‘‘నన్ను రెండుసార్లు రేప్ చేసిన నా మాజీ భర్తకు మా పిల్లలను చూసే హక్కు లేదు’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షానెన్ హెడ్లీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వివాహ బంధంలో సంవత్సరాల తరబడి వేధింపులకు గురయ్యారు బెక్కీ ( ఇది ఆమె అసలు పేరు కాదు). తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడిన నేరంలో మాజీ భర్త జైలుపాలైన రోజున ఇక కష్టాలు తీరిపోయాయని భావించారామె.
కానీ, తన మాజీ భర్తకు పిల్లలను చూసే అవకాశం (పేరెంటల్ యాక్సెస్) లేకుండా చేయడానికి, యూకేలోని ఓ ఫ్యామిలీ కోర్టులో ఆయనకు మళ్లీ ఎదురుపడాల్సిన పరిస్థితి వచ్చిందామెకు. మాజీ భర్తకు శిక్షపడిన మూడో రోజే ఇది జరిగింది.
హింస, వేధింపులకు పాల్పడే భాగస్వాములకు పేరెంటల్ యాక్సెస్ లేకుండా చేయాలని పోరాడే వేలమందిలో బెక్కీ ఒకరు.
‘‘నాపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో నేను కో-పేరెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు'' అని ఆమె అన్నారు.
ఫ్యామిలీ కోర్టు సిస్టమ్ తాను అనుభవించిన వేదనలను పొడిగించిందంటూ ఆ భయంకర అనుభవాలను బెక్కీ వివరించారు.


ఫొటో సోర్స్, Getty Images
‘‘మళ్లీ వాళ్ల ముఖం చూడాల్సిన అవసరం ఉండొద్దు.. ’’
'1989 చిల్డ్రన్ యాక్ట్'కు 2014లో చేర్చిన నిబంధనల ప్రకారం, బాలల సంరక్షణ కేసులలో తల్లిదండ్రులు ఇద్దరి భాగస్వామ్యం బిడ్డ భవిష్యత్తుకు మేలు చేస్తుందని న్యాయమూర్తులు గట్టిగా నమ్మాలి. భాగస్వామిపై గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులలో ఇది వర్తిస్తుంది.
అయితే, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. ఈ నిబంధనను రద్దు చేయడానికి ప్రణాళికను ప్రకటించింది.
వేధింపులకు పాల్పడిన భాగస్వాములను జైలుకు పంపిన తర్వాత, ఫ్యామిలీ కోర్టుల్లో వారిని మళ్లీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండనే ఉండకూడదని బెక్కీ వాదిస్తున్నారు. ఈ చట్టాన్ని మార్చాలని కోరుతున్న ఉద్యమానికి ఆమె మద్దతిస్తున్నారు.
వేధింపులకు పాల్పడేవారిపై నేరం రుజువైన వెంటనే వారి నుంచి పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ అనే అవకాశాన్ని ఆటోమేటిక్‌గా తొలగించాలని ఆమె కోరుతున్నారు.
"అతను దోషిగా తేలినప్పటికీ, పిల్లలతో అతనికి సంబంధం ఉండకూడదని న్యాయమూర్తి ఒప్పుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఏ బాధితురాలికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటున్నా" అని బెక్కీ అన్నారు.
ఎనిమిది సంవత్సరాల పాటు వేధింపులు ఎదుర్కొన్న తర్వాత 2018లో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు బెక్కీ.
ఆమె మొదట్లో తన తల్లిదండ్రులతో నివసించినప్పటికీ, ఆర్థిక కారణాల వల్ల పిల్లలతో సహా తన భర్త ఇంటికి తిరిగి రావలసి వచ్చింది.
వేర్వేరు జీవితాలను గడుపుతున్నామని, విడాకుల ప్రక్రియ జరుగుతోందని, అదే సమయంలో భర్త రెండుసార్లు తనపై అత్యాచారం చేశారని బెక్కీ చెప్పారు.
2019లో ఫిర్యాదు చేసినా, 2022 వరకు అతనిపై అభియోగాలు మోపలేదు. యూకే న్యాయ వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా, ఆయన దోషిగా నిరూపణై శిక్ష పడేసరికి మరో రెండు సంవత్సరాలు పట్టింది.
2024లో కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధరించింది. ఆరు వారాల జైలుశిక్ష తర్వాత బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత బెక్కీ భర్త తన పిల్లలను కలుసుకోవడానికి ఫ్యామిలీ కోర్టు అనుమతి ఇచ్చింది.
‘‘నేను బాధలో ఉన్నాను. మరోపక్క విచారణ జరుగుతోంది. ఆ సమయంలోనే ఫ్యామిలీ కోర్టులో విచారణ కూడా ఎదుర్కోవాల్సిరావడం చాలా కష్టం’’ అని బెక్కీ అన్నారు.
‘‘వీడియో లింక్ ద్వారా అతనిని మళ్లీ చూడాల్సిరావడం, అతను చెప్పేవి వినాల్సి రావడం ఒక బాధితురాలిగా నా విషయంలో కరెక్ట్ కాదు" అని అన్నారు.
ఫ్యామిలీ కోర్టు విచారణ తనపైనా, పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపిందని ఆమె చెప్పారు.
‘‘మానసికంగా బాగానే ఉండేందుకు ప్రయత్నించాను. కానీ, బాగా లేని పరిస్థితి వచ్చినప్పుడు అది పిల్లలకు అర్ధమవుతుంది. వారు కూడా ఒకరకంగా బాధితులే. వారిపైనా అతని ప్రవర్తన ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపించింది'' అన్నారు బెక్కీ.
బెక్కీ భర్త దోషిగా నిర్ధరణ అయిన తర్వాత, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి తీర్పు ప్రకారం, జైలుశిక్ష ప్రారంభమయ్యాక జైలులో ఉన్న తండ్రిని చూడటానికి పిల్లలు వెళ్లవచ్చు.
కానీ, బెక్కీ దీనిపై అప్పీల్ కోర్టును ఆశ్రయించారు. ఆయన పేరెంటల్ రైట్స్‌ను పరిమితం చేయాలంటూ ఫ్యామిలీ కోర్టుకు కూడా వెళ్లవలసి వచ్చిందామె.

ఫొటో సోర్స్, Getty Images
చట్టంలో మార్పు....
2020 జూన్‌లో ప్రచురితమైన ప్రభుత్వ హామ్ ప్యానెల్ నివేదిక, గృహహింస కేసుల్లో పిల్లలను వారి తల్లి లేదా తండ్రితో సంబంధాన్ని కొనసాగించడానికి అనుమతించడం సరైందికాదని తేల్చింది.
ఈ నివేదిక వచ్చిన ఐదేళ్ల తర్వాత, ఇప్పుడు న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన రద్దు ప్రతిపాదన ప్రకారం, ఇలాంటి కేసుల్లో కోర్టులు డిఫాల్ట్‌గా పేరెంటల్ హక్కులు ఇవ్వాల్సిన పనిలేదు. కేవలం పిల్లల భద్రత, సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే, ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందో ఇంకా తెలియదు.
ఇటీవల విక్టిమ్స్ అండ్ కోర్ట్స్ బిల్లులో సవరణల కోసం జరిపిన క్యాంపెయిన్‌లో బ్రిటన్ లేబర్ ఎంపీ నటాలీ ఫ్లీట్ సక్సెస్ అయ్యారు.
ప్రస్తుతం కమిటీ దశలో ఉన్న ఈ కొత్త సిఫార్సులు, అత్యాచారం కారణంగా జన్మించిన పిల్లల విషయంలో ఆ నేరం రుజువైన, వేధింపులకు పాల్పడినవారి పేరెంటల్ రైట్స్‌ను పరిమితం చేస్తాయి.
ఏ పిల్లలపైనైనా తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడి, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలుశిక్ష పడినవారికి కూడా పేరెంటల్ రైట్స్ పరిమితమవుతాయి.
ఈ చట్టానికి అదనపు బలం 'జేడ్ చట్టం'. ఇది 2024లో వచ్చింది. తమ కుమార్తెను ఆమె భర్త హత్య చేసినా, వారి పిల్లల కోసం మృతురాలి తల్లిదండ్రులు అతనితో కలిసి కో-పేరెంట్‌గా వ్యవహరించాల్సి వచ్చిన సంఘటన నేపథ్యంగా పార్లమెంటు ఈ చట్టం తెచ్చింది.
ఇప్పుడు చట్టం ప్రకారం, తల్లిదండ్రులలో ఒకరు మరొకరిని హత్య చేస్తే, కోర్టు వారి పేరెంటల్ రైట్స్‌ను ఆటోమేటిక్‌గా పరిమితం చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
'పోరాడుతూ ఉండండి, వదిలిపెట్టకండి'....
ఇప్పుడేం చేయాలి అంటే.. ఈ బాధల నుంచి కోలుకునేలా తన పిల్లలకు సాయం చేయడం, తన జీవితాన్ని ఆశావహంగా ముందుకు సాగించడమేనని బెక్కీ చెప్పారు.
‘‘గృహ హింస నుంచి బయటపడిన, నాలాంటి స్థితిలో ఉన్న ఇతర బాధితులకు నేను చెప్పేది ఒక్కటే, 'పోరాడుతూ ఉండండి, వదిలిపెట్టకండి' అని'' అన్నారామె.
బాధితులు తమ అనుభవాలను బయటపెట్టేందుకు సాహసించడాన్ని తాము గుర్తిస్తున్నామని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
"పిల్లలను, గృహ హింస నుంచి బయటపడినవారికి మరింత హాని జరక్కుండా రక్షించేందుకు మేం కట్టుబడి ఉన్నాం'' అని ఆ ప్రతినిధి ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














