'ద హింజ్ ఆఫ్ హిస్టరీ': మనమిప్పుడు 'చారిత్రక కీలక మలుపు'లో జీవిస్తున్నామా? మానవాళి భవిష్యత్తు నిర్ణయించేది మనమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రిచర్డ్ ఫిషర్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
మనమున్న ప్రస్తుత కాలాన్ని వర్ణించటానికి ఉత్తమమైన పదం ఏది? ''అనూహ్యం'' అనో ''అసాధారణం'' అనో భావించటానికి మీరు మొగ్గుచూపుతారేమో.
కానీ మన కాలాన్ని వర్ణించటానికి మరో పదాన్ని కూడా చెప్తున్నారు. ఆ ఆంగ్లపదాన్ని ఎక్కువ మంది ఇప్పటివరకూ విని ఉండకపోవచ్చు. ఆ పదం 'హింజీ'. తెలుగులో 'కీలక మలుపులో' అని చెప్పొచ్చు.
మనం నివసిస్తున్న ఈ కాలం మానవ చరిత్రలో అతి ప్రభావశీలమైన కాలం అని చెప్పటానికి ఈ పదాన్ని వాడుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి, 2020 సంవత్సరపు రాజకీయాలే కాదు.. అంతకు మించిన విషయాల గురించి కూడా ఇది చెప్తోంది.
మన కాలంలో జరుగుతున్న సంఘటనలు రాబోయే కొన్ని వేల ఏళ్ల పాటు మానవాళి భవిష్యత్తును రూపొందించబోతున్నాయా అనే అంశంపై ప్రఖ్యాత తత్వవేత్తలు, పరిశోధకుల మధ్య సంవాదం జరుగుతోంది. 'ద హింజ్ ఆఫ్ హిస్టరీ' అంటే 'చారిత్రక మలుపు' అనే ఈ వాదం.. మానవాళి ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నామని ప్రతిపాదిస్తోంది. ఇది నిజంగా సంభావ్యమేనా?
నేడు జీవించివున్న వారు విశిష్టమైన ప్రభావానికి గురైనవారనే ఆలోచన కొన్నేళ్ల కిందట డెరెక్ పార్ఫిట్ అనే తత్వవేత్త ప్రతిపాదించారు. ఆయన తన 'ఆన్ వాట్ మేటర్స్' అనే పుస్తకంలో ''మనం చారిత్రక మలుపులో నివసిస్తున్నాం'' అని రాశారు.
''గత రెండు దశాబ్దాల శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలను గమనిస్తే ప్రపంచం ఇంత వేగంగా మునుపెన్నడూ మారలేదు. మనం రూపాంతరం చెందటానికి.. మన పరిసరాలు మాత్రమే కాదు, మనం స్వయంగా, మన వారసులు కూడా రూపాంతరం చెందటానికి మరింత గొప్ప శక్తులు మనకు త్వరలోనే సమకూరుతాయి'' అని ఆయన పేర్కొన్నారు.
ఈ 'చారిత్రక మలుపు కాలం' సిద్ధాంతం ఇటీవలి నెలల్లో మేధావుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అంశాన్ని మరింత క్రమపద్ధతిలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు విద్యావేత్తలు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన తత్వవేత్త విల్ మాక్‌ఆస్కిల్ గత ఏడాది ఒక ఫోరమ్‌లో లోతైన విశ్లేషణ పోస్ట్ చేయటంతో ఇది మొదలైంది. ఈ ప్రశ్నపై ఇతర పరిశోధకుల నుంచి తమవైన విశ్లేషణలు, విభిన్న కోణాల్లో పరిశీలనలతో 100కు పైగా కామెంట్లు వచ్చాయి. ఇంకా లోతైన పాడ్‌కాస్ట్‌లు, వ్యాసాల సంగతి సరేసరి.
దీంతో పార్ఫిట్ గౌరవార్థం ఈ అంశం మీద మాక్‌ఆస్కిల్ ఒక పుస్తకంలో అధ్యాయం కూడా ప్రచురించారు.
వాక్స్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ పరిశోధకుడు కెల్సీ పైపర్ ఆ సమయంలో ఒక వ్యాసం రాస్తూ.. చారిత్రక కీలక మలుపు అనే చర్చ అమూర్తమైన తాత్విక చర్చ కన్నా మించిన అంశమని చెప్పారు. ''మానవ జాతి దీర్ఘ కాలిక భవిష్యత్తు కోసం మన సమాజాలు ప్రాధాన్యంగా నిర్ణయించుకోవాల్సింది ఏమిటనేది గుర్తించటం (ఈ చర్చలో) అంతర్లీనంగా ఉన్న లక్ష్యం'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకో అర్థం చేసుకోవాలంటే.. ఈ కాలం 'కీలక మలుపు' అనే వాదాన్ని సమర్థించే వారి వాదనలను ముందు చూద్దాం.
ముందుగా.. ఇది ''విపత్తుల కాలం'' అనే అభిప్రాయం ఒకటి ఉంది. స్వీయ-నిర్మూలన, భూగోళానికి దీర్ఘకాలిక విధ్వంసం కలిగించే ప్రమాదం అసాధారణ స్థాయిలో అధికంగా ఉన్న కాలంలో మనం ఉన్నామనే ఆలోచనకు ఇటీవలి సంవత్సరాల్లో మద్దతు పెరిగింది.
బ్రిటన్ ఖగోళశాస్త్రవేత్త మార్టిన రీస్ మాటల్లో.. ''మన భూమి 4.5 కోట్ల శతాబ్దాలుగా మనుగడలో ఉంది. కానీ ఈ శతాబ్దం విశిష్టమైనది: ఒక జీవజాతి - మన జీవజాతి -చేతుల్లో ఈ భూగోళం భవిష్యత్తు ఉంది''.
''జీవావరణాన్ని సరిచేయలేనంతగా దెబ్బతీసే సామర్థ్యం కానీ, నాగరికతను దుర్గతి పట్టించే దిశగా సాంకేతికతను తప్పుదోవ పట్టించే సామర్థ్యం మనం మొట్టమొదటిసారిగా సంతరించుకున్నాం'' అంటారు రీస్.
ఈ విధ్వంసక శక్తులు మన వివేకాన్ని తుడిచిపెడుతున్నాయని టోబీ ఆర్డ్ పేర్కొన్నారు. ఆయన ఆక్స్‌ఫర్డ్‌లో మాక్‌ఆస్లిక్ సహచరుల్లో ఒకరు. 'ద ప్రిసిపీస్' అనే పుస్తకంలో మానవాళి అస్తిత్వ ముప్పును తగ్గించటం గురించి ఆయన రాశారు. ఆయన పుస్తకం పేరు 'ప్రిసిపీస్' మనమిప్పుడు ఎక్కడ ఉన్నాం అనేది చెప్తోంది. అంటే.. మనం 'కొండ చరియ' అంచున నిలుచున్నామని.. ఒక్క తప్పటడుగుతో అధోగతి పాలవుతామని అర్థం. ఈ శతాబ్దంలో మానవాళి అంతమయ్యే అవకాశాలు ఆరింట ఒకటిగా ఉందని ఆర్డ్ అంచనా వేశారు.
మన పూర్వీకులు ఎన్నడూ ఎదుర్కోనటువంటి ముప్పులను.. అణు యుద్ధం, ప్రాణాంతక జీవాయుధాల తయారీ వంటి వాటిని మనం సృష్టించామని.. దీనివల్ల మన కాలం 'కీలక మలుపు' అవుతుందని ఆర్డ్ అభిప్రాయం. మరోవైపు.. నాగరికతను అంతం చేసే ఈ ఘటనలను నివారించటానికి మనం కృషి చేయటం లేదు. సూపర్-కరోనావైరస్ వంటి బయో-వెపన్ల తయారీ మీద ప్రపంచ నిషేధం విధించే ఐక్యరాజ్యసమితి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్‌కు ఉన్న నిధులు.. ఒక సగటు మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ కన్నా తక్కువే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇక 21వ శతాబ్దంలో అత్యధునాతన కృత్రిమ మేథస్సు ఆవిర్భవిస్తుందని.. అది అతి త్వరగా ఓ మహా మేధస్సు (సూపరింటెలిజెన్స్)గా మారే అవకాశం ఉందని అనేక మంది పరిశోధకుల అంచనా. ఈ మార్పును మనం ఎలా నిర్వహిస్తామనేది మానవాళి మొత్తం భవిష్యత్తును నిర్ణయిస్తుందని వారి వాదన. ఆ సూపరింటెలిజెన్స్ స్వయంగా తన లక్ష్యాలు, అవసరాలకు అనుగుణంగా మానవాళి భవిష్యత్తును కలకాలం శాసించవచ్చుననీ వారు అంటారు. ఈ విషయంలో మరో అవకాశం కూడా ఉందని.. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ తొలుత ఎవరి చేతుల్లో ఉంటే వారు మానవ భవిష్యత్తును శాసించవచ్చునని కూడా వారు విశ్లేషిస్తున్నారు.
ఇక ఈ శతాబ్దంలో చోటుచేసుకున్న వాతావరణ మార్పు, పర్యావరణ విధ్వంసం.. మానవాళి భవిష్యత్తును చాలా సుదీర్ఘ కాలం ప్రభావితం చేయవచ్చునని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌కు చెందిన ల్యూక్ కెంప్ వాదిస్తారు.
అంతేకాదు.. మానవ నాగరికత బాల్యంలో ఉన్న కాలం ఇదని.. కాబట్టి ఈ కాలం ప్రభావవంతమైనదనే వాదన కూడా ఉంది. మానవ చరిత్రలో మన వయసు సుమారు 10,000 సంవత్సరాలే. మనముందటి తరాలకు.. మార్పులను, విలువలను, లక్ష్యాలను సంలీనం చేసుకుని తదుపరి తరాలకు అందించే సామర్థ్యం చాలా అధికంగా ఉంటుందని వాదించవచ్చు. నేటి నాగరికతను.. ఎదిగే క్రమంలో అలవడిన లక్షణాలు, అయిన గాయాలు రెండిటినీ తన జీవితాంతం కొనసాగించే ఒక చిన్నారిగా కూడా మనం భావించవచ్చు.
అయితే.. మనం బాల్యంలో ఉన్నామనే అంశాన్ని.. పై వాదనకు వ్యతిరేక వాదన కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది: తొలి మానవలు అత్యంత ప్రభావవంతమైన కాలంలో జీవించారా? ఎందుకంటే.. వ్యవసాయ విప్లవం ఆరంభ దశలో కొన్ని తప్పటడుగులు వేసినట్లయితే మన నాగరికత మనుగడలోకే వచ్చి ఉండేది కాదు.
కావచ్చేమో. కానీ మాక్‌ఆస్కిల్ సూచిస్తున్నట్లుగా.. మానవ చరిత్రలో చాలా ఘట్టాలు మలుపులే అయినా.. అవి ప్రభావవంతమైనవే కావాలనేం లేదు.
''ఉదాహరణకు వేట, ఆహార సేకరణ సాగించిన మానవులకు.. వారు కీలక మలుపులో ఉండటానికి అవసరమైన చోదక శక్తి లేదు. ఎందుకంటే తాము సుదూర భవిష్యత్తును రూపొందించగలమనే తెలివిడి కానీ, కావాలనుకుంటే విభిన్నమైన మార్గం ఎంచుకునే వనరులు కానీ వారికి లేవు'' అంటారు మాక్‌ఆస్కిల్. ప్రభావం అనే దానికి మాక్‌ఆస్కిల్ నిర్వచనం ప్రకారం.. అనేక మార్గాల్లో ఒక దానిని ఎంచుకోగల అవగాహన, సామర్థ్యం ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయం ఎందుకంత ముఖ్యం?
ప్రభావశీలత అనే నిర్దిష్ట నిర్వచనమే.. మాక్‌ఆస్కిల్ తదితరులు ఈ అంశంపై ఆసక్తి చూపటానికి కారణం.
సుదూర భవిష్యత్తు గురించి ఆలోచించే తత్వవేత్తలుగా మాక్ఆస్కిల్, ఇతరులు.. చారిత్రక కీలక మలుపు భావనను.. జిజ్ఞాసను సంతుష్టపరిచే ఓ సైద్ధాంతిక సమస్య కన్నా పెద్ద విషయంగా చూస్తారు. దీనికి సమాధానాలు కనుగొనటం అనేది.. మానవాళి సమీప భవిష్యత్తు మీద, దీర్ఘ కాలిక సమస్యల మీద ఎంత సమయం, ఎన్ని వనరులు వెచ్చించాలనే దానిని ప్రభావితం చేస్తుందని వీరు భావిస్తారు.
సులభమైన రీతిలో చెప్పాలంటే.. మీ జీవితంలో తర్వాతి రోజు ఇప్పటివరకూ అత్యంత ప్రభావవంతమైన రోజు - ఉదాహరణకు ఒక కీలకమైన పరీక్ష రాయటం కానీ, ఒక జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకోవటం కానీ - కాబోతోందని మీరు భావించినట్లయితే.. ఆ రోజు కోసం మీరు చాలా శక్తిని, కృషిని నేరుగా వెచ్చిస్తారు. అలాగే.. మీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన రోజు దశాబ్దాల దూరంలో ఉందని మీరు భావించినట్లయితే.. లేదంటే ఆ రోజు ఏదో మీకు తెలియకపోయినా.. మీరు ముందుగా ఇతర ప్రాధాన్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు.
'చారిత్రక కీలక మలుపు' భావనకు వ్యతిరేక వాదనలు
మనం 'చారిత్రక కీలక మలుపు'లో ఉన్నామనే భావనను వ్యతిరేకించే ఒక సామాన్యమైన వాదన: సంభావ్యత రీత్యా అందుకు అవకాశం లేదు.
ఈ శతాబ్దం దాటి మనం ముందుకు సాగి, ఒక క్షీరద జాతి సగటు జీవితకాలాన్ని చేరుకుంటే.. మానవాళి మరో 10 లక్షల సంవత్సరాలు మనుగడ సాగిస్తుందని చెప్పొచ్చు. అంటే.. అప్పటికి మనం నక్షత్రాలకు విస్తరించి, ఇతర గ్రహాల్లో నివాసం ఉండగలిగే పరిస్థితి. మున్ముందు ఇంకా పుట్టబోయే ప్రజల సంఖ్య విస్తారంగా ఉంది. కేవలం రాబోయే 50,000 సంవత్సరాలనే చూసుకున్నా.. భవిష్యత్తు తరాల లెక్క చాలా భారీగా ఉంటుంది. జననాల రేటు 21వ శతాబ్దంలో ఉన్నట్లుగానే స్థిరంగా ఉన్నా కూడా.. ఇప్పటివరకూ నివసించిన మానవుల సంఖ్య కన్నా పుట్టబోయే మనుషుల సంఖ్య 62 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అది దాదాపు 6.75 ట్రిలియన్ల జనాభా.
రాబోయే ఆ మహా జనాభా సంఖ్యను బట్టి చూస్తే.. అందులో ఒక చిన్న భాగమైన మనం అత్యంత ప్రభావశీలురుగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందంటారు మాక్‌ఆస్కిల్. ఆ భవిష్యత్ మానవులు నైతికంగానూ, సాంకేతికంగానూ నేటి మన స్థాయికన్నా మరింత విజ్ఞానవంతులై ఉండే అవకాశం ఉంది (అలావుండాలనే ఆశ కూడా). కాబట్టి వారు మానవాళి భవిష్యత్తును ఇప్పుడు మనం కనీసం ఊహించనైనా లేని విధాలుగా ప్రభావితం చేసే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
అది అసంభావ్యమే కాదు.. అది ''అనుమానాస్పదం'' కూడా కావచ్చునని మాక్‌ఆస్కిల్ అంటారు. మనం చారిత్రక మలుపులో నివసిస్తుండి తీరాలని నిర్ధారించే వారు.. అంతర్లీనంగా తప్పుడు హేతుబద్ధతను సూత్రీకరిస్తుండవచ్చు. అచేతనంగా వరుసక్రమాన్ని పేరుస్తుండవచ్చు. ఉదాహరణకు అభిజ్ఞ పక్షపాతాల పాత్ర ఉంటే? మొదట.. స్పష్టమైన పక్షపాతం ఉంటుంది. అది ఈనాటి ఘటనలు అవి వాస్తవంగా కన్నా చాలా ముఖ్యమైనవిగా కనిపించేలా చేస్తుంది. ఉదాహరణకు.. మీరు 1980లలో జీవిస్తున్నపుడు.. నానోటెక్నాలజీ అనేది మానవాళికి అతి పెద్ద ముప్పుగా భావించివుండొచ్చు. కానీ ఎంతో భయపెట్టిన ఆ 'గ్రే గూ' సిద్ధాంతం అతిగా చూపిందని తేలింది.

ఫొటో సోర్స్, Nigel Hawtin
రెండోది నిర్ధారణ పక్షపాతం.. అస్తిత్వ ముప్పుల మీద మరింత దృష్టి కేంద్రీకరించాలని మీరు నమ్మినట్లయితే.. మీరు ఆ నిర్ధారణకు మద్దతునిచ్చే వాదనలను అచేతనంగా బలంగా వాదిస్తుంటారు.
ఈ కారణాలతో పాటు మరికొన్ని అంశాలను కలిపి.. మనం అత్యంత ప్రభావవంతమైన కాలంలో జీవిస్తున్నామని మాక్‌ఆస్కిల్ నిర్ధారిస్తారు. ఇతర కాలాలతో పోలిస్తే మనం అసాధారణమైన చారిత్రక మలుపులో జీవిస్తున్నామని ఆలోచించేలా ఒప్పించే వాదనలు ఉండొచ్చునని.. కానీ మానవాళి ముందు అతి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉన్నందున.. నిజమైన చారిత్రక కీలక మలుపు కాలం అనేది భవిష్యత్తులో రావాల్సి ఉందని ఆయన సూచిస్తున్నారు.
అత్యంత కీలకమైన సమయంలో మనం అత్యంత ముఖ్యమైన మానవులం కాదేమోనని నిర్ధారణకు రావటం నిరుత్సాహకరంగా అనిపించవచ్చు కానీ.. ఇదో మంచి విషయం కావచ్చు. ''పెను విపత్తుల కాలం'' భావనను నమ్మినట్లయితే.. రాబోయే శతాబ్దంలో జీవించటం చాలా ప్రమాదకరం కావచ్చు. మానవజాతి మనుగడ సాగించేలా చూడటానికి భారీ త్యాగాలు చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చు. కెంప్ ఉటంకించినట్లుగా.. భవిష్యత్తు ఊహ ప్రమాదంలో ఉందన్నప్పుడు భయాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఆ భవిష్యత్తును రక్షించే పేరుతో కొన్నిసార్లు దుష్టకార్యాలను కూడా సమర్థించుకుంటారని చరిత్ర చెప్తోంది.
''రాజ్యాలు ఊహించిన ప్రమాదాలకు ప్రతిస్పందనగా క్రూరమైన చర్యలు చేపట్టిన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ ముప్పు ఎంత ఎక్కువగా ఉందని ఊహిస్తే.. అత్యవసర శక్తులు అంత తీవ్రంగా ఉంటాయి'' అంటారాయన.
ఉదాహరణకు.. కపటమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ విధ్వంసకారక సాంకేతికతలు కానీ అభివృద్ధి చెందకుండా నివారించాలని కోరుకునే కొందరు పరిశోధకులు.. జీవించివున్న మానవులందరి మీదా అన్ని వేళలా సునిశిత నిఘా ఉంచాలని వాదించారు.
కానీ.. చారిత్రక కీలక మలుపులో జీవిస్తున్నపుడు త్యాగాలు చేయటం అవసరమైతే.. ఇతర కాలాల్లో జీవితం నిమిత్తమాత్రంగా ఉండొచ్చని కాదు. అది భవిష్యత్తుకు మన బాధ్యత లేకుండా చేయదు. మానవజాతిని అంతం చేసేంత పెద్ద ఘటన కాకపోయినా.. ఈ శతాబ్దంలో మనం గణనీయమైన విధ్వంసం సృష్టించవచ్చు. వాతావరణంలో కర్బనవాయువుల నుంచి భూమి లోపల అణు వ్యర్థాల వరకూ మన వారసులకు కలుషితమైన వారసత్వ సంపద అందించటానికి గత శతాబ్దంలో మనం అనేక కొత్త మార్గాలు కనుగొన్నాం.
మన కాలం అత్యంత ప్రభావ వంతమైనదా కాదా అనేది మనకు ఇంకా తెలియకపోయినప్పటికీ.. రేపు జీవించబోయే కోటానుకోట్ల మంది మానవుల జీవితాలను, సంక్షేమాన్ని.. మేలుగానో, కీడుగానో రూపొందించటంలో మనకు మునుపటికన్నా ఎక్కువ శక్తి ఉందని మరింత ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని మనం ఎంత వివేకంగా ఉపయోగించుకున్నామనే దానిపై తీర్పు చెప్పేది భవిష్యత్ చరిత్రకారులు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








