తిత్లీ తుపాను: ‘రెండేళ్లుగా చెక్కులు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం’ - బాధితుల ఆవేదన

ఫొటో సోర్స్, NDMA
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
తిత్లీ తుపాను బీభత్సం తర్వాత బాధితులకు ప్రభుత్వం, ప్రతిపక్షం తరపున అనేక హామీలు వచ్చాయి. ఇళ్లు ఇస్తామని, పంట నష్టం చెల్లిస్తామని నాటి ప్రభుత్వం చెప్పగా... ప్రభుత్వం చెప్పిన దానికి మరింత అదనపు సాయం అందిస్తామని ప్రతిపక్షం చెప్పింది.
అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉంది. అప్పటి అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్షమైంది. కానీ తిత్లీ తుపాను బాధితుల పరిస్థితి మాత్రం అలాగే ఉంది.
ఒడిశాపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అనుకున్న తిత్లీ తుపాను అప్పుడు శ్రీకాకుళంపై కూడా విరుచుకుపడింది. 2018 అక్టోబరు 10వ తేదీ అర్థరాత్రి మొదలైన బీభత్సం... మర్నాడు మధ్యాహ్నం వరకూ కొనసాగింది.
తిత్లీ సృష్టించిన కల్లోలాన్ని జిల్లా వాసులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. కదిపితే కన్నీళ్లతో ఆ తుపాను మిగిల్చిన కష్టాలను చెబుతున్నారు. ఈ తుపాను జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, రణస్థలం, పాతపట్నం, సంతకవిటి మండలాల్లోని పంటపొలాలు, జీడితోటలతో పాటు మత్స్యకారుల జీవితాలను నేలమట్టం చేసింది.
తిత్లీ తుపాను సమయానికి జిల్లాలో 5.80 లక్షల ఎకరాల్లో వివిధ పైర్లు సాగవుతున్నాయి. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఈదురుగాలుల ధాటికి జిల్లాలోని 19 మండలాల్లోని పంటలు, తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
జిల్లాలో తుపాను ప్రభావంతో 3.4 లక్షల ఎకరాల వరి నీట మునిగింది. 5,052 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 2,082 ఎకరాల్లోనూ, చెరకు 355 ఎకరాల్లోనూ దెబ్బతింది. 12 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయని అధికారులు అంచనాలు వేశారు.

తిత్లీ కలిగించిన నష్టం మొత్తం 3,600 వందల కోట్ల రూపాయలుగా అప్పటి ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ మేరకు సాయం అందించాలని కేంద్రానికి నివేదిక కూడా పంపించింది. ఆ తర్వాత జిల్లాలోని తొలి విడత పరిహారంగా చంద్రబాబు 520 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు.
వాటిని బాధితులకు 2018 నవంబర్ 4న పలాసలో సభ ఏర్పాటుచేసి చెక్కుల రూపంలో అందించారు.
ఇందులో 263 కోట్ల రూపాయలు ఉద్యానవన పంటలు,160 కోట్ల రూపాయలు వరి పంట, జీడితోటలు నష్టపోయిన వారికి... 50 కోట్ల రూపాయలు ఇళ్లు, 34.5 కోట్ల రూపాయలు పశువులను కోల్పోయిన వారికి అందచేశారు.

వీరితోపాటు పడవలను కోల్పోయిన మత్స్యకారులు, చిరువ్యాపారులకు కూడా చెక్కులు పంపిణీ చేశారు.
అయితే చాలా మంది విషయంలో చెక్కులు ఇంకా చెక్కులుగానే మిగిలిపోయాయి. రెండేళ్లుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా, ఖాతాల్లోకి డబ్బు జమకావడంలేదు.
"రైతులను ఆదుకుంటామంటూ నష్టపరిహారంగా చెక్కులు ఇచ్చారు. వాటిని పట్టుకుని అప్పటి నుంచి బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ డబ్బులు రాలేదు. కారణమడిగితే బ్యాంకుల్లో చెప్పరు. ఇప్పడు ప్రభుత్వం మారింది. వీరిని అడిగితే... ఇదిగో ఈవారం, పైవారం అంటున్నారు" అని కొబ్బరి రైతు పాపారావు బీబీసీతో చెప్పారు.

‘కొబ్బరి మొక్కలు నేలలో నిలవట్లేదు’
మొత్తం కొబ్బరి తోటలతో నిండిన ఉద్దానంలో ఒకప్పుడు తలపైకెత్తి చూస్తే ఆకాశం కనిపించేది కాదు.
అందుకే దీన్ని ‘మినీ కేరళ’ అనేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 లక్షల కొబ్బరి మొక్కలు నేలకొరిగాయి.
సుమారు 54 వేల కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మిగిలి ఉన్నా అరకొర కొబ్బరి మొక్కలకు కూడా చీడ పట్టి పనికి రాకుండా పోయాయి.
"కొబ్బరి తోటల్ని నష్టపోయామని ప్రభుత్వం మాకు కొబ్బరి మొక్కల్ని ఇచ్చింది. అయితే అవి మా భూములకు సరిపోవడం లేదు.
భూమిలో నిలబడటం లేదు. పట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తున్నాయి.
15 ఏళ్లు పెరగాల్సిన మొక్క పది రోజులు కూడా నిలబడం లేదు" అని ఎర్రముక్కం గ్రామానికి చెందిన కొబ్బరి రైతు పార్వతి పంటకు పనిరాని మొక్కలను చూపిస్తూ ఆవేదనతో చెప్పారు.
కొబ్బరి రైతుకి తుపాను మిగిల్చిన నష్టంతో పాటు మరో కష్టం వచ్చింది. తుపాను దెబ్బకి కొబ్బరి చెట్లన్ని నేలకూలడంతో...తోటల్లో నీడ కరువైంది. నీడ లేని చోట కలుపు మొక్కలు పెరుగుతాయి. దీంతో ఉద్దానంలోని అన్ని కొబ్బరితోటలు కలుపు మొక్కలతో నిండిపోయాయి.
"తుపాను తర్వాత ఏడాదికి ఎనిమిది నుంచి పది సార్లు కలుపు మొక్కలను పీకడమే మా పనైపోయింది.
మోడులుగా మిగిలిపోయిన కొబ్బరి చెట్లు కూడా పెరిగే అవకాశం కనిపించడం లేదు. కొత్త మొక్కలేస్తే పురుగు పట్టేస్తుంది.
కలుపు తీయకపోతే భూమి సారాన్ని తగ్గించేస్తాయి. వీటి వల్ల చీడపీడలు కూడా పెరుగుతున్నాయి" అని ఎర్రముక్కం గ్రామ రైతు వెంకటరావు చెప్పారు.

‘అద్దె ఇంట్లో ఉండలేం... సొంత ఇల్లు కట్టుకోలేం’
తిత్లీ తుపానుకు జిల్లావ్యాప్తంగా 25 వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. నేలమట్టమైన ఒక్కో ఇంటికి రూ. 2.50 లక్షల చొప్పున మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. చాలా కుటుంబాలు నేటికీ అద్దె ఇళ్లల్లో, తోటల్లో షెడ్లు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నాయి.
"తుపాను వర్షానికి మా ఇల్లు పడిపోయింది. అప్పుడు పది వేలు ఇచ్చారు. వెంటనే ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల రూపాయల డబ్బులిస్తామన్నారు. జీడి తోటలు కూడా పోయాయి. దాంతో ఆ తోటలోనే షెడ్డు వేసుకుని ఉంటున్నాను. ఇప్పటి దాకా ఏ సాయమూ అందలేదు" అని ఎర్రముక్కంలోని నరసమ్మ చెప్పారు.
మత్స్యకారుల ఆవేదన
తిత్లీ తుపానుకు కంచిలి, వజ్రపుకొత్తూరు, బారువ, ఎర్రముక్కం తదితర తీరప్రాంత మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు.
బోట్లు, పడవలు, వలలు అన్నింటిని తిత్లీ నాశనం చేసింది. మత్స్యకారులకి దాదాపు 9 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.
"ఒక్కో బోటూ రూ.పది లక్షలు ఉంటే దానికి పరిహారంగా లక్ష రూపాయలే ఇచ్చారు. దానికీ ఎన్నో కోర్రీలు పెట్టారు. ఇంకా వలలు, పడవలు, ఇంజిన్లు సబ్బిడీ మీద ఇస్తామని కొంత డబ్బు కట్టించుకున్నారు. ఇప్పటి వరకూ రాలేదు. మేం ఇళ్లు కోల్పోడంతో పాటు మా జీవనాధారమైన పడవలు, వలలు కూడా నష్టపోయాం" అని తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదిక ప్రతినిధి వాసుపల్లి కృష్ణారావు బీబీసీతో చెప్పారు.

‘అనర్హులే ఎక్కువ మంది ఉన్నారు’
తిత్లీ పరిహారాన్ని అదనంగా మరో 150 కోట్ల రూపాయలు పెంచుతున్నట్లు గత ఏడాది సీఎం జగన్ పలాసలో ప్రకటించారు.
ప్రతి కొబ్బరి చెట్టుకు 1,500 నుంచి 3,000 రూపాయల వరకు… జీడిమామిడికి హెక్టారుకు 30 వేల నుంచి 50 వేల రూపాయలకు పరిహారాన్ని పెంచుతున్నామన్నారు. అయితే ఆ హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
దీనిపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బీబీసీతో మాట్లాడుతూ.... "ప్రభుత్వం ఇళ్లు కోల్పోయిన వారికి, నష్టపోయిన మత్స్యకారులతోపాటు బాధితులందరికీ న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. అది కూడా మరో రెండు వారాల్లోనే జరుగుతుంది. అప్పటి ప్రభుత్వం ఎక్కువ మంది అనర్హులను బాధితుల జాబితాల్లో చేర్చింది. ఇప్పడు మేం వాటిని పరిశీలించి, అనర్హులందరినీ తొలగిస్తున్నాం. నిజమైన బాధితులకి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందువల్లే ఆలస్యమవుతోంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/bendalam ashok
‘రైతులతో కలిసి పోరాటం చేస్తాం’
తిత్లీ పరిహారం అంశానికి కూడా రాజకీయ రంగు పులుముకుంది. బాధితుల జాబితాల్లో అనర్హులను చేర్చారంటూ వైఎస్సార్సీపీ టీడీపీని తప్పుపడుతోంది.
తిత్లీ తుపాను సమయంలో జగన్ పాదయాత్ర చేస్తూ... విజయనగరం జిల్లాలోనే ఉన్నారని, కానీ పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకి వచ్చి కనీసం పరామర్శించలేదని టీడీపీ అంటోంది.
ఇలాంటి వారికి రైతుల పట్ల బాధ్యత ఉందంటే ఎలా నమ్ముతామని ఇచ్ఛాపురం ఎమ్మేల్యే బెందాళం అశోక్ బీబీసీతో అన్నారు.
"జాబితాలను సవరిస్తున్నామంటూ వైసీపీ నాయకులు వారికి గిట్టనివాళ్ల పేర్లను తొలగిస్తున్నారు. అప్పుడు జాబితాలను తయారు చేసింది ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న అధికారులే. మరి వారిని తప్పుపడతారా? తిత్లీ బాధితులకు న్యాయం చేయకపోతే, వారితో కలిసి టీడీపీ పోరాటం చేస్తుంది. తప్పులు మీరు చేసి, వాటిని మరోకరి మీదకు నెట్టేస్తూ ఎంతకాలం పబ్బం గడుపుతారు?" అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








