కరోనావైరస్ : మనుషులను రక్షించేందుకు పెట్టిన లాక్‌డౌన్ గుర్రాల ప్రాణాల మీదకు తెచ్చింది

- రచయిత, బళ్ల సతీశ్, నవీన్ కుమార్ కె.
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కరోనా లాక్‌డౌన్ అన్ని వర్గాల వారినీ ప్రభావితం చేసింది. కానీ దానితో ప్రత్యక్షంగా ఏ సంబంధమూ లేని గుర్రాలు కూడా కరోనా దెబ్బ చవిచూశాయి. ఆకలి బాధను అనుభవించాయి. కొన్ని తిండిలేక చనిపోయాయి కూడా.
హైదరాబాద్‌లో చాలా మంది గుర్రాల యజమానులు వాటికి తిండి పెట్టలేక, అలాగని వదల్లేక ఇంజెక్షన్ల ద్వారా గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. ఇలా చేస్తే, గుర్రాలు బతికి ఉంటాయి. కానీ, వాటికి ఆకలి మాత్రం తీరదు.
నగరంలో ఉండే గుర్రాలకు సమీపంలోని పల్లెల నుంచి మేత రావాలి. లాక్‌డౌన్ మొదట్లో యజమానుల దగ్గర కాస్త డబ్బు ఉన్నా, గుర్రాలకు మేత తేవడం, రవాణా పర్మిషన్లు, వాహనాలు దొరకడం చాలా ఇబ్బందిగా ఉండేది. దానికితోడు ధరలు పెరిగాయి. ఆ సమస్యను ఎలాగోలా అధిగమించొచ్చు అనుకునేలోపు.. లాక్‌డౌన్ పొడిగించారు. దీంతో గుర్రాలకు పనిలేదు. యజమానులకు ఆదాయం లేదు. వాటికి మేత లేదు.
''నగరంలో నిజానికి 500 వరకూ గుర్రాలు ఉండేవి. కానీ లాక్‌డౌన్‌లో తిండి లేక కొన్ని చనిపోయాయి. కొన్నింటిని యజమానులు వేరే వాళ్లకు అమ్మేశారు'' అని అన్నారు మహమ్మద్ ఆజం.
అత్తాపూర్‌కు చెందిన మహమ్మద్ ఆజం... తాత, తండ్రీ గుర్రాలను అద్దెకిచ్చే వ్యాపారమే చేశారు. ఇప్పుడు ఆయన కూడా అదే పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇలా గుర్రాలను అద్దెకిచ్చే వారు 50 మంది వరకూ ఉంటారనీ, ప్రస్తుతం సుమారు 450 వరకూ గుర్రాలు ఉంటాయనీ ఆయన చెబుతున్నారు.
రాణి రుద్రమ, రాజన్న, మగధీర, బాహుబలి వంటి సినిమాల కోసం తాము గుర్రాలు సరఫరా చేసినట్టు చెప్పారు ఆజం. ఇక సీజన్లను బట్టి వివాహాలు, ఫంక్షన్లకూ వీళ్లు గుర్రాలను పంపుతారు.
''లాక్‌డౌన్ ముందు సమస్య లేదు. సినిమాలు, వివాహాలు, ఫంక్షన్లతో నడచిపోయేది. కానీ లాక్‌డౌన్ వల్ల లెక్కలేనంత నష్టం వచ్చింది. వాటికి తిండి, నీరు, ఉలవలు కావాలి. ఉద్యోగులు ఉండాలంటే వారికి జీతాలు ఇవ్వాలి. ఇదంతా సమస్య. స్వచ్ఛంద సంస్థల వాళ్లు కొంత సాయం చేశారు'' అని చెప్పారు ఆజం.
జీవాలను పెంచే వారందరికీ లాక్‌డౌన్ ఏదో రూపంలో సమస్యలు తెచ్చింది. కానీ వాటన్నిటికంటే గుర్రాలది ప్రత్యేకమైన సమస్య. వీటిని పాల కోసమో, ఆహారం కోసమో కాక, కేవలం ప్రదర్శనల కోసం, వినోదం కోసం పెంచుతారు. దానివల్ల లాక్‌డౌన్ ప్రభావం వీటిపై గట్టిగా పడింది.
దీనికి తోడు కేవలం రెండు మూడు గుర్రాలను మాత్రమే పెంచుతూ అద్దెకు తిప్పే వారు వాటికి రోజూ దాణా అందించలేక ఇబ్బంది పడ్డారు. ఇదే గుర్రాల ఆకలి చావులకు కారణమైంది. చాలా గుర్రాలు అనారోగ్యం పాలయ్యాయి.

''భారత దేశంలో గుర్రాల యజమానులు అయితే బాగా ధనవంతులు లేదా బాగా పేదవారు. రేస్ కోసం, సరదాగా పెంచుకోవడం కోసం, స్వారీ చేయడం కోసం ధనవంతులు గుర్రాలను పెంచుతారు. మిగిలిన వారికి ఇవి బతుకుదెరువు. వారు తరతరాలుగా ఈ గుర్రాలను అద్దెకిస్తూ బతుకుతున్నారు. పెళ్లి ఊరేగింపులు (బారాత్), మతపరమైన ఊరేగింపులు, సినిమా షూటింగులకూ అద్దెకిచ్చి ఆ ఆదాయంతో జీవిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల వీరికి చాలా దెబ్బ పడింది'' అన్నారు రెబెకా గుప్తా.
హైదరాబాద్‌కు చెందిన రెబెకా గుప్తా సెకండ్ ఛాన్స్ అనే సంస్థ నిర్వహిస్తున్నారు. 13 ఏళ్లుగా హైదరాబాద్‌లో రోడ్లపై వదిలేసిన గుర్రాలను రక్షించే పనిలో ఆమె ఉన్నారు. రెబెకా, కాజా వీరేంద్ర (హైదరాబాద్ రేస్ కోర్స్ సీఓఓ), ఫాతిమా, సాగర్ లాక్‌డౌన్‌లో గుర్రాలకు సాయం చేయడానికి కృషి చేస్తున్నారు.
ఒక గుర్రం నిర్వహణకు రోజుకు సుమారు 250-300 రూపాయల ఖర్చు అవుతుందని ఆజం చెప్పారు. సినిమాలు, వివాహాలు, ఫంక్షన్లూ ఉంటే గుర్రానికి 1500 వరకూ, మనిషికి బేటా, రవాణా చార్జీలు వస్తుంటాయి. ఈ పనులు రోజూ ఉండకపోయినా, బాలెన్స్ అయిపోయేది అంటున్నారు వ్యాపారులు. కానీ నిరంతరంగా 7 నెలల నుంచి అసలు పనే లేకపోవడంతో వారికిప్పుడు గుర్రాలకు మేత వేయడం కూడా కష్టంగానే మారింది.
''మేము అంతా గ్రూపుగా ఎంతో కొంత చేయాలనుకున్నాం. మా కుటుంబం మిల్లుల వ్యాపారంలో ఉంది. ఆ పరిచయాలతో ప్రయత్నించగా, హైదారబాద్‌లోని మిల్లుల వాళ్లు ధాన్యం, దినుసుల పొట్టు (బ్రాన్) విరాళంగా ఇచ్చారు. మొదట్లో 284 గుర్రాలకు మేత సరఫరా చేశాం. తరువాత మా దగ్గరకు చాలా మంది యజమానులు వచ్చారు. దీంతో 350కి పైగా గుర్రాలకు మేత అందించాం. జూన్ వరకూ బానే చేశాం. కానీ జూలై నుంచి మాకు నిధుల కొరత మొదలైంది. ఒకసారి మేత అందించడానికి 2 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుంది. ఇప్పటి వరకూ మిల్లు యజమానులు 600 బస్తాల మేత ఉచితంగా ఇచ్చారు. తరువాత మా కుటుంబం నెల నెలా 100 బస్తాల మేత ఇస్తోంది. నగదు మొత్తం మేమిద్దరం (రెబెకా, వీరేంద్ర) సొంతంగా పెట్టుకున్నాం. అయినా ఇంకా అవసరం ఉంది. దీంతో మేం అందర్నీ సాయం అడుగుతున్నాం. చేతనైనంత సాయం చేయండి అని కోరుతున్నాం'' అని అన్నారు రెబెకా.

ఫొటో సోర్స్, Rebecca Gupta
రోడ్లపై దిక్కులేని గుర్రాలు
సాధారణంగా గుర్రం పనిచేసినంత సేపూ వాటికి తిండి దొరుకుతుంది. కానీ వాటికి ఏదైనా జబ్బు చేసినా, కాలు విరిగినా, లేదా ముసలిది అయిపోయినా దానిని పోషించలేక రోడ్లపై వదిలేస్తారు యజమానులు.
తిండిలేకపోవడం, గాయాలతో ఉండడంతో అవి తొందరగా చనిపోతాయి. అలాంటి పరిస్థితిలో ఉన్న గుర్రాలను ఈ స్వచ్ఛంద సంస్థ వారు చేరదీస్తున్నారు. వైద్యం చేయించి, తిండి పెడుతున్నారు.
''బక్కచిక్కిపోయి ఎముకలు కనిపిస్తోన్న, కాళ్లు విరిగిన గుర్రాలను ఎన్నింటినో చేరదీశాం. చాలా మంది గుర్రాల యజమానుల దగ్గర నాలుగుకు మించి గుర్రాలు ఉండవు. వారు ఆర్థికంగా బలమైన వారు కాదు. దీంతో వాటి నిర్వహణ చాలా సమస్య. వాటిపై ఆదాయం ఆగిపోగానే వాటిని రోడ్లపై వదిలేస్తారు. మీరు జుమ్మేరాత్ బజార్ వంటి ప్రాంతాలు వెళ్లి చూస్తే, ఎముకలు తేలిన గుర్రాలు ఎన్నో కనిపిస్తాయి'' అన్నారు రెబెకా.
ముసలివైపోయి, గాయాలయ్యి, పనిచేయలేకపోవడంతో యజమానులు తిండిపెట్టక వదిలేసిన గుర్రాలూ హైదరాబాద్లో ఎన్నో వస్తుంటాయి. బరువులు లాగేవీ, బండ్లకు కట్టేవీ, పెళ్లి ఊరేగింపుల గుర్రాలూ ఈ కోవలో ఉంటాయి. ఈ వారంలోనే ఇలాంటివి మూడు గుర్రాలను చేరదీశారు ఈ బృంద సభ్యులు.
ప్రస్తుతం లాక్‌డౌన్ దెబ్బ నుంచి తట్టుకోవడానికి చిన్న స్థాయిలో గుర్రపు స్వారీ నేర్పడం ప్రారంభించారు ఆజం. ఈయన దగ్గర పదుల సంఖ్యలో గుర్రాలున్నాయి కాబట్టి ఈ పని సాగుతోంది. కానీ ఐదు లోపు గుర్రాలుండే వాళ్లకు వేరే ఆదాయం లేకపోయింది.
లాక్‌డౌన్ నిబంధనలు పూర్తిగా ఎప్పుడు ఎత్తేస్తారా.. గతంలోలా ఫంక్షన్లు, షూటింగులకూ గుర్రాలను ఎప్పుడు సరఫరా చేయగలమా అని వీళ్లంతా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








