివాదాలు సర్వత్రా చర్చనీయమవుతున్నాయి.

విజయనగరం గజపతి రాజుల కుటుంబ విషయాలు చాలా వరకూ గోప్యంగానే ఉండేవి. సంచయిత గజపతిని మాన్సాస్ ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా, సింహాచలం ధర్మకర్తగా నియమించిన తర్వాత రాజ కటుంబంలోని వివాదాలు రచ్చకెక్కాయి. రాజకీయాల కోసం కుటుంబాల మధ్య వైరం పెరిగింది. దీంతో ఒకరిపై మరొకరు బహిరంగానే విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు.

పూసపాటి సంచయిత
ఫొటో క్యాప్షన్, పూసపాటి సంచయిత

రొటేషన్ పద్ధతిలో సంచయిత...

పూసపాటి వంశీయులకు చెందిన ఆస్తుల్లో అత్యంత విలువైనవి భూములే. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పీవీజీ రాజు తమకున్న వేల ఎకరాల భూములను దేవాలయాలు, వాటి ధూపదీప నైవేద్యాల కోసం దేవాదాయశాఖకు అప్పగించారు. ఆ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం దేవస్థానానికి దాదాపు 13 వేల ఎకరాల భూములు, 108 ఉపాలయాలు వచ్చి చేరాయి.

దేవాదాయశాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఈ దేవాలయాలకు పూసపాటి వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచీ సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు రెండిటికీ ఒక్కరే ఛైర్మన్‌గా వ్యవహరించడం ఆనవాయితీ. తొలుత పీవీజీరాజు, ఆయన తర్వాత ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజులు అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరించారు.

అయితే, 2020 మార్చి 3వ తేదీన రోటేషన్ పద్ధతంటూ జీవో నెం. 74 ద్వారా అశోక్ గజపతి రాజును తొలగించి సంచయిత గజపతిని ప్రభుత్వం నియమించింది. సంచయిత ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె. ఈమె సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మాన్సాస్ ట్రస్టు

ట్రస్టుపై అధికారం ఎవరిది?

పూసపాటి వంశానికి చెందిన విజయరామ గజపతిరాజు 1860లో సంస్కృత కళాశాలను ఆ తర్వాత సంగీత కళాశాలను నెలకొల్పారు. అలాగే 1879లో మహారాజా అటానమస్ కళాశాలను నెలకొల్పి ఇంటర్మీడియట్ విద్యకు పునాదులు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజులు ఈ కళాశాలలు అన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించారు.

విజయనగర రాజ్యానికి చిట్టచివరి యువ రాజు పీవీజీ రాజు 1958లో తమ తండ్రి పేరు మీద 'మహారాజా అలక్ నారాయణ గజపతి సోసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (MANSAS) అనే ట్రస్టును నెలకొల్పారు. అంతేకాదు, తమ ఆస్తులన్నింటినీ ఆయన దీని పరిధిలోకి తీసుకొచ్చారు.

తమ పూర్వీకులు నిర్మించిన కోటనూ, అందులోని భవనాలనూ విద్యాసంస్థల నిర్వహణకు ఇచ్చేశారు. మాన్సాస్ ట్రస్టును ఎవరు నిర్వహించాలి? అనే విషయం రాజ కుటుంబాల అంతర్గత విషయంగా చూస్తూ...ఎవరూ దీనిపై ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తొలినాళ్ల నుంచి కొన్ని కుటుంబాలు ఈ ట్రస్టులో పని చేస్తూ వస్తున్నాయి. అలా ప్రస్తుతం ఈ ట్రస్టులో పని చేస్తూ పేరు బయటకు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి బీబీసీతో మాట్లాడారు.

"రాజుల కుటుంబ విషయాలు, ట్రస్టు విషయాలు ఎప్పుడూ రహస్యంగానే ఉండేవి. మా తండ్రి, కొందరు పెద్దలు చెప్పిన విషయాల ప్రకారం... మాన్సాస్ 1958లో ఏర్పాటైన సమయంలోనే వంశపారంపర్యంగా ఎవరు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టాలన్నది నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతోపాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ విజయనగర సంస్థానానికి సంబంధించిన అనేక ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటినీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చారు. 1995లో పీవీజీ రాజు కాలం చేయడంతో బై-లా ప్రకారం ఆయన పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆనంద గజపతిరాజు 2016లో మరణించిన తర్వాత అశోక్ గజపతిరాజు ఆ బాధ్యతలను స్వీకరించారు. గజపతి రాజులు స్థాపించిన పాఠశాలలు, కళాశాలల ద్వారా వేలమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అదే విధంగా నాతో పాటు వందల మంది ఉద్యోగులు ఈ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు" అని తెలిపారు.

కార్తీక్ సుందరరాజన్
ఫొటో క్యాప్షన్, కార్తీక్ సుందరరాజన్ (ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి)

ఎవరీ కార్తీక్ సుందరరాజన్‌?

గజపతి రాజులు అనగానే అందరికీ గుర్తొచ్చేది సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు. ఈ రెండిటికీ గజపతి రాజ కటుంబీకులే అనువంశిక ధర్మకర్తలుగా ఉంటారు. దేవస్థానంలో ఎప్పుడూ పెద్దగా వివాదాలుండవు. కానీ ఈ మధ్యకాలం ప్రతీదీ వివాదంగానే మారుతూ వస్తోంది.

సంచయిత గజపతి ఆలయ ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దేవస్థానం కార్యకలాపాలమీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సింహాచల దేవస్థానంలో గత కొంతకాలంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

సింహాచలం గోశాలలో ఒకేసారి 150 మంది ఉద్యోగులను తొలగించారు. దీనిమీద ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వ జోక్యంతో తిరిగి వారిని నియమించారు. ముఖ్యంగా ఛైర్ పర్సన్ తాలుకా అంటూ కార్తీక్ సుందరరాజన్ అనే వ్యక్తి సింహచలం కొండపైన గెస్ట్ హౌస్‌లో ఉంటున్నారు. ఆయన ఆలయ రికార్డులు పరిశీలించడం, సిబ్బందిని ప్రశ్నించడం చేస్తున్నారు. అందరూ ఆయనను ఆలయ ఓఎస్డీ అనే చెప్పుకుంటున్నారు. ఆయనకు అన్ని వసతులతో కొండపై గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారు.

అయితే కార్తీక్ ఏ హోదాలో పని చేస్తున్నారో తెలియకపోవడంతో... గెస్ట్ హౌస్‌ను వెంటనే ఖాళీ చేయాలని అప్పటి ఈవో భ్రమరాంబ నోటిసులు ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే భ్రమరాంబ బదిలీమీద వెళ్లిపోయారు. ఆమె స్థానంలో అన్నవరం దేవస్థానం ఈవో త్రినాధరావు ఇన్ ఛార్జ్ ఈవోగా వచ్చారు.

"ఇటీవల జరిగిన ట్రస్టు బోర్డు సమావేశంలో ఓఎస్డీ, న్యాయ సలహాదారు నియమాకాల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. దేవాదాయశాఖ నిబంధనలకు లోబడి ఓఎస్డీని నియమించాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదిరింది. కార్తీక్ సుందరరాజన్‌ను ఓఎస్డీగా నియమించాలంటూ దేవాదాయశాఖని కోరాం" అని ఇన్ ఛార్జ్ ఈవో త్రినాధరావు బీబీసీతో చెప్పారు.

కార్తీక్ సుందరరాజన్ ఇప్పటి వరకు ఏ హోదాలో సింహాచలంలో పని చేస్తున్నారనే విషయంపై బీబీసీ ఆయన్నే వివరణ కోరింది.

"ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. మీడియాలో, బయటా నా హోదా విషయంలో అనేకం అనుకుంటున్నారు. నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడలేను" అని ఆయన చెప్పారు.

మాన్సాస్ ట్రస్టు

‘రాజుల ఆస్తులను కాపాడుకోవడానికే ట్రస్టు పెట్టారా?’

ఘన చరిత్ర కలిగిన ఎంఆర్ కళాశాల కూడా ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఎంఆర్ కళాశాలని ఎయిడెడ్ నుంచి అన్ ఎయిడెడ్ కళాశాలగా మార్చాలంటూ ట్రస్టు తరపున ప్రభుత్వానికి లేఖ అందింది. దీన్ని పరిశీలించి... నివేదికను పంపాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ సెప్టెంబర్ 25న ఉన్నత విద్య ఆర్జేడీకి లేఖ రాశారు.

ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజాసంఘాలతో కలిసి నిత్యం అందోళనలు చేస్తున్నారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో మొత్తం 12 విద్యా సంస్థలు పని చేస్తున్నాయి. వీటిలో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

"కాలేజీకి నష్టాలు వస్తున్నాయనీ... అధ్యాపకుల జీతాలు, నిర్వహణ భారంగా మారాయని పేర్కొంటూ యాజమాన్యం గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. రెండు సార్లు కొంత మొత్తంలో నిధులు విడుదల చేశారు. కానీ వేల ఎకరాలు కలిగిన మాన్సాస్‌ ట్రస్టు ఆధ్యర్యంలో నడిచే ఈ కళాశాలకు నష్టం ఎలా ఉంటుంది? విజయనగరం జిల్లాలోని వేల ఎకరాల మాన్సాస్‌ భూములను రైతులు సాగు చేసి ప్రతి సంవత్సరం కౌలు కడుతున్నారు. ఆ డబ్బంతా ఏమైపోతుంది? మాన్సాస్‌ పరిధిలో ఉన్న విద్యా సంస్ధలు ప్రతి ఏడాదీ కొన్ని కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నాయి. ఆ డబ్బంతా మాన్సాస్‌ పరిధిలోకి వస్తుంది. ఆ డబ్బు ఏమవుతోంది? లాభాపేక్ష లేకుండా నడపడం ఈ కాలేజీని స్థాపించినప్పటి లక్ష్యం. ఇప్పటి వారసుల నడవడిక చూస్తుంటే ఆ రోజు ఈ ట్రస్టు ఏర్పాటు చేసింది అప్పటి రాజుల ఆస్తులు కాపాడుకోవడానికేమో అనిపిస్తోంది. అంతేకాదు మహారాజ కాలేజీ స్థలం, భవనాలకు దాదాపు ప్రస్తుత మార్కెట్ ప్రకారం 350 కోట్ల రూపాయల రేటు పలుకుతుంది. అందుకే దీన్ని మెల్లగా ప్రైవేటుపరం చేసి ఇన్నాళ్లూ ప్రజల కోసం ఉపయోగించిన ఆస్తులను ఇప్పుడు సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు" అని విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి పి. రామ్మోహన్ రావు బీబీసీతో చెప్పారు.

యూనివర్సిటీ లేని ఏకైక జిల్లా విజయనగరం

"విజయనగరం జిల్లాలోని దాదాపు 14 మండలాల్లో అధిక శాతం భూములు రాజుల కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. వీటికి తోడు లెక్కకు అందని ఆస్తులున్నాయి. అయినా కూడా ఎంఆర్ కళాశాలలోని అధ్యాపకులకు జీతాలివ్వలేని పరిస్థితి అంటే ఎవరైనా నమ్ముతారా? గత మూడు నెలలుగా జీతాల కోసం రోడ్లెక్కి అందోళనలు చేస్తున్నాం. జిల్లాలోని విద్యావ్యవస్థ మొత్తం విజయనగరం రాజుల కుటుంబం చేతిలోనే ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ విశ్వవిద్యాలయాలున్నాయి. విజయనగరంలో మాత్రం లేదు. విద్యా వ్యవస్థ మొత్తాన్ని తమ గుత్తాధిపత్యంలో ఉండేందుకే యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయించలేదు. ఈ ఏడాది డిగ్రీలోని ఎయిడెడ్ సీట్ల అడ్మిషన్లు కూడా నిలుపుదల చేశారు. ఇప్పుడు ఎంఆర్ కళాశాలని అన్ ఎయిడెడ్ గా మారిస్తే...మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు ప్రైవేటు పరం అయిపోయినట్లే" అని ఎంఆర్ కళాశాలలోని డిగ్రీ కామర్స్ అధ్యాపకులు శ్రీకాంత్ బీబీసీతో అన్నారు.

అశోక్ గజపతిరాజు

ఫొటో సోర్స్, facebook/ashokvizianagaram

ఫొటో క్యాప్షన్, అశోక్ గజపతిరాజు

‘మా వంశ ప్రతిష్ఠను పాడు చేస్తున్నారు’

సింహాచలం, మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్‌గా సంచయిత గజపతిని నియమించడంపై అశోక్ గజపతి రాజు ఇప్పటికే కోర్టుల్లో పోరాటాలు చేస్తున్నారు. తాజాగా మహారాజ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు సంచయిత ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మీడియా ముందుకు వచ్చారు.

"రిజిస్టరైన మాన్సాస్ ఎడ్యూకేషన్ ట్రస్టును మార్చే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలతో సంబంధం లేని ఈ ట్రస్టు మీద కన్నేసింది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన మాన్సాస్ సంస్థకి మంచి ఆశయాలున్నాయి. రాజకీయాలకు అతీతంగా కార్యకలాపాలు సాగించే ఈ ట్రస్టుకు అనేక చోట్ల భూములూ, 125 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లూ ఉన్నాయి. మహారాజ కాలేజి ప్రైవేటీకరణ ఎందుకో మాన్సాస్ ఛైర్ పర్సన్ చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్‌గా సంచయితను నియమించడాన్ని ఆనంద గజపతి రాజు రెండో భార్య సుధా, ఆమె కూతురు ఊర్మిళ వ్యతిరేకించారు. ఈ విషయంమీద గతంలోనే వారు మీడియాతో మాట్లాడారు.

సుధా, ఊర్మిళ
ఫొటో క్యాప్షన్, సుధా, ఊర్మిళ

"ఆనంద గజపతిరాజుకు అసలు వారసులం మేమే. పేరు చివరన గజపతిరాజు అని వాడుకునే హక్కు ఆమెకు లేదు. ఆనంద గజపతి రాజు, సంచయిత తల్లి ఉమా పరస్పర అంగీకారంతో 1991లో చట్ట ప్రకారంమే వారు విడిపోయారు. అలాగే ఆస్తుల పంపకాలూ, ఫ్యామిలీ సెటిల్‌మెంట్స్ కూడా జరిగాయి. ఉమాతో విడాకుల సమయంలో ఆనంద గజపతి రాజు సెటిల్‌మెంట్ కింద ఆమెకు విజయనగరం మార్కెట్‌లోని దుకాణాలు, ఊటీలోని ఆస్తులు, బంగారం, వజ్రాలు వంటివి ఇచ్చారు. అయితే వాటన్నింటినీ అమ్మేసుకుని.. ఇప్పుడు మళ్లీ ఆయన వారసులమంటూ సంచయిత తెర మీదకి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఆనంద గజపతిరాజు వారసత్వం విషయంలో మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. మేమే ఆయనకు అసలైన వారసులం" అని సుధా గజపతి చెప్పారు.

"మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎంతో చరిత్ర కలిగిన మహారాజా కళశాలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. మా తాత, తండ్రి పేర్లను చెడగొట్టేలా వ్య సంచయిత వహరిస్తున్నారు. ఇలాంటి విద్యాసంస్థను ప్రైవేటుపరం చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం" అని ఊర్మిళ అన్నారు.

సింహాచలం, మాన్సాస్ ట్రస్టు విషయాల్లో పదేపదే రాజకీయ పార్టీల ప్రస్తావన వస్తోంది. సంచయితకు వైకాపా పార్టీ నాయకులు మద్దతిస్తుంటే...టీడీపీ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ విషయం గురించి ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బీబీసీతో మాట్లాడారు.

"తెలుగుదేశం నాయకులను దెబ్బతీసే పనుల్లో భాగంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన కారుని తానే శుభ్రపరుచుకుని, అర్భాటాలకు తావివ్వకుండా యూరోపియన్ లివింగ్ స్టైల్లో అశోక్ గజపతి జీవిస్తారు. నీతి నిజాయితీలతో ఉండే అశోక్ గజపతిరాజు మీద రాజకీయంగా పోరాడలేక అడ్డదారుల్లో మాన్సాస్ సంస్థపై కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలోని బలమైన నాయకులందరినీ వైసీపీ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. ట్రావెల్స్‌లో అక్రమాలంటూ జేసీ కుటుంబాన్ని, ఈఎస్ఐ స్కామంటూ అచ్చెంనాయుడిని, సంచయిత గజపతిని అడ్డం పెట్టుకుని అశోక్ గజపతిని దెబ్బతీయాలని చూస్తోంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి సింహాచలం గుడి, మాన్సాస్ ట్రస్టుకు చెందిన వేల ఎకరాల భూములమీద కన్నేశారు. అందులో భాగంగానే ఈ రాజకీయాలు చేస్తున్నారు" అని బీబీసీతో అన్నారు.

సింహాచల దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు విషయాల్లో టీడీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి బొత్స సత్యనారాయణ గతంలోనే కొట్టిపారేశారు.

"ప్రతిదానిపై ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారింది. అశోక్ గజపతి రాజు తనకి అన్యాయం జరిగిందని భావిస్తే... కోర్టుకు వెళ్లడం ఆయనకున్న హక్కు. ఏదైనా కోర్టు నిర్ణయిస్తుంది. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లోకి ప్రభుత్వాన్ని లాగటం భావ్యం కాదు. అయితే, ఈ వివాదాలు అశోక్ గజపతిరాజు, సంచయిత గజపతిరాజుల కుటుంబ వ్యవహారం. ఈ సమస్యను వారే చక్కదిద్దుకోవాలి" అని మీడియా సమావేశంలో చెప్పారు.

పూసపాటి సంచయిత

ఫొటో సోర్స్, mansasedu.org

‘రాజకీయాలు చేయకండి’

మాన్సాస్ ట్రస్టు, సింహాచల దేవస్థానం విషయాలలో ఛైర్ పర్సన్ సంచయిత గజపతి తీసుకున్న నిర్ణయాలు పదే పదే వివాదస్పదం అవుతున్న విషయం గురించి సంచయిత గజపతినే బీబీసీ ప్రశ్నించింది.

"అన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయి. కావాలనే నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. సింహాచలం, ఎంఆర్ కాలేజీపై టీడీపీ నాయకులు, అశోక్ గజపతిరాజు చేస్తున్నది తప్పుడు ప్రచారం. మహారాజా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హైస్కూల్ ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారు. ప్రస్తుతం ఆ విధానంతోనే ముందుకెళ్తున్నాం. ఎంఆర్ కళాశాల స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రైవేటు కాలేజీ. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. చిల్లర రాజకీయాల్లోకి మాన్సాస్‌ విద్యాసంస్థలను లాగొద్దు. బాబాయి తన రాజకీయల కోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయాల్లోకి మాన్సాస్‌ విద్యాసంస్థలను లాగవద్దు. నేను ఆనందగజపతి రాజు, ఉమా గజపతి రాజుల కుమార్తెను. గజపతుల వంశ ప్రతిష్ఠను మరింత పెంచుతాను. నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నాను. అది నచ్చని కొందరు నాకు చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. ఇంతకు మించి ఏమీ లేదు" అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)