కరోనావైరస్: హైదరాబాద్‌లో సినిమా థియేటర్లు ఎందుకు మూతపడుతున్నాయి?

శాంతి థియేటర్
ఫొటో క్యాప్షన్, శాంతి థియేటర్
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ తెలుగు

శుక్రవారం వచ్చిందంటే సినిమా అభిమానుల సందడితో థియేటర్ల వద్ద పండుగ వాతావరణంతో కళకళలాడేవి. అలాంటి పరిస్థితి మళ్ళి రాకపోవచ్చు. మల్టీ ప్లెక్సుల ధాటికి అంతంత మాత్రంగా ఉన్న సింగల్ సినిమా థియేటర్లు కరోనా దెబ్బకు మూతపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో శాంతి, శ్రీ మయూరి, గెలాక్సీ వంటి కొన్ని సినిమా థియేటర్లు మూతపడ్డాయి.

కోవిడ్ కారణంగా సినిమా ప్రదర్శనలు నిలిపివేయడంతో థియేటర్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. "రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజనకు ముందు 3600 థియేటర్లు ఉండేవి. ఇప్పుడు 1600 ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో 650పైగా థియేటర్లు ఉన్నాయి. వీటిలో ఎన్ని సినిమా ప్రదర్శనలకు తెరుచుకుంటాయో తెలియదు" అని తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు విజేందర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

మూతపడిన శాంతి థియేటర్ యజమాని పిచ్చేశ్వర రావుతో బీబీసీ మాట్లాడింది. మరో దారిలేక థియేటర్ మూయక తప్పటం లేదని ఆయన చెప్పుకొచ్చారు. 1969లో హైదరాబాద్ లోని నారాయణగూడలో ఆయన శాంతి థియేటర్‌ను ప్రారంభించారు. "అప్పట్లో ఇక్కడ మామిడి తోట ఉండేది. సినిమాల మీద ఉన్న ఆసక్తితో థియేటర్ వ్యాపారంలోకి వచ్చాను. పుణె నుంచి వాస్తుశిల్పిని తీసుకొచ్చి దగ్గరుండి డిజైన్ చేయించాను. థియేటర్‌లో పెట్టిన షాండ్లియర్ కోసం దేశమంతా తిరిగాను. అప్పట్లో అది ప్రత్యేక ఆకర్షణగా ఉండేది" అన్నారు.

పెద్ద హీరోల సినిమాలు విడుదల అయిన రోజు జరిగే సందడి అంతా ఇంతా కాదు. సినిమా హిట్టా ఫ్లాపా తెలుసుకోవాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న థియేటర్ల వద్ద మొదటి ఆట చూస్తే తెలిసిపోతుంది అంటారు సినిమా అభిమానులు. ఈ కోవకు చెందిన థియేటర్లే శ్రీమయూరి, శాంతి.

మయూరి థియేటర్
ఫొటో క్యాప్షన్, మయూరి థియేటర్

ఎంతో మంది హీరోలు తమ సినిమాను ఆదరించి హిట్ ఇచ్చినందుకు శాంతి థియేటర్ వేదికగా అభిమానులకు కృతజ్ఞత తెలుపుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

"బాధగానే ఉంది. కానీ మరో దారి లేదు. సినిమా అందరూ చూడాలి. అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆదాయం తగ్గిపోతున్నా థియేటర్‌ను నడిపాం. వచ్చే ఆదాయం కాస్త థియేటర్ నిర్వహణకు మాత్రమే సరిపోయేది. ఇప్పుడు కోవిడ్ కారణంగా అది కూడా లేదు. ఒక వేళ మళ్లీ థియేటర్ తెరచినా ఎంత మంది సినిమా చూడటానికి వస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో ఇక నడప లేక పోతున్నాం" అని తన ఆవేదన వ్యక్తం చేశారు శాంతి థియేటర్ యజమాని పిచ్చేశ్వర రావు.

థియేటర్ మూస్తున్న వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది శాంతి థియేటర్ యాజమాన్యం. అది చూసి ఎంతో మంది తమ అనుభావాలను నెమరువేసుకున్నారు. కాలేజీ రోజుల్లో క్లాసులకు డుమ్మా కొట్టి స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లడం, పెళ్లయిన కొత్తలో తొలిసారిగా ఆ థియేటర్లో సినిమాలు చూసిన జంటలు నాటి రోజుల్ని సోషల్ మీడియా వేదికగా గుర్తుకు తెచ్చుకున్నారు.

కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత మళ్ళీ థియేటర్లు తెరిచేందుకు అనుమతులు వచ్చాయి. కొన్ని థియేటర్లు సిద్దమవుతున్నాయి కూడా. కానీ పూర్తి స్థాయిలో ఎన్ని తెరుచుకుంటాయి అన్నది చూడాలి అంటున్నారు థియేటర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి.

దీనికి కేవలం కోవిడ్‌-19 ఒక్కటే కారణం కాదు. దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలు ఇవాళ పరిశ్రమ కుదేలవ్వడానికి దారి తీశాయి. అలా ముక్కుతూ మూల్గుతూ ఉన్న పరిశ్రమకు కోవిడ్ చావు దెబ్బ కొట్టిందని ఆయన బీబీసీకి వివరించారు.

"మల్టీప్లెక్స్‌ల రాకతో కొన్ని సింగిల్ థియేటర్లు మూతపడ్డాయి. దానికి తోడు 100 రోజులు ఆడే సినిమాలు ఎక్కువగా విడుదల కాకపోవడం ఆదాయంపై ప్రభావం చూపాయి. పార్కింగ్‌పై వచ్చే ఆదాయం కోల్పోవడంతో థియేటర్ల నిర్వహణలో పెద్ద లోటు ఏర్పడింది" అని మరో థియేటర్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖాళీగా మయూరి పార్కింగ్ ప్రాంతం
ఫొటో క్యాప్షన్, ఖాళీగా మయూరి పార్కింగ్ ప్రాంతం

పార్కింగ్ ఆదాయం

పార్కింగ్ ఆదాయానికి థియేటర్ల నిర్వాహణకు సంబంధం ఏంటీ అన్న అనుమానం రావచ్చు. దీనిపై హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి, సుదర్శన్ థియేటర్లలో పార్టనర్, హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల సంఘం కార్యదర్శి అయిన బాలగోవింద్ రాజ్ బీబీసీతో మాట్లాడారు.

"టికెట్, పార్కింగ్, క్యాంటీన్.. ఈ మూడు థియేటర్లకు ఆదాయం. టికెట్ ధరలో ఎక్కువ భాగం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌కి పోతుంది. క్యాంటీన్, పార్కింగ్ ఆదాయంపైనే ఆధారపడి థియేటర్ నడపాలి. అయితే పార్కింగ్ రుసుమును రద్దు చేస్తూ ప్రభుత్వం నిబంధనలు తెచ్చింది. దాంతో ప్రజలకు మేలు కంటే పరిశ్రమకు నష్టం ఎక్కువ జరిగింది" అన్నారు బాల గోవింద రాజ్.

2018లో మాల్స్, వినోద ప్రదర్శన స్థలాల వద్ద పార్కింగ్ కల్పించాలన్న చట్టాల్లోని క్లాజులను సవరిస్తూ పార్కింగ్ రుసుము వసూల్‌పై కోన్ని నిబంధనలతో జీఓ జారీ చేసింది ప్రభుత్వం.

అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు బతకాలంటే పార్కింగ్ చార్జీలు వసూలు చేయడానికి అనుమతి ఉండాలని థియేటర్ల యజమానుల అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

ప్రేక్షకుల స్పందన

టికెట్ ధరలు..

సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. టికెట్ ధరలో ఎక్కువ భాగం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌కి పోతుంది. డిమాండ్ ను బట్టి రేటు పెంచడం, తగ్గించడానికి అవకాశం లేదు. రేటు పెంచుకోవాలి అంటే వారు ప్రత్యేక ఆర్డర్లు తెచ్చుకోవాలి. అంటే భారీ సినిమా రిలీజ్ అయిన ప్రతీసారీ థియేటర్ యజమానులు లైసెన్సింగ్ అథారిటీ లేదా కోర్టుకు వెళ్లి రేట్లు పెంచుకునే ఆర్డర్ తెచ్చుకుంటారు.

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, తీరా రేటు పెంచాక, సినిమా సరిగా ఆడకపోతే, దానికి తగ్గట్టుగా రేటు తగ్గించుకోవడానికి అవకాశం ఉండదు. అంటే సినిమా ఫ్లాప్ అయినా రేటు తగ్గించడానికి రూల్స్ ఒప్పుకోవు. అసలే ప్లాప్ అయిన సినిమా ఆపై ధర ఎక్కువ పెట్టి చూసేందుకు ఏ ప్రేక్షకుడు మాత్రం ఇష్టబడతారు?

ఇక్కడ ఇంకో చిక్కు ఉందంటున్నారు విజేందర్ రెడ్డి. "గతంలో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మంది ఉండే వారు. దాంతో సినిమా విడుదలకు ముందు ఎవరైతే తమకు అందుబాటులో ఉన్న ధరలో సినిమా ఇస్తారో వారి వద్ద థియేటర్ల యజమానులు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒకరు ఇద్దరు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వారు అడిగినంతా ఇవ్వాల్సిందే. దానికి తోడు టికెట్ ధర నిర్ణయించుకునే అవకాశం లేకపోవడంతో సినిమా బాగోకపోతే దాని భారం థియేటర్ యజమానిపైనే పడుతుంది" అని ఆయన వివరించారు.

చైనాలోని ఒక థియేటర్‌లో క్రిమి నివారణ రసాయనాలు చల్లుతున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

కరెంటు బిల్లులు

సినిమా థియేటర్ నడపాలంటే నెలకు ఐదు లక్షలు ఖర్చు అవుతుందని విజేందర్ రెడ్డి వివరించారు. ఇందు కరెంటు బిల్లులు, జీతాలు వగైరా ఖర్చులు ఉంటాయి అంటున్నారు. గ్రామాల్లో ఉన్న థియేటర్ల నిర్వాహణకు ఖర్చు ఒక లక్ష తగ్గుతుంది అంటున్నారు.

"సగటున నెలకు కరెంటు బిల్లు లక్షకుపైగా వస్తుంది. కోవిడ్ లాక్‌డౌన్లో కూడా కరెంటు బిల్లులు కట్టాము. అంటే ఎనిమిదిన్నర నెలలు ఆదాయం లేకున్నా కరెంటు బిల్లులు కట్టాల్సి వచ్చింది" అని ఆయన వివరించారు.

మూతపడుతున్న సినిమా థియేటర్లను గోడౌన్లుగా లీజుకు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లు ఉన్న స్థలాలు మంచి రియల్ ఎస్టేట్ విలువ ఉన్న స్థలాలు. ఆదాయం లేని థియేటర్ నిర్వాహణ కంటే గోడౌన్లకు లీజుకు ఇస్తే మంచి ఆదాయం వస్తుందని ఆలోచిస్తున్నారు థియేటర్ ఓనర్లు.

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అనుకూలంగా లేవని కామ్‌స్కోర్ మూవీస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ ఆకెళ్ళ తెలిపారు.

"ఓవైపు కొత్త సినిమాలు రాక, థియేటర్లకు జనాల్ని తీసుకొచ్చే కంటెంట్‌లేని పరిస్థితుల్లో కూడా తట్టుకుని నిలబడే ఆర్థిక పరిస్థితి వారికి ఉండదు. ఇది బాధాకరమైనా, వాస్తవం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశంలోనే అత్యధిక సింగిల్ స్క్రీన్‌లు ఉన్నది కూడా ఆంధ్రా, తెలంగాణల్లోనే. థియేటర్లకు జనం వచ్చే ఆక్యుపెన్సీ రేటు కూడా ఇక్కడే ఎక్కువ. మధ్య, అల్పాదాయ వర్గాలకు ఈ థియేటర్లు వినోదం అందిస్తున్నాయి. ఓ రకంగా ఇది సినిమా పరిశ్రమకు పెద్ద నష్టం. ఇంకా పరిస్థితి చేజారక ముందే, ఈ వ్యవస్థలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల అవసరం గుర్తించి, వారు నిలబడడానికి తగిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం" బీబీసీతో చెప్పారు రాజ్‌కుమార్.

పాత చిత్రం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

ప్రభుత్వం చేయూత

హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ థియేటర్ల నిర్వహణకు సంబంధించిన కొన్ని నిబంధనలు సడలిస్తామని ప్రకటించారు.

ఇతర రాష్ట్రాల తరహాలోనే ఒక రోజులో ఎన్నైనా షోలు వేసుకునేందుకు అనుమతి, టికెట్ ధరల విషయంలో ప్రభుత్వ నియంత్రణ లేకుండా చేయడం, లాక్‌డౌన్‌లో వసూలు చేసిన కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామి ఇచ్చారు. అయితే వీటిపై ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

సినిమా రంగంపై జీఎస్టీ 18 శాతం ఉంది. అందులో 9 శాతం రాష్ట్ర ప్రభుత్వానికీ, 9 శాతం కేంద్ర ప్రభుత్వానికీ వస్తుంది. అయితే చిన్న సినిమాల విషయంలో, అంటే 10 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా జీఎస్టీని తిరిగి రీయంబర్సుమెంటు చేస్తామని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO

''తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్లో మొదలైంది. పరిశ్రమను కాపాడుకోవాలి.'' అని కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించారు.

కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం వస్తే చాలా మంది సింగిల్ స్క్రీన్ యజమానులకు ప్రయోజకరంగా ఉంటుంది అంటున్నారు విజేందర్ రెడ్డి.

ఈ గడ్డు పరిస్థితి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బయట పడతాయా.. లేదా శాంతి, శ్రీ మయూరి, గెలాక్సీ వంటి థియేటర్ల బాటనే పడతాయా అన్నది కోవిడ్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తేలనుంది.

అయితే ఓటీటీలు, మల్టీప్లేక్సులు అందుబాటులో లేని వారికి చేరువగా ఉంటూ, వినోదాన్ని అందిస్తున్న చిన్న సినిమా థియేటర్లు ఎన్ని మిగులుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)