జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?

ఫొటో సోర్స్, kcr/facebook
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో మేయర్ పదవి ఏ పార్టీకి దక్కబోతోందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
అసలు ఇలాంటి సమయాల్లో మేయర్ పదవికి ఎన్నిక ఎలా జరుగుతుంది? ఈ ప్రక్రియలో ఎక్స్‌అఫీషియో ఓట్ల పాత్ర ఏంటి? ఆ మద్దతుతో మేయర్ పదవి దక్కించుకోవడం సాధ్యమేనా? మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలా? మెజార్టీ సరిపోతుందా? ఈ అంశాలన్నీ ఆసక్తికరంగా మారాయి.
ఎక్స్‌అఫీషియో ఓట్లు అంటే...
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నేరుగా ప్రజల ఓట్లతో ఎన్నికైన కార్పొరేటర్లతో (మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు) పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన, ఇతర ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరోక్షంగా గెలిచిన రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉంటుంది.
ఇందుకోసం వారు ముందుగానే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
అయితే గతంలో వేరే ఏదైనా మున్సిపాలిటీలో ఓటు వేసి ఉంటే మరో చోట పేరు నమోదు చేసుకునే వీలు ఉండదు. అంటే, ఒక ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో రెండు మున్సిపాలిటీలు ఉంటే, ఏదో ఒక చోటే ఎక్స్అషీయోగా తన పేరు నమోదు చేసుకోవచ్చు.
ఎక్స్అఫీషియో సభ్యులను కొన్నిచోట్ల కోఆప్షన్ సభ్యులు అని కూడా అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాజిక్ ఫిగర్ ఎంత?
మేయర్ పదవి దక్కించుకునేందుకు కార్పొరేషన్‌లోని మొత్తం సీట్లలో సగం కన్నా ఎక్కువ దక్కించుకోవాలి. ఉదాహరణకు ఒక చోట 100 మంది సభ్యులు ఉంటే, కనీసం 51 ఓట్లు రావాలి.
ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 స్థానాలు ఉండగా, వీటికి అదనంగా కొన్ని ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఈ ఎక్స్‌అఫీషియో ఓట్లు ఎన్ని అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. 52, 44, 45 ఇలా రకరకాల లెక్కలు ఉన్నాయి.
గ్రేటర్ పరిధిలోని మొత్తం ఎక్స్‌అఫీషియో అర్హత ఉన్న వారి సంఖ్య నుంచి, గతంలో వేర్వేరు మున్సిపాలిటీల్లో ఓట్లు వేసిన వారిని తీసేస్తే ఈ సంఖ్య తేలుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది.
ఒకవేళ ఎక్స్‌అఫీషియో ఓట్లు 52 ఉన్నాయి అనుకుంటే, అప్పుడు మేయర్ ఎన్నికలో ఓటు వేసేవారి సంఖ్య 202 అవుతుంది. మేయర్ పీఠం కావాలంటే 102 స్థానాల బలం అవసరం అవుతుంది. దీన్ని ‘మ్యాజిక్ ఫిగర్’ అంటారు.
టీఆర్ఎస్ ప్రస్తుతానికి 55 స్థానాలు సంపాదించుకుంది. ఆ పార్టీకి మేయర్ పదవి దక్కించుకోవాలంటే, ఇంకా 47 ఓట్లు అవసరం.
ఒకవేళ ఎక్స్‌అఫీషియో ఓట్లు 44 అయితే, అప్పుడు మొత్తం బలం 194గా మారుతుంది. మ్యాజిక్ ఫిగర్ 98 అవుతుంది.

ఫొటో సోర్స్, ktr/twitter
ఎక్స్‌అఫీషియో ఓట్లలో టీఆర్ఎస్ బలం ఎంత?
మొత్తం ఎక్స్‌అఫీషియో ఓట్లలో టీఆర్ఎస్‌వి 38 ఓట్లు ఉన్నాయని ఓ లెక్క, 31 ఓట్లు ఉన్నాయని మరో లెక్క వినిపిస్తున్నాయి. కచ్చితమైన సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది.
ఎంఐఎంకి 10, బీజేపీకి 3, కాంగ్రెస్‌కి 1 చొప్పున ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి.
ఎక్స్‌అఫీషియో ఓట్ల బలం కలుపుకుని చూస్తే, మ్యాజిక్ ఫిగర్‌కి టీఆర్ఎస్ ఇంకా 9 లేదా 12 ఓట్ల దూరంలో ఉంది.
ఇక మిగతా పార్టీలకూ ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నా, అవి అధికారంలోకి వచ్చేంత ఎక్కువగా లేవు.
ఎక్స్‌అఫీషియో ఓట్లలో టీఆర్ఎస్ సంఖ్య తేలకపోవడానికి ఓ కారణం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అవసరమైన చోట్ల హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాయకుల ఎక్స్‌అఫీషియో ఓట్లను టీఆర్ఎస్ వాడుకుంది.
ఒక చోట ఓటు వేసిన వారు మరో చోట ఎక్స్‌అఫీషియో ఓటు వేయడానికి వీలు లేకపోవడంతో, ఇప్పుడు జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఎక్స్‌అఫీషియో ఓట్ల సంఖ్య తగ్గింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎన్నిక రోజు కొందరు గైర్హాజరయితే...
తక్కువ బలంతో టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం కూడా ఉంది.
మేయర్ ఎన్నిక జరిగే రోజు సభకు హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యను బట్టి మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. హాజరైనవారి సంఖ్య తగ్గితే, మ్యాజిక్ ఫిగర్ కూడా తగ్గుతుంది.
200 మంది సభకు వస్తే, 101 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అదే 150 మందే సభకు వస్తే మ్యాజిక్ ఫిగర్ 76 అవుతుంది.
ఈ లెక్కన, ఒకవేళ ఎంఐఎం మొత్తంగా గానీ, ఆ పార్టీ కార్పొరేటర్లలో ఓ మోస్తరుగా గానీ సభకు రాకుండా ఉంటే, మ్యాజిక్ ఫిగర్ తగ్గి టీఆర్ఎస్ మేయర్ పీఠం గెలుచుకోవచ్చు.

ఫొటో సోర్స్, aimim
ఏ పార్టీల మధ్య పొత్తు ఉంటుంది?
ఎంఐఎం లేదా బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా టీఆర్ఎస్ మేయర్ పదవి చేపట్టొచ్చు. అయితే, బీజేపీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు.
ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవచ్చు. గతంలో ఆ రెండు పార్టీలూ ఎంతో సన్నిహితంగా మెలిగాయి కూడా.
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకోవడం లేదా, మేయర్ పదవిని కొంత కాలం వారు, కొంత కాలం వీరూ పంచుకోవడం ఇలా ఏదో ఒక ఏర్పాటుకు రావొచ్చు.
కానీ, కేసీఆర్ ఇప్పుడు పొత్తుల వైపు వెళ్తారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
‘‘మీరు కారుకు వేసే ప్రతి ఓటూ మజ్లిస్‌కు చెందుతుంది’’ అని బీజేపీ ప్రచారం చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.

అసలు మ్యాజిక్ ఫిగర్ అక్కర్లేదా?
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మ్యాజిక్ ఫిగర్ అన్న ప్రసక్తే లేదన్న వాదన కూడా ఉంది.
మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ ఎంపిక, అసెంబ్లీలో సీఎం ఎంపికలా ఉండదు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్వహిస్తారు. అప్పుడే ఎక్స్‌అఫీషియోల ఓట్లు నమోదు చేస్తారు. ఆయా పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను కలెక్టరుకు ఇస్తాయి.
మొత్తం కార్పొరేటర్లను, ఎక్స్‌అఫీషియోలను కలిపి సభలో కూర్చోపెట్టి ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తడం ద్వారా ఎన్నిక ఉంటుంది. వారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని మేయర్ చేస్తారు. అంటే ఎవరికీ 50 శాతం రాకపోయినా, ఉన్నవారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి పదవి దక్కుతుంది. ఇదీ కొందరు చేస్తున్న వాదన.
ఒకవేళ ఇదే నిజమైతే, అప్పుడు టీఆర్ఎస్ బెంగ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే, ఆ పార్టీ ప్రత్యర్థులైన ఎంఐఎం, బీజేపీలు పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదని చెప్పొచ్చు.
అంటే, ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ విడివిడిగా మేయర్ పదవి కోసం పోటీపడితే టీఆర్ఎస్ బలమే ఎక్కువ కాబట్టి, మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కుతుంది. కాంగ్రెస్‌కు ఉన్నది ఇద్దరే కార్పొరేటర్లు కాబట్టి, ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చినా, ప్రభావమేమీ ఉండదు.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో వ్యవస్థను తీసేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు.
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90 (1) కొట్టివేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వ స్పందన కోసం నోటీసులు ఇచ్చింది హైకోర్టు.
ఇక మేయర్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు మంత్రి కేటీఆర్. అంతవరకూ వేచి చూడక కతప్పదేమో!
(ఈ కథనానికి జీహెచ్ఎంసీ ఎన్నికలను దగ్గర నుంచి గమనించిన పలువురు పాత్రికేయులు, రాజకీయ నాయకులు చెప్పిన సమాచారం ఆధారం.)
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








