నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడిన వైనం వివాదంగా మారుతోంది.
తొలుత అందరూ దీనిని ఆత్మహత్యగానే అనుమానించారు. పోలీసులు కూడా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించారు.
అయితే సలాంతో పాటుగా ఆయన భార్య, ఇద్దరు బిడ్డలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పోలీసుల వేధింపులని పలువురు ఆరోపణలు చేశారు.
చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అబ్దుల్ సలాం తీసుకున్న సెల్ఫీ వీడియో కేసుని కీలక మలుపు తిప్పింది.
నంద్యాల పోలీసులపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. పోలీసు వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని పలువురు ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఇద్దరు ఐపీఎస్‌లతో విచారణకు ఆదేశించింది.
అలాగే, నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతం సవాంగ్ ఆదివారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఐ జీ పీ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ అధికారి అరిఫ్ ఆఫీజ్ నంద్యాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని చెప్పిన గౌతం సవాంగ్, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.

ఫొటో సోర్స్, Shariff
రైలు కింద పడి కుటుంబమంతా..
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు రైల్వే స్టేషన్ వద్ద నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈనెల 3వ తేదీన జరిగింది. ఉదయం 11.30 నిమిషాల ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన వారంతా గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణాలకు పూనుకున్నారు.
మృతుల్లో షేక్ అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహన్ (38)తో పాటుగా 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు దాదా కలందర్ ఉన్నారు. ఈ ఆత్మహత్యపై రైల్వే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.
ఘటనా స్థలంలో మీడియాకు వివరాలు వివరాలు అందించిన సందర్భంగా పోలీసులు చెప్పిన సమాచారం మేరకు మృతుడు సలాం గతంలో దొంగతనం కేసులో నిందితుడు.
అంతకుముందు బంగారం దుకాణంలో పనిచేశారు. కొన్ని నెలల క్రితం దొంగతనం ఆరోపణలతో ఉద్యోగం కోల్పోయారు.
జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత నంద్యాలలో ఓ ఆటో అద్దెకు తీసుకుని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఆ సమయంలోనే ఆటోలో ప్రయాణిస్తుండగా తనకు చెందిన రూ. 70వేలు పోయాయని ఓ ప్రయాణీకుడు ఫిర్యాదు చేశారు.
దాంతో పోలీసులు ఈ కేసులో మరోసారి అబ్దుల్ సలాంని విచారించారు.
ఆయన భార్య నూర్జహన్ ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాద్యాయురాలిగా పనిచేసేది. కానీ, కరోనా కారణంగా ఆమె ఉపాధి కూడా కోల్పోయారు.
కుమార్తె 10వ తరగతి, కుమారుడు నాలుగో తరగతి చదువుతున్నారు.
ఆర్థిక కారణాలతోనే నంద్యాల నుంచి పాణ్యం మండలం కౌలూరు వరకూ వెళ్లి ఆత్మహత్యకు పూనుకుని ఉంటారని అనుమానిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

సెల్పీ వీడియోతో మలుపు తిరిగిన కేసు..
చాలాకాలంగా పనిచేస్తున్న బంగారు దుకాణంలో జరిగిన దొంగతనానికి అబ్దుల్ సలాం కారణమని యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత సలాం అరెస్ట్ అయ్యారు.
నంద్యాల సబ్ జైలులో 42 రోజుల పాటు సలాం రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చి కేసు విచారణకు, వాయిదాలకు హాజరవుతున్నారు.
ఈలోగా కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతుండగా ఆయన మరోసారి దొంగతనం కేసులో ఇరుక్కున్నారు.
ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు తనను వేధిస్తున్నారని సలాం ఆరోపిస్తూ కుటుంబంతో కలిసి చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
అయింతే నంద్యాల వన్ టౌన్ పోలీసులు బీబీసీకి చెప్పిన వివరాల ప్రకారం బంగారం షాపులో దొంగతనం కేసులో అబ్దుల్ సలాంపై 207 19 కింద కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్లు 457,380 కింద ఈ కేసు సాగుతోంది. తాజాగా ఆటోలో జరిగిన దొంగతనం కేసులో ఆయన అనుమానితుడు మాత్రమే.
‘‘ఆటోలో జరిగిన రూ. 70వేల దొంగతనం, బంగారం షాపులో జరిగిన దొంగతనంలో నాకు సంబంధం లేదు. అయినా నేను చేయని దొంగతనంలో నన్ను వేధిస్తున్నారు. నాపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు చావు తప్ప మరో దారి లేదు’’ అంటూ సెల్ఫీ వీడియోలో ఇద్దరు బిడ్డలు, భార్యతో కలిసి కన్నీరుమున్నీరవుతూ అబ్దుల్ సలాం చెప్పారు.
దీంతో ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా విచారణ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
‘పోలీసుల వేధింపులతోనే కుటుంబం చనిపోయింది’
షేక్ అబ్దుల్ సలాం కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడడానికి పోలీసులే కారణమని మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికితీయాలని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘1992 నుంచి అదే బంగారం దుకాణంలో సలాం పనిచేస్తున్నారు. యజమానుల మధ్య తగాదాలు వచ్చాయి. ఏకంగా 5కిలోల బంగారం దొంగతనం చేశాడని సలాం మీద కేసు పెట్టారు. పోలీసులు తీవ్రంగా వేధించారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టారు. చివరకు 42 రోజుల పాటు జైలు పాలుజేశారు. తీరా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనం నెపం ఆరోపించారు. ఆటో వెళుతుండగా వెనక సీటులో ఉన్న బ్యాగ్ నుంచి డ్రైవర్ డబ్బులు తీయడం సాధ్యమేనా అన్నది కూడా ఆలోచించలేదు. నేరం ఒప్పుకోవాలని తీవ్రంగా హింసించారు. చివరకు మరో దారి తెలియని సలాం కుటుంబమంతా ఆత్మహత్యకు పూనుకోవాల్సి ఉంది. దీనికి నంద్యాల పోలీసులే బాధ్యత వహించాలి. వారిపై కేసు నమోదు చేయాలి. పూర్తిస్థాయిలో విచారణ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు..
పోలీసుల వేధింపుల మూలంగానే సలాం కుటుంబమంతా ఆత్మహత్యకు పూనుకుందని ఎన్ హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసినట్టు నంద్యాలకు చెందిన అడ్వకేట్ బాలహాజీ తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘చోరీ కేసులో బాధితుడిని పోలీసులు వేధించారు. అవమానించారు. అందులో నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డిది ప్రధాన పాత్ర. అందుకే దీనిపై విచారణ చేయాలని కోరుతున్నాం. రాతపూర్వకంగా ఎన్ హెచ్ ఆర్సీకీ ఫిర్యాదు చేశాం. పిటీషన్‌ను స్వీకరించారు. సీబీసీఐడీతో విచారణ చేయాలి. బాధితుడిని వేధించిన సీఐ, ఇతర పోలీస్ సిబ్బంది పాత్రను వెలుగులోకి తీసుకురావాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణికి అడ్డుకట్ట వేయాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
స్పందించిన ప్రభుత్వం, ఇద్దరు ఐపీఎస్‌లతో దర్యాప్తు
సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వివాదంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
సీఎం జగన్ ఆదేశాలతో దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
బెటాలియన్స్ ఐజీ శంక బ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ ఆరిఫ్‌లకు ఈ కేసు విచారణ బాధ్యత అప్పగించారు.
దీనిపై కర్నూలు డీఐజీ వెంకట్రామిరెడ్డి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నత స్థాయి అధికారులు విచారణకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకూ సీఐ సోమశేఖర్ రెడ్డిని సస్ఫెన్షన్ లో ఉంచాము. సమగ్ర విచారణ తర్వాత అసలు వివరాలు వెల్లడిస్తాం’’ అని తెలిపారు.
‘‘న్యాయం జరిగేలా చూస్తాం’’
ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి అన్నారు. ఆయన నగరంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐపీఎస్‌ల ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. బంధువులతో మాట్లాడాము. వీడియోలో సలాం చివరి మాటలు వినిపించారు. పూర్తిగా అన్ని పరిశీలించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సమగ్ర విచారణ సాగుతుంది. వారి కుటుంబానికి అండగా ఉంటాం’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- మనుషులను రక్షించేందుకు పెట్టిన లాక్డౌన్ గుర్రాల ప్రాణాల మీదకు తెచ్చింది
- ‘రెండేళ్లుగా చెక్కులు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం’
- మన చేతిరాతను మార్చిన పెన్ను... ఎలా పుట్టింది? దాని చరిత్ర ఏంటి?
- జో బైడెన్: అమెరికా కొత్త అధ్యక్షుడు
- కమలా హారిస్: అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళ
- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎందుకింత ‘గందరగోళం’?
- అమెరికా కొత్త అధ్యక్షుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








