‘నేను అంటే రెండు పెద్దపెద్ద రొమ్ములు కాదు.. ఎంతో నొప్పిని అనుభవిస్తున్నా’

మెలిస్సా ఆష్‌క్రాఫ్ట్

ఫొటో సోర్స్, Melissa Ashcroft

ఫొటో క్యాప్షన్, 20 ఏళ్ల వయసులో ఉండగా, మెలిస్సా తన రొమ్ముల తగ్గింపు గురించి వైద్యులను మొదటిసారి అడిగారు .
    • రచయిత, క్లైర్ థామ్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెద్ద వక్షోజాల కారణంగా ఓ మహిళ ఏళ్ల తరబడి నొప్పిని అనుభవిస్తున్నారు. అయితే వైద్య నియమాల వల్ల ఆమెకు రొమ్ముల సైజు తగ్గించే ఆపరేషన్ చేయించుకోవడానికి వీలుకావడం లేదు.

మెలిస్సా ఆష్‌క్రాఫ్ట్. ఈ మహిళ తన 36ఎం సైజు వక్షోజాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వక్షోజాల బరువు వల్ల కొన్నిసార్లు ఆమెకు పాపను మంచం మీద నుంచి ఎత్తుకోవడం కూడా కష్టమవుతోంది.

30 ఏళ్ల మెలిస్సాకు ఇద్దరు పిల్లలు. ఈ ఏడాది ప్రారంభంలో తన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) దాదాపు 35గా ఉంది. ఈ సంఖ్య రొమ్ము తగ్గింపు శస్త్రచికిత్స ప్రమాణాలకు మించి ఉందని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) తెలిపింది.

స్కాట్లాండ్‌లోని బ్లెయిర్‌గోరైలో నివసించే మెలిస్సా తన వక్షోజాల పరిమాణం శరీర బరువుకు అదనంగా 16 కిలోల బరువు తగిలించినట్లుగా ఉంటుందని, దీనివల్ల బరువు తగ్గడానికి తగిన వ్యాయమాలు చేయలేకపోతున్నానని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మెలిస్సా, స్కాట్లాండ్

ఫొటో సోర్స్, Melissa Ashcroft

'అలాంటి అటెన్షన్ వద్దు'

‘‘నా భుజాలు, నడుము నొప్పిగా ఉండటం వల్ల వ్యాయామం కష్టంగా ఉంటోంది’’ అని మెలిస్సా బీబీసీ రేడియో స్కాట్లాండ్‌తో చెప్పారు.

"నేను ట్రెడ్‌మిల్ వాడుతుండగా, జనం నన్ను సెక్సువల్‌గా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది, నాకు సిగ్గుగా అనిపిస్తుంటుంది, ఆ పరిస్థితి నాకు వద్దు" అన్నారామె.

మెలిస్సా ఫిట్‌గా ఉండటానికి ఈత కొడుతుంటారు. కానీ, స్విమ్‌సూట్ ధరించినప్పుడు సెక్సువల్‌గా చూస్తారేమోనని కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారామె.

"నాకు అలాంటి అటెన్షన్ వద్దు" అని మెలిస్సా చెప్పారు.

"ఇది జోక్ కాదు. నేనంటే ఒక జత రొమ్ములు కాదు, వ్యక్తిత్వం ఉన్న మనిషిని. మిగతా నొప్పుల్లాగే ఇది కూడా తీవ్రమైనది, బాధపెట్టేది." అన్నారామె.

20 ఏళ్ల వయసులో ఉండగా, రొమ్ముల తగ్గింపు గురించి తన వైద్యుడిని మొదట సారి సంప్రదించారు మెలిస్సా. శస్త్రచికిత్స జరిగితే, భవిష్యత్తులో పిల్లలకు పాలివ్వడంలో ఇబ్బంది ఉంటుందని ఆమెకు చెప్పారు.

ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు - ఏడేళ్ల కొడుకు, తొమ్మిది నెలల కూతురు. గర్భధారణ సమయంలో ఆమె రొమ్ములు మరింత పెరిగాయి. నొప్పిని తగ్గించుకోవడానికి ఫిజియోథెరఫీ వంటివి కూడా ప్రయత్నించారామె. అయితే, తనకు సాధారణ జీవితాన్ని గడపాలంటే రొమ్ము తగ్గింపు అవసరమని మెలిస్సా అంటున్నారు.

మెలిస్సా, బీఎంఐ, స్కాట్లాండ్

ఫొటో సోర్స్, Melissa Ashcroft

వైద్యులు ఎందుకు నిరాకరిస్తున్నారు?

రొమ్ముల తగ్గింపు‌ ప్రమాణాలను ఎన్‌హెచ్‌ఎస్ ప్రాంతాలను బట్టి అనుసరిస్తుంటుంది. కానీ మెలిస్సా లాంటి అనేకమంది మహిళలు వారి బీఎంఐ ఎక్కువగా ఉండటం వల్ల తిరస్కరణకు గురవుతున్నారు.

బీఎంఐ ఎక్కువగా ఉన్నవారికి శస్త్రచికిత్స సమయంలో మత్తుమందు సమస్యలు, గాయం నెమ్మదిగా మానడం, రక్తం గడ్డకట్టడం, ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదాలు ఉంటాయి.

రొమ్ము తగ్గింపు శస్త్రచికిత్స అర్హత సాధించాలటే , రోగులు సాధారణంగా ఏడాది పాటు తమ బీఎంఐను 20 నుంచి 27 మధ్య ఉండేలా చూసుకోవాలి.

గర్భధారణ, బిడ్డ పుట్టిన తర్వాత హార్మోన్లు సాధారణ స్థితికి రావడంతో తనను ఎన్‌హెచ్ఎస్‌కు రిఫర్ చేశారని, ఆ తర్వాత కొంత బరువు తగ్గినట్లు మెలిస్సా చెప్పారు. కానీ, రొమ్ములు బరువుగానే ఉండటంతో బీఎంఐ(ప్రమాణాలకు)కి ఎలా అర్హత సాధించాలో ఆమెకు ఇంకా అర్థం కావడంలేదు.

ప్రభుత్వం ఏం చెబుతోంది?

శరీర ఆరోగ్యం లేదా ఊబకాయం వివరించడానికి బీఎంఐ అత్యంత ఆధారపడినదగినదేనా? అనే విషయంపై ప్రజల్లో గత దశాబ్దం నుంచి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మెలిస్సాలాంటి శరీరం ఉన్నవారిలో ఈ నియమంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మెలిస్సా ప్రమాణాల విషయంలో అర్హత సాధించినా, ఎన్‌హెచ్ఎస్‌లో రొమ్ము తగ్గింపు శస్త్రచికిత్సకు హామీ రాకపోవచ్చునని సెయింట్ ఎల్లెన్స్ హాస్పిటల్స్‌ ఫౌండర్, కాస్మెడికేర్ యజమాని గిల్ బైర్డ్ అన్నారు.

"కోవిడ్‌కు ముందు నుంచి శస్త్రచికిత్స కోసం వేలాది మంది వేచి ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్ఎస్‌ అత్యంత తీవ్రమైన కేసులను మాత్రమే పరిష్కరిస్తోంది" అని గిల్ బైర్డ్ బీబీసీ స్కాట్లాండ్‌తో చెప్పారు.

"ఎన్‌హెచ్ఎస్‌ అత్యవసర కేసులపై దృష్టి పెట్టాలి. బీఎంఐ చాలా వాటిని పరిమితం చేస్తుంది. ఎందుకంటే, తీవ్రమైన కేసులను పరిశీలిస్తే జీ, హెచ్ లేదా ఎం సైజు వక్షోజాలు ఉన్న మహిళల బీఎంఐ 30 కంటే తక్కువగా ఉండటం చాలా అరుదు’’ అన్నారామె.

"రొమ్ము తగ్గింపు శస్త్రచికిత్స కోసం ప్రజలకు వైద్యపరంగా తగిన యాక్సెస్ ఉండటం ముఖ్యమని అర్థం చేసుకున్నాం. అది పారదర్శకంగా, ఆధారాలతో ఉండాలి" అని స్కాటిష్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అన్నారు.

"వైద్య నిపుణుల బృందం రూపొందించి, అంగీకరించిన నేషనల్ రెఫరల్ ప్రోటోకాల్ (ఎన్ఆర్పీ)ను రోగులు పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలు వైద్య పరిశోధనపై ఆధారపడి ఉంటాయి. అవి ప్రజలను అడ్డుకోవడానికి కాదు , శస్త్రచికిత్స అవసరమైన వారు దానిని పొందగలరని నిర్ధరించుకోవడానికి ఉద్దేశించినవి" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)