అఫ్గానిస్తాన్: పెళ్లి రోజే దారుణాన్ని చూసిన జంట.. బంధువులు ఇప్పటికీ సూటిపోటి మాటలు అంటున్నారు

- రచయిత, అలెగ్జాండర్ కిర్మాణీ
- హోదా, బీబీసీ న్యూస్
అది వారి జీవితంలో చాలా సంతోషకరమైన రోజుగా జీవితాంతం గుర్తుండిపోవాల్సింది.. కానీ, అదే అత్యంత విషాదకరమైన రోజుగా మారింది.
అఫ్గానిస్తాన్‌కు చెందిన మీర్వైజ్, రెహానా గత ఏడాది కాబూల్‌లో వివాహం చేసుకున్నారు. వారి పెళ్లిరోజున ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో పెళ్లికి వచ్చిన 90 మంది అతిథులు మరణించారు.
మీర్వైజ్, రెహానాల ఆత్మీయులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి కారణంగా వారి వివాహం వారికి విషాదకరమైన రోజుగా మారింది.
ఈ వారానికి వారి పెళ్లయి ఏడాదవుతుంది. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా రెహానా ఆ రోజు జరిగిన ఘటనల గురించి మాట్లాడారు.
"రోజూ నాకు పీడకలలు వస్తుంటాయి. సరిగా నిద్రపోలేకపోతున్నాను. ఏవైనా పెద్ద శబ్దాలు, పేలుళ్లు వినిపిస్తే భయంతో వణికిపోతాను. మళ్లీ ఏదో దారుణం జరగబోతున్నట్టు అనిపిస్తుంది" అని బీబీసీతో చెప్పారు.
ఆ రోజు దాడిలో మరణించిన వారి బంధువులు మళ్లీ ఆ పెళ్లి జరిగిన హాల్ ఎదుటే నిరసనలకు దిగాలని ఆలోచిస్తున్నారు. చనిపోయినవారికి న్యాయం జరగాలంటే ఇదొక్కటే మార్గమని భావిస్తున్నారు.
కానీ ఆ నిరసనల్లో తాను పాల్గొనలేనని మీర్వైజ్ అన్నారు. ఆ రోజు జరిగినది తలచుకుంటేనే వణుకు పుడుతుంది.
పెళ్లికి ముందు మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. అకస్మాత్తుగా మా ఆనందం అంతా ఆవిరైపోయింది. ప్రళయం వచ్చి పడినట్లనిపించింది అని మీర్వైజ్ వాపోయారు.

షియా వర్గం కావడం వల్లే టార్గెట్ చేశారు
మీర్వైజ్, రెహానాల వివాహాన్ని లక్ష్యంగా చేసుకోడానికి కారణం వారు అఫ్గానిస్తాన్‌లోని షియా వర్గానికి చెందినవారు కావడమే.
ఇస్లామిక్ స్టేట్ ఈ వర్గం విశ్వాసాలను ధర్మ విరుద్ధంగా భావిస్తుంది. చాలా ఏళ్లుగా ఐఎస్ షియా వర్గంపై దాడులు చేస్తూనే ఉంది.
కొత్త జంటపై నిందలు
ఆ రోజు జరిగిన ఘోరానికి వధూవరులిద్దరూ హతాశులైపోయరు. వీరి పెళ్లి వల్లే ఇంత దారుణం జరిగిందని బంధువులంతా ఆడిపోసుకున్నారు. దాంతో వారిద్దరూ మరింత కుంగిపోయారు.
"ఒకరోజు నేను షాపింగ్‌కు వెళ్లాను. మా పెళ్లిలో మరణించినవారి బంధువు అక్కడ కనిపించారు. నన్ను చూడగానే 'హంతకుడు' అని నిందించారు" అంటూ మీర్వైజ్ తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
మీర్వైజ్ దర్జీ పని చేస్తారు. నిందలు, వేధింపులు ఎక్కువవడంతో అతను తన దుకాణాన్ని మూసేయాల్సి వచ్చింది.
రెహానాను కూడా జనం విడిచిపెట్టలేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంవల్లే ఆ ఘోరం జరిగిందని నిందలు వేశారు.
"అందరూ నా వల్లే ఈ దారుణం జరిగిందని నిందిస్తున్నారు. నేనన్నీ నిశ్శబ్దంగా వింటాను. తిరిగి ఏమీ అనను" అని రెహానా అన్నారు.

ఫొటో సోర్స్, EPA
అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ దాడులు..
ఈ పేలుడుకి కారణమైన ఐఎస్ అఫ్గానిస్తాన్ వరకు తాలిబన్‌లంత శక్తివంతమైనది కానప్పటికీ అనేక ప్రాణాంతకమైన దాడులకు తెగబడింది.
ఈ ఏడాది మే నెలలో ఈ సంస్థ కాబూల్‌లో ఒక ప్రసూతి ఆస్పత్రి మీద దాడి చేసింది. అందులో 24మంది మహిళలు, పిల్లలు, శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నెల ప్రారంభంలో జలాలాబాద్‌లోని ఒక జైలుపై దాడి చేసి వందలకొద్దీ ఖైదీలను బయటకు వెళ్లేలా చేసింది.
ఐఎస్‌కు చెందిన అగ్రనాయకులెందరినో అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ సంస్థకు పట్టున్న ప్రాంతాలను ప్రభుత్వం తిరిగి తన అధీనంలోకి తెచ్చుకుంది. అయినా ఐఎస్ మాత్రం తన దాడులను ఆపలేదు.

ఫొటో సోర్స్, AFP
గాయాలు మళ్లీ మళ్లీ రేగుతున్నాయి
మీర్వైజ్, రెహానాల పెళ్లిలో మరణించినవారి బంధువులు కనిపించినప్పుడల్లా మళ్లీ ఆ గాయలు రేగుతాయని వారిద్దరూ అంటున్నారు.
"మా పెళ్లి అయిన వారం తరువాత కాబూల్‌లో మరో బాంబు పేలుడు సంభవించింది. అది విని నా భార్య స్పృహ కోల్పోయింది" అని మీర్వైజ్ చెప్పారు.
రెహానాకు ఇప్పుడు మానసిక వైద్యం జరుగుతోంది. కాబూల్‌కు చెందిన ఒక చారిటీ సంస్థ 'పీస్ ఆఫ్ మైండ్ అఫ్గానిస్తాన్' ఆమెకు ఈ వైద్యసహాయం అందిస్తోంది.
జరిగిన ఘోరం రేపిన గాయాలనుంచీ బయటపడడానికి ఈ వైద్యసహాయం ఎంతో ఉపయోగపడుతోందని రెహానా చెప్పారు.
"నా బాధలన్నీ మరొకరితో చెప్పుకోగలుగుతున్నాను. అది నాకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది" అని రెహానా అన్నారు.
రెహానాకు వైద్యం అందిస్తున్న మానసిక నిపుణులు లైలా ష్వార్ట్జ్ బీబీసీతో మాట్లాడుతూ "రెహానా మానసిక ఆరోగ్యం మెరుగవుతూ ఉంది. అప్పుడే మరో పేలుడు సంభవించింది. దాంతో ఆమె మళ్లీ మునుపటి మానసిక స్థితికి వెళ్లిపోయారు" అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో ఏటా వేలమంది ఉగ్ర దాడుల్లో మరణిస్తారు. ఎంతోమంది మానసికంగా కుంగిపోతారు. కానీ చాలాకొద్దిమందికే మానసిక వైద్యం అందుబాటులో ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలే సరిగ్గా లేని దేశంలో మానసిక వైద్యం లభించడం కష్టమే!
మీర్వైజ్, రెహానాలకు ప్రైవేట్ ఆస్పత్రి ఖర్చులు భరించడం భారమే కానీ వారికి ధార్మిక సంస్థల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి.
శాంతిస్థాపన కలలో మాట
అఫ్గానిస్తాన్‌లో ప్రతి కుటుంబానికి మానసిక వైద్యం అందాల్సిన అవసరం ఉందని మీర్వైజ్ అభిప్రాయపడుతున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక దాడిలో ప్రాణాలు కోల్పోయినవారో లేక గాయాల పాలైనవారో ఉంటారని మీర్వైజ్ అన్నారు.
అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య రాబోయే రోజుల్లో శాంతి చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నారు. అయితే ఇందులో ఐఎస్ భాగం కాబోదు.
"అఫ్గానిస్తాన్‌లో మాకు రక్షణ లేదు" అని రెహానా అంటున్నారు.
మీర్వైజ్, రెహానాలు అఫ్గానిస్తాన్‌కు దూరంగా కొంతకాలంపాటూ గడిపి వస్తే వారి మానసిక స్థితి మెరుగవుతుందని ష్వార్ట్జ్ భావిస్తున్నారు. వారి వివాహ సమయంలో జరిగిన దారుణాన్ని మరచిపోయి, మామూలు జీవితం ప్రారభించాలంటే వారు కొంతకాలం విదేశాల్లో గడపడం మంచిదని ఆమె అంటున్నారు. అందుకు కావలసిన నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.
మీర్వైజ్‌కు కూడా కౌన్సిలింగ్ అందిస్తున్నారు. కానీ శాంతి స్థాపన కలలో మాటగానే అనిపిస్తోందని అతను అంటున్నారు.
"నా పెళ్లికి ముందు చాలా త్వరలో మనకు శాంతి లభిస్తుందని అంటుండేవారు. ఏది శాంతి? ఎక్కడ ఉంది? పెళ్లయి ఏడాదైంది కానీ దేశంలో శాంతి చేకూరే మార్గం కనిపించట్లేదు" అని మీర్వైజ్ వాపోయారు.
"పదేళ్ల తరువాత కూడా అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపన జరుగుతుందన్న ఆశ లేదు" అని మీర్వైజ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








