అనోస్మియా: వాసన చూడలేని వ్యాధి.. ఎంత ప్రమాదకరమో తెలుసా

యాజ్మిన్ సల్జార్

ఫొటో సోర్స్, Yazmin Salazar

ఫొటో క్యాప్షన్, యాజ్మిన్ సల్జార్

మల్లెపూల వాసన ఎలా ఉంటుందంటే మీరు ఏం చెబుతారు? చిరుజల్లు పడే ముందు మట్టి వాసన గురించి ఏమని వర్ణిస్తారు? మాటల్లో చెప్పడం కష్టం కదా!

కానీ, యాజ్మిన్ సల్జార్‌కు ఆమె భర్త ఇలాంటి వాసనల గురించి మాటల్లోనే వివరిస్తారు. ఎందుకంటే, ఆమె వాసనలు చూడలేరు.

యాజ్మిన్‌ వయసు 38 ఏళ్లు. అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఆమె ఉంటున్నారు.

ఆమెకు అనోస్మియా అనే సమస్య ఉంది. ఆమె వాసన చూడలేరు.

వాసన చూసే సామర్థ్యం కోల్పోవడం ప్రస్తుతం కోవిడ్ సోకినవారిలో ప్రధానం లక్షణంగా కనిపిస్తోంది. అయితే, వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత వారు తిరిగి వాసన చూడగలుగుతున్నారు.

కానీ అనోస్మియాతో బాధపడేవారు ఎన్నటికీ వాసన చూడలేరు.

అనోస్మియా పెద్ద సమస్యగా బయటకు కనిపించకపోవచ్చు గానీ, దాన్ని అనుభవిస్తున్నవారు జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

వాసన చూడలేని వారు కుంగుబాటు (డిప్రెషన్) బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బ్రిటన్‌లో అనోస్మియాపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న అబ్సెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా ఓక్లే అంటున్నారు.

''జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటి వాటి వల్ల కూడా అనోస్మియా రావొచ్చు. తలకు గాయాలవ్వడం... తల, మెడ క్యాన్సర్‌లకు రేడియేషన్ చికిత్స చేయించుకోవడం, మాదకద్రవ్యాల వాడకం, పొగ తాగడం, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధుల వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంది.

వయసు మీద పడుతున్నకొద్దీ వాసన చూసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. 75 ఏళ్లు పైబడినవాళ్లలో దాదాపు 30 శాతం అనోస్మియాతో ఉంటారు'' అని సారా ఓక్లే అన్నారు.

యాజ్మిన్ సల్జార్

ఫొటో సోర్స్, Yazmin Salazar

ఫొటో క్యాప్షన్, యాజ్మిన్ చిన్ననాటి ఫొటోలు

మిగతా వారిలా తాను వాసనలు చూడలేకపోతున్నానని రెండో తరగతి చదువుతున్నప్పుడు యాజ్మిన్ గుర్తించారు.

''వాసన తెలియకున్నా, నా క్లాస్‌మేట్స్, ఇంట్లోవాళ్లు ఎలా స్పందిస్తే నేనూ అలానే స్పందిచేదాన్ని. వాళ్లు దుర్వాసన వస్తుందంటే దుర్వాసన... సువాసన వస్తుందంటే సువాసన వస్తుంది అనేదాన్ని. నిజానికి నాకు అసలు వాసనే తెలియదు'' అని యాజ్మిన్ చెప్పారు.

ఏడో తరగతికి వచ్చాక యాజ్మిన్ తన తల్లికి అసలు విషయాన్ని వివరించారు. ఆమె వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లారు.

అయితే, పెద్దగా భయపడాల్సిందేమీ లేదని, కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అప్పుడు వైద్యుడు సూచించారని యాజ్మిన్ చెప్పారు.

యాజ్మిన్ సల్జార్

ఫొటో సోర్స్, Yazmin Salazar

ఆహారం పాడైనా, తన దగ్గరి నుంచి చెమట వాసన వస్తున్నా యాజ్మిన్‌కు తెలియదు.

ఇలాంటి విషయాల్లో ఆమె తన సన్నిహితులపై ఆధారపడతారు.

''మన శరీరం వాసన మనకు తెలియకపోవడం... అద్దంలో చూసుకున్నప్పుడు, మన ప్రతిబింబం మనకు కనిపించకపోవడం లాంటిదని అనోస్మియాతో ఉన్న మరో వ్యక్తి నాతో ఓసారి అన్నారు'' అని యాజ్మిన్ అన్నారు.

రాకేశ్ కమల్

ఫొటో సోర్స్, Rakesh Kamal

ఫొటో క్యాప్షన్, రాకేశ్ కమల్

హైదరాబాద్‌కు చెందిన రాకేశ్ కమల్ కూడా అనోస్మియాతో బాధపడుతున్నారు.

''మా తాతకు కూడా ఈ సమస్య ఉండేది. కానీ, ఆయన ఎప్పుడూ దీని గురించి బయటకు పెద్దగా చెప్పలేదు'' అని అన్నారు రాకేశ్.

అనోస్మియా ఉన్న వాళ్లు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆయన వివరించారు.

''ఓసారి మా వంటగదిలో నిప్పు అంటుకుంది. ఆ సమయంలో నా భార్య నిద్ర పోతోంది. నేను హాల్‌లో ఉన్నా. వాసన తెలియదు కాబట్టి, నేను గుర్తించలేకపోయా. చివరికి హాల్‌లోకి పొగ రావడంతో విషయం తెలిసింది'' అని రాకేశ్ చెప్పారు.

ఆ తర్వాత ఇంట్లో గ్యాస్ లీక్ అయినా, పొగ వెలువడినా గుర్తించే పరికరం పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వంట చేసే సమయమంతా స్టవ్ దగ్గరే జాగ్రత్తగా ఉంటానని తెలిపారు.

''చాలా ఏళ్లపాటు నేను మా ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు నా సమస్య గురించి చెప్పలేదు. చెప్పినా ఎవరూ నమ్మరని అనిపించింది. 21 ఏళ్లు వచ్చేదాకా ఎవరికీ తెలియనివ్వలేదు'' అని రాకేశ్ అన్నారు.

కోవిడ్ సమయంలో వాసన సామర్థ్యం కోల్పోవడం గురించి, అనోస్మియా అంశం గురించి చాలా చర్చ జరిగింది.

ఈ సమస్య గురించి ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాకేశ్ అంటున్నారు.

''చూపు, వినికిడి సామర్థ్యం లేనివాళ్ల సమస్యల గురించి అందరికీ తెలుసు. కానీ, వాసన చూడలేనివారి సమస్యల గురించి ఎవరూ మాట్లాడరు'' అని ఆయన అన్నారు.

జోష్నా మహారాజ్

ఫొటో సోర్స్, Mel Yu Vanti

ఫొటో క్యాప్షన్, జోష్నా మహారాజ్

వాసన సామర్థ్యం నెమ్మదిగా పోయే ప్రమాదం కూడా ఉంది. తనకు అలాగే జరిగిందని టోరంటోకు చెందిన షెఫ్ జోష్నా మహారాజ్ అంటున్నారు.

సైనసైటిస్ కారణంగా ఆమెకు ఇతర సమస్యలు తలెత్తి, వాసన సామర్థ్యం పోయింది.

వృత్తిరీత్యా జోష్నాకు వాసన సామర్థ్యం చాలా ముఖ్యం. అది పోయాక, తాను పనిచేసే రెస్టారెంట్‌లో పొరపాటున ఆమె వంటలు మాడగొట్టేవారు.

''విపరీతమైన ఆందోళనకు గురయ్యా. వాసన చూడలేకపోవడంతో వృత్తి రీత్యా నాకు చాలా సమస్యలు వచ్చాయి'' అని ఆమె అన్నారు.

ఇప్పుడు ఆమె తన వాసన సామర్థ్యంపై ఆధారపడకుండా, వంట ప్రక్రియలో ఏ పనికి ఎంత సమయం పడుతుందన్నదాన్ని సరిగ్గా లెక్కగట్టుకుని, వాటి ప్రకారం పనిచేస్తున్నారు.

'స్మెల్ ట్రైనింగ్' కూడా తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

స్మెల్ ట్రైనింగ్‌లో వాసన సంకేతాలను కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేయడంలో కీలకపాత్ర పోషించే ముక్కులోని నరాలను ఉత్తేజితం చేస్తారు. దీనితో సమస్య పూర్తిగా పరిష్కారమవ్వదు గానీ, కొంత మేర సానుకూల ఫలితాలు ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

యాజ్మిన్ సల్జార్

ఫొటో సోర్స్, Yazmin Salazar

2016లో తన పుట్టిన రోజు నాడు యాజ్మిన్ 'ద గర్ల్ హూ కాంట్ స్మెల్' పేరుతో ఓ ఆన్‌లైన్ బ్లాగ్ మొదలుపెట్టారు. తన అనుభవాల గురించి ఆమె అందులో రాస్తూ వస్తున్నారు.

అనోస్మియాతో బాధపడుతున్నవారికి తాము ఒంటరివాళ్లమని అనిపించకూడదని తాను ఈ పని చేస్తున్నట్లు యాజ్మిన్ చెప్పారు.

కోవిడ్ సమయంలో అనోస్మియా గురించి చర్చ జరగడం మంచి పరిణామమని, ఈ సమస్యపై జరుగుతున్న పరిశోధనలకు ఆర్థికంగా మరింత చేయూత లభించాలని ఆశిస్తున్నామని సారా ఓక్లే చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)