కోహ్లీ, గైక్వాడ్ సెంచరీలు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయిన భారత్

ఫొటో సోర్స్, Noah SEELAM/AFP via Getty Images
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో ఛేదించింది.
మార్‌క్రమ్ సెంచరీ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులు), మాథ్యూ బ్రీట్‌జ్కీ(64 బంతుల్లో 68 పరుగులు), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీలు సాధించారు.
ఈ మ్యాచ్‌లో ఓ వైపు మంచు ప్రభావం, మరోవైపు ఫీల్డింగ్ తప్పిదాలు భారత జట్టుకు ఇబ్బందులు సృష్టించాయి. చివర్లో టోనీ డి జోర్జీ (17 పరుగులు) రిటైర్డ్ ఔట్ అయినా, కార్బిన్ బాష్ దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు.
భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
మార్‌క్రమ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.


ఫొటో సోర్స్, Noah SEELAM/AFP via Getty Images
గైక్వాడ్, కోహ్లీ సెంచరీలు
అంతకుముందు, భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(22), రోహిత్ శర్మ(14)లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
రోహిత్ శర్మను బర్గర్ ఔట్ చేయగా, యశస్వి జైస్వాల్‌ను మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, గైక్వాడ్‌లు దక్షిణాఫ్రికా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కోహ్లీతో కలిసి సింగిల్స్, డబుల్స్, బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు గైక్వాడ్. మరోవైపు, కోహ్లీ కూడా దూకుడైన బ్యాటింగ్ కొనసాగించాడు.
ఈ క్రమంలో గైక్వాడ్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతనికిది మొదటి సెంచరీ. అయితే 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేసిన గైక్వాడ్, షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు.

ఫొటో సోర్స్, Noah SEELAM/AFP via Getty Images
ఆ తర్వాత కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. అయితే, 93 బంతుల్లో 102 పరుగులు చేసిన కోహ్లీని లుంగీ ఎంగిడి పెవిలియన్ పంపాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్, జడేజా(24)లు చివరి వరకు క్రీజులో నిలవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, Getty Images
రాణించిన మార్‌క్రమ్, బ్రెవిస్
359 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ధీటుగా బదులిచ్చింది. మొదటి వికెట్ (డీ కాక్) త్వరగానే కోల్పోయినా, కెప్టెన్ బవుమా, మార్‌క్రమ్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.
ఈ జోడీ రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత బవుమాను ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేసినా, మాథ్యూ బ్రీట్‌జ్కీ(68 పరుగులు)తో కలిసి మార్‌క్రమ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో మార్‌క్రమ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు.
అయితే, 110 పరుగులు చేసిన మార్‌క్రమ్‌ను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి.
కానీ, బ్రెవిస్(54) వచ్చీ రావడంతోనే హిట్టింగ్ మొదలుపెట్టడంతో చేయాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో బ్రెవిస్ 33 బంతుల్లోనే అర్థ శతకం అందుకున్నాడు.
చివర్లో బ్రెవిస్, టోనీ డి జోర్జీలు పెవిలియన్ చేరినా, బాష్ రాణించడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆఖరి వన్డే వైజాగ్ వేదికగా శనివారం (డిసెంబర్ 6) జరగనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














