విశాఖపట్నం కేజీహెచ్: పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్ద దిక్కు

కేజీహెచ్

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌ది సుమారు శతాబ్ద కాలపు చరిత్ర. మరో రెండేళ్లలో శత వసంతాలకు చేరువకానున్న ఈ ఆసుపత్రిలోనే ప్రస్తుతం అత్యంత విషాదకరమైన ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నారు.

కోవిడ్-19 రోగుల చికిత్స కోసమూ ఇక్కడ పూర్తి ఏర్పాట్లున్నాయి.

1923, జులై 19న ఏర్పాటైన ఈ ఆసుపత్రి కేవలం విశాఖపట్నానికే కాదు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, తూర్పు గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలకు సేవలందిస్తోంది.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల ప్రజలకూ ఈ ఆసుపత్రే సంజీవని.

ఒడిశాలోని మల్కన్‌గిరి, కొరాపుఠ్, గజపతి, గంజాం జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రోగులు నిత్యం కేజీహెచ్‌కు వస్తుంటారు.

ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యపరంగా కష్టం వస్తే కేజీహెచ్‌‌పైనే ఆశలు పెట్టుకుంటారు.

కేజీహెచ్ ఆసుపత్రి

ఫొటో సోర్స్, kgh

ఫొటో క్యాప్షన్, కేజీహెచ్ ఆసుపత్రి

మద్రాస్ ప్రెసిడెన్సీలో

కేజీహెచ్ అని అంతా పిలుచుకునే కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖ సముద్ర తీరంలో 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆసియాలోని పురాతన వైద్య కళాశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంధ్ర మెడికల్ కాలేజీ ఈ ఆసుపత్రికి అనుబంధంగానే ఉంది.

సుమారు 1500 పడకల ఆసుపత్రయిన కేజీహెచ్‌లో 240 పడకలు సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఉన్నాయి.

రోజుకు సుమారు 1500 మంది రోగులను అవుట్ పేషెంట్ విభాగంలో చికిత్స చేసే ఇక్కడ 150 నుంచి 200 మంది ప్రతి రోజూ ఇన్ పేషెంట్లుగా చేరుతుంటారు.100 వరకు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి ప్రతిరోజూ.

చిన్న డిస్పెన్సరీగా మొదలై1845లో సాధారణ డిస్పెన్సరీగా మొదలైన ఇది 1857 నాటికి 30 పడకల ఆసుపత్రిగా మారింది.

అనంతరం కొత్త భవనాలను నిర్మించి దీన్ని మరింత విస్తరించారు.

1923 జులై 19న దీనికి కింగ్ జార్జ్ ఆసుపత్రిగా నామకరణం చేసి అప్పటి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పానగంటి రామరాయనింగర్(పానగల్ రాజా) ప్రారంభించారు.

అనంతరం దశలవారీగా మరింత విస్తరణకు నోచుకున్న ఈ ఆసుపత్రి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా ఉంది.

ప్రైవేటు ఆసుపత్రులు ఇంతగా విస్తరించడానికి ముందు కేజీహెచ్ ఒక్కటే ఆ ప్రాంతంలో ప్రధాన ఆసుపత్రి.

1923లో కేజీహెచ్‌ను అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి పానగల్ రాజా ప్రారంభించారు
ఫొటో క్యాప్షన్, 1923లో కేజీహెచ్‌ను అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి పానగల్ రాజా ప్రారంభించారు

దేశంలోనే టాప్ గవర్నమెంట్ కాలేజీల్లో స్థానం

దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రి/వైద్యకళాశాలల్లో ఒకటికింగ్ జార్జ్ హాస్పిటల్‌లో అన్ని విభాగాల్లో కలిపి 400 మందికి పైగా వైద్యులున్నారు.

ఇక్కడి మెడికల్ కాలేజీ 2019 సంవత్సరానికి గాను దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు/వైద్యసంస్థల టాప్ టెన్ జాబితాలో చోటు దక్కిందచుకుందని సీనియర్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.

నేపాల్ నుంచీ రోగులు

కేజీహెచ్‌కు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్ నుంచీ రోగులు వస్తుంటారని ఆయన తెలిపారు.

నేపాల్ నుంచి సైతం రోగులు వచ్చిన సందర్భాలున్నాయని.. ఇక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ సేవలు, ఆసుపత్రిపై సుదీర్ఘ కాలంగా ఉన్న నమ్మకమే రోగులను ఇటువైపు రప్పిస్తోందని చెప్పారు.

సుశిక్షితులైన నిపుణులు, అనుభవజ్ఞులు ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండడంతో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు.

రాష్ట్రంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందేటప్పుడు, వివిధ జిల్లాల్లో వ్యాధులు ప్రబలినప్పుడు కేజీహెచ్ నిపుణులు అధ్యయనాలు చేయడం, అక్కడ సేవలందించడం చేస్తుంటారు.

ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధులపైనా కేజీహెచ్ బృందం అధ్యయనం చేసిందని.. విశాఖ జిల్లాలోని మొండిపాలెంలో అంతుచిక్కని మరణాలపైనా కేజీహెచ్ బృందమే అధ్యయనం చేసిందని.. ఇంకా రాష్ట్రంలోని అనేక చోట్ల ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కేజీహెచ్ నిపుణులు రంగంలోకి దిగారని గుర్తుచేశారు.

‘కీలక డిపార్టుమెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది’

విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో అనేక వైద్య విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలున్నాయి.

ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటెరాలజీ, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలున్నప్పటికీ మెడికల్ అంకాలజీ, రుమటాలజీ వంటి విభాగాలనూ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నది ఇక్కడి నిపుణుల మాట.

ప్రతి రోజూ వేలాది మంది రోగులకు చికిత్స చేసే ఈ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ నిపుణులను ప్రముఖులు వచ్చినప్పుడు వారి కాన్వాయ్‌లో విధులు వేస్తుంటారని.. అయితే, దానివల్ల రోగులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిగానే కాకుండా దేశంలోని ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఒకటైన కేజీహెచ్‌లో మెడికల్ అంకాలజీ, రుమటాలజీ విభాగాలనూ ఏర్పాటు చేయాల్సిన తరుణం వచ్చిందని.. ఆ విభాగాలనూ ఏర్పాటు చేస్తే రోగులకు మరింత విస్తృత సేవలు అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)