ప్రపంచ జనాభా: పడిపోతున్న జననాల రేట్లు... ఈ శతాబ్దం చివరికి ప్రపంచం ఎలా ఉండబోతుంది?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్న కారణంగా ఈ శతాబ్దం చివరికి దాదాపు అన్ని దేశాల్లోనూ జనాభాలు కుంచించుకుపోవచ్చని ఓ ప్రముఖ అధ్యయనం అంచనా వేసింది. ఫలితంగా వివిధ దేశాల్లోని సమాజాలపై ‘ఆశ్చర్యకర’ ప్రభావాలు ఉండొచ్చని అభిప్రాయపడింది.
లాన్సెడ్ మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయనం అచ్చైంది.
ఈ అధ్యయనం నేపథ్యంలో జనాభాపరంగా నాటకీయ మార్పులు ఎదుర్కొంటున్న ఏడు దేశాల పరిస్థితులను, రాబోయే సమస్యల పరిష్కారానికి అవి తీసుకుంటున్న చర్యలను ఓసారి పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్
జపాన్ జనాభా సగానికి పైగా తగ్గిపోనుంది. 2017లో గరిష్ఠంగా 12.8 కోట్ల జనాభాతో ఉన్న ఆ దేశం ఈ శతాబ్దం చివరికి 5.3 కోట్ల జనాభాకు తగ్గిపోవచ్చని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది.
జపాన్ ఇప్పటికే జనాభాలో అత్యంత మంది వృద్ధులు ఉన్న దేశంగా మారింది. వంద ఏళ్లకు పైబడ్డవారి రేటు కూడా అక్కడే అత్యధికంగా ఉంది.
అక్కడి కార్మికశక్తికి అది భారంగా మారింది. ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి.
అధికారిక అంచనాల ప్రకారం 2040కల్లా జపాన్ జనాభాలో 35 శాతం మంది వృద్ధులు ఉంటారు.
ఈ పరిస్థితికి తోడు ఒక్కో మహిళకు 1.4 జననాల చొప్పున అక్కడ సంతానోత్పత్తి రేటు ఉంది. అంటే ఉద్యోగాలు చేసేందుకు అక్కడ జనం కూడా తగ్గిపోతారు.
జనాభా స్వరూపం అలాగే కొనసాగాలంటే సంతానోత్పత్తి రేటు 2.1గా కొనసాగాలి.
దేశంలోకి వచ్చే వలసల విషయంలో జపాన్ ఇదివరకు బాగా జాగ్రత్తగా వ్యవహరించేది. ఈ సమస్యల దృష్ట్యా గత కొన్నేళ్లలో మాత్రం నిబంధనలు కాస్త సడలించింది.
అయితే, వలస ఉద్యోగుల శ్రమ దోపిడీ జరుగుతోందన్న కథనాలు కూడా విస్తృతంగా వస్తున్నాయి.
ఇటలీ
ఇటలీ జనాభా కూడా సగానికిపైగా తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయి. 2017లో ఆ దేశ జనాభా 6.1 కోట్లు. ఈ శతాబ్దం చివరికి అది 2.8 కోట్లకు తగ్గవచ్చని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది.
జపాన్ తరహాలో ఇటలీలో కూడా వృద్ధ జనాభా ఎక్కువ. ప్రపంచ బ్యాంక్ సమాచారం ప్రకారం 2019 నాటికి ఇటలీలో 23 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారే.
సంతానోత్పత్తి రేట్లను పెంచేందుకు జననానికి రూ.68 వేలు చొప్పున ఆ దేశంలోని జంటలకు చెల్లించే కార్యక్రమాన్ని కూడా ఇటలీ 2015లో తెచ్చింది.
అయితే, యురోపియన్ యూనియన్‌లో అత్యల్ప సంతానోత్పత్తి రేట్లు ఇటలీలోనే ఇంకా ఉన్నాయి.
ఆ దేశం విడిచి వెళ్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అధికారిక సమాచారం ప్రకారం 2018లో ఇటలీ నుంచి దాదాపు 1,57,000 మంది వెళ్లిపోయారు.
స్థానిక జనాభాను పెంచేందుకు, ఆర్థిక వృద్ధి కోసం చాలా పట్టణాలు కొత్త పథకాలను తీసుకువచ్చాయి. ఇళ్లను ఒక యూరో (సుమారు రూ.85) కు విక్రయించడం, తక్కువ జనాభా ఉన్న చోట్ల వ్యాపారాలను ప్రారంభించేవారికి ప్రోత్సహకాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చైనా
జనాభా పెరుగుదలను నెమ్మదింపజేసేందుకు చైనా 1979లో వివాదాస్పద ‘వన్ చైల్డ్’ (ఒకే బిడ్డ) విధానాన్ని తీసుకువచ్చింది. ఆర్థిక వృద్ధి ప్రణాళికలపై ప్రభావం పడొచ్చన్న వాదనలున్నా వాటిని లెక్క చేయకుండా ఆ విధానాన్ని అమలు చేసింది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనానే. వచ్చే నాలుగేళ్లలో 140 కోట్ల గరిష్ఠ స్థాయికి చైనా జనాభా వెళ్లి, 2100 నాటికి 73.2 కోట్లకు తగ్గుతుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది.
చైనాలో జననాల రేటు 2019లో 70 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కార్మిక శక్తి చాలా వరకూ తగ్గిపోయి, పెద్ద సంఖ్యలో వృద్ధ జనాభాను పోషించాల్సిన పరిస్థితి దేశంలో ఏర్పడుతుందని కొంతమంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాలో ఇలాంటి సమస్యలు ఏర్పడితే, దాని ప్రభావం అంతర్జాతీయంగానూ ఉంటుంది.
జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతుండటంతో 2015లో చైనా వన్ చైల్డ్ విధానానికి వీడ్కోలు చెప్పింది. ఇద్దరు పిల్లలను కనేందుకు జంటలకు అనుమతి ఇచ్చింది.
ఈ చర్యతో జననాల రేటు కాస్త పెరిగినా, చాలా కాలంగా కొనసాగుతున్న సరళిని అది వెనక్కి మళ్లించలేకపోయింది.
వన్ చైల్డ్ విధానం లింగ నిష్పత్తిలోనూ తీవ్ర అసమానతలకు కారణమైందన్న వాదనలు ఉన్నాయి. 2019లో ఆ దేశంలో మహిళల సంఖ్య కన్నా పురుషుల సంఖ్య మూడు కోట్లు ఎక్కువగా ఉంది. ఆడ శిశువును కనడం ఇష్టం లేక అబార్షన్లు చేయించుకోవడం కూడా ఈ పరిస్థితికి ఓ కారణం.
వన్ చైల్డ్ విధానాన్ని ఎత్తివేసినా, కుటుంబాలకు ఒకరికి మించి పిల్లలను పోషించేలా ఆర్థిక తోడ్పాటు అందించకపోవడం వల్ల కూడా ఫలితాలు రావట్లేదని కొందరు అంటున్నారు.
ఇరాన్
ఇరాన్ జనాభా కూడా ఈ శతాబ్దం చివరికల్లా గణనీయంగా పడిపోనుంది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ దేశంలో జనాభా విస్ఫోటనం వచ్చింది. అయితే, ఆ దేశం జనాభా నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసింది.
ఇరాన్‌లో జనాభా పెరుగుదల రేటు ఒక శాతం కన్నా తక్కువకు చేరినట్లు గత నెలలో ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వచ్చే 30 ఏళ్లలో అత్యధిక శాతం వృద్ధులున్న దేశంగా ఇరాన్ మారిపోవచ్చని వ్యాఖ్యానించింది.
చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వివాహాలు, జననాలు తగ్గిపోయాయని అక్కడి ప్రభుత్వం మీడియా సంస్థ ఇర్నా ఓ కథనంలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో గత నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాసెక్టమీ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లను ఇరాన్ నిలిపివేసింది. ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బ్రెజిల్
బ్రెజిల్‌లో సంతానోత్పత్తి రేటు గత 40 ఏళ్లలో గణనీయంగా మారిపోయింది.
1960లో ఒక్కో మహిళకు 6.3 జననాల చొప్పున అక్కడ సంతానోత్పత్తి రేటు ఉంది. ప్రస్తుతం అది 1.7కు తగ్గింది.
2017లో 21 కోట్లుగా ఉన్న బ్రెజిల్ జనాభా... 2100 నాటికి 16.4 కోట్లకు తగ్గుతుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది.
క్యాథలిక్‌లు ఎక్కువగా ఉండే బ్రెజిల్‌లో చిన్న కుటుంబాల గురించి చూపిస్తూ వచ్చిన సీరియళ్లు జననాల రేటు తగ్గేందుకు దోహదం చేశాయని 2012లో ఓ అధ్యయనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
జననాల రేటు తక్కువగా ఉన్నా, యవ్వనంలోనే గర్భధరిస్తున్నవారు కూడా బ్రెజిల్‌లో ఎక్కువగా ఉంటున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది.

ఫొటో సోర్స్, DOMINIQUE FAGET/getty
భారత్
2100 కల్లా భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది.
అయితే, జనాభా ఇప్పుడు ఉన్న స్థాయి కన్నా తగ్గిపోతుందని అభిప్రాయపడింది.
2017లో 130 కోట్లుగా ఉన్న భారత జనాభా, ఈ శతాబ్దం చివరి కల్లా 110 కోట్లకు చేరుకుంటుందని పరిశోధకులు అంటున్నారు.
1960లో దేశంలో సంతానోత్పత్తి రేటు 5.91గా ఉంది. ఇప్పుడు అది 2.24కు తగ్గిపోయింది.
మిగతా దేశాలు సంతానోత్పత్తి రేట్లను పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నా, భారత ప్రధాని నరేంద్ర మోదీ చిన్న కుటుంబాలే మేలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
‘‘జనాభా విస్ఫోటనం వల్ల భావి తరాలకు చాలా సమస్యలు వస్తాయి. అయితే, ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారిని తీసుకువచ్చేముందు, వారి అవసరాలు తీర్చగలమా, బాగా చూసుకోగలమా అన్న ఆలోచన చేసే వర్గం ఉంది. వాళ్లు చిన్న కుటుంబాలుగా ఉండటం ద్వారా తమ దేశ భక్తిని చాటుకుంటారు. వాళ్ల నుంచి మిగతా వాళ్లు నేర్చుకోవాలి’’ అని గత ఏడాది మోదీ ఓ ప్రసంగంలో అన్నారు.
నైజీరియా
నైజీరియాతోపాటు మిగతా ఆఫ్రికన్ దేశాలు కూడా జనాభా తగ్గిపోయే సమస్యను ఎదుర్కొంటున్నాయి.
ఉపసహారా ఆఫ్రికా దేశాల్లో జనాభా 2100 నాటికి 300 కోట్లకు తగ్గవచ్చని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.
79.1 కోట్ల జనాభాతో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నైజీరియా అవతరిస్తుందని అంచనా వేసింది.
2100కల్లా నైజీరియాలో కార్మికశక్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంటుందని, దేశ జీడీపీ వృద్ధికి అది దోహదం చేస్తుందని పేర్కొంది.
అయితే, జనాభా పెరుగుదల వేగం ఎక్కువగా ఉండటం వల్ల మౌలిక వసతులు, సామాజిక వ్యవస్థల మీద భారం పడుతుంది.
‘‘దేశంలో పిల్లలను పోషించలేకపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. విద్య, వైద్యం గురించి చెప్పనక్కర్లేదు. జనాభా పెరుగుదల రేట్ల గురించి కచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని నైజీరియా ఆర్థిక మంత్రి జైనాబ్ అహ్మద్ 2018లో బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘పెట్టుబడుల వేటగాడు ముఖేశ్ అంబానీ’ 5జీ నిర్ణయం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారత్‌పై గూగుల్‌కు అంత ప్రేమ ఎందుకు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








