ఇన్సోమ్నియా: నిద్ర పోనివ్వని ఈ డిజార్డర్ ఏమిటి, దీని నుంచి బయటపడడం ఎలా?

నిద్రలేమి, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

వృత్తిపరంగా తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలాకాలంగా ఇన్సోమ్నియా (నిద్రలేమి)తో బాధపడుతున్నానని గాయని కల్పనా రాఘవేందర్ తెలిపారు.

మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె స్పందిస్తూ, తమ కుటుంబంలో ఎలాంటి మనస్పర్థలూ లేవని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో సూచించిన టాబ్లెట్లను కాస్త ఓవర్ డోసు తీసుకోవడం వల్ల స్పృహతప్పి పడిపోయినట్లు ఒక వీడియో ద్వారా కల్పన స్పష్టం చేశారు.

అయితే, కల్పన బాధపడుతున్న ఈ ఇన్సోమ్నియా అంటే ఏమిటి?

ఇన్సోమ్నియాకి నిద్రమాత్రలే పరిష్కారమా? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్నది మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిద్రలేమి

ఫొటో సోర్స్, Getty Images

'ఇన్సోమ్నియా' అంటే ఏమిటి?

మీరు తరచూ నిద్రపోవడంలో సమస్యలు ఎదుర్కోవడమే ఇన్సోమ్నియా, అంటే నిద్రలేమి. మీకు కనుక నిద్రలేమి ఉంటే.. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదని, రాత్రిపూట చాలాసార్లు మేల్కొంటారని, లేదంటే రాత్రంతా మేల్కొనే ఉంటారని బ్రిటన్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్ చెబుతోంది.

నిద్రలేచిన తర్వాత కూడా అలసటగా అనిపించడం, దీంతో మధ్యాహ్నం పూట కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనిపించినా నిద్రపట్టకపోవడం, దీని ప్రభావంతో ఏ పనిపైనా దృష్టిని కేంద్రీకరించలేకపోవడం జరుగుతూ ఉంటాయని పేర్కొంది.

మూడు నెలల కంటే తక్కువ సమయం పాటు ఈ లక్షణాలు ఉంటే.. దాన్ని షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియా అని, మూడు నెలల కంటే ఎక్కువ ఉంటే.. లాంగ్ టర్మ్ ఇన్సోమ్నియాగా ఎన్‌హెచ్ఎస్ తెలిపింది.

నిద్రలేమికి కారణాలేంటి?

  • తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జైటీ, డిప్రెషన్
  • శబ్దాలు
  • గది చాలా వేడిగా లేదా చల్లగా ఉండటం
  • సౌకర్యంగా లేని పరుపులు
  • ఆల్కహాల్, కెఫేన్, నికోటిన్
  • కొకైన్ వంటి చట్టవిరుద్ధమైన డ్రగ్స్
  • షిఫ్ట్ వర్క్
నిద్రలేమి

ఫొటో సోర్స్, Getty Images

నిద్రలేమితో కలిగే నష్టాలు..

ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది.

నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని అంతకుముందు బీబీసీ రిపోర్టు చేసిన కథనం సందర్భంగా లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ షేన్ ఓమారా చెప్పారు.

నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

నిద్రలేమికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 153 అధ్యయనాల్లో 50 లక్షల మందికి పైగా పాల్గొన్నారు.

చాలా మందికి నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని చెప్పారు.

నిద్రలేమితో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని.. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలయ్యి ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని, కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలయ్యి మరింత ఆహారం తినేవిధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉంటుందని పరిశోధకులంటున్నారు.

ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని ప్రొఫెసర్ షేన్ ఓమారా చెప్పినట్లు అంతకుముందు బీబీసీ రిపోర్టు చేసిన కథనంలో పేర్కొంది.

అందుకే తగినంత నిద్రలేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.

ఎక్కువ నిద్ర దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. కానీ అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

నిద్రలేమి

ఫొటో సోర్స్, Getty Images

మీకు మీరుగా నిద్రలేమి నుంచి ఎలా బయటపడొచ్చు..

మీ నిద్ర అలవాట్లను మార్చుకోవడం ద్వారా నిద్రలేమి నుంచి బయటపడొచ్చని ఎన్‌హెచ్ఎస్ తన వెబ్‌సైట్‌లో పలు సూచనలు చేసింది. అవేంటో చూద్దాం..

  • ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం
  • నిద్రపోవడానికి గంట ముందు రిలాక్స్ అవ్వాలి. అంటే, స్నానం చేయడం లేదా ఏదైనా పుస్తకం చదవడం చేయాలి.
  • నిద్రపోయే గది ప్రశాంతంగా, చీకటిగా ఉండేలా చూసుకోవాలి. కర్టెన్లు వాడాలి, అవసరమైతే ఐ మాస్క్ లేదా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి.
  • ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • మీ పరుపు, దిండు, వాటి కవర్లు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.

నిద్రపోయేముందు చేయకూడనివి..

  • స్మోక్ లేదా ఆల్కాహాల్ తీసుకోవడం వంటివి చేయకూడదు.
  • నిద్రపోవడానికి ఆరు గంటల ముందువరకూ టీ లేదా కాఫీ వంటివి తాగకూడదు.
  • రాత్రిపూట ఎక్కువ ఆహారం తీసుకోకూడదు.
  • నిద్రపోవడానికి కనీసం 4 గంటల ముందు వ్యాయామం చేయకూడదు.
  • టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ వంటివి చూడకూడదు. ఎందుకంటే, బ్లూ లైట్ మిమ్మల్ని మరింత ఎక్కువ సేపు మేల్కొని ఉండేలా చేస్తుంది.
  • నిద్రమత్తుగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయొద్దు.
యువతి

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతున్న నిద్రలేమి ఫిర్యాదులు

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఎక్కువ మంది నిద్రలేమి సమస్యపై డాక్టర్లను సంప్రదిస్తున్నారు.

ఊబకాయం సమస్య నానాటికీ పెరుగుతుండటంతో నిద్రలేమి సమస్య తీవ్రమవుతోందని బ్రిటన్‌కి చెందిన కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గై లెస్జినర్ గతంలో తెలిపారు.

నిద్రలేమికి 'కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీ' చికిత్సే పరిష్కారమని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కాదని, ఆలోచనా విధానంలో మార్పుతోనే పరిష్కారం సాధ్యమని అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)