ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం: ఒకరి మృతదేహం వెలికితీత

గురుప్రీత్ సింగ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గురుప్రీత్ సింగ్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - ఎస్ఎల్బీసీ) సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మందిలో గురుప్రీత్ సింగ్ అనే ఎరక్టర్ ఆపరేటర్ మృతదేహాన్ని ఆదివారం కనుగొన్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపినట్టు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి బీబీసీకి చెప్పారు.

‘‘ఇవాళ జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఒక మృతదేహాన్ని గుర్తించి బయటికి తీసుకు వచ్చినట్టుగా’’ సహాయక సిబ్బంది ఒకరు బీబీసీకి చెప్పారు. ఆ మృతదేహం గురుప్రీత్ సింగ్ అనే టీబీఎం ఆపరేటర్‌ది’’ అని సహాయక సిబ్బంది బీబీసీతో అన్నారు.

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

గురుప్రీత్ సింగ్ పంజాబ్‌లో తర్న్ తరన్ జిల్లాకు చెందినవారు. ఆయన అమెరికా కంపెనీ రాబిన్స్‌లో ఎరక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు.

సొరంగంలో చిక్కుకుపోయినవారి ఆచూకీ కోసం కేరళ నుంచి తెప్పించిన కడవార్ జాగిలాలు మానవ అవశేషాలు ఉన్న ఓ ప్రాంతాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు.

సొరంగంలో చిక్కుకుపోయిన వారిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్‌తో మరో ఆరుగురు ఉన్నారు. వీరిలో ఆరుగురు జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీకి చెందిన వారు కాగా, ఇద్దరు రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన వారు.

వీరంతా ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారుగా నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు.

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మృతుల వివరాలు

ఫొటో సోర్స్, UGC

సొరంగంలో చిక్కుకుపోయిన వారి వివరాలు

1.మనోజ్ కుమార్, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఉన్నావ్, ఉత్తర‌ప్రదేశ్), తండ్రి పేరు: అర్జున్ ప్రసాద్

2.శ్రీనివాస్, సైట్ ఇంజినీర్(చందౌలి, ఉత్తరప్రదేశ్), తండ్రి పేరు: రామ్ క్రిత్

3.సందీప్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రిపేరు: జితు సాహు

4.జగ్తా జెస్, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: మఘే జెస్

5.సంతోష్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: కేశ్వర్ సాహు

6.అనూజ్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: రామ్ ప్రతాప్ సాహు

7.సన్నీ సింగ్, జనరల్ ఆపరేటర్ (జమ్మూ కశ్మీర్), తండ్రి పేరు: రామ్ సింగ్

8.గురుప్రీత్ సింగ్, ఎరక్టర్ ఆపరేటర్ (పంజాబ్), తండ్రి పేరు: విర్సా సింగ్

సొరంగం

ఫొటో సోర్స్, UGC

ప్రమాదం ఎలా జరిగిందంటే..

దోమలపెంట వద్ద సొరంగం పనులు జరుగుతున్న ప్రదేశంలో ప్రమాదం జరిగినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రమాదం ఘటనపై సమీక్షించిన మంత్రి, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు.

''శనివారం ఉదయం పనులు ప్రారంభం కాగానే ఒక వైపు నుంచి నీళ్లు టన్నెల్‌లోకి రావడం మొదలైంది.

నీళ్లు, మట్టి కలిసిపోయి బురదమయంగా మారినట్లు తెలుస్తోంది'' అని చెప్పారు.

ఘటనకు కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దం వచ్చినట్లు మిగతా కార్మికులు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చెప్పారు.

''బోల్ట్స్ ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్స్ కింద పడినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి చీకటిగా మారింది'' అని మంత్రి తెలిపారు.

ఆచూకీ లేని ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్లు మంత్రి ప్రకటించారు.

''ఇటీవల ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఘటన జరిగినపుడు అక్కడ చిక్కుకున్న కార్మికులను బయటకు ఏ విధంగా తీసుకువచ్చారో కూడా తెలుసుకుంటున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నిపుణుల సహాయం తీసుకుంటాం'' అని మంత్రి మీడియాతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)