GHMC ఎన్నికల ఫలితాలు: గ్రేటర్ హైదరాబాద్‌లో హంగ్... ఆశించిన ఫలితం రాలేదన్న కేటీఆర్, 2023లో అధికారం తమదేనన్న కిషన్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గద్దెను ఎక్కేందుకు అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి లభించలేదు.
150 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 149 సీట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 55 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా, 48 స్థానాల్లో బీజేపీ, 44 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించాయి.
కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకు పరిమితమైంది.
గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు భారీగా సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంది.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా కమలం పార్టీ ముందంజలో కనిపించింది. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే సరికి టీఆర్ఎస్ 70కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపు కొనసాగిన కొద్దీ టీఆర్ఎస్ ఆధిక్యం తగ్గుతూ, బీజేపీ ఆధిక్యం పెరుగుతూ వచ్చింది.
టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాయి. మొత్తం 150 వార్డులు ఉండగా, 149 వార్డుల్లో విజేతలు ఎవరన్నది ప్రకటించారు.అత్యధికంగా టీఆర్ఎస్ 55 వార్డులు గెలుచుకోగా, 48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 44 వార్డులతో ఎంఐఎం మూడో స్థానం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల మాత్రమే గెలిచింది.
టీఆర్ఎస్ కూకట్‌పల్లి జోన్‌లో 20, షేరిలింగంపల్లిలో 13, సికింద్రాబాద్‌లో 11, ఎల్బీనగర్‌లో 6, ఖైరతాబాద్‌లో 5 వార్డుల చొప్పున గెలిచింది.
బీజేపీ ఎల్బీనగర్‌లో 15, సికింద్రాబాద్‌లో 14, ఖైరతాబాద్‌లో 9, చార్మినార్‌లో 7, కూకట్‌పల్లిలో 2 వార్డులు గెలుచుకుంది. షేరిలింగంపల్లిలో ఒక వార్డులో విజయం సాధించింది.
ఎంఐఎం చార్మినార్ జోన్‌లో 29 వార్డులు, ఖైరతాబాద్ జోన్‌లో 13 వార్డులు గెలుచుకుంది. సికింద్రాబాద్, షేరిలింగంపల్లిల్లోనూ ఒక్కో వార్డు చొప్పున సొంతం చేసుకుంది.
కాంగ్రెస్ ఎల్బీనగర్ జోన్‌లో రెండు వార్డులు గెలుచుకుంది.
ఒక్క నేరెడ్‌మెట్ వార్డులో మాత్రం విజేత ఎవరన్నది ప్రకటించలేదు. ఈ వార్డులో చివరి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 505 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది.
అయితే, స్వస్తిక్ గుర్తుకు బదులు వేరే బ్యాలెట్ కాగితంపై వేరే ముద్ర వేసిన ఓట్లు ఈ వార్డులో 544 పోలయ్యాయి. దీంతో హైకోర్టు ఆదేశం ప్రకారం ఫలితాన్ని ప్రకటించలేదు.
'ఆశించిన ఫలితం రాలేదు.. పార్టీలో ఆలోచించి తదుపరి నిర్ణయం' - కేటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీకి మరో 25 స్థానాలు వస్తాయని భావించామని చెప్పారు. 10కి పైగా స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు చాలా స్వల్ప ఓట్ల తేడాతో పరాయజం పాలయ్యారని వివరించారు.
మేయర్ అభ్యర్థి ఎంపిక గురించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. దానికి ఇంకా రెండు నెలల సమయం ఉందని, కాబట్టి ఈలోపు పార్టీలో అన్నీ చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
ఇంకా ఐదారు స్థానాల ఫలితాలు వెలువడాల్సి ఉందని గుర్తు చేసిన ఆయన ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందింది తమ పార్టీయేనని చెప్పారు.
'2023'లో అధికారానికి ఇదే వేదిక: కిషన్ రెడ్డి
కేటీఆర్ తమ పార్టీపై చేసిన తప్పుడు ఆరోపణలకు జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా ప్రజలే సమాధానం చెప్పారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా అవతరించిందని, 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికలు తమకు వేదికగా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
''టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ప్రజల ఆదరణను ఆ పార్టీ వేగంగా కోల్పోతోంది. జనం విసిరిన సవాలును టీఆర్ఎస్ ప్రభుత్వం స్వీకరించాలి'' అని అన్నారు.
బీజేపీపై టీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని... అక్రమ కేసులు పెట్టినా, తమ కార్యకర్తలు వెనకడుగు వేయలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులను టీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా భయభ్రాంతులకు గురిచేసిందని ఆయన ఆరోపించారు.
హంగ్ ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చాక స్పందిస్తామని, తమ పార్టీ కార్పొరేటర్లు 'కూలిపోతున్న' టీఆర్ఎస్‌లోకి వెళ్లబోరని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తాం: బండి సంజయ్
తమ పార్టీని ఆదరించిన హైదారాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అన్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు సీట్లతోపాటు ఓట్ల శాతం కూడా భారీగా పెరిగిందని అన్నారు. జాతీయ నాయకుల ప్రచారం తమ పార్టీకి బాగా కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో 'గడీల పాలన'ను బద్దలు కొట్టే దమ్ము తమ పార్టీకే ఉందని సంజయ్ అన్నారు.
''టీఆర్ఎస్ పార్టీకి సన్ స్ట్రోక్ తగిలింది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కేసీఆర్ ఇప్పటికైనా అపాయింట్మెంట్‌లు ఇవ్వాలి. 'సారు, కారు, ఇక రారు'... 2023లో కారు షెడ్డుకు పోవడం ఖాయం'' అని అన్నారు.

‘4 నుంచి 40 స్థానాలకు పెరుగుతున్నాం.. టీఆర్ఎస్‌కు నీళ్లు తాగిస్తాం’ - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో గతంలో నాలుగు స్థానాలకు పరిమితమైన తాము ఇప్పుడు 40 స్థానాలు చేజిక్కించుకోనున్నామని, ఇది తమ పార్టీకి చాలాపెద్ద విజయమని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం సాయంత్రం బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో ఆయన మాట్లాడుతూ.. వంద స్థానాల్లో గెలుపొందుతామని ఆశించామని, సంఖ్య తగ్గినప్పటికీ తాము మెరుగైన ప్రదర్శన చేశామన్నారు.
ప్రతిపక్ష హోదాలో ఉంటే కనుక టీఆర్ఎస్ పార్టీకి నీళ్లు తాగిస్తామని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని, బీజేపీ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసించారని రాజాసింగ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రధాని మోదీ సారథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ సాగిస్తున్న రాజకీయాలపై తెలంగాణ ప్రజలు విశ్వాసం ఉంచారని ఆయన అన్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/uttamkumarreddy
టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
150 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి రెండు సీట్లలోనే గెలుపొందింది.
తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురానికి పంపించానని, కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని కోరానని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.



ఫొటో సోర్స్, facebook/trspartyonline
71 వార్డుల్లో టీఆర్ఎస్ ఆధిక్యం... 43 చోట్ల ఎంఐఎం, 34 చోట్ల బీజేపీ...
మధ్యాహ్నం ట్రెండ్స్ ప్రకారం జీహెచ్ఎంసీలోని 71 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థులు 43 చోట్ల, బీజేపీ అభ్యర్థులు 34 చోట్ల ముందంజలో ఉన్నారు.
జోన్ల వారీగా చూస్తే, కూకట్‌పల్లి, షేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లలో టీఆర్ఎస్ జోరు చూపిస్తోంది.
కూకట్‌పల్లిలో 22 వార్డులు ఉండగా, 20 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మిగతా రెండు వార్డుల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
షేరిలింగంపల్లిలో 15 వార్డులు ఉండగా, 12 వార్డుల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రెండు చోట్ల బీజేపీ, ఒక చోట ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
సికింద్రాబాద్ జోన్‌లో 27 వార్డులు ఉండగా, 16 చోట్ల టీఆర్ఎస్ ముందంజలో ఉంది. పది వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు, ఒక చోట ఎంఐఎం అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
చార్మినార్, ఖైరతాబాద్‌ల్లో ఎంఐఎం హవా సాగుతోంది.
చార్మినార్ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉండగా, 28 చోట్ల ఎంఐఎం అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఐదు చోట్ల టీఆర్ఎస్, మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజంలో ఉన్నారు.
ఖైరతాబాద్‌లో మొత్తం 27 డివిజన్లు ఉండగా, 13 చోట్ల ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. 8 వార్డుల్లో టీఆర్ఎస్, 6 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఎల్బీనగర్ జోన్‌లో బీజేపీ కాస్త మెరుగైన స్థితిలో ఉంది. ఈ జోన్‌లో మొత్తంగా 23 వార్డులు ఉండగా, 11 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 10 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు, రెండు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నది ఈ ఒక్క జోన్‌లోనే.

ఫొటో సోర్స్, NAVEEN/BBC Telugu
ఆధిక్యంలో ఎంఐఎం అభ్యర్థులు
మధ్యాహ్నం 2 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం దబీర్ పురా, రమ్నస్‌పురా, దూధ్‌బౌలి, కిషన్ బాగ్, నవాబ్ సాహెబ్ కుంట, బార్కాస్, పత్తర్ గట్టి, పురానా పూల్, రియాస్త్ నగర్, అహ్మద్ నగర్ స్థానాల్లో ఎంఐ.ఎం అభ్యర్థులు గెలుపు బాటలో ఉన్నారని ఆ పార్టీ తెలిపింది..
ఏఎస్ రావు నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శిరీషరెడ్డి సింగిరెడ్డి గెలుపొందారు.
గతంలో మేయర్‌గా పనిచేసిన ఎంఐఎం మెహదీపట్నం అభ్యర్థి మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. ఆయనకు 5490 ఓట్ల మెజార్టీ లభించింది.
తొలి రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం
కౌంటింగ్ మొదటి రౌండులో టీఆర్ఎస్ పార్టీ ఆర్సీపురం, పఠాన్ చెరువు, చందా నగర్, హఫీజ్ పేట, హైదర్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, బాలా నగర్, చర్లపల్లి, మీర్ పేట్ హెచ్‌బీ కాలనీ, కాప్రా, శేరిలింగం పల్లి, గాజుల రామారం, రంగారెడ్డి నగర్, నాచారం, రాంనగర్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
కూకట్‌పల్లి కౌంటింగ్ సెంటర్ వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒక బ్యాలెట్ పెట్టెలో పోలైన వాటికన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయని బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. అభ్యంతరం పరిష్కరిస్తామని కౌంటింగ్ అధికారులు హామీ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
బీజేపీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు
చైతన్యపురి, గడ్డి అన్నారం, ఆర్‌కె పురం, సరూర్ నగర్, వనస్థలిపురం, లింగోజి గూడ, హస్తినాపురం, ఆల్వాల్, వెంకటాపురం స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కొత్త పేటలో బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుంది.
ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

ఫొటో సోర్స్, NAVEEN / BBC TELUGU
కౌంటింగ్ ఆలస్యం
నగరంలోని చాలా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లను తీసి ట్రేలలో వేసి వర్గీకరించిన తర్వాత, 25 కలిపి ఒక బండిల్ కింద కడతారు. వాటిని తర్వాత డ్రమ్ముల్లో వేస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇప్పుడే పూర్తయ్యింది. ఇంకా మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తి కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు
బ్యాలెట్ పత్రం మీద స్వస్తిక్ గుర్తుకు బదులు పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంప్ వేసినా దాన్ని చెల్లుబాటు అయిన ఓటుగా గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
స్టాంపు లేదా చెక్ గుర్తు ఉన్న బ్యాలెట్లను ప్రత్యేకంగా లెక్కించాలని, ఒక అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఇలా ప్రత్యేకంగా లెక్కించిన ఓట్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫలితాలని ప్రకటించవచ్చని హైకోర్టు సూచించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోర్టు నిర్ణయాన్ని తమ పార్టీ సాధించిన మొదటి నైతిక విజయమని చెప్పుకున్నారు. ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని, ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నానని సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
అయితే, హైకోర్టు ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించింది.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓట్ల లెక్కింపు కోసం నగరంలో మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో హాల్లో 14 టేబుళ్లు ఉంటాయి.
ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు నియమించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం 8152 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
ఈ ఓట్ల లెక్కింపులో 31 మంది కౌంటింగ్ పరిశీలకులు పాల్గొంటున్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియను రికార్డింగ్ చేయడానికి సీసీటివీలు ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కించనున్నారు.
బ్యాలెట్లు లెక్కించే ముందు మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను నిషేధించారు.
ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఫలితాలు కాస్త ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు.

కౌంటింగ్ కేంద్రాల బందోబస్తు.. ట్రాఫిక్ ఆంక్షలు
గెలిచిన అభ్యర్థులు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు చేయవద్దని సైబరాబాద్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.మొత్తం అభ్యర్థుల్లో 422 మంది ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు.
మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో ఈరోజు ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది. చాలాకాలం తర్వాత బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓట్లు వేయడంతో, ఓట్ల లెక్కింపు సమయంలో గొడవలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సాధారణంగా బ్యాలెట్ పత్రం మీద స్వస్తిక్ ముద్ర ఉండాలి. అలా కాకుండా పెన్నుతో గీసినా దానిని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు మరికాసేపట్లో విచారణ జరపనుంది. తీర్పును బట్టి అది చెల్లుతుందా లేదా అనేది తేలనుంది.

కౌంటింగ్‌లో కరోనా జాగ్రత్తలు
కౌంటింగ్ దగ్గర కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంచారు.
అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. మాస్క్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
ఈసారీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 74 లక్షల 67,256 ఓట్లు ఉండగా, 34 లక్షల 50,331 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీరిలో 18,60,040 మంది పురుషులు, 15,90, 219 మంది మహిళలు, ఇతరులు 72 మంది ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 1926 మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారని ఎన్నికల సంఘం తెలిపింది.
బరిలో 1122 అభ్యర్థులు
గ్రేటర్ ఎన్నికల్లో 150 స్థానాలకు మొత్తం 1122 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీఆర్ఎస్ 150, ఎంఐఎం 51, తెలుగుదేశం 106 స్థానాల్లో పోటీ చేశాయి.
అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్ పేట్ డివిజన్‌లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 3న ఈ వార్డులో రీపోలింగ్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








