లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రతి ఏటా మతాంతర వివాహం చేసుకోవాలనుకునే దాదాపు వెయ్యి జంటలు తమకు అండగా నిలవాలని దిల్లీలోని ఒక సంస్థ సాయం కోరుతాయి.

సాధారణంగా హిందూ, ముస్లిం జంటలు తమ పెళ్లికి కుటుంబాలు ఒప్పుకోని సమయంలో ధనక్‌ను సంప్రదిస్తుంటాయి.

తల్లిదండ్రుల తీరుతో విసిగిపోయిన 20-30 ఏళ్ల మధ్య అమ్మాయిలు, అబ్బాయిలు.. కుటుంబాలతో మాట్లాడి తమ పెళ్లికి సాయం చేయాలని, లేదంటే న్యాయ సహాయం అందించాలని ఈ స్వచ్ఛంద సంస్థను కోరుతారు.

ధనక్ సాయం కోరుతున్న జంటల్లో ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలనుకునే 52 శాతం హిందూ అమ్మాయిలు, హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలని వచ్చే 42 శాతం ముస్లిం అమ్మాయిలు ఉంటున్నారు.

భారత్‌లో హిందూ, ముస్లిం కుటుంబాలు రెండూ మతాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ధనక్ సంస్థను స్థాపించిన ఆసిఫ్ ఇక్బాల్ నాకు చెప్పారు.

"ఆ పెళ్లిని అడ్డుకోడానికి వాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. అబ్బాయి కుటుంబమే ఈ పెళ్లి వద్దనుకునేలా కొందరు తల్లిదండ్రులు తమ కూతురిపై మచ్చ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అలాంటి బంధాలను నిరుత్సాహపరిచేందుకు ఇప్పుడు వారికి 'లవ్ జిహాద్' అనే మరో ఆయుధం దొరికింది" అన్నారు.

మతం మార్చడానికే, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారని ఆరోపించే హిందూ గ్రూపులు భారత్‌లో మతాంతర వివాహాలను అడ్డుకునేందుకు 'లవ్ జిహాద్' అనే పదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి.

అహ్మదాబాద్ నగరంలో 2018లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్ నగరంలో 2018లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన

గత వారం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అతడిని మొదట లవ్ జిహాద్‌ లక్ష్యంగా తీసుకువచ్చిన కొత్త మతమార్పిడి వ్యతిరేక చట్టం కింద అరెస్ట్ చేశారు. మరో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయి.

వంచన, మోసం, వక్రీకరణను అడ్డుకోడానికి ఇలాంటి చట్టాలు అవసరమని ఆ పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

"హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, హిందూ సంస్థలు ఎప్పుడూ దానిని ఒక అద్భుతమైన ప్రేమ కథగా వర్ణిస్తాయి. అది రివర్స్ అయితే మాత్రం బలవంతంగా ఆ పెళ్లి జరుగుతున్నట్లు ఆరోపిస్తార"ని 'మిత్ ఆఫ్ లవ్ జిహాద్'పై పరిశోధనలు చేస్తున్న దిల్లీ యూనివర్సిటీ చరిత్రకారులు చారు గుప్తా చెప్పారు.

భారత్‌లోని చాలా ప్రాంతాల్లో పితృస్వామ్యం, బంధుత్వం, కులం, మతం, కుటుంబ గౌరవం లాంటివి ప్రేమను కష్టాల్లో, ప్రమాదంలో పడేశాయి. అయితే, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉన్న కొంతమంది యువతీ యువకులు శతాబ్దాలనాటి సామాజిక కట్టుబాట్లను ధైర్యంగా ఎదిరిస్తున్నారు.

మొబైల్ ఫోన్లు, చౌకగా లభిస్తున్న డేటా, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల సాయంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్రేమలో పడుతున్నారు.

రచయిత్రి అరుంధతీ రాయ్ తన 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' నవల్లో చెప్పినట్లు "ఎవరిని, ఎలా, ఎంతగా ప్రేమించాలో చెప్పే ప్రేమ చట్టాలను" వీరు బద్దలు కొట్టారు.

పెద్దలు కుదిర్చిన, భిన్న లింగాల, ఒకే కులంలో వివాహాలను భారత్‌లో ఆదర్శంగా భావిస్తారు. దేశంలో జరిగే పెళ్లిళ్లలో 90 శాతానికి పైగా పెద్దలు కుదిర్చినవే ఉంటున్నాయి. మతాంతర వివాహాలు చాలా అరుదు. ఒక అధ్యయనంలో అవి 2 శాతమేనని తేలింది.

హదియా జహాన్ ఇస్లాం మతంలోకి మారి, ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 2018లో హదియా తన భర్తతో కలసి ఉండేందుకు ఒక కోర్టు అనుమతి ఇచ్చింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హదియా జహాన్ ఇస్లాం మతంలోకి మారి, ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 2018లో హదియా తన భర్తతో కలసి ఉండేందుకు ఒక కోర్టు అనుమతి ఇచ్చింది

హిందూ సంస్థలు రాజకీయ లబ్ధి కోసం ఎప్పటికప్పుడు లవ్-జిహాద్ భూతాన్ని లేవనెత్తుతుంటాయని చాలామంది భావిస్తున్నారు.

భారత్‌లో ఇలాంటి మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారాలకు చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది.

1920లు, 1930ల్లో మత ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర భారతదేశంలోని హిందూ జాతీయవాద గ్రూపులు హిందూ మహిళలను ముస్లింలు అపహరిస్తున్నారంటూ, వాటికి వ్యతిరేకంగా ఒక ప్రచారం ప్రారంభించాయి. హిందూ భార్యలను తమకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశాయి.

ముస్లిం పురుషులు హిందూ మహిళలను అపహరిస్తున్నారని ఆరోపిస్తూ, వాటిని అడ్డుకోడానికి యునైటెడ్ ప్రావిన్సెస్(ప్రస్తుత ఉత్తరప్రదేశ్)లో ఒక హిందూ సంస్థను స్థాపించారు.

1924లో కాన్పూర్‌లోని ఒక ముస్లిం అధికారి హిందూ మహిళను తన వలలో వేసుకున్నాడని, బలవంతంగా మతం మార్చాడని ఆరోపించారు. ఆమెను ఆ అధికారి ఇంటి నుంచి విడిపించాలని ఇంకో హిందూ సంస్థ డిమాండ్ చేసింది.

హిందూ మహిళల అపహరణ గురించి వలస పాలనలోని భారత పార్లమెంటులో చర్చ కూడా జరిగింది.

"బలవంతంగా అపహరించి, పెళ్లి చేసుకున్న మహిళలను తిరిగి వారి ఇళ్లకు పంపించాలని, సామూహిక మత మార్పిడులకు ప్రామాణికత లేదని, తాము కోరుకున్న జీవితంలోకి తిరిగి రావడానికి ఆ మహిళలకు అన్ని అవకాశాలూ అందించాలని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది.

1947లో దేశ విభజన జరిగినప్పుడు పది లక్షల మంది చనిపోయారు, నిరాశ్రయులైన కోటిన్నర మంది పాకిస్తాన్‌కు పారిపోయారు. అక్కడ నుంచి హిందువులు, సిక్కులు భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో హింస ఎక్కువగా మహిళలపైనే సాగింది. ఇది మరో తీవ్రమైన బేధాన్ని సృష్టించింది.

ఇల్లు వదిలి పారిపోయిన జంటలు పోలీసుల రక్షణలో షెల్టర్ హోమ్స్‌లో ఉంటున్నాయి

ఫొటో సోర్స్, Mansi Thapliyal

ఫొటో క్యాప్షన్, ఇల్లు వదిలి పారిపోయిన జంటలు పోలీసుల రక్షణలో షెల్టర్ హోమ్స్‌లో ఉంటున్నాయి

ఇటీవల ఎన్నికలకు ముందు హిందువుల ఓట్లు కూడగట్టేందుకు హిందూ జాతీయవాద గ్రూపులు 'లవ్ జిహాద్ పదాన్ని లేవనెత్తాయి. 2014లో ఉతరప్రదేశ్‌ స్థానిక ఎన్నికలు దీనికి ఒక ఉదాహరణగా నిలిచాయి.

ఆ ఎన్నికల్లో "ముస్లిం పురుషులు హిందూ మహిళను అపహరించడం, మతం మార్చడం, వారిపై అత్యాచారం చేయడం, బలవంతంగా పెళ్లి చేసుకోవడం, మతం మార్చడానికి ప్రేమ పేరుతో వల వేస్తున్నారని ఆరోపిస్తూ హిందూ గ్రూపులు పోస్టర్లు, వదంతుల ద్వారా పక్కా వ్యూహం ప్రకారం ప్రచారం చేశాయి" అని ప్రొఫెసర్ గుప్తా తెలిపారు.

బీజేపీ సైద్ధాంతిక రైట్ వింగ్ సంస్థ ఆర్ఎస్ఎస్, తమ అధికార వాణిలో 'లవ్ జిహాద్' గురించి ఎన్నో కవర్ స్టోరీలు ప్రచురించింది. "లవ్ ఫర్ ఎవర్, లవ్ జిహాద్ నెవర్" అని నినదించాలని కోరింది.

ఈ కథనాల్లో ముస్లిం పురుషుల గురించే కాదు, హిందూ మహిళలను వలలో వేసుకోడానికి 'అంతర్జాతీయ ఇస్లాంవాద కుట్ర' జరుగుతోందనే వందతులు కూడా ఉన్నట్లు రాశారు.

ఖరీదైన బట్టలు, కార్లు బహుమతులు కొనడానికి ముస్లిం అబ్బాయిలకు విదేశీ నిధులు అందుతున్నాయని, హిందూ అమ్మాయిలను ఆకర్షించేందుకు వారు హిందువుల్లా కూడా నటిస్తున్నారని చెప్పారు.

'గ్లోబల్ లవ్ జిహాద్‌'లో భాగంగా బలహీనంగా ఉన్న హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని యూపీలోని ఒక బీజేపీ ప్రతినిధి ఆరోపించారు.

కానీ, ప్రొఫెసర్ గుప్తా ఈ ఆరోపణలను హిందూ మహిళల పేరుతో రాజకీయ, మత సమీకరణకు చేస్తున్న ప్రయత్నాలుగా వర్ణించారు.

ప్రేమికులు

ఫొటో సోర్స్, Getty Images

గతంలో, ప్రస్తుతం జరుగుతున్న 'లవ్ జిహాద్' ప్రచారాలకు పోలికలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, అధికార బీజేపీ నేతృత్వంలో ఈ ప్రచారం క్రమంగా మరింత బలోపేతం అయ్యిందని అంటున్నారు.

"స్వాతంత్ర్యానికి ముందు ఇలాంటి ప్రచారాలు వార్తాపత్రికల పేజీల లోపలే ఉండిపోయేవి. అలాంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి, అప్పట్లో ప్రధాన రాజకీయ పార్టీలేవీ ఉండేవి కాదు. ఇప్పుడు ఇది మొదటి పేజీ అంశంగా మారింది. రాష్ట్రాలు ఈ చట్టాలను అమలు చేయడంలో నిమగ్నమయ్యాయి. బలవంత మత మార్పిడుల కోసమే ముస్లిం అబ్బాయిలు, హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారనే సందేశం వైరల్ చేసేందుకు సోషల్ మీడియా, మెసేజ్ సేవలను ఉపయోగించుకుంటున్నార"ని గుప్తా చెప్పారు.

మతాంతర వివాహం చేసుకోవాలనుకున్న జంటలు భారత 'స్పెషల్ మ్యారేజ్ యాక్ట్' నుంచి తప్పించుకోవాలని అనుకున్నప్పుడే ఇలా మతమార్పిడులు జరుగుతాయని చాలా మంది భావిస్తున్నారు.

ఈ చట్టం ప్రకారం మతాంతర వివాహం చేసుకోవాలనుకునే జంటలు పెళ్లికి కొన్ని నెలల ముందే తమ వ్యక్తిగత వివరాలను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోపు కుటుంబాలు, తమ పెళ్లిని అడ్డుకుంటాయేమోనని చాలా జంటలు భయపడుతున్నాయి.

భాగస్వామిని ఎంచుకుని మతాంతర వివాహాలు చేసుకోవాలనుకునే వారిని అడ్డుకోడానికి, వారిలో భయం కలిగించడానికే ఈ చట్టాలు తీసుకొచ్చారని, తల్లిదండ్రులు, అధికారులు యువతను హెచ్చరించడానికి ఈ చట్టాలను ఉపయోగించవచ్చని చాలామంది భావిస్తున్నారు.

మరోవైపు, చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు కులమతాల గోడలను కూల్చిమరీ ప్రేమలో పడుతున్నారు. ప్రేమ కోసం కుటుంబాలను కూడా వదులుకుంటున్నారు. అలాంటి పెళ్లిళ్లను రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా అడ్డుకున్నప్పుడు, వారిలో చాలా మంది ప్రభుత్వ సంరక్షణ గృహాలలో ఉండాల్సి వస్తోంది.

"భారత్‌లో ప్రేమ సంక్లిష్టమైనది, కఠినమైనది" అంటున్నారు ఇక్బాల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)