భోగాపురం విమానాశ్రయం: ట్రయల్ రన్ సక్సెస్.. పనులు ఎక్కడిదాకా పూర్తయ్యాయి, ఈ ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలేంటి?

ఫొటో సోర్స్, GMR
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఆదివారం (జనవరి4)నాడు ట్రయల్ రన్ విజయవంతమైంది. న్యూదిల్లీ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఇక్కడ దిగిన తరువాత అగ్నిమాపక వాహనాలు విమానం రెండు వైపుల నుంచి నీటిని ఎగచిమ్ముతూ చేసిన 'వాటర్ సెల్యూట్' ను అందుకుంటూ విమానం ముందుకు కదిలింది.
నాలుగునెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.
ట్రయల్ రన్ విజయవంతం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
ఈ రోజు రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కొత్త మైలురాయిగా నిలిచిపోతుందని, ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి గట్టి ఊతమిస్తుందని తెలిపారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయని వైసీపీ అధినేత జగన్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.


ఫొటో సోర్స్, GMR
విమానాశ్రయానికి అల్లూరి పేరు
దాదాపు పదేళ్ల క్రితం మొదలైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. నిర్మాణంలో ఎదురైన ఆలస్యాలు, భూసేకరణ సమస్యలు, ప్రభుత్వాల మార్పుల మధ్య ముందుకు సాగిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 96 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రధాన ట్రయల్ రన్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్లకు మరో అడుగు దగ్గరైంది. ఈ ఎయిర్ పోర్టుకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు.
ఆదివారం ఉదయం దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం రన్ వే పై దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీజీసీఏ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉన్నతాధికారులు ప్రయాణించారు.
ట్రయల్ రన్ సందర్భంగా రన్‌వే పనితీరు, నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా ఏర్పాట్లు, విమానాల రాకపోకలకు అవసరమైన సాంకేతిక సన్నద్ధతను అధికారులు పరిశీలించారు.

ఫొటో సోర్స్, DPRO VIZAG
96 శాతం పనులు పూర్తి
భోగాపురం విమానాశ్రయాన్ని ఆకర్షణీయంగా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బిల్డింగ్‌ను ఎగిరే చేప ఆకృతిలో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణాలను తీర్చిదిద్దినట్టు జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఇందన ప్రభాకర రావు బీబీసీతో చెప్పారు.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో కీలకమైన రన్ వే, ట్యాక్సీ వే, ఎర్త్‌వర్క్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. టెర్మినల్ భవనం, ప్రధాన బిల్డింగ్‌లు, అప్రోచ్ రోడ్లు, లోకలైజర్, జీపీఎస్ నావిగేషన్, రాడార్, ఏటీసీ వ్యవస్థలు తుది దశలో ఉన్నాయని, దాదాపు 96శాతం పనులు పూర్తయ్యాయని ప్రభాకరరావు చెప్పారు.
వాతావరణ పరికరాలు, నావిగేషన్ సిస్టమ్స్‌పై టెస్టింగ్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన చిన్నపాటి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.
దాదాపుగా పనులు పూర్తయి ప్యాచ్ వర్క్ జరుగుతున్న పరిస్థితి అక్కడ కనిపించింది.

పదేళ్లకు అందుబాటులోకి
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 2015 మే 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ఆమోదం తెలిపింది. 2016 అక్టోబర్ 7న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మొదట 2023 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, భూసేకరణలో జాప్యం, పరిహార వివాదాలు, ప్రభుత్వాల మార్పులతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది.
2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్ జగన్ మరోసారి భూమి పూజ నిర్వహించారు.
దీంతో రెండుసార్లు శంకుస్థాపనలు జరిగిన ప్రాజెక్ట్‌గా ఇది గుర్తింపు పొందింది.
ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా 2024లో బాధ్యతలు చేపట్టడంవల్ల ప్రాజెక్ట్ వేగం పెరగిందని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
తమ హయాంలోనే పనులన్నీ చేశామని వైసీపీ కూడా చెబుతోంది.
2026 డిసెంబరు నాటికి ఎయిర్‌పోర్ట్ పూర్తవ్వాల్సి ఉంది. అయితే ఆరు నెలలు ముందే, అంటే 2026 జూన్ లోనే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
"నాలుగు నెలల క్రితం టెక్నికల్ గా ఒక ట్రయల్ రన్ నిర్వహించాం. ఇప్పుడు జరుగుతున్నది ప్రధాన ట్రయల్ రన్. జూన్ నుంచి కమర్షియల్ ఫ్లైట్లు, ఆగస్టు నుంచి ప్రయాణికుల సేవలు ప్రారంభించాలన్నది ప్రణాళిక" అని ప్రభాకర రావు చెప్పారు.

ఫొటో సోర్స్, DPRO VIZAG
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలు
- మొత్తం విస్తీర్ణం: 2,700 ఎకరాలు (ఇందులో 2,203 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ పోర్టు నిర్మాణం, మరో 500 ఎకరాలు భవిష్యత్ విస్తరణ కోసం)
- నిర్మాణ సంస్థ: జీఎంఆర్ గ్రూప్
- టెర్మినల్ విస్తీర్ణం: 81,000 చదరపు మీటర్లు (78000 చదరపు మీటర్ల పనులు పూర్తి)
- ఏరో బ్రిడ్జీలు: 22
- ప్రారంభ సామర్థ్యం: ఏడాదికి 60 లక్షలమంది ప్రయాణికులు
- రెండో దశలో: కోటీ20లక్షల మంది ప్రయాణికులు
- తొలి దశ వ్యయం: రూ.4,750 కోట్లు
- రన్ వే పొడవు: 3.8 కిలోమీటర్లు
భారీ విమానాలు, ఎయిర్‌బస్ ఎ380 వంటి లాంగ్ హాల్ట్ ఫ్లైట్లకు అనుకూలంగా ఈ రన్‌వే రూపొందించారు.
దేశంలోనే పొడవైన రన్ వేల్లో ఒకటిగా భోగాపురం నిలవనుందని జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకరరావు బీబీసీకి వివరించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు విశాఖపట్నం నుంచి 55 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కిలోమీటర్లు, శ్రీకాకుళానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫొటో సోర్స్, DPRO VIZAG
రియల్ ఎస్టేట్ బూమ్
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రకటన నుంచి క్రమంగా రియల్ ఎస్టేట్ పెరిగింది. ‘‘అసలు రాష్ట్రంలోనే భోగాపురంలో జరుగుతున్నంత రియల్ ఎస్టేట్ వ్యాపారం మరెక్కడా జరగడంలేదని’’ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆర్. నాయుడు బీబీసీతో చెప్పారు.
‘‘లక్షల్లో ఉన్న భూమి ధర కోట్లరూపాయలకు ఎగబాకిందని’’ తెలిపారు.
ప్రస్తుతం స్థానిక రైతుల దగ్గర భూములు లేవని, పెట్టుబడిదారుల చేతుల్లోనే ఎక్కువ భూమి ఉందనే ఆరోపణలున్నాయి..
"మాకు 4 ఎకరాల భూమి ఉండేది. ఎయిర్ పోర్ట్ వస్తుందని చెప్పినప్పుడు రేట్లు పెరుగుతాయని అమ్మలేదు. అయితే ఇక్కడ పెద్దగా పనులు ప్రారంభం కాకపోవడం, పదే పదే ఈ ఎయిర్ పోర్టుపై రాజకీయాలు జరగడంతో...మేం ఇక ఈ ఎయిర్ పోర్ట్ వస్తుందో రాదోనని...2021లో ఆ భూమిని అమ్మేశాం. ఇంకా కొంత భూమి చేతిలో ఉంది. కానీ ఇప్పటి ధరలతో పోలీస్తే అప్పుడు అమ్మకం ఎంత తప్పో అర్ధమయింది." అని భోగాపురం రైతు ఎం. రాము బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, DPRO VIZAG
కనెక్టివిటీ సవాళ్లు
భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తయితే తూర్పు నౌకాదళ నిర్వహణలో ఉన్న విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు బంద్ అవుతాయి. ఈ ఎయిర్ పోర్టు విశాఖ నగరానికి 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నైట్ ల్యాండింగ్ సమస్యలు ఉండటంతో...మరో ఎయిర్ పోర్టుని నిర్మించాలంటూ నేవీ కేంద్రాన్ని కోరింది.ఆక్కడ మొదలైన కథే ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు వరకు సాగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది.
అధునాతనంగా, భారీ ఎత్తున తలపెట్టిన ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలుత 15 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత, వివిధ దశల్లో నిర్వాసిత గ్రామస్థుల అందోళనలతో ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ 2,700 ఎకరాలకు పరిమితమైంది.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశాఖపట్నానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.. కనీస ప్రయాణ సమయం గంట నుంచి గంటన్నర పడుతుంది.
"ఎయిర్ పోర్టు అవసరాల దృష్ట్యా ప్రయాణ సమయం, ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు విశాఖ నుంచి 12 ప్రధాన రహదారులు కనెక్ట్ చేయాల్సి ఉంది. అయితే వీటి అభివృద్ధిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కనెక్టివీటి లేకుండా ఎయిర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే ఎయిర్ ప్యాసింజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్లైట్ టిక్కెట్‌కి అయ్యే ఖర్చుకంటే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకి రానుపోను ఖర్చులే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది." అని విశాఖ ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ. నరేశ్ బీబీసీతో అన్నారు.
భోగాపురం విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి ప్రయాణికులు కేవలం 45 నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా బీచ్ కారిడార్‌కు భూ సేకరణ, రహదారి విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేశారు. భోగాపురం సకాలంలో చేరుకునే విధంగా బీచ్ కారిడార్‌కు అడుగులు పడుతున్నాయి" అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














