చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్ భారత్, ఫైనల్లో న్యూజీలాండ్‌పై గెలుపు

ఫొటో సోర్స్, Getty Images
టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
దుబయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజీలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది.
న్యూజీలాండ్ విధించిన 252 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది.
టోర్నీ చరిత్రలో భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం ఇది మూడోసారి.
గతంలో 2002, 2013 సంవత్సరాల్లోనూ ఈ టైటిల్‌ను అందుకుంది.
కెప్టెన్ రోహిత్ శర్మ (76) అర్ధసెంచరీతో టాప్‌స్కోరర్‌గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నారు.
శ్రేయస్ అయ్యర్ (48) రాణించాడు.
చివర్లో కేఎల్ రాహుల్, జడేజా సత్తా చాటడంతో భారత్ మరో ఐసీసీ టైటిల్ విజేతగా నిలిచింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది.
రచిన్ రవీంద్రకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
ఫైనల్లో రచిన్ 37 పరుగులు చేశాడు.
75 పరుగులకే టాపార్డర్ కూలినప్పటికీ డరైల్ మిచెల్ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), బ్రేస్‌వెల్ (40 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, జడేజా తలా ఓ వికెట్ పడగొట్టారు.


ఫొటో సోర్స్, Getty Images
రోహిత్ శర్మ దూకుడు
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రోహిత్ ధాటి మొదలైంది.
జేమీసన్ బౌలింగ్‌లో రెండో బంతికే రోహిత్ సిక్సర్ కొట్టాడు.
గిల్‌కు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా తానే స్ట్రయికింగ్ తీసుకున్నాడు.
రూర్కీ బౌలింగ్‌లోనూ రెండు ఫోర్లు బాదాడు.
స్మిత్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకొని చెలరేగాడు.
అతను వేసిన ఆరో ఓవర్‌లో ఒక భారీ సిక్సర్‌తో ఆకట్టుకున్న రోహిత్, ఎనిమిదో ఓవర్‌లో ఒక సిక్సర్ మరో రెండు బౌండరీలతో 14 పరుగులు రాబట్టాడు.
ఈ దశలో రోహిత్ ఎదుర్కొన్న బంతులు 35 కాగా గిల్ ఆడిన బంతులు 13 మాత్రమే.
గిల్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేయగా, రోహిత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దీంతో 10 ఓవర్లకు భారత్ వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది.
శాంట్నర్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన రోహిత్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
తగ్గని జోరు
అర్ధసెంచరీ తర్వాత కూడా రోహిత్ జోరు తగ్గలేదు. వీలుకుదిరినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.
రచిన్ రవీంద్ర బౌలింగ్‌లోనూ ఒక ఫోర్ బాదాడు.
ఎట్టకేలకు 14వ ఓవర్ చివరి బంతికి గిల్ కూడా సిక్సర్‌తో అలరించాడు.
మిడిల్ ఓవర్లలో న్యూజీలాండ్ స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు ఇబ్బంది పడిందని, భారత టాపార్డర్ స్ట్రయిక్ రొటేట్ చేయడంలో దిట్ట అని భారత బ్యాటింగ్ సందర్భంగా బీబీసీ రేడియో 5 స్పోర్ట్స్ ఎక్స్‌ట్రా కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నారు.
2022 నుంచి వన్డేల్లో చూస్తే మొదటి 10 ఓవర్లలో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ 68 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నారని క్రిక్‌విజ్ అనలిస్ట్ విక్రమ్ చంద్రశేఖరన్ వెల్లడించారు. రోహిత్ తర్వాత ముహమ్మద్ వసీమ్ (36), ట్రావిస్ హెడ్ (28), డేవిడ్ వార్నర్ (26) ఈ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు.
రోహిత్, గిల్ నిలకడగా పరుగులు చేయడంతో 17 ఓవర్లలో భారత స్కోరు 100కు చేరింది.
ఈ దశలో భారత బ్యాటర్లు తప్పిదాలు చేస్తే తప్ప న్యూజీలాండ్‌కు వికెట్లు దక్కేలా లేవంటూ బీబీసీ సౌండ్స్ కార్యక్రమంలో న్యూజీలాండ్ మాజీ సీమర్ సిమోన్ డౌల్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిలిప్స్ సూపర్‌మ్యాన్ ఫీట్, గిల్ అవుట్
భారత్ 105 పరుగుల స్కోరు వద్ద గిల్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది.
శాంట్నర్ బౌలింగ్‌లో ఫిలిప్స్ పట్టిన అద్భుత క్యాచ్‌కు గిల్ అవుటయ్యాడు.
గిల్ 50 బంతుల్లో 1 సిక్స్ సహాయంతో 31 పరుగులు చేశాడు.
గ్లెన్ ఫిలిప్స్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ అందుకోవడంతో గిల్ అవుటయ్యాడు.
వెంటనే భారత్‌కు మరో షాక్ తగిలింది.
వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ (1) ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.
కోహ్లీ కేవలం 2 బంతులే ఎదుర్కొన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
క్రీజును వదిలి రోహిత్ అవుట్
కోహ్లీ అవుటయ్యాక శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ఒక బౌండరీ బాదాడు.
తర్వాత భారత ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది.
22వ ఓవర్ నుంచి వరుసగా 6 ఓవర్లలో ఒక బౌండరీ కూడా లేకుండా కేవలం 9 పరుగులే చేసి కీలకమైన రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది.
రచిన్ రవీంద్ర వేసిన 27వ ఓవర్ తొలి బంతికి క్రీజును వదిలి ఆడేందుకు రోహిత్ శర్మ ముందుకు రావడంతో బంతిని అందుకున్న వికెట్ కీపర్ లాథమ్ వికెట్లను గిరాటేశాడు. దీంతో 76 పరుగుల వద్ద రోహిత్ వెనుదిరిగాడు.
రోహిత్ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అప్పటికి భారత్ స్కోరు 122/3.
శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ 61 పరుగుల భాగస్వామ్యం
రోహిత్ అవుటయ్యాక అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ జాగ్రత్తగా ఆడారు.
ఎక్కువగా సింగిల్స్ తీస్తూ ఒక్కో పరుగు జోడించారు. మధ్యమధ్యలో శ్రేయస్ ఒకట్రెండు భారీ షాట్లు ఆడాడు. రెండు సిక్సర్లు బాదాడు.
ఒకసారి అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
37వ ఓవర్‌లో ఫిలిఫ్స్ బౌలింగ్‌లో శ్రేయస్ షాట్ ఆడగా లాంగాన్‌లో జేమీసన్ క్యాచ్‌ను జారవిడిచాడు. జేమీసన్ చేతిలోకి వచ్చి బంతి జారిపోయి కిందపడింది. అప్పుడు శ్రేయస్ 44 పరుగులతో ఉన్నాడు.
మరోవైపు అప్పటివరకు కాస్త ఇబ్బందిపడిన అక్షర్ పటేల్ తాను ఎదుర్కొన్న 34వ బంతికి ఒక ఫోర్ బాది బౌండరీల ఖాతా తెరిచాడు.
అర్ధసెంచరీకి 2 పరుగుల దూరంలో శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు.
శాంట్నర్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌తో అక్షర్‌తో కలిసి శ్రేయస్ 61 పరుగులు జోడించాడు.
అయ్యర్ 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు.
40 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 191/4.
ఈ దశలో భారత్ విజయానికి 60 బంతుల్లో 61 పరుగులు చేయాలి.
కేఎల్ రాహుల్ క్రీజులోకి రాగా, అక్షర్ పటేల్ (29) అవుటయ్యాడు.
హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) చివరి వరకు నిలవలేకపోయాడు.
అయితే జడేజా సహకారంతో కేఎల్ రాహుల్ జట్టును గెలిపించాడు.

ఫొటో సోర్స్, Getty Images
‘టాస్’లో రోహిత్ రికార్డు
కెప్టెన్‌గా వన్డేల్లో రోహిత్ శర్మ ఒక అనవసరపు రికార్డును మూటగట్టుకున్నాడు.
2023 నుంచి ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయి అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా సరసన నిలిచాడు.
బ్రియాన్ లారా కూడా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు.
1998-99 కాలంలో బ్రియాన్ లారా, 2023-25 వ్యవధిలో రోహిత్ శర్మ వరుసగా వన్డేల్లో టాస్ ఓడిపోయారు.
ఇక మరో వన్డేలో కూడా రోహిత్ టాస్ గెలవకపోతే లారాను వెనక్కి నెట్టి ఎక్కువసార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా అగ్రస్థానంలో నిలుస్తాడు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది.
75 పరుగులకే టాపార్డర్ కూలినప్పటికీ డరైల్ మిచెల్ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), బ్రేస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, జడేజా తలా ఓ వికెట్ పడగొట్టారు.
మొదటి 10 ఓవర్లు..
టాస్ గెలిచిన న్యూజీలాండ్ బ్యాటింగ్‌కు దిగి తొలి పది ఓవర్ల పాటు భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సమయంలో విల్ యంగ్ (15) వికెట్ కోల్పోయినప్పటికీ, రచిన్ రవీంద్ర భయపెట్టాడు.
షమీ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టగా, విల్ యంగ్ బౌండరీతో ఖాతా తెరిచాడు.
తర్వాత రెండు ఓవర్ల పాటు సంయమనం పాటించిన రచిన్ రవీంద్ర, హార్దిక్ వేసిన నాలుగో ఓవర్‌లో బ్యాట్ ఝళింపిచడం మొదలుపెట్టాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో పాటు మరో బౌండరీ కొట్టి ఆ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టాడు.
షమీ వేసిన మరుసటి ఓవర్‌లోనూ వరుసగా రెండు బౌండరీలు బాదాడు.
ఓవరాల్‌గా మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లు భారత్ అనుకున్నట్లుగా మ్యాచ్ జరుగలేదు.
రచిన్ రవీంద్ర క్యాచ్ రెండుసార్లు మిస్సవ్వడం, వైడ్ బాల్స్ పడటం వంటివి కెప్టెన్ రోహిత్ శర్మను కలవరపరిచాయి.
పైగా ఆరో ఓవర్‌లో రచిన్ క్యాచ్‌ను అందుకోబోతూ షమీ గాయపడ్డాడు.

ఫొటో సోర్స్, Getty Images
రచిన్ రవీంద్రకు రెండుసార్లు అదృష్టం
వరుణ్ వేసిన తర్వాతి ఓవర్ మొదటి బంతికే రచిన్ అవుటయ్యాడంటూ అప్పీల్ చేయడం, అంపైర్ అవుటివ్వడం, రివ్యూలో అది వైడ్ అని తేలడంతో నిరాశే ఎదురైంది.
మరుసటి బంతికే డీప్ మిడ్ వికెట్‌లో రచిన్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ వదిలేశాడు. ఈ పరిణామాలతో భారత్ కాస్త ఒత్తిడికి గురైంది.
కానీ, 'మిస్టరీ స్పిన్నర్'గా పేరున్న వరుణ్ చక్రవర్తి కాసేపటికే విల్ యంగ్‌ను అవుట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి తీసుకుంది.
రచిన్‌కు విలియమ్సన్ జత కలవడంతో 10 ఓవర్లకు న్యూజీలాండ్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది.
న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో సెమీస్‌లో విలియమ్సన్, రచిన్ చెరో సెంచరీలు సాధించి జోరు మీదున్నారు.
రచిన్ అవుటైన క్షణం
కెప్టెన్ రోహిత్ శర్మ తొలి 10 ఓవర్ల వరకు స్పిన్నర్ కుల్దీప్‌కు బంతి ఇవ్వలేదు.
11వ ఓవర్‌లో బంతి అందుకున్న కుల్దీప్ తన తొలి బంతికే క్రీజులో కుదురుకున్న రచిన్ రవీంద్రను అవుట్ చేసి న్యూజీలాండ్‌కు షాకిచ్చాడు.
కుల్దీప్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 69 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది న్యూజీలాండ్.
రచిన్ అవుట్‌తో మ్యాచ్‌పై భారత్ కాస్త పట్టు సాధించినట్లుగా కనిపించింది. డారిల్ మిచెల్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
కాసేపటికే కుల్దీప్ భారత్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
విలియమ్సన్ ఎలా అవుటయ్యాడంటే...
కుల్దీప్ తెలివిగా రాంగన్ బాల్ సంధించి విలియమ్సన్‌ను బోల్తా కొట్టించాడని క్రిక్‌విజ్ అనలిస్ట్ విక్రమ్ చంద్రశేఖరన్ విశ్లేషించారు.
ఆ బంతిని ఫ్లిక్ చేసిన విలియమ్సన్ కుల్దీప్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విలియమ్సన్ 14 బంతుల్లో 11 పరుగులే చేశాడు. అప్పటికి న్యూజీలాండ్ స్కోరు 75/3.
కుల్దీప్ అప్పటివరకు సంధించిన బంతుల్లో విలియమ్సన్‌ను అవుట్ చేసిన బంతి స్లోయెస్ట్ డెలివరీ (50.9 ఎంపీహెచ్)ని అని విక్రమ్ వెల్లడించారు.
తర్వాత వచ్చిన టామ్ లాథమ్ (14) కూడా ఎక్కువసేపు నిలవలేదు.
ఈ దశలో డరైల్ మిచెల్ (63), గ్లెన్ ఫిలిప్స్ (34) జట్టును ఆదుకున్నారు.
వీరిద్దరూ ఆచితూచి ఆడారు. అప్పుడప్పుడు ఫిలిప్స్ బౌండరీలు బాదేందుకు ప్రయత్నించినా, మిచెల్ మాత్రం సింగిల్స్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు.
వ్యక్తిగత స్కోరు 38 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ అందుకోలేకపోయాడు.
మరుసటి ఓవర్‌లో గిల్ కూడా ఫిలిప్స్ క్యాచ్‌ను చేజార్చాడు.
బ్రేస్‌వెల్ అజేయ అర్ధసెంచరీ
వరుణ్ చక్రవర్తి, ఫిలిప్స్‌ను అవుట్ చేయడంతో 87 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం విడిపోయింది. కివీస్ ఇన్నింగ్స్‌లో వీరిదే అత్యధిక భాగస్వామ్యం.
తర్వాత బ్రేస్‌వెల్ జతగా డరైల్ మిచెల్ అర్ధసెంచరీ సాధించాడు.
91 బంతుల్లో మిచెల్ అర్ధసెంచరీ పూర్తయింది.
తర్వాత బ్రేక్‌వెల్ కాస్త జోరు చూపగా, షమీ బౌలింగ్‌లో మిచెల్ రెండు బౌండరీలు బాది అవుటయ్యాడు. మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్ వద్ద రోహిత్ అందుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన శాంట్నర్ (8) తక్కువ పరుగులకే రనౌట్ అయ్యాడు.
స్మిత్‌తో కలిసి అర్ధసెంచరీ పూర్తి చేసిన బ్రేస్‌వెల్ అజేయంగా ఇన్నింగ్స్‌ను ముగించాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














