దుర్గాపూర్ అత్యాచారం కేసు: కస్టడీకి బాధితురాలి బ్యాచ్‌మేట్‌, పోలీసులు ఏం చెప్పారు?

దుర్గాపూర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇల్మా హసన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో పోలీసులు బాధితురాలితో చదువుతున్న ఒక విద్యార్థిని తమ కస్టడీకి తీసుకున్నారు.

మంగళవారం అరెస్టు చేసిన ఆ విద్యార్థిని బుధవారం పశ్చిమ బర్ధమాన్ కోర్టులో హాజరుపరిచారు.

అక్టోబర్ 10న కాలేజీ క్యాంపస్ బయట జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు.

అసన్‌సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌధరి దీనిపై మీడియాతో మాట్లాడారు. ‘‘సాంకేతిక ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఒక వ్యక్తి ఆమెపై శారీరకంగా, లైంగికంగా దాడికి పాల్పడ్డాడని మేం గుర్తించాం" అని పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటనపై పశ్చిమబెంగాల్‌ అధికార పక్షంపై ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తోంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దుర్గాపూర్ అత్యాచారం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సంఘటనా ప్రాంతంలో సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?

గతంలో అరెస్టు చేసిన ఐదుగురి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌధరి తెలిపారు. ఆ విద్యార్థిని స్నేహితుడు సంఘటన స్థలంలో ఉన్నాడని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

‘‘అతని పాత్ర ఏమిటన్నది కూడా ఆరా తీస్తున్నాం’’ అని చౌధరి అన్నారు.

బాధితురాలి నుంచి నిందితులు లాక్కున్న మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ తెలిపారు.

రిపోర్టుల ప్రకారం, బాధితురాలు తన స్నేహితుడితో కలిసి మెడికల్ కాలేజీ క్యాంపస్ నుండి బయలుదేరారు. నిందితుడు ఆ విద్యార్థినికి బ్యాచ్‌మేట్. ఈ సంఘటన కాలేజీకి బయట ఉన్న అటవీ ప్రాంతంలో జరిగింది. సంఘటన స్థలంలో ఉన్న వారందరి పాత్రలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

‘‘నేరం జరిగిన తీరును రీకన్‌స్ట్రక్ట్ చేయడం, టెక్నికల్‌గా, సైంటిఫిక్‌గా ఆధారాలు సేకరించడం, అక్కడ దొరికిన వస్తువుల స్వాధీనం, నిందితులు వైద్య పరీక్షలు సహా అన్ని దర్యాప్తు అంశాలు పూర్తయ్యాయి. రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం" అని పోలీస్ కమిషనర్ అన్నారు.

పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదని, తన కూతురిని ఒడిశాకు పంపాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ నెరవేరుతుందా అని జర్నలిస్టులు అడిగినప్పుడు, పోలీస్ కమిషనర్‌ను సమాధానం ఇవ్వలేదు.

దుర్గాపూర్ అత్యాచారం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సంఘటనా స్థలంలో పోలీసులు

రాజకీయ వివాదం

ఈ సంఘటన తర్వాత, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మాటల యుద్ధం ప్రారంభమైంది.

పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రత గురించి బీజేపీ నేతలు అధికార పక్షంపై విమర్శలు చేశారు. దర్యాప్తు నిష్పాక్షికతంగా జరగదంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇటు, ఒడిశా మహిళా కమిషన్ సభ్యురాలు ఊర్మిళా మహాపాత్ర మాట్లాడుతూ, "బాధితురాలు మెరుగైన చికిత్స పొందాలి, ఒడిశాకు రావడం ద్వారా ఇది సాధ్యమవుతుంది" అని అన్నారు.

బెంగాల్ ప్రభుత్వం శాంతిభద్రతలపై తగినంత శ్రద్ధ చూపడం లేదని ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సోవన మొహంతి ఆరోపించారు.

బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మాట్లాడుతూ, "బాధితురాలికి న్యాయం చేయడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటాం. బెంగాల్‌లో రెండో పునరుజ్జీవనాన్ని మేం కోరుకుంటున్నాం. బెంగాల్‌ను మహిళలకు సురక్షితమైన రాష్ట్రంగా మార్చాలి. ఇప్పుడు బెంగాల్ సేఫ్ అని చెప్పలేం" అని ఆయన అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ మహిళా నాయకులు మౌనంగా ఉన్నారని బీజేపీ ఆరోపించింది.

మరోవైపు, పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

దుర్గాపూర్ అత్యాచారం

ఫొటో సోర్స్, ANI

తండ్రి ఏమన్నారు?

అంతకుముందు, ఒడిశా విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, "రాత్రి 8 గంటల ప్రాంతంలో, ఒక విద్యార్థి తన స్నేహితులతో కలిసి మా అమ్మాయిని ప్రలోభపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు" అని ఆరోపించారు.

బాధితురాలి తండ్రి విలేఖరులతో మాట్లాడుతూ, "సీబీఐ దర్యాప్తు జరిపించడం మంచిది. కానీ ఇదంతా బెంగాల్ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది" అని అన్నారు.

"నేరస్థులకు కఠిన శిక్షపడాలని నేను కోరుకుంటున్నాను. నేను బెంగాల్ వదిలి ఒడిశా వెళ్తున్నాను. నా కూతురి భవిష్యత్తు నాశనం అయింది. 'సోనార్ బంగ్లా' ను 'సోనార్ బంగ్లా' గానే ఉండనివ్వండి. చాలా కలలు, ఆశలతో మా అమ్మాయిని డాక్టర్ చేయాలని ఇక్కడికి పంపాం. ఇప్పుడు ఆమెకు ఏం జరిగిందో చూడండి. మేం తిరిగి వెళ్లిపోతాం’’ అని ఆయన అన్నారు.

బాలికతో కలిసి చదువుకున్న విద్యార్థి అరెస్టు గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ, ‘‘ దీనికి అతనే బాధ్యుడని నేను చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు దర్యాప్తు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని అన్నారు.

అక్టోబర్ 11న కాలేజీ విడుదల చేసిన సీసీ కెమెరా వీడియోలో బాధితురాలు తన స్నేహితుడితో కలిసి సాయంత్రం 7:58 గంటలకు క్యాంపస్ నుండి బయటకు వెళ్లారు.

తన మొబైల్ ఫోన్ పోయిందని, క్యాంపస్ బయట తనపై దాడి జరిగిందని కాలేజీ హాస్టల్‌కు తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)