స్క్రబ్ టైఫస్: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఈ వ్యాధి ఎంత సీరియస్?

స్క్రబ్ టైఫస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

నాలుగైదు రోజులుగా జ్వరం ఉండి.. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి పరీక్షల్లో నెగెటివ్ వచ్చి కూడా జ్వరం తగ్గకపోతే, అది స్క్రబ్ టైఫస్ కావొచ్చు.

నవంబర్ 30వ తేదీన విజయనగరం జిల్లాలో ఒక మహిళ స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో మరణించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధిపై ఆందోళన నెలకొంది.

ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇది నల్లిలాంటి ఒక చిన్న పురుగు కుట్టడం వలన వచ్చే వ్యాధి. ముందుగా గుర్తించకపోయినా, పట్టించుకోకపోయినా ప్రాణాంతకం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి? ఇది ఎలా వస్తుంది? గుర్తించడం ఎలా, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ అంశాలపై వైద్యులు అలాగే వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్క్రబ్ టైఫస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ కీటకం ఉండే అవకాశాలు ఉన్న ప్రాంతాలలో కీటక నాశినులను చల్లాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు సూచిస్తున్నారు.

స్క్రబ్ టైఫస్ అంటే...

వ్యాధి నిర్ధరణ జరిగిన తర్వాత సరైన వైద్యం తీసుకుంటే స్క్రబ్ టైఫస్ ప్రాణాంతకం కాదని విశాఖ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి పి. జగదీశ్వరరావు బీబీసీతో అన్నారు.

‘‘స్క్రబ్‌ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది చిగ్గర్ మైట్ అనే నల్లిని పోలిన పురుగు కుట్టడం వలన వస్తుంది. కుట్టినప్పుడు మన శరీరంలోకి లార్వా దశలో ఉండే ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. దీనివల్ల స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది’’ అని జగదీశ్వరరావు అన్నారు.

పొలాలు, పొదలు, గడ్డివాములు వంటి స్క్రబ్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండటం, ఆ పురుగు కుట్టిన తర్వాత వచ్చే లక్షణాల్లో తలతిరగడం, గందరగోళంగా ఉండటంతో ఈ వ్యాధికి స్క్రబ్ టైఫస్ అనే పేరు వచ్చినట్లు విశాఖకు చెందిన ఫిజిషియన్ డాక్టర్ టి. స్రవంతి చెప్పారు.

‘‘చిగ్గర్ మైట్స్ అనేవి లార్వా దశలో ఉండే చాలాచిన్న పురుగులు. అంటే మైక్రో‌స్కోప్‌లో మాత్రమే కనిపించేంత చిన్నగా సరాసరి 0.2 మిల్లీమీటర్ల పరిమాణంలో.. ఎరుపు, నారింజ రంగులో ఉంటూ చూసేందుకు నల్లి పురుగులా కనిపిస్తాయి’’ అని డాక్టర్ స్రవంతి తెలిపారు.

స్క్రబ్ టైఫస్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, డాక్టర్ స్రవంతి

ఏపీలో స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోని ఓ మహిళ ఈ వ్యాధి లక్షణాలతో మరణించడంతో ఆందోళన మొదలైంది. ఏపీలోని చాలా జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ చివరి వరకు 6678 పరీక్షలు చేయగా...అందులో 1317 కేసులు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.

"రాష్ట్రంలో చిత్తూరు, కాకినాడ, విశాఖలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ గుర్తించే 'ఎలిసా' వంటి పరీక్షలు చేసే సౌకర్యం అన్ని ఆసుపత్రుల్లో లేదు. పైగా ఈ కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సంఖ్య కంటే ఈ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు" అని వైద్య ఆరోగ్యశాఖాధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

‘‘ఈ కీటకం వర్షాకాలంలో, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి, నేల తడిగా ఉండే కాలంలో అంటే ఆగస్ట్ నుంచి ఫిబ్రవరిలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆ సమయంలో లార్వా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో పనిచేసేవారు, తోట పనులు చేసే వారు, చెప్పుల్లేకుండా గడ్డిలో వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలి’’ అని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి బీబీసీతో చెప్పారు.

పురుగు, ఓరియంటియా సుట్సుగముషి

ఫొటో సోర్స్, Getty Images

‘చిన్న పురుగే...ప్రమాదం పెద్దది’

ఒక పురుగు కుట్టిందనే విషయమే తెలియకుండా ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుందని, పైగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడడానికి ఆ పురుగు కుట్టిన తర్వాత 5 నుంచి 10 రోజులు సమయం పడుతుందని డాక్టర్ స్రవంతి అన్నారు.

"ఇది కుట్టడం వలన (మనకు తెలిసినా, తెలియకపోయినా) జ్వరం వచ్చి...అది నాలుగైదు రోజులుగా తగ్గకపోతే అది స్క్రబ్ టైఫస్ కావొచ్చు. ఓరియంటియా సుట్సుగముషి బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి అవయవాలను డ్యామేజ్ చేస్తుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరంపై దద్దుర్లు, కుట్టినచోట గట్టి మచ్చ ఏర్పడటంలాంటి లక్షణాలు కనిపిస్తాయి.ప్లేట్ లెట్స్ కూడా తగ్గిపోతాయి. ఆ తర్వాత దశలో కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి" అని డాక్టర్ స్రవంతి బీబీసీతో చెప్పారు.

యాంటీబాడీస్

ఫొటో సోర్స్, UGC

స్క్రబ్ టైఫస్‌ను ఎలా గుర్తిస్తారు? ట్రీట్మెంట్ ఉందా?

‘‘ స్క్రబ్ టైఫస్ నిర్ధరణకు సిరోలజీ పరీక్షలు చేస్తారు. అంటే రక్తంలోని యాంటీబాడీలను బట్టి వ్యాధిని గుర్తించే పరీక్షలు. ఇందులో ఎలిసా టెస్ట్‌ను ఎక్కువగా చేస్తారు. ఇండైరెక్ట్ ఇమ్యునోఫ్లోరోసెన్స్ అస్సే (ఐఎఫ్ఏ) పరీక్ష ఉంటుంది. అయితే ఇది అన్నీ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండదు. కానీ దీనిని ఈ వ్యాధికి 'గోల్డ్ స్టాండర్డ్' పరీక్షగా పరిగణిస్తారు’’ అని డాక్టర్ వాణి చెప్పారు.

ప్రారంభదశలో వ్యాధి నిర్ధరణ కోసం కొద్దిచోట్ల పీసీఆర్ పరీక్ష కూడా ఉందని, నిర్ధరణ గంటలో జరిగిపోతుందని డాక్టర్ వాణి చెప్పారు. వ్యాధి ఉన్నట్లు తెలిస్తే చికిత్స ద్వారా తగ్గించవచ్చని డాక్టర్ వాణి అన్నారు.

‘‘ ఇది కొత్త వ్యాధి కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడు పరీక్షలు చేయడం వలన ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. నవంబరు నెలలో విశాఖ కేజీహెచ్‌లో 149 మందికి పరీక్షలు చేయగా...అందులో 19 స్క్రబ్ టైఫస్ పాజిటిల్ తేలింది. వారంతా చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయిపోయారు" అని డాక్టర్ వాణి తెలిపారు.

ఈ వ్యాధి సోకినప్పుడు వచ్చే జ్వరాన్ని సాధారణ జ్వరంగా భావించి చికిత్స ఆలస్యం చేస్తారనీ, దీనివల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వైద్యులు అన్నారు.

ఆంధ్రప్రదేశ్, నారా చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వ్యాధిపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

'స్క్రబ్ టైఫస్ అంటువ్యాధా'

స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జగదీశ్వరరావు బీబీసీతో చెప్పారు.

"సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సంక్రమించదు" అని తెలిపారు.

ఈ వ్యాధి రాకుండా ప్రాధమికంగా పాటించాల్సిన కొన్ని విషయాలను డాక్టర్ జగదీశ్వరరావు చెప్పారు.

  • ఇంటిలోని పాత మంచాలు, దిండ్లు, దుప్పట్లు, వాడని దుస్తులను శుభ్రం చేసుకోవాలి. లేదంటే వాటిని వాడకూడదు.
  • తడి నేలలు, పొలాలు, గడ్డివాములు, పశువుల పాకలు, వ్యర్థాలు ఉండే చోట ఈ పురుగులు ఉండే అవకాశం ఉంది. అక్కడికి వెళ్లేవారు కాళ్లకు బూట్లు ధరించడంతో పాటు, శరీరం పూర్తిగా కవరయ్యే దుస్తులు ధరించాలి.
  • పిల్లలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, గర్భిణులపై వెంటనే ప్రభావం కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఈ పురుగు ఉండే అవకాశమున్న ప్రదేశాలకు ఇలాంటివారు వెళ్లకుండా చూసుకోవాలి.
  • మొక్కల దగ్గర ఇన్‌సెక్ట్ రెపెల్లెంట్స్ వాడటం మంచింది. అలాగే మట్టి, గడ్డి ప్రాంతాల్లో నేరుగా కూర్చోకూడదు.

‘‘ జ్వరం రాగానే అది స్క్రబ్ టైఫస్ అని భయపడాల్సిన పని లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే ఇది జ్వరాలు వచ్చే సీజన్‌. అప్రమత్తంగా ఉండాలి" అని జగదీశ్వర రావు చెప్పారు.

మరోవైపు స్క్రబ్ టైఫస్' వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చిగ్గర్ మైట్‌తో పాటు ఆ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు, అలాంటి ప్రమాదాన్ని ఏ విధంగా నివారించాలనేది ప్రజలకు వివరించాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులకు సీఎం సూచించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)