'తాగడం మానేస్తానని, ఇకనుంచి కొట్టనని ప్రామిస్ చేసేవాడు', చివరికి..

ఈవ్ గ్రాహం
ఫొటో క్యాప్షన్, ఈవ్ గ్రాహం
    • రచయిత, ఎలిడ్ డేవిస్, నికోలా రూథర్‌ఫర్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఈవ్ గ్రాహమ్ దాదాపు 50 ఏళ్లు తన భర్త పెట్టే శారీరక, మానసిక వేధింపుల్ని భరించారు.

ఆయన ఒకసారి ఆమెను ఓడరేవు నుంచి సముద్రంలోకి తోసేశారు. మరోసారి ఆమె ముక్కును గట్టిగా కొరికి గాయపరిచారు.

కానీ, తమ పిల్లల కోసం ఆ బంధాన్ని భరించినట్లు ఆమె చెప్పారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన చేతిలోనే ఉండటంతో తాను అక్కడ ఇరుక్కుపోయానని ఆమె అన్నారు.

తనకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించే వెల్డింగ్, శిల్పకళను మొదలుపెట్టిన తర్వాత, పోలీసులను ఆశ్రయించే ధైర్యం వచ్చిందని అన్నారు.

తన అనుభవాన్ని అందరితో పంచుకోవడం వల్ల గృహ హింసకు గురయ్యే ఇతర బాధితులు తనలా సహాయం కోసం బయటకు వస్తారని ఆమె భావిస్తున్నారు.

ఆమె భర్త పేరు విలియం మెక్‌డోనల్డ్. ప్రస్తుతం ఆమె భర్త రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

1975-2022 మధ్యకాలంలో ఈవ్ జీవితానికి ప్రమాదం కలిగించేలా తీవ్రమైన దాడి, బెదిరింపులకు పాల్పడిన కేసులో 76 ఏళ్ల విలియంను జ్యూరీ దోషిగా నిర్ధరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈవ్ గ్రాహం

‘జీవితం నరకప్రాయం’

తాగితే తన భర్త హింసించేవాడని, తన జీవితం నరకప్రాయంలా అనిపించేదని 67 ఏళ్ల ఈవ్ చెప్పారు.

ఒకసారి వంటగదిలో గొడవ జరిగినప్పుడు విలియం తన ముఖాన్ని కొరికాడని బీబీసీతో ఆమె అన్నారు.

''నా మీదకు టవల్ విసిరాడు. తర్వాత నా ముక్కు కొరికాడు. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది. ఇక నేను దీన్ని భరించలేను అని చెప్పేదాన్ని. నువ్వేం చెప్పినా ఎవరూ నమ్మరని అనేవాడు. జీవితాంతం తీవ్రమైన బాధ, ఒత్తిడి వల్ల నాకు అయిదుసార్లు మూర్ఛ వచ్చింది. చాలా భయపడేదాన్ని. నాకు నత్తి రావడం మొదలైంది'' అని ఆమె వివరించారు.

'ఆయనను ప్రేమించాను, అందుకే నమ్మాను'

70లలో గృహ హింస పట్ల ప్రజల వైఖరి చాలా భిన్నంగా ఉండేదని ఆమె అన్నారు.

''అప్పట్లో మహిళలకు, బాధిత కుటుంబాలకు ఎలాంటి మద్దతు ఉండకపోయేది. అతని గురించి అందుకే నేను ఎవరికీ చెప్పలేదు. పిల్లల ఉన్న మహిళలు వివాహ బంధం నుంచి బయటపడటం ఇంకా కష్టం.

తాగడం మానేస్తానని, ఇకనుంచి కొట్టనంటూ ప్రామిస్ చేసేవాడు. ఆయనను నేను ప్రేమించాను. అందుకే నమ్మాను. కొన్నిసార్లు మానసికంగా హింసించేవాడు. డబ్బంతా ఆయన చేతిలోనే ఉండేది. నేను ఇరుక్కుపోయాను'' అని ఆమె వివరించారు.

ఈవ్ గ్రాహం

లోహాలతో శిల్పాలు...

స్కాట్లాండ్ సరిహద్దుల్లోని ట్రాక్వైర్ హౌస్‌కు వెళ్లడంతో తన జీవితం మారిపోయిందని ఆమె చెప్పారు.

వెల్డింగ్ ఎలా చేయాలో నేర్చుకుని, స్క్రాప్ మెటల్‌తో శిల్పాలను తయారు చేయడం ప్రారంభించారు. ఆ కళలో ఆమె ప్రతిభను అందరూ మెచ్చుకోవడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆమె లోహంతో చేసిన కళాఖండాల్లో మిడత, డైనోసార్ వంటివి ఉన్నాయి. తాను తయారు చేసిన వాటిలో కొన్నింటిని ఆమె అమ్ముకుని డబ్బు సంపాదించారు.

''నా శిల్పాలు ప్రజలకు నచ్చుతున్నాయి. ఇక నేను ఆర్థికంగా స్వతంత్రంగా మారగలనని అనుకున్నా. వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ధైర్యం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆయనకు శిక్ష పడింది. నాకు న్యాయం జరిగింది'' అని ఆమె చెప్పారు.

గ్రాహం

‘గృహ హింస బారిన పడితే సహాయం కోరండి’

''నాలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి నేను చెప్పేది ఏంటంటే, మీ పరిస్థితి గురించి ఎవరికైనా చెప్పండి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. సహాయాన్ని కోరండి. 40 ఏళ్లు భరించిన తర్వాత కూడా ఆ హింస నుంచి మీరు బయటపడగలరని చెప్పడానికి నేనే ఒక సజీవ సాక్ష్యం'' అని ఆమె సూచించారు.

తాను అనుభవించిన జీవితాన్ని పట్టించుకోకుండా, ఇప్పుడు పూర్తిగా భవిష్యత్తుపై దృష్టి సారిస్తున్నానని గ్రాహం చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)