క్యాన్సర్: సర్జరీ తర్వాత కీమో థెరపీ అవసరమేనా? ఈ రక్త పరీక్ష చెప్పేస్తుంది

- రచయిత, ఫెర్గుష్ వాల్స్
- హోదా, మెడికల్ ఎడిటర్
క్యాన్సర్ కణాలను గుర్తుపట్టే ఒక రక్త పరీక్ష అనవసర కీమోథెరపీ చికిత్సలకు చెక్‌పెట్టే అవకాశముంది.
దీని కోసం బ్రిటన్‌లో బోవెల్ క్యాన్సర్ బాధితులపై ఒక అధ్యయనం జరుగుతోంది. సర్జరీతో రోగుల్లోని అన్ని కణితులను తొలగించారో లేదో నిర్ధరించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
మూడోదశ బోవెల్ క్యాన్సర్ బాధితుల్లో సగం మందికి సర్జరీతో సమస్య తీరిపోతుంది. అయినప్పటికీ చాలా మందికి కీమోథెరపీని వైద్యులు సూచిస్తారు.
ఇప్పుడు ఆ అనవసర చికిత్సను తగ్గిండమే లక్ష్యంగా తాజా పరీక్ష చేపడుతున్నారు. దీనిలో 1600 మంది బోవెల్ క్యాన్సర్ బాధితులు పాల్గొంటున్నారు.

లండన్‌లోని చెల్సియా కింగ్స్ రోడ్‌లో బెన్ కుక్ ఒక హెయిర్ సెలూన్ నడిపిస్తున్నాయి. ఫ్యాషన్ షూట్లకు ఆయన స్టైలిస్ట్‌గానూ పనిచేస్తుంటారు.
గత ఏడాది మార్చిలో తన మలం ముదురు రంగులో రావడాన్ని ఆయన గుర్తించారు. వెంటనే ఎన్‌హెచ్ఎస్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే ఆయన మూడో దశ బోవెల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు.
అయితే, ఆ తర్వాత కడుపులోని మిగతా క్యాన్సర్ కణాలను తగ్గించేందుకు, క్యాన్సర్ తిరగబెట్టకుండా చూసేందుకు నరాల్లోకి సూదులతో ఔషధాలు ఎక్కించే కీమోథెరపీ మొదలుపెట్టారు.
అయితే, కీమోథెరపీలో ఉపయోగించే ఆక్సాలిప్లాటిన్‌తో అరికాళ్లు, చేతుల్లో నొప్పులు, తిమ్మిర్లు వస్తుంటాయి. దీర్ఘకాలంలో నరాలు కూడా దెబ్బతింటాయి. దీని వల్ల తను అమితంగా ప్రేమించే తన ఉద్యోగాన్ని చేయలేనేమోనని బెన్ ఆందోళన చెందేవారు.
‘‘అలా అయితే, నేను తట్టుకోలేను. నేను పనిచేయాలి. అదే నాపై థెరపీలా పనిచేస్తుంది’’అని ఆయన అన్నారు.
శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ అవసరమా? అనే లక్ష్యంతో లండన్‌లోని రాయల్ మెర్స్‌డెన్ హాస్పిటల్‌లో జరుగుతున్న అధ్యయనంలో పాల్గొన్నవారిలో 52ఏళ్ల బెన్ కూడా ఒకరు.
పరీక్షల్లో ఆయనలో ఎలాంటి క్యాన్సర్ సంకేతాలు లేవని తేలింది. దీంతో ఇకపై ఆయన నరాల్లోకి సూదుల ద్వారా ఎక్కడించే ఔషధాలను తీసుకోవాల్సిన అవసరం లేదు.
దీనికి బదులుగా రోజుకు రెండుసార్లు నోటిలో వేసుకునే ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు. దీని వల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు. దీంతో హాయిగా బెన్ పనిచేసుకోవచ్చు.
‘‘నిజానికి ఆ నోటిలో వేసుకుని మందులతో నా చేతుల్లో నొప్పులేమీ రావడం లేదు. ఆ ఔషధాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి’’అని ఆయన చెప్పారు.

రక్తంలోని కనిపించే క్యాన్సర్ సంకేతాలైన ‘‘సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్ఏ’’ల జాడలను గుర్తుపట్టడం ద్వారా ఈ రక్తపరీక్ష పనిచేస్తుంది. రక్తంలో ఈ మార్కర్లు గమనించడం ద్వారా ఆ రోగి శరీరంలో సర్జరీ తర్వాత కణితులు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. అయితే, ఇవి సాధారణ స్కాన్‌లో కనిపించవు.
తాజా అధ్యయనం నిర్వహిస్తున్న ప్రధాన పరిశోధకుల్లో డాక్టర్ నౌరీన్ స్టార్లింగ్ కూడా ఒకరు. దీని వల్ల వేల మంది బోవెల్ క్యాన్సర్ బాధితులకు సూదులతో ఎక్కించే మందుల నుంచి విముక్తి లభిస్తుందని ఆమె చెప్పారు.
‘‘మూడో దశ బోవెల్ క్యాన్సర్ బాధితుల్లో సగం మందికి శస్త్రచికిత్స ఒక్కటే సరిపోతుంది. కానీ, మనం చాలా మందికి అనవసరంగా చికిత్స అందిస్తున్నాం’’అని ఆమె చెప్పారు.
‘‘ఈ కొత్త రక్త పరీక్షతో అనవసర కీమోథరపీని అడ్డుకోవచ్చు. అది రోగికి చాలా మేలు చేస్తుంది. దీని వల్ల దేశానికి కూడా డబ్బులు ఆదా అవుతాయి’’అని ఆమె అన్నారు.
టీఆర్ఏసీసీగా పిలుస్తున్న ఈ పరీక్షను అమెరికన్ కంపెనీ గార్డంట్ హెల్త్ అభివృద్ధి చేసింది. ఇక్కడ సేకరిస్తున్న నమూనాలను విశ్లేషణన కోసం కాలిఫోర్నియా పంపిస్తున్నారు. ఫలితాలు మరో రెండు వారాల్లో వస్తాయి.

జీవించే అవకాశం ఎంత?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (ఎన్ఐహెచ్ఆర్) నిధులతో ఈ అధ్యయనం కొనసాగుతోంది. సాధారణ కీమోథెరపీ తీసుకున్నవారితో పోల్చినప్పుడు రక్త పరీక్ష సాయంతో నోటిద్వారా మాత్రలు వేసుకునే వారిలో మూడేళ్ల తర్వాత ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయో దీనిలో విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ బాధితుల విషయంలోనూ ఇలాంటి అధ్యయనం ఒకటి కొనసాగుతోంది.
‘‘క్యాన్సర్ రోగులకు ఈ కొత్త పరీక్షతో చాలా మేలు జరుగుతుంది. శస్త్రచికిత్స అనంతరంతోపాటు క్యాన్సర్‌ను తొలి దశల్లో గుర్తించేందుకూ ఇది ఉపయోగిపడుతుంది’’అని స్టార్లింగ్ వివరించారు.
‘‘లిక్విడ్ బయాప్సీ’’గా పిలుస్తున్న ఈ పరీక్షతో సంప్రదాయ విధానాల కంటే మెరుగ్గా క్యాన్సర్‌ను గుర్తించవచ్చని ఇప్పటికే స్పష్టమైంది.
దీనిపై గ్రీసులో చేపట్టిన ఒక అధ్యయనం నేచర్ జర్నల్‌లో గత జనవరిలో ప్రచురితమైంది. లిక్విడ్ బయోప్సీతో స్కాన్ కంటే నాలుగేళ్ల ముందే క్యాన్సర్‌ను గుర్తుపట్టొచ్చని దానిలో పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ బాధితులపై ఆ అధ్యయనం జరిగింది.
షికాగోలో గత జూన్‌లో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ కాన్ఫెరెన్స్‌లో 455 మంది బోవెల్ క్యాన్సర్ రోగులపై చేపట్టిన ఒక అధ్యయనాన్ని ప్రదర్శించారు. రక్త పరీక్ష ఆధారంగా చికిత్సను నిర్వహిస్తే, శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ అవసరమయ్యే అవకాశం దాదాపు సగానికి తగ్గిపోతోందని దీనిలో తేలింది.
అయితే, లిక్విడ్ బయాప్సీలను ఎంతవరకు నమ్మొచ్చో స్పష్టంగా తెలుసుకునేందుకు బ్రిటన్‌లో మరింత విస్తృత అధ్యయనం అవసరమని డాక్టర్ స్టార్లింగ్ చెప్పారు.
ప్రస్తుం బ్రిటన్‌లో ప్రైవేటు రోగులు కూడా కావాలంటే ఈ పరీక్ష చేయించుకోవచ్చు.
సర్రేకు చెందిన సుజాన్ వింటర్ మార్చి 2022లో మూడో దశ బోవెల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే కణితులను తొలగించేందుకు ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు.
మొదట్లో క్యాన్సర్‌ను పూర్తిగా శరీరం నుంచి తొలగించేందుకు కీమోథెరపీ అవసరమని ఆమె భావించారు. కానీ, ప్రైవేటుగా ఆమె సీటీ-డీఎన్ఏ టెస్టు చేయించుకున్నారు. అప్పుడే ఆమె శరీరంలో క్యాన్సర్ అవశేషాలు లేవని తేలింది.
దీంతో 58ఏళ్ల సుజాన్ కీమోథెరపీ ఆలోచనలను మానుకున్నారు.
‘‘కీమోథెరపీతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో నాకు తెలుసు. మిమ్మల్ని మీరే వేదనకు గురిచేసుకోవడం ఎందుకు. మీకు అది అవసరంలేదని లేదని తెలిస్తే, అద్భుతంగా అనిపిస్తుంది’’అని ఆమె చెప్పారు.
క్యాన్సర్ అవశేషాలను గుర్తుపట్టే ఈ పరీక్షతో తొలి దశల్లోనే ఆ వ్యాధిని నిర్ధారించొచ్చు. దీంతో మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది.
చాలా రకాల క్యాన్సర్‌లను ఇలా తొలి దశల్లో గుర్తించేందుకు ఇలాంటి రక్త పరీక్షలను అభివృద్ధి చేస్తున్నారు.
50 రకాల కణితులను తొలి దశల్లోనే గుర్తించేందుకు 50 నుంచి 77 ఏళ్ల మధ్య వయసున్న 1,40,000 మందిపై బ్రిటన్‌లో ఒక అధ్యయనం జరుగుతోంది. దీని ఫలితాలు వచ్చే ఏడాది వచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















