గ్రీన్ టీ: డైట్ సప్లిమెంట్లు అధిక బరువును తగ్గిస్తాయా

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, కేథరిన్ డా కోస్టా
- హోదా, బీబీసీ హెల్త్
బరువు తగ్గడానికి తీసుకునే ప్రత్యామ్నాయ ఔషధాల వల్ల పెద్దగా ప్రభావం ఉండదని వీటిపై అధ్యయనం చేసిన ఒక అంతర్జాతీయ సమీక్ష వెల్లడించింది.
కొన్ని మూలికలతో చేసిన ఔషధాలు, ఆహార పదార్థాలతో చేసే సప్లిమెంట్ల వల్ల కొంతవరకు ఉపయోగం ఉన్నప్పటికీ, వాటి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు ఆధారాలు ఏమి లేవని చెబుతున్నారు.
దీర్ఘకాలంలో ఇవి సురక్షతమేనా కాదా అన్న దానిపై మరింత పరిశోధన జరగాలని సూచించారు.
మొక్కలు, జంతు ఉత్పత్తులతో కూడిన డైట్ మందులు, పౌడర్లు, ద్రవాలకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది.
అంతర్జాతీయంగా ఈ పరిశ్రమ విలువ 41 బిలియన్ డాలర్లు ఉండొచ్చని గత ఏడాది అంచనా వేశారు.
ప్రతి ఏటా కేవలం 20 శాతం కొత్త ఉత్పత్తులకు మాత్రమే ఆడిట్ జరుగుతోంది. ఈ ఔషధ సంస్థల వాదనలకు ఆధారాలు ఉన్నాయని చెప్పేందుకే ఇలా చేస్తారు.
ఈ డైట్ సప్లిమెంట్లలో ఆమోదయోగ్యమైన పరిమాణంలో మాత్రమే ఔషధ రహిత పదార్థాలు ఉండాలనే నియమం కూడా కొన్ని దేశాల్లో ఉంది.
"ఇవి మార్కెట్‌లోకి రావడానికి ముందు సాధారణ మెడిసిన్ల మాదిరిగా క్లినికల్ ఆధారాలు, వాటి ప్రభావం గురించి ఆధారాలు చూపించనవసరం లేదు" అని ఈ అధ్యయనం చేసిన ప్రధాన పరిశోధకురాలు ఎరికా బెస్సెల్ చెప్పారు.
అయితే ఈ సప్లిమెంట్లు వాడితే బరువు తగ్గుతారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తమ అధ్యయనంలో తేలిందని వివరించారు.
చాలా రకాల సప్లిమెంట్లు కొంత కాలం పాటు వాడటానికి సురక్షితంగానే అనిపించినప్పటికీ, ఇవి బరువును తగ్గించలేవని చెప్పారు.
ఆస్ట్రేలియాకు చెందిన అధ్యయనకారులు ఈ పరిశోధన చేశారు.
ఈ అధ్యయనం కోసం బరువు తగ్గేందుకు మూలికా సప్లిమెంట్ల వల్ల కలిగే ప్రభావాన్ని డమ్మీ చికిత్సతో పోల్చి చూసారు. 2018 ఆగస్ట్ వరకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
16 సంవత్సరాలు నిండిన అధిక బరువు ఉండి ఆరోగ్యకరంగా ఉన్న 4331 మందిపై పరిశోధన చేశారు. ఇలా చేసిన 54 అధ్యయనాల డేటాను విశ్లేషించారు.
వైద్య పరంగా కనీసం 2.5 కేజీల బరువు తగ్గితే దానిని బరువు తగ్గినట్లుగా పరిగణిస్తారు.
హర్బల్ సప్లిమెంట్లు అయిన గ్రీన్ టీ, గార్సినియా కంబోజియా, వైట్ కిడ్నీ బీన్స్, ఎఫెడ్రా, ఆఫ్రికా మామిడి, ఎర్బా మెట్, అడవి ద్రాక్ష, అతి మధురం వేళ్ళు, తూర్పు భారతదేశపు గ్లోబ్ తసిల్ లాంటి వాటిని విశ్లేషించారు.
అయితే, వీటన్నిటిలోనూ కేవలం వైట్ కిడ్నీ బీన్ వల్ల కాస్త మంచి ఫలితాలు వచ్చినట్లు ఈ అధ్యయనం తేల్చింది.
దీని వల్ల 1.61 కేజీల బరువు తగ్గినట్లు తెలిపింది. కానీ ఈ ఫలితాలను వైద్యపరంగా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.
అలాగే ఆఫ్రికా మామిడి, అడవి ద్రాక్ష, తూర్పు భారతదేశపు గ్లోబ్ తసిల్ వంటి వాటిని కలిపి చూస్తే ఫలితాలు కొంత వరకు ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు.
అయితే, "ఈ ఫలితాలను చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి " అని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సత్వర పరిష్కారాలు
రూపాంతరం చేసిన సెల్లులోజ్, బ్లడ్ ఆరంజ్ రసంతో కొంత వరకు ఆశాజనక ఫలితాలు వచ్చాయని వివరించారు. అయితే, వీటిపై ఒకేసారి మాత్రమే పరిశోధన చేసినట్లు చెప్పారు. బరువు తగ్గేందుకు వీటిని సిఫార్సు చేసే ముందు మరిన్ని ఆధారాలు అవసరమని పరిశోధకులు అంటున్నారు.
"బరువు సమస్యలు తగ్గడానికి మూలికా వైద్యాలు, సత్వర పరిష్కారాలు ఇచ్చేవిగా కనిపిస్తాయి కానీ, వాటి గురించి మనకు తెలిసింది చాలా తక్కువనే విషయం వాటిని వాడేవారు గుర్తుంచుకోవాలి" అని బెస్సెల్ అన్నారు.
ఈ డైట్ సప్లిమెంట్లపై అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన అధ్యయనాలు తక్కువగా జరిగాయని అన్నారు. వీటి దీర్ఘకాలిక ప్రభావంపై సమాచారం లేదని చెప్పారు.
ఇటీవల కాలంలో విపరీతంగా అభివృద్ధి చెందుతున్న డైట్ సప్లిమెంట్ల పరిశ్రమ, ఈ ఉత్పత్తుల ప్రాముఖ్యత దృష్ట్యా, వీటిపై మరిన్ని విస్తృత అధ్యయనాలు జరగాలని ఆమె అన్నారు.
ఈ అధ్యయనం ఫలితాలను ఈ ఏడాది ఒబేసిటీపై జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ సదస్సులో విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











