స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?

స్లీప్ పెరాలిసిస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లూక్ మింజ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

స్లీప్ పెరాలసిస్ ప్రేరణగా పుట్టిన పెయింటింగ్స్, హారర్ కథలను మనం తరచూ చూస్తుంటాం. అయితే, అసలు కదలలేని స్థితిలో మనం నిద్ర నుంచి మేల్కోవడానికి కారణాలు ఏమిటనే ప్రశ్నపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.

అలాగే నిద్రలేచిన తరువాత కూడా ఎందుకు ఇంకా ఏదో భ్రమలో(హేలూసినేషన్‌లో) కొంత మంది ఉండిపోతారు అనే దానిపై పరిశోధకులు దృష్టిసారిస్తున్నారు.

టీనేజీ వయసులోనే మొదటిసారి ఆ అనుభవం నాకు ఎదురైంది. స్కూలుకు వెళ్లడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. అప్పుడే నిద్రలేచి మంచంలో ఇంకొక వైపుకు తిరిగే ప్రయత్నం చేశాను. కానీ, శరీరం అందుకు సహకరించలేదు. శరీర భాగాలేవీ కదలటం లేదు. పాదాల వరకు పక్షవాతం వచ్చినట్టుగా అనిపించింది.

నా మెదడు పని చేస్తూనే ఉంది. శరీరమే స్పందించడం లేదు. నా పడక గది వేడిగా, జైలులా అనిపించటం మొదలైంది. గది గోడలన్నీ మూసుకుపోతునట్టు అనిపించింది. నాలో భయం, ఆందోళన మరింత ఎక్కువయ్యాయి. 15 సెకన్ల తరువాత కానీ నా శరీరం కదలలేదు.

నాకు జరిగినదానికి ఒక పేరు ఉందని నాకు చాలా రోజుల తరువాత తెలిసింది. దాని పేరు ‘నిద్ర పక్షవాతం’ అంటే స్లీప్ పెరాలసిస్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- ఇది రాత్రి పూట నిద్ర సమయాలలో చాలా సాధారణంగా సంభవించే పరిస్థితి.

ఈ పరిస్థితిలో మెదడు పని చేస్తూనే ఉంటుంది. కానీ శరీరం మాత్రం తాత్కాలికంగా బిగుసుకుపోతుంది. మొదటిసారి భయానకంగా అనిపించినా, తరువాత 2-3 రోజులకి ఒకసారి ఇలా జరగటం కామన్ అయ్యింది. తరుచూ జరిగే కొద్దీ భయం తగ్గుతూ వచ్చింది. కొన్నాళ్ళకి ఇది చిన్న అసౌకర్యం తప్ప ఇంకేమీ కాదనుకునే స్థితికి వచ్చేసింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్లీప్ పెరాలసిస్

ఫొటో సోర్స్, Getty Images

‘‘తీవ్రమైన ప్రభావం చూపించగలదు’’

నిద్ర పక్షవాతం అనేది జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపించగలదు కూడా. కొంతమందికి దీనితో పాటు హేలూసినేషన్స్ కూడా వస్తాయి. ఈ సమస్యతో బాధపడుతున్న 24 సంవత్సరాల విక్టోరియా తనకి 18 ఏళ్ల వయసున్నప్పుడు తొలిసారి ఇలా జరిగిందని చెప్పారు.

“నాకు మెలకువ వచ్చింది కానీ శరీరం కదలటం లేదు. దెయ్యం రూపంలో ఉన్న ఏదో ఆకారం కర్టెన్ వెనక కనిపించింది. అది నా గుండెల మీదకి దూకింది. నేను ఇంకో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. అన్నిటికన్నా భయానకమైన విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా నేను అరవలేకపోయాను. అదంతా కూడా నిజంగా జరుగుతున్నట్టే అనిపించింది” అని ఆమె వివరించారు.

కొంతమంది తాము గ్రహాంతరవాసులని, భయం పుట్టించే చొరబాటుదారులని, చనిపోయిన బంధువులని కూడా చూస్తున్నామన్న భ్రమలో ఉంటారు.

తమ శరీర భాగాలు గాల్లో తేలుతున్నట్టు, అచ్చు తమని పోలినవారు తమ మంచం పక్కన నించున్నట్టు వారికి కనిపిస్తుంది. కొంతమందికి దేవకన్యలు కనిపిస్తారు. దీంతో తాము ధైవానుభూతికి లోనయ్యామని భావిస్తారు.

మంత్రగత్తెలు ఉన్నారని ఆధునిక ఐరోపా తొలినాళ్ళలో ఉన్న నమ్మకానికి ఇలాంటి భ్రమలు కూడా ఒక కారణం అయ్యుండొచ్చని పరిశోధకుల అభిప్రాయం. అలాగే తమని గ్రహాంతరవాసులు అపహరించారని ఈ ఆధునిక కాలంలోనూ కొంతమంది చెప్పే మాటలకు కూడా ఈ భ్రమలే కారణం అయ్యుండొచ్చని కూడా వారి అభిప్రాయం.

స్లీప్ పెరాలసిస్

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఇప్పటిది కాదు..’’

నిద్ర పక్షవాతం అనేది మనుషుల నిద్రంత పాతదని శాస్త్రవేత్తల అభిప్రాయం. సాహిత్యంలో ఈ స్థితిని ఎన్నోసార్లు ఎంతో వివరంగా వాడుకున్న దాఖలాలు కోకొల్లలు.

నిద్ర పక్షవాతాన్ని పెయింటింగ్స్‌లో చిత్రించిన విధానం నుంచి స్ఫూర్తి పొంది మేరీ షెల్లీ ‘‘ఫ్రాన్కన్‌స్టెయిన్’’ నవలలో ఒక సీన్ రచించారు. అయితే నిద్ర పక్షవాతం మీద జరిగిన పరిశోధన చాలా తక్కువ.

“ఈ మధ్యవరకు దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే గత 10 ఏళ్లుగా ఈ విషయంపై ఆసక్తి పెరుగుతోంది” అని బలంద్ జలాల్ తెలిపారు. ఆయన నిద్ర మీద హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు.

నిద్ర పక్షవాతానికి వివిధ మార్గాల ద్వారా వైద్యం అందించే ప్రక్రియలో బహుశా మొదటి సారి క్లినికల్ ట్రయల్ పూర్తి చేసిన పరిశోధకుడు ఈయనే. 2020లో ఆయన ఈ పరిశోధన పూర్తి చేశారు.

స్లీప్ పెరాలసిస్

ఫొటో సోర్స్, Getty Images

నిద్ర పక్షవాతంపై చాలా నిబద్ధతతో పరిశోధన చేస్తున్న అది కొద్ది మంది పరిశోధకులలో బలంద్ జలాల్ ఒకరు. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి, దాని ప్రభావం ఏమిటి? అని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం ఆయన చేశారు.

అలాగే ఈ పరిస్థితి ద్వారా మన మెదడుకి సంబంధించి నేటి వరకు మిస్టరీగానే ఉన్న అనేక విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.

స్లీప్ పెరాలసిస్ బాధితులు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఏకాభిప్రాయం లేదు. దీని మీద పరిశోధనల్లోనూ పొంతన కూడా ఉండేది కాదు.

అయితే 2011లో సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ మేరీల్యాండ్‌లో విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బ్రయాన్ షార్ప్‌లెస్ ఈ పరిస్థితికి ఎంతమంది బాధితులు అనే దాని మీద అప్పటి వరకు వచ్చిన అన్ని పరిశోధనల మీద సమగ్రమైన సమీక్ష చేశారు.

ఆయన అప్పుడు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. ఇది వరకు ఐదు దశాబ్దాలలో వచ్చిన 35 పరిశోధనలని సమీక్షించారు. అన్నీ పరిశోధనాలలో కలిపి 36,000కు పైగా క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నారు. అప్పటివరకు అనుకున్నాదానికంటే ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువని బ్రయాన్ రివ్యూలో తేలింది. వయోజనులలో 8% మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆ పరిస్థితి చవిచూశామని దీనిలో తెలిపారు. ఈ సంఖ్య విశ్వవిద్యాలయం విద్యార్ధులలో (28%), సైకియాట్రిక్ రోగులలో (32%) కంటే ఇంకా ఎక్కువ.

“ఇదేమి మనం అనుకునేంత అరుదు కాదు” అని బ్రయాన్ తెలిపారు. ఆయన ‘స్లీప్ పెరాలసిస్: హిస్టారికల్, సైకలాజికల్ అండ్ మెడికల్ పర్స్పెక్టివ్స్’ అనే పుస్తకం సహ- రచయిత కూడా.

స్లీప్ పెరాలసిస్

ఫొటో సోర్స్, Getty Images

నిద్ర పక్షవాతాన్ని చూసిన తర్వాత, కొంత మంది అతీత శక్తులలో దీనికి జవాబు ఉంది అని నమ్ముతుంటారు. అయితే వాస్తవంగా చూసుకుంటే దీనికి కారణం చాలా సాధారణమైన విషయం అని బలంద్ జలాల్ తెలిపారు.

‘‘రాత్రి పూట మన నిద్రలో నాలుగు దశలు ఉంటాయి. చివరి దశని ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్ఈఎం) స్లీప్ అంటారు. ఈ దశలోనే మనకి కలలు వచ్చేది. ఈ ఆర్ఐఎం దశలో మెదడు మన శరీరాన్ని స్థంభింపచేస్తుంది. మనకు కలలలో వచ్చేవాటి వల్ల, గాయాలు పాలవ్వకుండా మెదడు తీసుకునే ముందు జాగ్రత్త చర్యగా దీనిని చెప్పుకోవచ్చేమో.

అయితే కొన్ని సార్లు మెదడు ఆర్ఐఎం స్థితి నుంచి ముందుగానే తేరుకుంటుంది. అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. ఈ ప్రక్రియ మనల్ని నిద్ర నుంచి మేల్కొనేటట్టు చేస్తుంది. అయితే మెదడులోని కింది భాగం అప్పటికీ ఆర్ఈఎం స్థితిలోనే ఉంటూ శరీరం స్థంభించిపోవడానికి అవసరమైన న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ని పంపిస్తూనే ఉంటుంది’’ అని బలంద్ జలాల్ తెలిపారు.

స్లీప్ పెరాలసిస్

ఫొటో సోర్స్, Getty Images

“మెదడులోని కొన్ని భాగాలు ఈ దశలో యాక్టివ్ అవుతాయి. అంటే మీ మెదడు పని చేస్తుంది, అయితే శారీరకంగా మీరు కదలలేని స్థితిలో ఉంటారు” అని బలంద్ జలాల్ తెలిపారు.

నేను ఇరవైలలో ఉన్నప్పుడు ఈ నిద్ర పక్షవాతం రెండు మూడు రోజులకి ఒకసారి వచ్చేది. అయితే అప్పుడు కూడా అది నా జీవితం మీద పెద్ద ప్రభావమేమి చూపలేదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడానికి అది ఒక ఆసక్తికరమైన విషయం. ఈ విధంగా చూసుకుంటే నా అనుభవం చాలా సాధారణమైనది.

“ఈ పరిస్థితి ఉన్న వారిలో అత్యధిక శాతం మందికి ఇదొక చిన్న విచిత్రమైన అనుభూతి అంతే” అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్లీప్ మెడిసిన్ ప్రొఫెసర్ కొలిన్ ఎస్పీ తెలిపారు. “ఒక రకంగా ఇది నిద్రలో నడక లాంటిది. నిద్రలో నడిచే అలవాటు ఉన్నవారిలో అత్యధిక శాతం మంది ఇదో పెద్ద వ్యాధని, వైద్యులని కలవాలని అనుకోరు. కలవరు కూడా. కుటుంబసభ్యులకి అదొక వింత. అంతే” అని కొలిన్ అన్నారు.

అయితే ఆ కొంతమందికి ఇది బాగా ఇబ్బందికరమైన విషయం. షార్ప్‌లెస్ చేసిన పరిశోధనలో ఈ నిద్ర పక్షవాతం పరిస్థితి ఉన్నవారిలో 15% నుంచి 44% మంది దీని కారణంగా “తీవ్రమైన ఒత్తిడికి” గురవుతారు అని తేలింది.

ఈ పరిస్థితి కారణంగా కన్నా దీనికి మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాని మీదే సమస్యలు ఆధారపడి ఉంటాయి. మరోసారి ఇలా నిద్ర పక్షవాతం వస్తే ఎలా ఉంటుందో ఏమిటో అనే విషయం మీద రోజంతా తీవ్రంగా మథనపడుతుంటారు.

“రాత్రి మొదలయినప్పుడు, తెల్లారుతున్న సమయంలో ఈ పరిస్థితి ఉన్నవారు తీవ్ర ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంటుంది. దీని చుట్టూ ఒక ఆందోళనా ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. దీని తీవ్ర రూపం ఏమిటంటే ప్యానిక్ అటాక్” అని కొలిన్ ఎస్పీ తెలిపారు.

స్లీప్ పెరాలసిస్

ఫొటో సోర్స్, Getty Images

నార్కోలెప్సీ కూడా..

కొన్ని సీరియస్ కేసులలో ఈ నిద్ర పక్షవాతం అనేది మనలో అంతర్గతంగా ఉన్న నార్కోలెప్సీ అనే వ్యాధికి చిహ్నం. నార్కోలెప్సీ అనేది నిద్ర సంబంధించి తీవ్రమైన సమస్య. ఇందులో మన మెదడు మన నిద్ర, నడకని నియంత్రించలేదు. దీని ఫలితంగా ఈ వ్యాధి ఉన్నావారు ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు.

ఈ నిద్ర పక్షవాతం అనేది నిద్ర లేమి నుంచి వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకు అంటే సరిగ్గా నిద్ర లేనప్పుడు నిద్రకి సంబంధించిన ప్రక్రియలు అన్నీ అస్తవ్యస్తం అవుతాయి.

ఈ నిద్ర పక్షవాతానికి ఉత్తమమైన వైద్యం ఏమిటంటే అవగాహన కలిపించటం. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటో రోగులకి చెప్పి, దీని వల్ల ప్రమాదం ఏమి లేదు అనే భరోసా వారికి ఇవ్వాలి.

కొన్నిసార్లు ధ్యానంలాంటివి సూచిస్తారు. నిద్రకి ఉపక్రమించేముందు వారిలో ఆందోళన తగ్గించి, శరీరం స్తంభించిపోయినప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండగలిగేలా చెయ్యటం ఈ ప్రక్రియ లక్ష్యం.

పరిస్థితి తీవ్రంగా ఉన్న సందర్భాలలో మందులు వాడకాన్ని సూచిస్తారు. మామూలుగా కుంగుబాటుకు సూచించే సెలక్టివ్ సెరోటోనిన్ రీఆప్టేక్ ఇన్హిబిటర్స్‌ను వారికి సూచిస్తారు.

వీడియో క్యాప్షన్, వీడియో: స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి?

తీవ్రం ఎప్పుడు అవుతుంది?

నిద్ర పక్షవాతం మరీ తీవ్రంగా ఉండేది భ్రమలు వచ్చినప్పుడే. రాత్రి పూట వచ్చే ఇవి భయం కలిగిస్తుంటాయి. కానీ ఇవి మానవ మెదడు గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియచేస్తాయి కూడా.

మీకు నిద్ర పక్షవాతం వచ్చినప్పుడు మీ మెదడులోని మోటార్ కోర్టెక్స్ శరీరానికి కదలమని సిగ్నల్స్ పంపిస్తుంది. అయితే శరీరంలోని నరాలు స్తంభించిపోయి ఉండటంతో నరాల నుండి తిరిగి మెదడుకి ఏ సిగ్నల్స్ అందవు.

“ఇక్కడ ఒక రకమైన అసమతుల్యత ఏర్పడుతుంది. మనం అనుకునే ఒక భావన దెబ్బతిని, ముక్కలు అవుతుంది” అని బలంద్ జలాల్ తెలిపారు. దీని కారణంగా మెదడు “ఈ ఖాళీలని పూరించి” నరాలు ఎందుకు కదలటం లేదు అనేదానికి తన సొంత అవగాహన ఏర్పరుచుకుంటుంది. అందుకే ఈ పరిస్థితిలో ఎవరో మీ గుండె మీద కూర్చుని మీ శరీరాన్ని నొక్కి పెట్టి ఉన్నారనే భ్రమ తరుచుగా కలుగుతుంటుంది.

యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో గోల్డ్ స్మిత్ కళాశాలలో అనోమాలిస్టిక్ సైకాలజీ రీసెర్చ్ యూనిట్ అధ్యక్షులైన క్రిస్టోఫర్ ఫ్రెంచ్ ఒక దశాబ్దం పైగా ఇలాంటి భ్రమలు కలిగే వారితో మాట్లాడుతూ, వారికి అవి కలిగినప్పుడు వాటిని రికార్డింగ్ చేసుకుంటూ వస్తున్నారు. “చాలా వరకు అవి అందరికీ సాధారణమైనవే. అయితే ఇందులో కొన్ని విభిన్నమైనవి, మరికొన్ని విపరీతమైనవి కూడా ఉంటాయి” అని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, గురక: నిద్రలోనే మీ ప్రాణాలు తీస్తుందా

వివరించడం కూడా కష్టమే

కొన్ని భ్రమలని వివరించడం కూడా కష్టమే. కొన్నయితే మరీ వింతగా కూడా ఉంటాయి. తన పరిశోధనలో భాగంగా క్రిస్టోఫర్ ఫ్రెంచ్.. భయం గొలిపే నల్ల పిల్లి కనిపిస్తోందని, నన్ను మొక్కలు గొంతు పిసుకుతున్నాయని, ఇలాంటి ఎన్నో భ్రమలను రికార్డ్ చేశారు. అయితే మిగతావి చాలా సాధారణమైనవి.

చుట్టుపక్కల ఉన్న సాంస్కృతిక వాతావరణం ప్రభావం కూడా వాటి మీద ఉంటుంది. కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్‌లో ఒక “ముసలావిడ” నా గుండె మీద కూర్చుని ఉంది అనే భ్రమ సాధారణం. మెక్సికన్ ప్రజలు తమ గుండె మీద “ఎప్పుడో చనిపోయిన మనిషి” కూర్చుని ఉన్నాడని చెబుతుంటారు.

అలాగే సెయింట్ లూషియాలో నిద్రలో కోక్మాలు- అంటే ఇంకా బాప్టిజం తీసుకోని పిల్లలు-తమ గొంతు పిసుకుతున్నారు అని చెబుతారు. తుర్కియే ప్రజలు “కరబాసాన్”- అంటే దెయ్యం లాంటి ఒక జీవి- తమకి కనిపించింది అని, ఇటలీ వాసులయితే తమకి మంత్రగత్తెలు కనిపిస్తున్నారని చెబుతారు.

వీడియో క్యాప్షన్, నిద్ర సరిగా పోని వాళ్ళకు సాయం చేసే గుణం తగ్గిపోతుందా?

సంస్కృతి కూడా ప్రభావితం చేస్తుందా?

ఒకే వయసు, ఒకే జెండర్‌కు చెందిన డెన్మార్క్, ఈజిప్ట్ ప్రజల నిద్ర పక్షవాతం గురించి బలంద్ జలాల్ పరిశోధన చేసినప్పుడు.. వారి వారి సంస్కృతి ఆధారంగా వారి మధ్య తేడాలు కనిపించాయి. డెన్మార్క్(25%) వారితో పోల్చుకుంటే నిద్ర పక్షవాతం ఈజిప్ట్ (44%) వారిలో ఎక్కువ . దెయ్యాలు కనిపిస్తున్నాయని భావించిన ఈజిప్ట్ వాసులు ఎక్కువ సమయం కదలలేని పరిస్థితిలో ఉన్నారు.

అతీత శక్తులు ఉన్నాయని నమ్మి, భయపడే వారికి నిద్ర పక్షవాతం అంటే భయం ఎక్కువ ఉంటుంది అని, అలాగే ఈ భయం నిద్ర పక్షవాతం తరుచుగా రావటానికి కూడా కారణం అవుతుంది అనేది బలంద్ జలాల్ సిద్ధాంతం.

“మీరు ఎక్కువగా ఆందోళనకి, ఒత్తిడికి గురవుతుంటే మీ నిద్ర వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో నిద్ర పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి” అని బలంద్ జలాల్ తెలిపారు. “ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆ జీవి ఇలా ఉంటుంది. అది రాత్రి పూట దాడి చేస్తుంది అని మీ అమ్మమ్మో, నాయనమ్మో చెప్పింది అనుకోండి- అది మీలో భయం కలిగిస్తుంది కదా. ఆ భయం కారణంగా మీరు రాత్రి పూట మరీ యాక్టివ్‌గా ఉంటారు. అలాగే మెదడులో భయానికి సంబంధించిన భాగాలు కూడా హైపర్ యాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టే ఆర్ఈఎం నిద్ర దశలో మీకు ఇలా అనిపిస్తుంది- ఇక్కడ ఏదో తేడాగా ఉంది. ఆ జీవి ఇక్కడే ఉంది. నేను కదలలేకపోతున్నాను అనే భావన మీలోనూ కలుగుతుంది’’అని ఆయన చెప్పారు.

“సంస్కృతి అనేది ఇలాంటి తీవ్రమైన ప్రభావాలకు కూడా కారణం కాగలదు” అని బలంద్ జలాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)