శ్రీశైలం పవర్ ప్లాంట్: భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనే ప్రమాదం?

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
శ్రీశైలం ఎడమ గట్టు మీద ఉన్న తెలంగాణ జెన్‌కో పవర్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం తీవ్ర నష్టానికి దారితీస్తోంది. సుదీర్ఘకాలం పాటు దీని ప్రభావం కనిపించబోతోంది. తెలంగాణ ప్రభుత్వం అంచనాలు తలకిందులు కాబోతున్నాయి. విద్యుత్ ఉత్పాదన మీద పడిన ప్రభావంతో కొత్త సమస్యలు తలెత్తేలా కనిపిస్తున్నాయి.
మొత్తం ఆరు యూనిట్లతో నడుస్తున్న పవర్ ప్లాంట్ ప్రమాదానికి గురయ్యింది. అందులో నాలుగు యూనిట్లు ఎక్కువగా నష్టపోగా, మిగిలిన రెండు యూనిట్ల పరిస్థితిపై అధికారులు పూర్తి అంచనాకు రాలేకపోతున్నారు.
మరోవైపు ప్రమాదంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ రంగంలో దిగి విచారణ ప్రారంభించింది.
విద్యుత్ ఉత్పత్తి పరిస్థితి ఏమిటి?
తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిలో జల విద్యుత్‌ది కీలక స్థానం. రాష్ట్రంలో మొత్తం 11 జల విద్యుత్ కేంద్రాలున్నాయి. కానీ శ్రీశైలంలో ఆరు యూనిట్లతో నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండేది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 21 వరకూ తెలంగాణలో ఉత్పత్తి అయిన విద్యుత్ మొత్తం 15,556.66 మిలియన్ యూనిట్లు. అందులో థర్మల్ విద్యుత్ ద్వారా 7,288 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా, జల విద్యుత్ వాటా 8,268 మిలియన్ యూనిట్లు. ఇక శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ద్వారా 676.56 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు.
2019-20 సంవత్సరంలో మొత్తం తెలంగాణలో జలవిద్యుత్ ఉత్పత్తి 4,509 మిలియన్ యూనిట్లు. దీనిలో 45 శాతానికిపైగా (1993.1 మిలియన్ యూనిట్లు) శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి చేశారు.
కానీ, ఈ నెల 21వ తేదీ రాత్రి 10.52 నిమిషాల నుంచీ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో డీఈ శ్రీనివాస్‌తో పాటుగా నలుగురు ఏఈలు, సిబ్బంది, అమరాన్ కంపెనీ సిబ్బంది ఇద్దరు మృత్యువాతపడ్డారు.

విద్యుత్ సమస్యలు అనివార్యమా...
శ్రీశైలంలో జరిగిన ప్రమాదంతో తెలంగాణ ప్రభుత్వం అంచనాలు తారుమారు అవుతున్నట్టు చెప్పొచ్చు. ఒకేసారి సుమారు 2,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడంతో జెన్‌కో పరిధిలో ఆ లోటుని పూడ్చడం చిన్న విషయం కాదు.
శ్రీశైలంలోని 6 యూనిట్లలో ఒక్కో దాని నుంచి 150 మెగావాట్ల చొప్పున 900 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నడుస్తోంది. ఇప్పుడు ఒకేసారి మొత్తం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఈ సీజన్‌లో విద్యుత్పాదన నిలిచిపోవడం ఇదే తొలిసారిగా జెన్‌కో లెక్కలు చెబుతున్నాయి.
దీంతో ఓవైపు వరదల కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఉండే అవకాశాలు ఈ ప్రమాదం మూలంగా చేజారిపోయినట్టుగా చెప్పవచ్చు. ఇప్పుడు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సమకూర్చుకోవడం ప్రభుత్వానికి సవాల్ కాబోతోంది.
అదనంగా విద్యుత్ కొనుగోలు ద్వారా గానీ, కేంద్రం నుంచి అదనపు వాటాలు మాత్రమే సమస్యకు పరిష్కారం చూపగలవని రిటైర్డ్ జెన్ కో ఇంజనీర్ పి రామ్మోహన్ రావు బీబీసీతో అన్నారు.
చాలా కీలకమైనది
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం తెలంగాణా విద్యుత్ రంగంలో కీలకమైనది. థర్మల్ విద్యుత్‌లో కొత్తగూడెం, జల విద్యుత్‌లో శ్రీశైలం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతమున్న అంచనాల ప్రకారం శ్రీశైలంలో కనీసం ఒక సంవత్సరం వరకూ ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యమా అనే సందేహాలున్నాయి. దానికి అవసరమైన సాంకేతిక సహకారం విదేశాల నుంచి తీసుకోవాలి.
4 యూనిట్లు పూర్తిగా ధ్వంసం అయినట్టు ప్రాథమిక సమాచారం. మిగిలిన రెండు యూనిట్లు పునఃప్రారంభించగల దశలో ఉన్నాయా లేదా అన్నది స్పష్టత లేదు. వాటిని తిరిగి రంగంలోకి తీసుకురావాలని అనుకున్నా మరికొన్ని నెలలు ఖచ్చితంగా పడుతుంది.
దీంతో శ్రీశైలం నుంచి ఈసారి 2,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుందనే అంచనాలలో ఇప్పటికి కేవలం 600 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పాదన జరిగింది. మిగిలిన 1600 మిలియన్ యూనిట్లు కొరత ఏర్పడబోతోంది. ఈ లోటు పూడ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా వాటాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఉత్పత్తి పెంచే ప్రయత్నాలతోనే..
శ్రీశైలం కుడి, ఎడమ గట్లుపై విద్యుత్ ఉత్పత్తికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే శ్రీకారం చుట్టారు. కుడి గట్టు మీద విద్యుత్ కేంద్రం నిర్మించగా, ఎడమ గట్టువైపు మాత్రం భూగర్భంలో జల విద్యుత్ కేంద్రం నిర్మించారు. కుడి గట్టు మీద నిర్మించిన విద్యుత్ కేంద్రం కన్నా ఎడమ గట్టువైపు కేంద్రం ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది.
ఆసియాలో సొరంగ మార్గంలో ఉన్న విద్యుత్పాదన కేంద్రాలలో శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం ఒకటి. సుమారు 1.7 కిలోమీటర్ల పొడవునా టన్నెల్‌లో ఆరు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సొరంగం ద్వారానే వాహనాల రాకపోకలకు కూడా మార్గం ఉంది. 2004 నుంచి పూర్తి ఉత్పత్తి సామర్థ్యం సంతరించుకుంది.
ఏటా జూలై నుంచి అక్టోబర్ వరకూ కృష్ణా నదికి వరదల సీజన్ కావడంతో జల విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూల సమయం. ఏటా రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పాదనలో శ్రీశైలం అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఈసారి కూడా మరోసారి అత్యధిక విద్యుత్ ఉత్పాదన రికార్డులు నెలకొల్పాలని పట్టుదలతో పనిచేస్తున్నట్టు ఇక్కడి సిబ్బంది బీబీసీకి తెలిపారు. పేరు వెల్లడించేందుకు అంగీకరించని ఓ విభాగం డీఈ అందించిన సమాచారం ప్రకారం పరిమితికి మించి ప్రయత్నం జరిగినట్టుగా కనిపిస్తోంది.

భారీగా ఉత్పత్తి చేయాలని..
శ్రీశైలంలో ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా పది గేట్లు ఎత్తేసి మిగులు జలాలు దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో సాధారణంగా 150 నుంచి 160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతంది. మరిన్ని ప్రయత్నాలు చేస్తే 180 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.
కానీ, ఈసారి ఏకంగా 220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. గడచిన 15 రోజులుగా శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ కేంద్రం నిరంతరాయంగా పనిచేస్తోంది.
900 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌లో ఈ నెల 16న 20.26 మిలియన్ యూనిట్లు, 17న 20.59 మి.యూ., 18న 20.86 మి.యూ చొప్పున క్రమంగా ఉత్పత్తి పెంచుతున్నారు. ఆ క్రమంలోనే ఆగస్టు 1 నుంచి ప్రమాదానికి గురయ్యే వరకూ 399.27 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది.
విద్యుత్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నంలో 6వ యూనిట్‌లో విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని జెన్‌కో డీఈ అంటున్నారు. ఈ ప్రభావంతో అక్కడి ప్యానెల్ బోర్డులు వేడెక్కి, కాపర్ వైర్లలోని ఇన్సులేషన్ కాలిపోయి ఉంటుందని ప్రాథమిక అంచనాగా భావిస్తున్నామన్నారు. మంటలు ఒక్కసారి చెలరేగడం, అవి వ్యాపించడంలో అదే కారణమని ఫైర్ సేఫ్టీ వర్గాలు కూడా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

అంతా ఆటోమేషన్ అయినా..
శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్‌ను జపాన్ టెక్నాలజీతో నిర్మించారు. పూర్తిగా ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే మొత్తం ట్రిప్ అయిపోయేలా ఏర్పాటు చేశారు. అయినా ఇంత పెద్ద ప్రమాదానికి కారణాలు అంతుబట్టడం లేదని రిటైర్డ్ ఇంజనీర్లు అంటున్నారు.
శ్రీశైలంలో పనిచేసిన ఇంజనీర్ ఫణీంద్ర కుమార్ బీబీసీతో మాట్లాడారు. ''పటిష్ఠమైన వెంటిలేటర్ వ్యవస్థ కూడా ఉంది. ఇక్కడ ఎన్నడూ ప్రమాదం జరిగిన దాఖలాలు లేవు. కుడివైపున ఉన్న విద్యుత్ కేంద్రంలోనే మంటలు వ్యాపిస్తే అదుపు చేసిన అనుభవం ఉంది. కానీ ఎడమవైపు ప్రాజెక్టులో చిన్న సమస్యలే తప్పా ఎన్నడూ ఎలాంటి నష్టం లేదు. పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లున్నాయి. అయినా హై ఓల్టేజ్ సమస్య వల్ల కంట్రోల్ సిస్టమ్ పనిచేసి ఉండదని భావిస్తున్నాను. అంతగా ఓల్టేజ్ పెరగడానికి కారణాలు ఏమిటన్నది విచారణలో తేలుస్తారు. కానీ ఇంత పెద్ద నష్టం మాత్రం ఎన్నడూ ఊహించదని, పదేళ్ల క్రితం రిటైర్ అయిన మాలాంటి వారెవరికీ ఇది అంతుబట్టడం లేదు'' అంటూ వివరించారు.
ఇప్పుడే చెప్పలేం..
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ ఎప్పటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందనే విషయంలో అధికారులకు కూడా స్పష్టత రావడం లేదు. చీఫ్ ఇంజనీర్ డీ ప్రభాకర్ రావుని ఈ విషయంపై బీబీసీ సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''ప్రమాదానికి కారణాలు ఏమిటనేది పూర్తిగా నిర్ధారణ కాలేదు. విచారణ సాగుతోంది. ప్రాథమిక అంచనాల్లో కూడా స్పష్టత లేదు. తొలుత దర్యాప్తు జరగాలి. నష్టం అంచనాకు రావాలి. తదుపరి అవసరమైన చర్యల కోసం ఆలోచిస్తాం. దానికి అనుగుణంగా జెన్ కో, తెలంగాణా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రస్తుతం ప్లాంట్‌లో పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడించడం సాధ్యం కాదు. పునః ప్రారంభం విషయం కూడా చెప్పలేం''అని అన్నారు.

రంగంలో దిగిన సీఐడీ
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రమాదానికి కారణాలపై విచారణ ప్రారంభమైంది. సీఐడీ రంగంలో దిగింది. అడిషినల్ డీజీపీ గోవింద్ సింగ్ నేతృత్వంలోని బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. అధికారులతో మాట్లాడింది. వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది. ప్రమాదానికి పూర్తి కారణాలు కనుక్కోవడం, భవిష్యత్తులో ప్లాంట్ భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయంపై ఈ బృందం నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణలో విపక్ష కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. అందులో భాగంగా సీఐడీ విచారణ చేయాలని ఇప్పటికే డిమాండ్ చేసిన ఎంపీ ఏ రేవంత్ రెడ్డితో పాటు మరో సీనియర్ నేత మల్లు రవి కూడా శ్రీశైలం బయలుదేరి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మార్గం మధ్యలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌కు వారిని తరలించారు.
ఇది రాజకీయాలకు సమయం కాదు.. ప్రభుత్వం సక్రమంగా స్పందించింది: ఎంపీ రాములు
''సంఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. కారణాలూ సీనియర్ ఇంజనీర్లకు కూడా అంతుబట్టడం లేదు. విచారణ జరిగితే విషయాలు తెలుస్తాయి. సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆందోళన చేయడం తగదు'' అని నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు బీబీసీతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ప్రమాదం జరిగినపుడు ప్రభుత్వమే ముందుగా స్పందించిందంన్నారు. ''సంబంధిత మంత్రి, సీఎండీ ఘటన సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలశ్యంగా సమాచారం అందుకున్న వెంటనే మేము కూడా అక్కడకు చేరుకున్నాం. సింగరేణి, రామగుండం నుంచి రెస్క్యూ బృందాలను తీసుకొచ్చి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాము. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. నష్టపరిహారం కూడా ప్రకటించాం'' అని ఆయన చెప్పారు.
''అయినప్పటికీ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ తీరు సరికాదు. మృతదేహాలను వెలికితీసి, అంత్యక్రియలు కూడా పూర్తికాకముందే ప్రతిపక్ష నేతలు బాధ్యతరాహిత్యంగా వ్యహరిస్తున్నారు. నిందలు, ఆరోపణలకు ఇది తగిన సమయం కాదు. రాజకీయ కుట్ర అని పేర్కొనడం తగదు. ఎవరి నిర్లక్ష్యం ఈ ఘటనలో లేదు'' అన్నారాయన.
రోజువారీ కార్యక్రమాల నిర్వహణలోనే ప్రమాదం జరిగిందని.. ప్రమాదాన్ని గుర్తించకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం నైతిక విలువలకు తిలోదకాలివ్వడమేనని తప్పుపట్టారు.
''ఈ ప్రాజెక్ట్ పునః ప్రారంభంపై నిపుణులకు కూడా పూర్తిగా సమాచారం రాలేదు. సాంకేతిక నిపుణులు దానిపై కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతానికి మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలనేది ప్రశ్నార్థకమే. వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగులు, ప్రజల్లో విశ్వాసం కలిగించేలా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు'' అని ఎంపీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










