ఇండియా వర్సెస్ పాకిస్తాన్: క్రికెట్‌లో 'హ్యాండ్‌షేక్' సంప్రదాయమా? లేక నియమమా?

భారత్, పాకిస్తాన్, ఆసియా కప్, షేక్‌హ్యాండ్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఆటపై రాజకీయాల ప్రభావం కూడా ఉంది.

ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొన్న వివాదాలు పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా ద్వారా చాలామంది దృష్టిని ఆకర్షించాయి.

ఆదివారం జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడనున్నాయి.

ఈ నెల 14న దుబయిలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.

ఈ విజయాన్ని భారత క్రికెట్ అభిమానులు సంబరంలా జరుపుకొన్నారు. అదే సమయంలో ఈ మ్యాచ్‌పై ఓ వివాదం కూడా తలెత్తింది.

టాస్ వేసిన తర్వాత, మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత క్రికెటర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు.

దీనిపై అసంతృప్తి వ్యక్తంచేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించింది.

పహల్గాం బాధితులకు సంఘీభావం తెలిపేందుకు ఇలా చేసినట్టు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. కానీ షేక్‌హ్యాండ్ వివాదం అక్కడితో ముగియలేదు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, మ్యాచ్ రిఫరీ పాత్ర పైనా ప్రశ్నలు తలెత్తాయి. వారు పరిస్థితిని సరిగ్గా నియంత్రించారా లేదా అన్న ప్రశ్నలు వినిపించాయి.

దీనిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. జరిగింది సరైనదేనా? క్రీడాకారులు రాజకీయ వివాదాల్లో భాగమవ్వాలా? లేదా దేశంతో పాటు వారి మనోభావాలను గౌరవించాలా? వంటి ప్రశ్నలు వినపడుతున్నాయి.

క్రికెట్‌లో స్పాన్సర్లు,డబ్బు సమస్యలు చాలా పెద్దవిగా మారాయా అనే ప్రశ్న కూడా తలెత్తింది. అలాగే ఈ వివాదంలో భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల పాత్రను ఎలా చూడాలి?

బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ 'ది లెన్స్'లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేశ్ శర్మ ఈ అంశాలన్నింటినీ చర్చించారు.

ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ మ్యాగజీన్.. మాజీ క్రికెటర్, కోచ్ విజయ్ దహియా, సీనియర్ జర్నలిస్ట్‌లు అయాజ్ మెమన్, నీరూ భాటియా పాల్గొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, పాకిస్తాన్, ఆసియా కప్, షేక్‌హ్యాండ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గత మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోకపోవడంపై వివాదం తలెత్తింది.

నో హ్యాండ్‌షేక్ వివాదం: సంప్రదాయమా లేదా నియమమా?

ఆదివారం (సెప్టెంబర్ 14) భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభానికి ముందు, తర్వాత ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు.

టాస్ సమయంలో కూడా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు.

టాస్ సమయంలో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవద్దని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ రెండు జట్ల కెప్టెన్లను కోరారని పాకిస్తాన్ ఆరోపించింది. దీనిపై పాకిస్తాన్ ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది.

మ్యాచ్ రిఫరీని తొలగించకపోతే యూఏఈతో జరిగే మ్యాచ్‌లో ఆడబోమని కూడా పాకిస్తాన్ బెదిరించింది. దీంతో బుధవారం పాకిస్తాన్, యూఏఈ మధ్య ఆసియా కప్ నాకౌట్ మ్యాచ్ ఆలస్యంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచింది.

"సంప్రదాయం, నియమాల మధ్య వ్యత్యాసం ఉంది. మ్యాచ్ రిఫరీ విషయానికొస్తే, ఏదైనా నియమాన్ని పాటించకపోతే మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకుంటాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటారు. అయితే అది నియమం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇతర జట్ల మధ్య కూడా ఇలాంటివి చాలా జరిగాయి" అని కరచాలనం వివాదంపై మాజీ క్రికెటర్, కోచ్ విజయ్ దహియా అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ రిఫరీ ఏం చేయకపోవడం వల్లే ఈ సమస్య పెద్దదైందని విజయ్ దహియా అన్నారు.

''నియమాలు ఉన్నప్పుడే మ్యాచ్ రిఫరీలు సీన్‌లోకి వస్తారు" అని అన్నారు.

పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్ ఒప్పుకోవడం పెద్ద దుమారం సృష్టించిందని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ మ్యాగజీన్ అభిప్రాయపడ్డారు.

"ఒకవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌తో పోరాడతామని చెబుతున్నాం, మరోవైపు క్రికెట్ ఎందుకు ఆడుతున్నాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆడటానికి అంగీకరించడం ఆశ్చర్యంగా ఉంది" అని ప్రదీప్ అన్నారు.

" ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌లో ఆడుతున్నాం. ఆడనంటే అంతటితో అయిపోయేది. ఆడడానికి ఒప్పుకుని ఇలా చేయాలా? ఇదే పెద్ద ప్రశ్న" అని ఆయన అన్నారు.

భారత్, పాకిస్తాన్, ఆసియా కప్, షేక్‌హ్యాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాచ్‌కు ముందూ, తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్, క్రికెటర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు.

భారత ఆటగాళ్లపై ఒత్తిడి ఉందా?

ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లపై ఒత్తిడి ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తికి వారి సొంత భావాలు ఉంటాయని, వాటిని వ్యక్తపరచగలరని అంటున్నారు.

భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం భారత క్రికెటర్లపై ఒత్తిడి పెంచిందని సీనియర్ జర్నలిస్ట్ నీరూ భాటియా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వారిని వెళ్లి ఆడమని ఆదేశించిందని, అందుకే వారు ఆడారని ఆమె అన్నారు.

"పాకిస్తాన్ జట్టుతో ఎక్కువ స్నేహంగా ఉండొద్దని భారత ఆటగాళ్లపై ఒత్తిడి ఉంది. సాధారణంగా, ఇతర టోర్నమెంట్లలో లేదా రెండు దేశాల మధ్య సంబంధాలు బాగున్నప్పుడు భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారు, మాట్లాడుకుంటారు" అని నీరూ భాటియా అన్నారు.

"మ్యాచ్ ఆడడం మంచి విషయం అని నేను భావిస్తున్నా. భారత్ మ్యాచ్ గెలిచింది, అది చాలా బాగుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రకటన కూడా చేశారు. తర్వాత షేక్‌హ్యాండ్ ఇచ్చుకోకపోవడం ఆటగాళ్లకు అతిపెద్ద అవమానం అని నేననుకుంటున్నా. ఎందుకంటే ఆటగాళ్లు ఏం చేశారు? భారత ఆటగాళ్లు లేదా పాకిస్తాన్ క్రికెటర్లని కాదు, ఇది రాజకీయ వివాదం, వారికి ఇందులో పాత్ర లేదు. షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటే, స్థానాలేవీ మారవు" అని సీనియర్ జర్నలిస్టు అయాజ్ మెమన్ అభిప్రాయపడ్డారు.

భారత్, పాకిస్తాన్, ఆసియా కప్, షేక్‌హ్యాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ రిఫరీ క్షమాపణ చెప్పాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది.

మ్యాచ్ ఆలస్యంపై ఎందుకు సమాచారమివ్వలేదు?

ఆసియా కప్‌లో భాగంగా బుధవారం(సెప్టెంబరు 17) సాయంత్రం పాకిస్తాన్ జట్టు షెడ్యూల్ సమయానికి స్టేడియంకు చేరుకోకపోవడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తుందని కొన్ని చానెళ్లలో వార్తలొచ్చాయి.

బోర్డు, ఐసీసీ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ గంటసేపు వాయిదా పడిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి అమీర్ మీర్ తర్వాత విలేకరులతో చెప్పారు.

భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం వల్లే ఇదంతా జరిగిందని, దానిని కప్పిపుచ్చడానికే ఈ వ్యవహారం తెరపైకి వచ్చిందని సీనియర్ జర్నలిస్ట్ నీరు భాటియా అభిప్రాయపడ్డారు.

షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం అంటే నిరసనను వ్యక్తం చేస్తున్నారని అర్థమని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ అంటున్నారు.

"పాకిస్తాన్ చేయగలిగిన స్థాయిలో ఫిర్యాదు చేసింది. కానీ మ్యాచ్ ఆలస్యంగా ఎందుకు ప్రారంభించారనేది నా అవగాహనకు అందని విషయం. పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తుందని న్యూస్ చానళ్ల ద్వారా తెలుసుకున్నాం. కానీ గంట ఆలస్యం ఎందుకు జరిగిందో అధికారికంగా ఎవరూ ఏమీ చెప్పడం లేదు" అని ప్రదీప్ అభిప్రాయపడ్డారు.

"ఆటగాళ్లు యుద్ధం చేయడానికి వెళ్ళారా లేదా మ్యాచ్ ఆడటానికి వెళ్ళారా అన్నది అర్థం చేసుకోవడం కష్టమనిపించే పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ జరుగుతోంది" అని ఆయన చెప్పారు.

"చాలాసార్లు ఇలాంటివి మొదటిసారి జరుగుతాయి. ఆ తర్వాత కూడా, అనేక నియమాలు రూపొందుతాయి లేదా వాటిని ఐసీసీ పరిశీలిస్తుంది" అని మాజీ క్రికెటర్, కోచ్ విజయ్ దహియా అన్నారు.

"ఐసీసీ లేదా ఏసీసీ నియమించిన అధికారులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే, వారు ఆ అంశాలను పరిశీలించి, వాటిని దృష్టిలో ఉంచుకుని, మ్యాచ్ రిఫరీలు వారికి అప్పగించిన పని చేశారని భావించి ఉండొచ్చు" అని ఆయన అన్నారు.

"ఎవరినైనా వెళ్లి షేక్‌హ్యాండ్ ఇవ్వమని చెప్పడం ఆయన పని కాదు" అని విజయ్ దహియా అన్నారు.

"మ్యాచ్ రిఫరీపై ఫిర్యాదు సమయంలో పీసీబీ చెప్పిన కొన్ని విషయాలు, వారి వాదనకు బలం చేకూర్చడానికి బదులు బలహీనపరిచింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్, పాకిస్తాన్, ఆసియా కప్, షేక్‌హ్యాండ్

ఫొటో సోర్స్, Reuters

క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెడుతున్నారా?

భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు క్రికెట్‌ను రాజకీయాలకు ఉపయోగిస్తాయని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ అభిప్రాయపడ్డారు.

ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్‌లో భారత ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ నీరూ భాటియా అన్నారు. "క్రికెట్‌లో డబ్బు ఉంటుంది. రాజకీయ నాయకులూ ఉంటారు. కాబట్టి, పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారుతుంది" అని ఆమె అన్నారు.

ఇది ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఒక విధంగా వారిని శాంతికి, యుద్ధానికి ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. శాంతి కోసం, ఒకరినొకరు కౌగిలించుకుని రమ్మని వారితో చెబుతారు యుద్ధం కోరుకుంటే, ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకుని రమ్మని చెబుతారు. కాబట్టి, ఈ ఆటను రాజకీయాలకు దూరంగా ఉంచడం చాలా కష్టం. భవిష్యత్తులో ఒకరితో ఒకరు మ్యాచ్‌లు ఆడటానికి ఇష్టపడకపోవచ్చు" అని ప్రదీప్ అన్నారు.

"ఈ మ్యాచ్‌లో ఒకవేళ పాకిస్తాన్ గెలిచి, వారు ఈ విషయాలు చెప్పి ఉంటే, భారత్ ఎలా స్పందించేది? కాబట్టి భారత అభిమానులు కూడా ఆటను ఆటలాగే చూడాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆటను రాజకీయాలతో కలిపితే ఇలాగే జరుగుతుంది" అని ఆయన అన్నారు.

ఆసియా కప్ భవిష్యత్తులో జరుగుతుందా లేదా, జరిగితే ఎలా జరుగుతుందో తెలియదని సీనియర్ జర్నలిస్ట్ అయాజ్ మెమన్ ఆందోళన వ్యక్తం చేశారు. "ఆసియా కప్‌లో అత్యుత్తమ మ్యాచ్, అతిపెద్ద మ్యాచ్, భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ జరగడంపైనే సందేహాలుంటే ఆసియా కప్ నిర్వహించడంలో అర్ధముందా?'' అని ఆయన ప్రశ్నించారు.

"ఇది కాకుండా, వచ్చే టీ20 ప్రపంచ కప్ భారతదేశంలో జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు కూడా ఇక్కడికి వస్తుంది. భారత్ ఎలా ప్రవర్తిస్తుందో, ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో మనం చూడాలి" అని మెమన్ అన్నారు.

కొంతమంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లు వివాదాన్ని సోషల్ మీడియాలో మరింత పెంచుతున్నారని ఆయన ఆరోపించారు.

"సోషల్ మీడియాలో, ముఖ్యంగా రిటైర్డ్ క్రికెటర్లలో ఎక్కువమంది, భారత్, పాకిస్తాన్ గురించి మాట్లాడితే, అగ్నికి ఆజ్యం పోసేలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని మెమన్ విమర్శించారు.

"క్రికెట్ సమాజంలో ఒక భాగం, సమాజం క్రికెట్‌లో భాగం కాదు" అని విజయ్ దహియా అన్నారు.

''ఏ ఆటగాడైనా మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, అతని మనసులో ఉండే ఏకైక విషయం, మునుపటి మ్యాచ్ కంటే ఎలా మెరుగ్గా రాణిస్తాననేదే'' అని విజయ్ దహియా విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)