తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన సైన్యం

తెలంగాణ వరదలు

ఫొటో సోర్స్, ANI

తెలంగాణలో వరద బాధితులను ఆదుకోవడానికి భారత సైన్యం రంగంలోకి దిగింది. వరద ముంచెత్తిన ప్రాంతాలలో నిర్వాసితులుగా మారిన ప్రజలను సైనికులు హైదరాబాద్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రమంతటా కురిసిన భారీ వర్షాలకు జన జీవితం అతలాకుతలమైంది.

"బంగాళఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షాలకు చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. హైదరాబాద్ నగరంలో చాలా జనావాసాలు నీట మునిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు సైన్యం బండ్లగూడ ప్రాంతంలో అక్టోబర్ 14న సహాయక చర్యలు ప్రారంభించింది" అని భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

"నిరాశ్రయులైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు బాధితులకు ఆహార పొట్లాలు అందిస్తున్నాం. సహాయక శిబిరాల్లో సైనిక వైద్య బృందాలు సేవలు అందిస్తున్నాయి" అని ఆ ప్రకటన తెలిపింది.

గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటంటే..

హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ మినహా మిగిలిన ప్రధాన ప్రాంతాలలో వరద ప్రభావం తగ్గు ముఖం పట్టింది. ఉప్పల్, బైరామల్ గూడ, ఎల్ బి నగర్ ప్రాంతాలలో నీటి మట్టం తగ్గింది. కొన్ని కాలనీలలో మాత్రం నిన్నటితో పోలిస్తే కాస్త తక్కువ స్థాయిలోనే వరద నీరు ఉంది. కానీ, ఓల్డ్ సిటీలో మాత్రం ఇంకా వరద ప్రభావం తగ్గలేదు. పల్లా చెరువు నుంచి నీరు పైకి పొంగుతూనే ఉండటంతో బండ్లగూడ నుంచి చాంద్రాయణ గుట్ట పరిసర ప్రాంతాలలోకి నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది. దీంతో చాలా కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జల దిగ్బంధ ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి కొంత సేపు సూర్యరశ్మి కూడా రావడంతో ట్రాఫిక్ పరిస్థితి కాస్త మెరుగుపడింది.

ఏపీలో వరదలు

ఏపీలో కొనసాగుతున్న సహాయ చర్యలు

కాకినాడ నగరం, రూరల్ పరిసరాల్లో వరద తాకిడి కొనసాగుతోంది. ఏలేరు జలాశయం నుంచి 19వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 10 మండలాల్లోని 140 గ్రామాల్లో వరద నీరు చేరింది. లక్ష ఎకరాల పంట నష్టం జరిగింది.

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో వరద తగ్గుముఖం పట్టింది. తూర్పుగోదావరిలో తీవ్రంగా ఉంది.కాకినాడ లో సహాయక బృందాలు రంగంలో దిగాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత, సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు.

హైదరాబాద్ వర్షాలు

మరో మూడు రోజులు వర్షాలు - వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్ నగరాన్ని వానలు అతలాకుతలం చేశాయి. పాత నగరాన్ని ముంచేశాయి.. నగరం మొత్తాన్ని అస్తవ్యస్తం చేసింది. 12 మందికి తక్కువ కాకుండా మరణించారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నగరానికి వెళ్లే దారులన్నీ స్తంభించిపోయాయి. రాత్రంతా హైదరాబాద్ చీకట్లో మగ్గింది.

తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ దిశగా ప్రయాణించి ఈరోజు (అక్టోబరు 14 వ తేదీ) ఉదయం 11.30 గంటలకు ఉత్తర కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలకు చేరుకుందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ప్రకటించింది.

ఈ వాయుగుండం గుల్బర్గాకు ఉత్తర దిశగా 40 కిలోమీటర్లు, షోలాపూర్ (మధ్య మహారాష్ట్ర) కు తూర్పు దిశగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 12 గంటలలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి అక్టోబర్ 16 వ తేదీ నాటికి మహారాష్ట్ర తీరంకు దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది.

మహారాష్ట్ర- దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం.. దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్రం ప్రాంతాలలో ఇది వాయుగుండముగా బలపడి క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

గురు, శుక్ర వారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్ నగరాన్ని వానలు అతలాకుతలం చేశాయి. పాత నగరాన్ని ముంచేశాయి.. నగరం మొత్తాన్ని అస్తవ్యస్తం చేసింది. 12 మందికి తక్కువ కాకుండా మరణించారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నగరానికి వెళ్లే దారులన్నీ స్తంభించిపోయాయి. రాత్రంతా హైదరాబాద్ చీకట్లో మగ్గింది.

వరద ప్రాంతాల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు

వణికిన ఓల్డ్ సిటీ:

ఈసారి హైదరాబాద్ వరదల ప్రభావం పాత నగరంపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఆరాంఘర్ దగ్గర ఉండే బండ్లగూడ ప్రాంతం, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోని పలు కాలనీల్లో వరద బీభత్సం సృష్టించింది. వేలాది మంది వరద నీటి ఇరుక్కుపోయి బిక్కుబిక్కుమంటూ గడిపారు. బండ్లగూడ దగ్గర్లోని పళ్ల చెఱువు పొంగడంతో ఆ నీరు బండ్లగూడ, హషీమాబాద్, చంద్రాయణగుట్టల్లోని కాలనీల్లో చేరింది. ఈ ప్రాంతాల్లోన్నీ పల్లంలో ఉండడంతో నీరు నిలచిపోయింది. అక్కడ వేలాది మంది చిక్కుకుపోయారు. వాహనాలు ధ్వంసం అయ్యి. పశువుల చనిపోయాయి. షాపులు మునిగిపోయాయి. అంతా అస్తవ్యస్తం అయింది. చాలా మంది డాబా ఇళ్లపైకి ఎక్కి నుంచిని సమయం గడుపుతున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసులు అక్కడ సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్టలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎంత చేసినా, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో సహాయ చర్యలు చాలా కాలనీలకు అందలేదు. మంగళవారం అర్థరాత్రి నుంచి వరద మొదలైతే, బుధవారం మధ్యాహ్నం 3.30 వరకూ కూడా చాలా కాలనీల్లోకి ప్రభుత్వ సిబ్బంది రాలేదు. అక్కడ బీభత్సం జరిగిందంటే అతిశయోక్తి లేదు.

విధ్వంసం:

పాత నగరంలో పలు చోట్ల గోడలు కూలాయి. వర్షాలకు గోడలు బాగా నానిపోయి, కూలాయి. ఎన్నో వాహనాలు ధ్వంసం అయ్యాయి. అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి గుడి పక్కనే ఉన్న ఇల్లు చూస్తుండగానే కుప్ప కూలిపోయింది. కార్లు, వ్యాన్లు తిరగబడ్డాయి. డైరీ ఫాంలలోని పశువులు, దూడలు చనిపోయాయి. మొదటి అంతస్తులు మునిగిపోయాయి. వరద వచ్చిన వేగానికి షాపుల ఇనుప షట్టర్లు నొక్కుకుపోయాయి. వరద ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకుపోతూ కనిపించారు. మెట్రో పిల్లర్ కుంగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. రోడ్డు మాత్రమే దెబ్బతిందనీ, మెట్రో స్తంభానికి వచ్చిన సమస్యేమీ లేదని ఆ సంస్థ వివరణ ఇచ్చింది.

జలమయం:

రోడ్లు, కాలనీలు మునగడం గురించి ఎంత చెప్పినా తక్కువే. నగరంలోని ప్రతీ ఏరియాలోనూ, ప్రతీ కాలనీలోనూ ఎంతో కొంత నీరు చేరింది అంటే అతిశయోక్తి లేదు. మూసాపేట మెట్రో పిల్లర్ దగ్గర రోడ్డు కొంచెం కుంగింది. బల్కంపేట ఎల్లమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం దగ్గరకు వరద నీరు చేరింది. కర్మన్ ఘాట్ గుడికి దగ్గరలో వరద నీటి ప్రవాహం తీవ్రంగా ఉండి ఆ రోడ్డుపై ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. ఇక్కడే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో వానలతో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. రోడ్లపై పెద్దగా నీరు లేని చోట కూడా సెల్లార్లు మునిగిపోయాయి. దీంతో అక్కడ పార్కింగ్లో ఉన్న వాహనాలన్నీ దెబ్బతిన్నాయి. సెల్లార్లలో కాపురం ఉండే వాచ్ మెన్లు, ఇస్త్రీ చేసే వారు చాలా ఇబ్బంది పడ్డారు.

హైదరాబాద్ శివార్లలో ఘటకేసర్, హయత్ నగర్ ప్రాంతాల్లో రికార్డు వర్షపాతం 32 సెంటీమీటర్లకు పైగా నమోదయింది. అంటే దాదాపు అడుగుకు పైగా వాన కురిసిందన్నమాట. సాధారణంగా 10 సెంటీమీటర్లపైన వాన పడితేనే నగరంలో రోడ్లపై నీరు నిలుస్తుంది. కానీ నగరంలో చాలా భాగాల్లో 20 సెంటీమీటర్ల వాన కురిసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నిండిపోయాయి. ఇక హుస్సేన్ సాగర్ కూడా నిండింది.

మరణాలు:

హైదరాబాద్ వరదల్లో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఇప్పటి వరకూ ధృవీకరణ జరిగిన సమాచారం ప్రకారం 12 మంది తక్కువ కాకుండా చనిపోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారు 8 మంది ఉన్నారు. సెల్లార్ నీటిలో మునిగి ఒక బాలుడు చనిపోయాడు.

వరద ప్రాంతాల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు

సహాయ చర్యలు:

రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బందీ, కేంద్రం తరపున ఎన్డీఆర్ఎఫ్ బృందాలూ, సైన్యానికి చెందిన వైద్య విభాగం పలుచోట్ల సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. కానీ పాత బస్తీలో సహాయ కార్యక్రమాలకు తగినన్ని పడవలు అందుబాటులో లేవు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కూడా పడవలు (బోట్లు), లైఫ్ జాకెట్లూ తెప్పించే ప్రయత్నం చేశారు పోలీసులు. వీలైనంత మందిని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. మంగళవారం రాత్రి నుంచి హైదరాబాద్ నగరం, శివార్లలలోని పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక బుధవారం ఎక్కడికక్కడ స్థానిక యువత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పాల్గొంది.

హైదరాబాద్ దారులన్నీ మూత:

మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకూ హైదరాబాద్ నగరానికి వచ్చే పలు దారులు మూసుకుపోయాయి. వర్షానికి ఉప్పల్ చెఱువు పొంగి పొర్లడంతో వరంగల్, యాదాద్రి - హైదరాబాద్ దారి మూసుకుపోయింది. ఇక విజయవాడ - హైదారాబాద్ దారిలో పలుచోట్ల హైవే మీదకు నీరు చేరి ఆ మార్గమూ ఆగిపోయింది. అటు శంషాబాద్ సమీపంలో హైవే రోడ్డు దెబ్బతిని కర్నూలు, అనంతపురం, బెంగుళూరు మార్గాలు మూసుకుపోయాయి.

కరెంటు లేదు:

హైదరాబాద్ నగరం ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడనంత సేపు, అతి ఎక్కువ భాగం చీకట్లో గడిపింది. సాధారణంగా నగరంలో వర్షం గట్టిగా కురిసినప్పుడు కరెంటు తీస్తారు. అది కొద్ది గంటల సమయానికీ, కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది. కానీ ఈసారి అలా కాదు హైదారాబాద్లో మెజార్టీ భాగానికి రాత్రంతా కరెంటు లేదు. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం కరెంటు రాగా, కొన్నిచోట్ల బుధవారం సాయంత్రం కరెంటు వచ్చింది.

ఆస్తి నష్టం:

ఈ వర్షం భారీ ప్రాణ నష్టంతో ఎంతో ఆస్తి నష్టాన్ని కలిగించింది. రాత్రికి రాత్రి వరద నీరు ఇళ్లల్లోకి చేరి పలు ఇళ్లు, ఇళ్లల్లోని వస్తువులు దెబ్బతిన్నాయి. అంతుకుమించి సరుకు మునిగిపోయి, నానిపోయి, కొట్టుకుపోయి వ్యాపారస్తులు కూడా చాలా చోట్ల తీవ్ర నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇప్పటికీ షాపుల్లోంచీ, గోడౌన్లలో నుంచీ నీరు బయటకు వెళ్లలేదు కొన్నిచోట్ల.

ఒక్క రోజు టూరిస్ట్ స్పాట్ గా మూసీ నది:

మొత్తం హైదరాబాద్ వరదల్లో హైలెట్ ఏంటంటే, మూసీ ప్రవాహం. ఈ వానలకు మూసీ నది పొంగిపొర్లింది. ఎప్పుడూ మురికితో బురదతో కనిపించే మూసీ నది, నగరాలకు దూరంగా ఉండే జీవనదిలా ఉప్పొంగి ప్రవహిచింది. ఆ దృశ్యం చూడటానికి జనం ఎగబడ్డారు. నగరానికి ఆ మూల లంగర్ హౌస్ నుంచి ఈ మూల నాగోల్ వరకూ మూసీ నది మీద వంతెనలన్నీ కిక్కరిసిపోయాయి. లంగర్ హౌస్ ప్రాంతంలో అయితే వంతెనపై నుంచి మూసీ ఫోటోలు తీసుకుంటున్న జనం వల్ల ట్రాఫిక్ జాం అవుతోందని, పోలీసులు ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఉదయం వరకూ కూడా కాస్త నల్లగా, చెత్తతో కూడిన ప్రవాహం కనిపించినా సాయంత్రానికి మూసీలో మామూలు రంగు నీళ్లు వచ్చాయి.

సెలవు:

జీహెచ్ఎంసీ పరిధిలో బుధ, గురువారాలు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దని ప్రభుత్వ అధికారులు సూచించారు.

రాజకీయం:

హైదరాబాద్ వరదలపై ప్రధాని మోదీ ఆరా తీసారు. రాహుల్ స్పందించారు. కిషన్ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్, మునిసిపల్ మంత్రి కేటీఆర్ లు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అసదుద్దీన్ ఒవైసీ రాత్రి నుంచీ సహాయక చర్యల దగ్గర ఉన్నారు.

గురువారం ఎలా ఉండబోతోంది?

గురువారం వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందనిని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం గురువారం హైదరాబాద్లో భారీ వానలు కురిసే అవకాశం లేదని వారు వివరణ ఇచ్చారు. అంత వరకూ ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. నీరు నిల్వ ఉన్నచోట, నీటి ప్రవాహాలు, నానిన భవనాలు, గోడలు, కరెంటు తీగలు, అంటు వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

చాంద్రాయణగుట్ట

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వీటికి సమీపంలో ఉన్న పల్లచెరువు నిండి కట్ట తెగడంతో చాంద్రాయణ గుట్ట, ఆరాంఘర్‌ మధ్యన ఉండే బండ్లగూడ దగ్గర రహదారి ధ్వంసమయిందని స్థానికులు చెబుతున్నారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పని చేసే డిజాస్ట్రర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌ బృందాలతోపాటు రాష్ట్ర పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ మెడికల్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతం పెద్దది కావడం, వరద తీవ్రత ఎక్కువగా ఉండటం, సిబ్బంది పరిమితంగా ఉండటంతో ఇక్కడ అందరికీ సహాయం అందించే పరిస్థితి కనిపించడం లేదు. చాలా ప్రాంతాలకు ప్రభుత్వ సిబ్బంది ఇంకా చేరుకోలేదు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్: రోడ్లపై ఉన్న కార్లు వరదలో ఇలా కొట్టుకుపోతున్నాయి

రాత్రి 2గంటల నుంచి ప్రారంభమైన వరద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వరద తీవ్రతను, తమకు జరిగిన నష్టాన్ని స్థానికులు బీబీసీకి వివరించారు. రోడ్డు మీద భారీ ఎత్తున నీరు నిలిచి ఉండటం, కాలనీలలోకి కూడా నీరు పెద్ద ఎత్తున చేరడంతో చాలామంది ప్రజలు ఇళ్లలోనే చిక్కుకు పోయారు. వరద భయంతో కొందరు బిల్డింగ్‌ల పైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

చాంద్రాయణ గుట్ట, ఆరాంఘర్‌ నడుమ ఉన్న అనేక కాలనీలలో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. అనేక ఇళ్ల గోడలు కూలిపోయాయి. ముఖ్యంగా పాత భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని డైరీ ఫామ్‌లలో పశువులు కూడా మరణించాయి. వేలసంఖ్యలో ఉన్న బాధితులకు సహాయం అందించడానికి సరిపడా సిబ్బంది లేకపోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'ఒకే కుటుంబంలో 8 మంది కొట్టుకుపోయారు'

కాగా, మైలార్‌దేవ్ పల్లి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అకస్మాత్తుగా పోటెత్తిన వరదనీటిలో కొట్టుకుపోయారని, వారిలో ఇద్దరి మృతదేహాలు లభించాయని మజ్లీస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అంజెద్ ఉల్లా ఖాన్ తెలిపారు.

బాధిత కుటుంబంతో మాట్లాడిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న లోతట్టు కాలనీల ప్రజలు
ఫొటో క్యాప్షన్, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న లోతట్టు కాలనీల ప్రజలు

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మంగళవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ధాటికి అతలాకుతలమైపోయింది.

నగరంలో సాయంత్రం ఆరు గంటల నుంచి దాదాపు అర్థరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది.

బండ్లగూడలో 8 మంది, ఇబ్రహీంపట్నంలో ఇద్దరు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు రోజులు సెలవులు.. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి’

భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బుధ, గురువారాలు(14, 15 అక్టోబరు) సెలవు ప్రకటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వరద పరిస్థితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

తక్షణం పునరావాస శిబిరాలు ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆయన జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు.

అత్యంత అవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చీఫ్ సెక్రటరీ చెప్పారు.

ఉప్పల్‌ చెరువు నీరు

ఘట్‌కేసర్‌లో 32.3 సెంటీమీటర్ల వర్షం

తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు 32.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

నీట మునిగిన ఇంటి నుంచి వయోధికుడిని రక్షిస్తున్న పోలీసులు
ఫొటో క్యాప్షన్, చైతన్యపురిలో నీట మునిగిన ఇంటి నుంచి వయోధికుడిని రక్షిస్తున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లాలో హయత్‌నగర్ మండలంలో 29.8 సెంటీమీటర్లు, సరూర్‌నగర్‌లో 27.3 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26.6 సెంటీమీటర్లు, యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండలోని వెంకటపల్లిలో 26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా అనేక ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

సరిగ్గా 20ఏళ్ల కిందట హైదరాబాద్‌లో అత్యధికంగా 24 సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఈ స్థాయిలో హైదరాబాద్ పరిసరాల్లో వర్షం కురవడం ఇదే తొలిసారి.

హుస్సేన్ సాగర్‌లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది.

హైదరాబాద్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న ప్రజలు
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న ప్రజలు

హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. నగరంలోని ఖైరతాబాద్, టోలీ చౌకీ, బోరబండ, సికింద్రాబాద్, అంబర్ పేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరుకుంది.

ముందు జాగ్రత్తగా నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దుమ్ముగూడలో పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది.

హైదరాబాద్ వర్షాలు

ఫొటో సోర్స్, twitter/HYDTP

హైదరాబాద్-విజయవాడ రాకపోకలు బంద్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ఎత్తున వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడవి అక్కడే ఆగిపోయి, కిలోమీటర్ల మేర బారులు తీరాయి.

వర్షపు నీటి ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు.

మరోవైపు నగరంలోని ప్రధాన జలాశయాలకు భారీ ఎత్తున వరద నీరు పోటెత్తింది. సుమారు 16 వేల 600 క్యూసెక్కుల వరద నీరు హిమయత్ సాగర్‌కు చేరుకుంది.

ప్రస్తుతం అందులోని నీటి మట్టం 1762.867 అడుగులకు చేరుకుంది. మంగళవారం అర్థ రాత్రి సుమారు 1300 క్యూసెక్కుల నీటిని మూసీ నదికి విడిచిపెడతామని అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్ వర్షాలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు.

మరోవైపు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్ని స్థాయిల్లోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ జన జీవనానికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాలనీల్లోని నిలిచిపోయిన నీటిని వీలైనంత త్వరంగా తోడించే ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో వరద తాకిడికి కూలిన భవనం.
ఫొటో క్యాప్షన్, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో వరద ఉద్ధృతికి ఒక భవనం కుప్పకూలింది

ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు మృతి

అటు ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం మంగళవారం ఉదయం నరసాపురం - కాకినాడ సమీపంలో తీరం దాటింది.

ఆ ప్రభావంతో కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

కృష్ణానదిలోకి భారీగా వరద నీరు చేరడంతో శ్రీశైలం జలాశయంలో పది గేట్లు ఎత్తివేశారు.

గోదావరి నదికి కూడా భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఫలితంగా నది నీటి మట్టం పెరుగుతూ వస్తోంది.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 129 మండలాల్లో 11.56 సెంటీ మీటర్ల నుంచి 20.44 సెంటీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సగటున 18 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

తూర్పుగోదావరి, విశాఖ సరిహద్దుల్లో కోటనందూరు నాతవరం మద్య రోడ్డుపై వరద నీరు. చిక్కుకున్న కారు.
ఫొటో క్యాప్షన్, తూర్పుగోదావరి, విశాఖ సరిహద్దుల్లో కోటనందూరు నాతవరం మధ్య రోడ్డుపై వరద నీటిలో కొట్టుకుపోతున్న కారు. ఈ ఘటనలో ఒక మహిళ మరణించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ్మిలేరు , ఎర్రకాలువ పొంగడంతో ఏలూరు నగరం సహా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు నది రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. విశాఖలో గోస్తనీ, శారదా నదులకు కూడా వరద తాకిడి పెరిగింది.రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా కుటుంబాలను ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

అనేక ప్రాంతాల్లో చెట్లు నేల కూలాయి, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి- విశాఖ జిల్లాల సరిహద్దుల్లోని కోటనందూరు, నాతవరం మధ్య రోడ్డుపై వరద నీరులో ఓ కారు చిక్కుకోవడంతో ఓ మహిళ మృతి చెందారు.

ఏలూరులో తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నగరానికి వరద ముప్పు ఏర్పడింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

కాకినాడ రైల్వే స్టేషన్లో భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో రైల్వే ట్రాక్ చెరువును తలపించింది. అటు నిడదవోలులోనూ అదే పరిస్థితి.

రైల్వే ట్రాక్ పైకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షం ధాటికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

విజయవాడలో కృష్ణా నది వరద ఉద్ధృతి పెరుగుతూ ఉండటంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటితో సహా మరో 30 ఇళ్లకు అధికారులు ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులను ఘాట్‌ రోడ్‌లో అనుమతించడం లేదు.

వరద ప్రాంతాల్లోని ప్రజలకు సహాయాన్ని అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం తెలంగాణపై కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం మరో పన్నెండు గంటల పాటు ఉంటుందని మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో విడుదల చేసిన బులిటెన్లో భారత వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ వర్షాలు

సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

వరద ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

మందులు, నిత్యావసర వస్తువులను అవసరమైన మేరకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

రహదారులు, కాలువలు, వంతెనలకు గండ్లు పడి రవాణాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు.

విశాఖ జిల్లా చింతపల్లిలో రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను తొలగిస్తున్న స్థానికులు, పోలీసులు
ఫొటో క్యాప్షన్, విశాఖ జిల్లా చింతపల్లిలో రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను తొలగిస్తున్న స్థానికులు, పోలీసులు

ఇప్పటికే పలు చోట్ల గండ్లు పడ్డాయి. విశాఖపట్నం జిల్లాలో మూడు జాతీయ విపత్తు సహాయక దళాలను (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిద్ధంగా ఉంచారు. కాకినాడలో ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచినట్టు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించారు. వరద తాకిడి పెరిగితే మరింత మందిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 327 బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఆ శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది.

తీవ్రంగా నష్టపోయిన రైతులుభారీ వర్షాలతో, వరదలు రైతుల ఆశలపై నీళ్లు జల్లాయి. వరి పంట అనేక చోట్ల కోతకొచ్చిన దశలో నేలపాలైంది. మరికొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో ఉన్న వరి నీట మునిగింది.

భారీ గాలుల వల్ల కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు, చెరువు గట్లకు గండ్లు పడ్డాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా 15వేల హెక్టార్లకు పైగా పంట నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా.

రైల్వే స్టేషన్లో వర్షం నీరు

కొనసాగనున్న వర్ష తాకిడి

ఏపీలో వర్షాల ప్రభావం మరో రెండురోజు పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. తీవ్ర వాయుగుండానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు 15 డిగ్రీల అక్షాంశాల వెంబడి కోస్తా ఆంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా ఇంటీరియర్‌ కర్నాటక మీదుగా 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

శ్రీశైలం జలాశయం
ఫొటో క్యాప్షన్, శ్రీశైలం జలాశయం

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీటి ప్రవాహం

శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేశారు.

ఇన్ ఫ్లో 2.34 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 3.45లక్షల క్యూసెక్కులు.

జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం: 884.60 అడుగులకు చేరుకుంది.

పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం: 213 టీఎంసీలకు చేరుకుంది.

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 77,666 క్యూసెక్కులు కాగా శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,51,761 ఔట్ ఫ్లో 3,53,518 క్యూసెక్కులు ఉంది.

నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2,99,667 క్యూసెక్కులుగా ఉంది.. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 4,95,431, ఔట్ ఫ్లో 5,42,909 క్యూసెక్కులు ఉంది.

ప్రకాశం బ్యారేజ్‌కు 6,49,987 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే నీటికి దిగువకు విడిచిపెడుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)