కీళ్ల నొప్పులకు యూరిక్ యాసిడ్ పెరిగి పోవడమే కారణమా? తగ్గాలంటే ఏం చేయాలి?

కీళ్ల నొప్పులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఓంకార్ కరంబేల్కర్
    • హోదా, బీబీసీ మరాఠీ

మీకు కాళ్లలో నొప్పి వస్తోందా? ముఖ్యంగా బొటన వేలు లేదా కాలి మండ దగ్గర నొప్పిగా అనిపిస్తోందా? కాలు కదపలేకపోతున్నారా?

మీకు కాలిపై ఏదైనా వాపు లేదా ఎర్రని మచ్చలు కనిపిస్తున్నాయా?

ఇలాంటి నొప్పులు నాలుగు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలి.

ఈ నొప్పికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు మీ రక్తంలో యూరిక్ ఆమ్లం స్థాయులు ఎలా ఉన్నాయో పరీక్షలు చేయించుకొని రావాలని వారు సూచిస్తారు.

శరీరంలో ఉత్పత్తయ్యే యూరిక్ ఆమ్లాన్ని మూత్రం ద్వారా మూత్ర పిండాలు బయటకు పంపిస్తాయి. అయితే, కిడ్నీలో కొన్ని సమస్యలు లేదా శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయులు పెరగడంతో రక్తంలోనూ దీని స్థాయులు పెరుగుతుంటాయి.

యూరిక్ ఆమ్లం స్థాయులు పెరగడంతో చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కాళ్లతోపాటు చేతుల్లోని ఎముకల దగ్గర యూరిక్ ఆమ్లం స్ఫటికాలు పేరుకుంటాయి. ఫలితంగా విపరీతమైన కీళ్ల నొప్పులు వస్తుంటాయి.

దీంతో కాళ్లు, చేతులు వాచిపోవడంతోపాటు నొప్పులు కూడా వస్తుంటాయి. ఈ వ్యాధినే ‘‘గౌట్‌ ఆర్థిరైటిస్’’ లేదా ‘‘గౌట్ కీళ్లవాతం’’గా పిలుస్తుంటారు.

కీళ్ల నొప్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కీళ్లవాతం ఎందుకు వస్తుంది?

  • మీకు హైఫీవర్ వచ్చేందుకు కారణమయ్యే వ్యాధి వచ్చినప్పుడు
  • ఆల్కహాల్ అతిగా తాగినప్పుడు లేదా కొవ్వులు, నూనెలు ఎక్కువ ఉండే ఆహారం తీసుకున్నప్పుడు
  • శరీరంలో నీటి స్థాయిలు పడిపోయినప్పుడు
  • కీళ్లకు గాయాలైనప్పుడు
  • కొన్నిరకాల ఔషధాలు తీసుకున్నప్పుడు

ఈ కీళ్లవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. డాక్టర్ కొన్ని ఔషధాలతోపాటు జీవన శైలిలో మార్పులు కూడా సూచించొచ్చు.

వారి సూచనలకు అనుగుణంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేసుకొని, చికిత్సను వెంటనే మొదలుపెట్టాలి.

కీళ్ల నొప్పులు

ఫొటో సోర్స్, Getty Images

యూరిక్ ఆమ్లం స్థాయులు ఎందుకు పెరుగుతాయి?

శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయులు ఎందుకు పెరుగుతాయో వివరిస్తూ బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఒక కథనాన్ని ప్రచురించింది. దానిలోని వివరాల ప్రకారం..

  • కొన్నిసార్లు గౌట్ కీళ్లవాతం లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి జన్యువుల ద్వారా వస్తాయి.
  • పురుషుల్లో ఒక వయసుకు వచ్చాక ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి.
  • బరువు ఎక్కువైనా ఇది వచ్చే అవకాశం ఉంటుంది
  • అతిగా ఆల్కహాల్ తాగినా..
  • మెనోపాజ్ సమయంలోనూ..
  • హైకొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, ఆస్టియోఆర్థిరైటిస్ లేదా మధుమేహం వచ్చినా..
  • ఏదైనా సర్జరీ తర్వాత లేదా గాయమైనప్పుడు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ వ్యాధికి మొదటిసారి సరైన చికిత్స తీసుకోకపోతే, ఇది మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.

మళ్లీ మళ్లీ ఈ కీళ్లవాతం వస్తుందంటే శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయులు తగ్గించుకునేందుకు ఔషధాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి లక్షణాలు కనిపించినప్పటికీ, శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయులు పెరిగినట్లు గుర్తిస్తే, వీటిని తగ్గించేందుకు మందులు తీసుకోవాలని ఎన్‌హెచ్ఎస్ సూచిస్తోంది.

కీళ్ల నొప్పులు

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ మళ్లీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయులు తగ్గించుకొనేందుకు ఈ కింది చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఎస్ సూచిస్తోంది.

  • బరువు తగ్గించేందుకు రోగులు ప్రయత్నించాలి.
  • సంతులిత ఆహారం తీసుకోవాలి. ఏ పదార్థాలు ఎక్కువ తినాలి, ఏవి తినకూడదో వైద్యులను అడిగి తెలుసుకోవాలి.
  • ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి.
  • నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
  • ధూమపానాన్ని మానుకోవాలి.
  • తరచూ వ్యాయామం చేయాలి. కానీ, కీళ్లపై ఒత్తిడి చేయకూడదు.
కీళ్ల నొప్పులు

ఫొటో సోర్స్, Getty Images

గౌట్ కీళ్లవాతం వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలనే అంశంపై డాక్టర్ తేజస్ ఖానోల్కర్‌తో బీబీసీ మాట్లాడింది.

‘‘నొప్పి, వాపు తగ్గేందుకు చికిత్స అవసరం. మొదట క్రయోథెరపీ ప్రయత్నించాలి. అంటే పది నిమిషాలపాటు ఐసు ముక్కలతో మర్దనా చేయాలి. దీంతో నొప్పి చాలావరకు తగ్గుతుంది’’అని ఆయన చెప్పారు.

‘‘ఒకసారి నొప్పి కొంచెం తగ్గిన వెంటనే, కీళ్లు మళ్లీ సాధారణంగా పనిచేసేందుకు డాక్టర్లు మీకు కొన్ని రకాల వ్యాయామాలు సూచిస్తారు. ఒక్కోసారి కీళ్లను పట్టి ఉంచే పట్టీలు కూడా వేసుకోవాలని సూచిస్తారు. ఫలితంగా కీళ్లు పెద్దగా కదలకుండా నొప్పి తగ్గుతుంది. ఆహారం, జీవన శైలిలో మార్పులతో బరువు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఇది తిరగబెట్టకుండా ఉంటుంది’’అని డాక్టర్ తేజస్ వివరించారు.

వీడియో క్యాప్షన్, లిక్విడ్ డైట్‌తో బరువు తగ్గడం సాధ్యమేనా?

బరువు తగ్గడం ఎందుకంత ముఖ్యం?

కీళ్లవాతం ముప్పు తగ్గించుకునేందుకు వైద్యులు ఎక్కువగా బరువు తగ్గాలని సూచిస్తుంటారు. ఎందుకంటే బరువు పెరగడంతో శరీరం ఉత్పత్తి చేసే యూరిక్ ఆమ్ల స్థాయులు కూడా పెరుగుతాయి. దీంతో కిడ్నీలపై మరింత ఒత్తిడి పడుతుంది. అంటే శరీరంలో మరింత యూరిక్ ఆమ్ల స్థాయులు పెరుగుతాయి.

ఆహారం తీసుకోవడాన్ని ఒక్కసారిగా తగ్గించేయడం లేదా విపరీత మార్పులతో మరిన్ని సమస్యలు వచ్చే ముప్పుంటుంది.

ఒక్కసారిగా బరువు తగ్గే ప్రక్రియలను యూకే గౌట్ సొసైటీ వద్దని చెబుతోంది. ఏమీ తినకుండా ఉపవాసం ఉండటంతో శరీరంలో యూరిక్ ఆమ్ల స్థాయులు మరింత పెరుగుతాయి, దీంతో కీళ్లవాతం మరింత ఎక్కువ అవుతుందని సంస్థ చెబుతోంది.

శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలు తగ్గాలంటే ఆహారంలో పళ్లు, కూరగాయలు, నట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ హాయోన్ చోయ్ చెప్పారు. ఆహారంలో సోడియం, పంచదార తగ్గించుకోవాలని సూచించారు.

‘‘ఈ విషయంలో సగటున 26 ఏళ్ల వయసున్న 44,000 మందిపై ఒక అధ్యయనం నిర్వహించాం. మేం సూచించిన ఆహారం తీసుకునేవారిని మిగతావారితో పోల్చిచూశాం. మేం సూచించిన ఆహారం తీసుకొనేవారికి తరచూ వ్యాయామం కూడా చేయాలని సూచించాం. దీంతో వారికి కీళ్లవాతం వచ్చే ముప్పు చాలా తగ్గింది’’ అని చోయ్ నొక్కిచెప్పారు.

వీడియో క్యాప్షన్, నెలసరి సరిగ్గా జరగాలి అంటే ఏం తినాలి? ఏం తినకూడదు?

ఏ ఆహారం తీసుకోకూడదు?

ప్యూరిన్ నుంచి యూరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ప్యూరిన్ స్థాయులు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

యూకే గౌట్ సొసైటీ సూచనల ప్రకారం మాంసం, చేపలు, ఆల్కహాల్‌లలో ప్యూరిన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో హోల్ గ్రెయిన్స్, పాలు, చీజ్, పెరుగు, గుడ్లు, పళ్లు, కూరగాయల్లో వీటి స్థాయులు తక్కువగా ఉంటాయి.

ముఖ్యంగా తీపి పానీయాలను తగ్గించుకోవాలని, నీరు ఎక్కువగా తాగాలని యూకే గౌట్ సొసైటీ సూచిస్తోంది.

(గమనిక: ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)