హైదరాబాద్ వరదలలో ఎంత మంది చనిపోయారు? ప్రభుత్వం మృతుల సంఖ్య ప్రకటించలేదు ఎందుకు

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గౌస్‌నగర్, హైదరాబాద్ బండ్లగూడ శివార్లలో ఉంటుంది. గౌస్‌నగర్ ఓ పక్కకు సిమెంటు రేకులతో కట్టిన ఇళ్లు వరుసగా కనిపిస్తాయి.
ఆ ఇళ్ల వరుసే కాలనీకి సరిహద్దు. అవతల మహ్మదీయనగర్ ఉంటుంది.
మహ్మదీయ నగర్‌లో ఎత్తుగా ఉన్న ఓ ప్రాంతంలో కొత్తగా ఒక లేఅవుట్ వేస్తున్నారు. ప్లాటింగ్ కూడా జరిగింది.
భారీ కాంపౌండ్ వాల్ కూడా కట్టారు. కొన్ని అడుగుల ఎత్తున రాళ్లతో, ఆపై సిమెంట్ ఇటుకలతో గోడ కనిపిస్తుంది.

మంగళవారం రాత్రి 8.30 గంటలు.
కాలనీలోని మహమ్మద్ జహంగీర్ హుస్సేన్ కుటుంబం భోజనానికి కూర్చుంది. జహంగీర్ చిన్న కొడుకు నవాజ్ అక్కానీకి ఓ సంబంధం వచ్చింది. దాని గురించి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.
ఆయన కూతురు పురుడు పోసుకుని పుట్టింట్లోనే ఉంది. భోజనాలు పూర్తయ్యాక కొందరు తమ గదుల్లోకి వెళ్లి పడుకున్నారు.
ఇంతలో పెద్ద శబ్దం.
‘‘కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ పేలినట్టుగా పెద్ద శబ్దం వచ్చింది. మేం ముందు గదిలో ఉన్నాం. పరుగెత్తి వెనక గదిలోకి వెళ్లాం. ఆ గదిలో గదిలో పెద్దపెద్ద బండలు, గ్రానైట్ రాళ్లు, శిథిలాలుగా పడి ఉన్నాయి. ఆ రాళ్లను తొలగించాం. మా వదిన, మా అక్క, మా అన్నపిల్లలు అదే గదిలో ఉన్నారు. మరో గదిలో అన్న, అక్క, అక్క పిల్లలు ఉన్నారు’’ అని నవాజ్ అక్కానీ చెప్పారు.

మృత్యువు మీద పడింది..
మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు మహ్మదీయనగర్‌లోని వెంచర్ గోడ కూలి, గౌస్‌నగర్ కాలనీపై పడింది.
సిమెంటు రేకుల ఇళ్లలో దాదాపు 8 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో రెండు ఇళ్లలోని 8మంది మరణించారు.
ఒక కుటుంబం నుంచి ఐదుగురు, మరో కుటుంబంలో ముగ్గురు చనిపోయారు.
నవాజ్ అన్న, వదిన, అక్క, ఆమె ఇద్దరు కొడుకులు మరణించారు. ఇంకో అక్కకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
చనిపోయిన అక్క పిల్లలిద్దరిలో 20 రోజుల వయసున్న బాబు కూడా ఉన్నాడు. నవాజ్ అన్న కొడుకులు ఇద్దరు, తండ్రి, చెల్లి ప్రాణాలతో బయటపడ్డారు.
నవాజ్ అక్కానీ తండ్రి జహంగీర్ ఆటోడ్రైవర్. అన్న ఐటీఐ చదివి గల్ఫ్‌లో పని చేసి వచ్చారు. మళ్లీ గల్ఫ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సివిల్ ఇంజినీరింగ్ చదివిన నవాజ్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. చిన్నక్క పురుడు అనంతరం జరిగే సంప్రదాయ కార్యక్రమాల అయ్యాక నవాజ్ పెళ్లి ఉంది.
కానీ ఇంతలోనే ఘోరం జరిగి పోయింది. స్థానికులు వచ్చి ఆ మృత దేహాలను బయటకు తీశారు.
‘‘రాత్రి ఎనిమిదిన్నర అయ్యిందనుకుంటా. కరెంటు పోయింది. ఇంతలోనే పెద్ద శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూశాం. ప్రమాదం జరిగిన ఇంటి నుంచి పిల్లలు పరుగున వచ్చారు. మమ్మల్ని వాళ్ల ఇంట్లోకి లాక్కెళ్లారు. లోపలికి వెళ్లి చూస్తే ఒక మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. రెండు గదులలో పడిన రాళ్ల కింద ఉన్న మృతదేహాలు వెలికి తీశాం’’ అని నవాజ్ ఎదురింట్లో ఉండే అబ్దుల్ షోయబ్ చెప్పారు

‘ఎవరూ చావలేదు కదా...చస్తే చూద్దాం’
భారీ వర్షాలకు కూలిపోయిన గోడ విషయంలో స్థానికులకు, లేఅవుట్ యాజమాన్యానికి మధ్య వివాదాలున్నాయి.
2018లో ఆ గోడ నిర్మిస్తున్నప్పుడే స్థానికులు అభ్యంతరం చెప్పారు.
“ సొంతవారు పోయారు, ఇల్లూ పోయింది. రూపాయి రూపాయి పోగేసి 2016లో ఇల్లు కట్టుకున్నాం. దీని కోసం అప్పులు కూడా చేశాం. సొంత మనుషులతో సహా ఇల్లు కూడా పోయింది’’ అని నవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నవాజ్ కుటుంబం ఇల్లు కట్టుకునే రోజుల్లో ఈ గోడ లేదు. 2018లో దీన్ని నిర్మించారు. తర్వాత ఎత్తు కూడా పెంచారు.
“కాలనీ వాళ్లం అంతా వెళ్లి గోడ ఎత్తు పెంచవద్దని కోరాం. వాళ్లు వినలేదు. ప్రమాదం జరిగితే ఎలా అని అడిగాం. ఎవరూ పోలేదు కదా, పోతే అప్పుడు చూద్దాం అని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇప్పుడు నా కుటుంబంలో ఐదుగురిని పోగొట్టుకున్నా. నేను ఎవర్ని అడగాలి? బాధ్యత ఎవరిది?’’ అని నవాజ్ ప్రశ్నిస్తున్నారు.
కాలనీవాసులు అభ్యంతరం చెప్పినా గోడ కట్టారని స్థానికుడు షోయబ్ అన్నారు.
ఈ ఘటనలో మరణించిన వారిలో ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ. 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చింది. కానీ దీనికి బాధ్యులైన వారు ఎవరూ అరెస్టు కాలేదు. బాధితులకు పక్కా ఇళ్ల గురించి ఎటువంటి హామీ లేదు.

ఓల్డ్‌సిటీలో మరణాలెన్ని?
హైదరాబాద్ పాతనగరం వరదలకు తీవ్రంగా దెబ్బతింది. బండ్లగూడ, మైలార్‌దేవ్ పల్లిలోని కొన్నికాలనీలు, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కాస్ ప్రాంతాల్లో నష్టం అపారంగా ఉంది. ప్రాణనష్టం మీద స్పష్టమైన లెక్కలు లేవు.
ఒక కాలనీలోని ఓ ఇంట్లో 8మంది గల్లంతయినట్లు వరద ప్రాంతాలలో కవరేజికి వెళ్లిన బీబీసీకి స్థానికులు తెలిపారు. వారిలో ఐదుగురి మృతదేహాలు లభించాయి. మరో ముగ్గురి ఆచూకీ ఇంత వరకు దొరక లేదు.
వరదలకు ఓల్డ్ సిటీలో 30మంది మరణించారని స్థానిక ఉర్దూ మీడియా కథనాలు చెబుతున్నాయి.
కానీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
బాధితులైన 12 కుటుంబాలకు హోంమంత్రి మహమూద్ అలీ ఒక్కొక్కరికి రూ.5 లక్షల రూపాయల పరిహారం చెక్కులు అందజేశారు.
ఇవి కూడా చదవండి:
- వీరికి వాసన తెలియదు... ఇంట్లో గ్యాస్ లీకైనా గుర్తించలేరు
- గృహహింస: ‘వందల సిజేరియన్లు చేసిన నేనే ఆశ్చర్యపోయాను.. గర్భాశయం పగిలిపోవడంతో అనుమానం వచ్చింది’
- ఆంధ్రప్రదేశ్: పాఠశాలల్లో కుల, మత ప్రస్తావన లేకుండా చేయొచ్చా? విద్యా శాఖ నిర్ణయం ఆచరణ సాధ్యమేనా?
- బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టారు.. అయినా బతికాడు.. కానీ..
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- ‘నాన్‌లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








