కరోనావైరస్ ఆంక్షలతో వరద బాధితుల సహాయక చర్యలకు ఊహించని అవరోధాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్‌లోని మధుబని జిల్లాలో వరదల కారణంగా నిరాశ్రయులైన వేల మందిని... అంచల్ కుమారీ నిస్సహాయ స్థితిలో చూస్తు ఉన్నారు.
ఆక్స్‌ఫామ్ అనే స్వచ్ఛంద సంస్థలో కార్యకర్తగా ఆమె పనిచేస్తున్నారు. సాధారణంగా ఆమె ఇలాంటి విపత్తుల సమయంలో బాధితులకు సహాయ సామగ్రి పంచుతూ ఉండాలి.
‘‘ఈసారి బాధితులకు పంచడానికి మా దగ్గర ఏమీ లేవు. చాలా నిరాశగా ఉంది. అవసరమైన చోటుకు సహాయ సామగ్రి చేరుకోవడం లేదు. ఫలితంగా నా లాంటి స్వచ్ఛంద కార్యకర్తలం నిస్సహాయులుగా ఉంటున్నాం. ఇక్కడి ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. మాకు ఎందుకు సాయం అందడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. నా దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేదు’’ అని అంచల్ అన్నారు.
దేశంలో ప్రస్తుత వరదల ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ కూడా ఒకటి.
ఈసారి వరదల్లో దేశవ్యాప్తంగా 850 మందికిపైగా చనిపోయారు. లక్షల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు.
‘‘మా జిల్లాలో జనం వరద నుంచి సురక్షితంగా ఉండేందుకు హైవేలపై, కొండ ప్రాంతాలపై పడుకుంటున్నారు. నాలుగు వారాల కన్నా ముందు నుంచీ ఈ పరిస్థితి ఉంది. మా సంస్థతోపాటు చాలా సంస్థలు ఇలాంటి సమయంలో జనం కోసం పనిచేసేవి. కానీ, ఈసారి ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు’’ అని అంచల్ అన్నారు.
దక్షిణాసియా వ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి విపత్తులు వచ్చిన చోట్ల సహాయ చర్యలకు కోవిడ్-19 ఆంక్షలు అవరోధంగా మారాయని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి.
దక్షిణాసియా వ్యాప్తంగా ఈ వరదల్లో మరణించినవారి సంఖ్య 1,300కుపైనే ఉంది. 2.5 కోట్ల మందిపై ఈ వరదల ప్రభావం పడింది.
ఈ నెలలో భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సగటున కురిసేదాని కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని, కొన్ని చోట్లలో సగటు కన్నా 60 శాతం మించి వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
‘‘ప్రభుత్వ విభాగాలు, అంతర్జాతీయ, జాతీయ స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, ముందులా సాయం చేయలేకపోతున్నాం. లాక్‌డౌన్‌లు, కోవిడ్-19 ఆంక్షల కారణంగా చాలా ప్రభావిత ప్రాంతాలను కార్యకర్తలు చేరుకోలేకపోతున్నారు. సాధారణంగా ఏటా ఈ సీజన్‌లో పునరావాసం కోసం ఉపయోగించే చోట్లు చాలా వరకూ కోవిడ్ క్వారంటీన్ కేంద్రాలుగా మారిపోయాయి. వరదల్లో నిరాశ్రయులైనవారికి నీడ లేకుండా పోతోంది’’ అని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, ఇండియా హెడ్ ఉదయా రెగ్మీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రవాణాపరంగా ఇబ్బందులు
సహాయ చర్యల అందించేందుకు అవసరమైన సామగ్రికి రవాణా వ్యవస్థ చాలా ముఖ్యం.
‘‘సహాయ సామగ్రిని చాలా వరకూ కొన్ని గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతాం. అలాంటి గిడ్డంగులు కంటైన్మెంట్ జోన్లలో ఉంటే, వాటి నుంచి సామగ్రి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ వాటిని బయటకు తీసుకురాగలిగినా, రవాణా చేయడం ఓ పెద్ద పని. లాక్‌డౌన్‌లు, కోవిడ్ ఆంక్షలు ఉన్న ప్రాంతాలను దాటుకుంటూ వాటిని తేవాలి’’ అని ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రొగ్రామ్స్ హెడ్ పంకజ్ ఆనంద్ అన్నారు.
సహాయ సామగ్రి అంతా నిల్వ ఉంచేదే కాదు. కొన్ని అవసరమైనప్పుడు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సప్లై చెయిన్లు ప్రభావితమయ్యాయి. అవసరమైన సామగ్రి దొరకడం కూడా కష్టంగా మారింది.
‘‘ఈ సవాళ్లన్నీ దాటుకుని ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నా, అక్కడ ఐసోలేషన్‌లోగానీ, క్వారంటీన్‌లో గానీ ఉండమని అడుగుతున్నారు. ఇలాంటి విపత్తులకు త్వరగా స్పందించడం చాలా ముఖ్యం. 48 గంటల్లోపు క్షేత్ర స్థాయిలో మేం ఉండాలి. కానీ కోవిడ్ ఆంక్షల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని చోట్లకైతే వెళ్లడమే అసాధ్యంగా మారింది’’ అని ఆనంద్ చెప్పారు.
నేపాల్‌లో సహాయ చర్యల్లో పాల్గొంటున్న కొన్ని సంస్థలు తాము ప్రభుత్వ అనుమతి తీసుకుని పనిచేస్తున్నామని, అయినా ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నాయి.
‘‘సంబంధిత ప్రభుత్వ శాఖ నుంచి అనుమతి పత్రాలను పొంది, వాటిని వెంటపెట్టుకుని మేం ప్రయాణిస్తున్నాం. కానీ, క్షేత్ర స్థాయిలో ఉన్న భద్రతా సిబ్బందికి మేం ఏం చేస్తామో తెలియదు. వాళ్లు మమ్మల్ని ఆపుతుంటారు. మమ్మల్ని నియంత్రించే ప్రభుత్వ శాఖకు... లాక్‌డౌన్, కోవిడ్ ఆంక్షలు అమలు చేసే భద్రతా సిబ్బందికి మధ్య సమన్వయ లోపం ఉంది’’ అని వాలంటీర్ కోర్ నేపాల్ సంస్థ కోఆర్డినేటర్ దీపక్ చపాగిన్ అన్నారు.
కాఠ్‌మాండూ ఈశాన్య ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినవారికి సాయపడేందుకు వెళ్తున్న తమ బృందాన్ని దాదాపు ఆరు గంటలపాటు పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని దీపక్ చెప్పారు.
ఇలాంటి విషయాలు జనాలను ఆదుకోవాలని వచ్చేవారిని నిరుత్సాహపరుస్తున్నాయని అన్నారు.
నేపాల్‌లో ఈ వర్షాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 260 మంది దాకా చనిపోయారని, దాదాపు 60 మంది గల్లంతయ్యారని ఆ దేశ హోంశాఖ తెలిపింది.

స్వచ్ఛంద కార్యకర్తల్లోనూ భయం
సహాయం కోసం జనం ఎక్కువగా ఎదురుచూస్తున్న ప్రాంతాల్లో సహాయ సామగ్రి రాగానే తోపులాటలు జరుగుతున్నాయి.
అసోంలో కొన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది.
‘‘కొన్ని ప్రాంతాల్లో మేం వెళ్లగానే జనం మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా పోగవుతున్నారు. వారిలో ఎవరికైనా కరోనా ఉండి, అది తమకు కూడా సోకుతుందేమోనని నా సహచరుల్లో చాలా మంది భయపడుతున్నారు’’ అని ఎస్‌ఏటీఆర్ఏ అనే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్న నానిడా సైకియా అన్నారు.
మూడు వారాలుగా తాము వరద సమస్య ఎదుర్కొంటున్నా, సాయం ఇంకా తమకు అందలేదని అసోంలోని చాలా ప్రాంతాల వారు చెప్పారు.
‘‘ఈ వరదల కోసం ముందస్తుగా సరుకులు నిల్వచేసుకుని సిద్ధమవ్వలేకపోయాం. నేను కూరగాయలు అమ్ముతుంటా. కరోనా భయంతో అందరూ కొనడం మానేశారు. దీంతో నా దగ్గర డబ్బు లేదు’’ అని లాల్ భాను అనే ఆవిడ అన్నారు.
ఆమెది అసోంలోని డోరంగ్ జిల్లాలోని ఒపోరియా గ్రామం. వరదల్లో ఆమె ఇల్లు కొట్టుకుపోయింది.
‘‘అందుకే ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురుచూస్తున్నాం. కానీ, ప్రభుత్వ శాఖలుగానీ, స్వచ్ఛంద సంస్థలుగానీ ఎవరూ రాలేదు. ఇదివరకు ఈ సమయంలో వరదలు వచ్చినప్పుడు వాళ్లంతా వచ్చేవారు’’ అని లాల్ భాను అన్నారు.
డబ్బులు లేక తమ కుటుంబం రోజులో ఒక్క పూటే తింటున్నామని ఆమె చెప్పారు.
బంగ్లాదేశ్‌లో దాదాపు 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారని రెడ్ క్రాస్ తెలిపింది.
‘‘ఇదివరకటి వానా కాలాలకు, ఇప్పటికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మా కార్యకర్తలు ఎక్కువగా స్థానికులే ఉంటారు. వాళ్లతో సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చే, సహాయం చేసే స్వచ్ఛంద కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అని ఇంటర్నెషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ బంగ్లాదేశ్ లీడ్ అజ్మత్ ఉల్లా చెప్పారు.

ఇక క్షేత్రస్థాయిలో అవరోధాలను తొలగించేందుకు స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని భారత విపత్తు నిర్వహణ విభాగం (డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) బీబీసీకి తెలిపింది.
‘‘వివిధ రాష్ట్రాల విపత్తు నిర్వహణ విభాగాలతోనూ మేం మాట్లాడుతూ ఉన్నాం. కోవిడ్ సమయంలో రక్షణ కిట్‌లు ధరించి, సాయం ఎలా చేయాలో శిక్షణ కూడా ఇచ్చాం. భౌతిక దూరం పాటించేందుకు పునరావాస శిబిరాల సంఖ్యను కూడా పెంచాం’’ అని భారత విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి జీవీవీ శర్మ చెప్పారు.
వచ్చే వారం వర్షాలు, వరదలు మరింత తీవ్రం కావొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
33 ప్రాంతాల్లో తీవ్ర వరద ప్రమాదం ఉందని భారత కేంద్ర నీటి కమిషన్ పేర్కొంది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి.
‘‘వరదలు పోటెత్తిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కలరా లాంటి వ్యాధులు ఎక్కువ అవుతాయి. ఇప్పటికే కోవిడ్ రోగులతో ఆసుపత్రులు పెనుభారం మోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీజనల్ రోగాలతో వచ్చేవారికి అవి ఎంతవరకూ చికిత్స అందించగలవన్న అనుమానాలు ఉన్నాయి’’ అని ఉదయా రెగ్మీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- శ్రీశైలం పవర్ ప్లాంట్: భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనే ప్రమాదం?
- కరోనావైరస్: ఈ పది దేశాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు
- హైదరాబాద్లో 6 లక్షల మందికి కరోనా సోకిందని సీసీఎంబీ అంచనా
- జీతాల డబ్బు తీసుకెళ్తున్న విమానం కూలి 8 మంది మృతి
- సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని సీడబ్ల్యూసీ నిర్ణయం
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన బంగారం దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








