ఆంధ్రప్రదేశ్: ఇదీ కాకినాడ సెజ్ చరిత్ర..

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
''కాకినాడ సెజ్ భూములు నావి అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఈ భూములన్నీ జగన్ బినామీవి అని అంటున్నారు. అందుకే నేను చెబుతున్నాను. ఈ భూములు నావే కాబట్టి, వెంటనే వాటిని రైతులకు తిరిగి ఇచ్చేయండి'' - 2015 జూలై 13న ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్య
సరిగ్గా ఇవే మాటలను ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 2018 ఆగస్టు 11 నాడు తునిలో జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన ప్రస్తావించారు. తనను కలిసిన సెజ్ రైతులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. కాకినాడ సెజ్ చట్టబద్ధమేనా అని వారిని ప్రశ్నలు కూడా అడిగారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఆ పార్టీకి చెందిన ఎంపీ వంగా గీత తీవ్ర ఆరోపణలు చేశారు.
గత ఏడాది జూన్ 26నాడు లోక్‌సభలో మాట్లాడుతూ ఆమె తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు.
"సకాలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. కాబట్టి 2013 భూసేకరణ చట్టం ప్రకారం సెజ్ భూములు వెనక్కి ఇవ్వాలి. రైతుల ఎదురుగా భూములున్నా అక్కడ పంటలు పండించే అవకాశం లేదు. భూములు ఖాళీగా ఉండటంతో ఉపాధి లేక కూలీలు కష్టాల పాలవుతున్నారు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ప్రజలున్నారు. ఎకరానికి మూడు లక్షల రూపాయల చొప్పున ఇచ్చి భూములు కాజేశారు. ఇప్పుడు వాటిని 50 నుంచి 60 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయాలి. సెజ్ అభివృద్ధి ఎంత ముఖ్యమో.. రైతులు కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి అంటే రైతులను, కూలీలను దూరం పెట్టడం కాదని దృష్టిలో ఉంచుకోవాలి. రైతులను సెంట్రల్ జైల్లో పెట్టారు. వాళ్ల పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వెంటనే సెజ్ రద్దు చేసి ఈ భూములన్నీ వెనక్కి ఇవ్వాలి"అని కేంద్రాన్ని ఆమె కోరారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇలాగే జరిగింది. 2012లో విపక్ష నేత హోదాలో చంద్రబాబు స్వయంగా వెళ్లి సెజ్ భూముల్లో ఏరువాక చేశారు. ఆ భూములను రైతులకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఈ పని ఎందుకు చేయలేదన్న విమర్శలున్నాయి.
అధికారంలోకి వచ్చాక మరో మాట
కాకినాడ సెజ్ రైతుల విషయంలో అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చిన తర్వాత ఓ మాట అన్నట్టుగా వివిధ పార్టీల తీరు ఉంటోందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"మా ప్రమేయం లేకుండా భూములు కాజేయాలని చూశారు. కేవలం 1.50 లక్షల రూపాయలు చేతిలో పెట్టి భూములు తీసుకోవాలని చూశారు. మేము నిలదీస్తే రూ. 3లక్షలకు పెంచారు. వైఎస్సార్ ప్రభుత్వం దీన్నీ తీసుకొచ్చింది. అప్పుడు చంద్రబాబు వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే తాను చెప్పింది చేయకపోగా మా మీద పలు కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. నేను 150 రోజులకు పైగా సెంట్రల్ జైల్లో ఉన్నాను. నా మీద 40 కేసులు బనాయించారు. నేను ఏ నేరం చేశాను? నా భూమి నాకు ఉంచండి అని అడగడం తప్పా? నాకు న్యాయం చేయమని కోరడం తప్పవుతుందా? మా పిల్లలకు పెళ్లిళ్లు లేవు. మా జీవితాల్లో స్థిరత్వం లేదు. అనేక మంది రైతులు భూములు కోల్పోయి వలసపోయారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. ప్రభుత్వం పరిశ్రమల యజమానుల కోసం తాము చేసిన చట్టాలనే ఉల్లంఘిస్తోంది. రైతులకు ఎవరు న్యాయం చేస్తారు?'' అని కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు పి సుబ్బిరెడ్డి అంటున్నారు.

యాజమాన్యాలు ఎలా మారుతున్నాయి?
కాకినాడ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను 2003లో ప్రారంభించారు. 2005 డిసెంబర్, 2006 జనవరిలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పేరుతో నోటిఫికేషన్ జారీ చేసింది.
కాకినాడ పరిసరాల్లో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో రిఫైనరీ ఏర్పాటుతో పాటుగా దానికి అనుబంధంగా పలు ఆయిల్ కంపెనీలు వస్తాయనే పేరుతో ఈ సెజ్‌కు భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కానీ, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు కోసం 2007 ఏప్రిల్ 23న కేంద్రం అనుమతినివ్వడం విశేషం. అంటే అనుమతి రాకముందే సెజ్ పేరుతో అప్పటికి అమలులో ఉన్న 1884 భూసేకరణ చట్టం 4(1) నిబంధన ప్రకారం ఈ ఉత్తర్వులిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం 1035 హెక్టార్ల పరిధి మేరకు మాత్రమే కాకినడ సెజ్‌కు అనుమతులిచ్చింది. అయినప్పటికీ అప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 5120 ఎకరాల భూమిని సేకరించారు. వాటితో పాటుగా తూర్పు గోదావరి జిల్లాలోని యూ కొత్తపల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల పరిధిలో 2,295 ఎకరాలు, తొండంగి మండలంలో మరో 2,398 ఎకరాలకు డిక్లరేషన్ కూడా లేకుండానే భూసేకరణకు సిద్దమయ్యారు.
15 ఏళ్లు గడుస్తున్నా ఈ 4693 ఎకరాలకు అవార్డులు కూడా ప్రకటించలేదు. వాటితో పాటుగా ప్రభుత్వ భూములు కూడా కలుపుకుంటే మొత్తం 10,500 ఎకరాల పరిధిలో కాకినాడ సెజ్ విస్తరించి ఉంటుంది.
అప్పట్లో ఓఎన్జీసీ రిఫైనరీ నిర్మాణం పేరుతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఏడాది గడిచే సరికి ఓఎన్జీసీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. కాకినాడ రిఫైనరీ నిర్మాణ ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్టు ఆనాటి ఓఎన్జీసీ చైర్మన్ ప్రకటించారు. కానీ నోటిఫికేషన్ మాత్రం రద్దు కాలేదు.
పైగా ఆ భూములను కేవీ రావు అనే వ్యక్తి పేరుతో కొనుగోలు చేసేందుకు నాటి ప్రభుత్వం అనుమతినిచ్చింది. స్టాంప్ డ్యూటీ మినహాయింపులు సహా అనేక రాయితీలు ఆయనకు దక్కాయి. చివరకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా వర్తించకుండా ఆయన పేరుతో దాదాపు 5వేల ఎకరాలు సేకరించారు.
ఎవరీ కేవీ రావు?
కాకినాడ పోర్టులో యాజమాన్యం పేరుతో కేవీ రావు చుట్టూ గతంలో పలు వివాదాలున్నాయి. ఆ తర్వాత ఆయన కాకినాడ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. ఆయన పేరుతోనే సెజ్ భూములను రిజిస్ట్రేషన్ చేయడం పట్ల పలు అభ్యంతరాలు వచ్చినప్పటికీ సెజ్ చట్టంలో ఉన్న మినహాయింపుల పేరుతో నాటి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ భూములు పలు మార్లు చేతులు మారినప్పటికీ ఇప్పటికీ 49 శాతం వాటాతో కేవీ రావు కీలక వాటాదారుగా ఉన్నారు.
ఆ తర్వాత వైఎస్సార్ మరణానంతరం రోశయ్య హయాంలో 2010లో కాకినాడ సెజ్‌లో 51శాతం వాటాను జీఎంఆర్ టేకోవర్ చేసింది. తద్వారా ఈ మల్టీ ప్రొడక్ట్ సెజ్‌లో జీఎంఆర్‌కు యాజమాన్యంలో స్థానం దక్కింది. ఆరంభంలో ఉన్న సమస్యలన్నీ తొలగినట్టేనని త్వరలో సెజ్‌లో భారీ పరిశ్రమల కార్యకలాపాలు ప్రారంభిస్తామని అప్పట్లో కేవీ రావు ప్రకటించారు. సెజ్ భూముల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని అప్పట్లో జీఎంఆర్ సంస్థ కూడా ప్రకటించింది. జీఎంఆర్ గేట్ వే పోర్ట్ నిర్మాణం కోసమంటూ ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది.

మరోసారి చేతులు మారిన సెజ్
ఇప్పటికే ఓఎన్జీసీ పేరుతో నోటిఫికేషన్ వచ్చినందున మూడు సార్లు చేతులు మారినట్లైంది. తాజాగా కాకినాడ సెజ్‌లో మెజార్టీ వాటాలను అరంబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయించినట్టు జీఎంఆర్ ప్రకటించింది. తన దగ్గర ఉన్న 51 శాతం వాటాను రూ.2610 కోట్లకు అరబిందో సంస్థకు అమ్ముతున్నట్టు తెలిపింది. దానిలో భాగంగా తొలివిడతలో రూ.1600 కోట్లు చెల్లించారని, మిగిలిన రూ.1010 కోట్లను రాబోయే రెండు, మూడేళ్లలో చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో మొత్తం యాజమాన్యం అరబిందో సంస్థ చేతుల్లోకి వెళుతుందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని జీఎంఆర్ ప్రతినిధి బీబీసీకి తెలిపారు.
టేకోవర్ చెల్లదంటున్న ఉద్యమ సంస్థలు
జీఎంఆర్ సంస్థ నుంచి అరబిందో సంస్థకు కాకినాడ సెజ్ బదలాయింపు ప్రక్రియ పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కాకినాడకు చెందిన అడ్వకేట్ అయినాపురపు సూర్యనారాయణ బీబీసీతో మాట్లాడారు.
"కాకినాడ సెజ్ భూసేకరణ నోటిఫికేషన్ చెల్లదు. భూములు సేకరించిన నాటికి కాకినాడ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదు. అయినా, ఓఎన్జీసీని చూపించి భూములు సేకరించారు. అది చట్ట విరుద్ధం. ఓఎన్జీసీ ఉపసంహరించుకన్న తర్వాత చట్టం ప్రకారం నోటిఫికేషన్ రద్దు చేయాలి. దానికి విరుద్దంగా నాటి వైఎస్సార్ ప్రభుత్వం వెళ్లింది. దానిపై కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈలోగా జీఎంఆర్ , ఇప్పుడు అరబిందో వంటివి సెజ్ పేరుతో రైతుల భూములతో వ్యాపారం చేస్తున్నాయి. ఈ టేకోవర్‌కు సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ అనుమతి లేదు. కాబట్టి అవి చెల్లుబాటు కావు. ఈ వ్యవహారంలో జగన్, విజయసాయిరెడ్డి పాత్రపై అనుమానాలున్నాయి. సీబీఐతో దర్యాప్తు జరపాలి. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ వంగా గీత కూడా దర్యాప్తు కోరారు" అని సూర్యనారాయణ అన్నారు.

పరిశ్రమలు వచ్చాయా?
కాకినాడ సెజ్ పరిధిలో 10వేల ఎకరాలకుపైగా స్థలం ఉంది. 15 ఏళ్లు గడుస్తున్నా, ఇందులో పట్టుమని పది ఎకరాల విస్తీర్ణంలోనైనా కార్యకలాపాలు కనిపించడం లేదు. చైనాకు చెందిన పల్స్ ఫ్లష్ అనే సంస్థ బొమ్మల తయారీ యూనిట్ నడుపుతోంది. దానికి తోడుగా ఆక్వా ప్రొడక్ట్ ప్రోసెసింగ్ యూనిట్లు మరో మూడు నెలకొల్పారు.
సుదీర్ఘకాలంగా భూములు పడావుగా పడి ఉండటం వల్ల అటు వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోయి, ఇటు పారిశ్రామిక అవసరానికి కూడా భూములు అక్కరకు రాని పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఖాళీ భూములను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
పరిశ్రమలు వచ్చే వరకూ తమకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని మాతావారిపాలెం గ్రామానికి చెందిన మాచర్ల అంజి అనే రైతు బీబీసీతో అన్నారు.
‘జగన్ బినామీల కోసమే’
కాకినాడ సెజ్ పేరుతో రైతుల భూములు తీసుకుని కార్పొరేట్ సంస్థలు బేరసారాలు చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం కాకినాడ సెజ్‌ను టేకోవర్ చేస్తున్న అరబిందో కంపెనీ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి వియ్యంకుడు భాగస్వామిగా ఉన్న సంస్థ కావడంతో విమర్శలు వస్తున్నాయి. వైఎస్ జగన్ బినామీలు కాకినాడ సెజ్‌లోని భూములు కాజేస్తున్నారని విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.
రైతులకు తొలుత కేవలం రూ. 3లక్షలు మాత్రమే ఇవ్వగా, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ. 2 లక్షల చొప్పున ఇప్పించామని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పుడు ఆ భూముల విలువ చాలా పెరిగినందున ప్రతీ రైతుకి దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అందించాలని ఆయన కోరారు.
అయితే కాకినాడ సెజ్‌కు సంబంధించి తాము అధికారంలోకి రాగానే ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా తమ ప్రభుత్వం కమిటీ వేసిందని కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో అన్నారు. తెలుగుదేశం పార్టీ, యనమల రామకృష్ణుడు చేస్తున్న వాదనను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు హయంలోనే సెజ్ కి బీజం పడిందని, ఏరువాకలో చెప్పిన మాటలను మరిచిపోయిన ప్రభుత్వం చంద్రబాబుది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు. ఏదైనా కంపెనీ, తన వాటాను మరో కంపెనీకి అమ్ముకోవడం తప్పా అని కన్నబాబు ప్రశ్నించారు. రెండు ప్రైవేటు సంస్థల లావాదేవీలను జగన్‌కు ముడిపెట్టడం తగదన్నారు.

‘వినియోగంలోకి రాని సెజ్‌లను రద్దు చేయాలి’
2013 భూ సేకరణ చట్టం ప్రకారం పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూములు వినియోగంలోకి రాకపోతే ఐదు నుంచి ఏడేళ్ల తర్వాత ఆ భూములు వెనక్కి తీసుకోవాల్సి ఉందని సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు డి శేషబాబ్జీ బీబీసీతో అన్నారు.
"కాకినాడ సెజ్ వచ్చి 15 ఏళ్లు అయ్యింది. పరిశ్రమలు రాలేదు. ఇప్పటికే దాదాపు 40 సెజ్‌లకు అనుమతులు రద్దు చేశారు. కేంద్రం మూసేస్తామని ప్రకటించిన వాటిలో కాకినాడ సెజ్ కూడా ఉంది. భూములు వినియోగించుకోనందున అనేక చోట్ల అనుమతులు వెనక్కి తీసుకున్నారు. కాకినాడ సెజ్ కూడా రద్దు చేయాలి. భూసేకరణ చట్టం, ప్రాజెక్ట్ చట్టాల ప్రకారం రైతులకు భూములు వెనక్కి ఇచ్చేవరకూ ఆందోళన చేస్తాం. రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారు. ఇప్పుడు వాటితో వ్యాపారాలు చేస్తున్నారు. రూ. 2వేల కోట్లు రుణం తీసుకుని సెజ్‌ని కొనుగోలు చేసిన జీఎంఆర్ ఇప్పుడు ఆ రుణం చెల్లించకుండానే తన వాటా విక్రయించడం ఆర్థిక నేరం. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి"అని ఆయన డిమాండ్ చేశారు.
‘బల్క్ డ్రగ్ యూనిట్ వస్తుంది’
సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటు కోసం చాలాకాలంగా చేసిన ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయని జీఎంఆర్ సెజ్ ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
"కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ యూనిట్లకు అనుమతివ్వబోతోంది. దాని కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం అంగీకరిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాకినాడ సెజ్ పరిధిలో ఈ బల్క్ డ్రగ్ యూనిట్ ఏర్పాటవుతుంది. సెజ్ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. అరబిందోతో ఒప్పందం చెల్లదన్న వాదన తప్పు. చట్ట ప్రకారమే మెజార్టీ వాటాను అరబిందోకి అప్పగించాం" అని ఆయన వివరించారు.
‘మేం రెగ్యులేటరీ బాడీ మాత్రమే’
కాకినాడ సెజ్ వ్యవహారాల్లో యాజమాన్య మార్పిడి, అక్కడి పరిశ్రమల విషయంలో తమకు సంబంధం లేదని విశాఖలో ఉన్న సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఏ రామ్మోహన్ రెడ్డి బీబీసీతో అన్నారు.
"జీఎంఆర్ నుంచి అరబిందోకి 51శాతం వాటా మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియ ఉంటుంది. రెండు సంస్థలు అంగీకరిస్తే దానికి అనుమతులు ఇవ్వడానికి అభ్యంతరం ఉండదు. కాకినాడ సెజ్ పూర్తిగా ప్రైవేటు సంస్థ. అక్కడ పరిశ్రమలు రాకపోతే డీ నోటిఫై చేయాలని వారు కోరితే పరిశీలిస్తాం. మిగిలిన వ్యవహారాలకు సంబంధం లేదు. సెజ్ డెవలప్‌మెంట్ కమిషనరేట్ రెగ్యులరేటరీ బాడీ మాత్రమే'' అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?
- #HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- వర్జినిటీ కోల్పోవడానికి సరైన వయసంటూ ఒకటి ఉంటుందా?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








