జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: హైదరాబాద్‌‌లో మోదీ - అమిత్‌షాలు బీజేపీ బలమంతటినీ ఎందుకు మోహరిస్తున్నారు?

నరేంద్ర మోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సరోజ్‌ సింగ్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది 4 సీట్లు మాత్రమే. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఈ ఎన్నికలు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిని దాటి వెళ్లేవి కావు. మొత్తం 82 లక్షల జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీకి బడ్జెట్‌ రూ. ఐదున్నర వేల కోట్లు. కానీ ఈ ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది.

బీజేపీ జాతీయ స్థాయి నాయకులు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, ప్రకాశ్‌ జావ్‌డేకర్‌, బీజేవైఎం నేత తేజస్వి సూర్య తదితరులు ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు.

హోంమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ప్రచారానికి వస్తారని అంటున్నారు. ఇక బిహార్‌లో పార్టీ విజయానికి బాటలువేసిన సీనియర్‌ నేత భూపేంద్ర యాదవ్‌కు బీజేపీ ఈ ఎన్నికల బాధ్యతను అప్పగించింది.

ఈ హడావుడి అంతా చూసి అందరికీ వస్తున్న సందేహం ఒక్కటే. గ్రేటర్‌ హైదరాబాద్‌ అనే మున్సిపాలిటి ఎన్నికను బీజేపీ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ఎందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ?

స్మృతి ఇరానీ

ఫొటో సోర్స్, SMRITI IRANI / TWITTER

‘గ్రేటర్‌’ ఎన్నికలు

డిసెంబర్‌ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే నెల 4వ తేదీన ఫలితాలు వస్తాయి. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) 99 సీట్లు గెలుచుకుంది. ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం 44, బీజేపీ కేవలం 4 సీట్లు గెలిచాయి.

సాధారణంగా మున్సిపల్‌ ఎన్నికలంటే కరెంటు, రోడ్లు, నీళ్లు, చెత్త లాంటి సమస్యల మీదే అందరి ప్రచారం నడుస్తుంది.

రాష్ట్ర పార్టీ పెద్దలు ప్రచారంలోకి దిగారంటే అర్ధముంది. కానీ బీజేపీ లాంటి జాతీయ పార్టీ అధ్యక్షుడు కూడా ప్రచార రంగంలోకి దిగుతున్నారంటే ఏమనుకోవాలి? ఆ పార్టీ ఈ ఎన్నికలను ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది?

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

దుబ్బాక ఉప ఎన్నికలు

“దుబ్బాక అసెంబ్లీ సీటు ఉప ఎన్నికకు అధికార పార్టీ ఆ శాసన సభ్యుడి భార్యకే సీటు ఇచ్చింది. అక్కడ గెలవడం టీఎర్‌ఎస్‌కు చాలా అవసరం. ఎందుకంటే అది ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉంటుంది. ఇక్కడ విజయం కోసం ముఖ్యమంత్రి మేనల్లుడు హరీశ్‌‌రావు అన్నీ తానై వ్యవహరించారు. కానీ ఇంత చేసినా అక్కడ బీజేపీ గెలిచింది’’ అన్నారు హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్ దినేశ్‌ ఆకుల.

“ఈ విజయంతో బీజేపీ మంచి ఉత్సాహంలో ఉంది’’ అన్నారాయన.

ఇక గణాంకాలను చూస్తే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 13.75 నుంచి 38.5కు పెరిగింది. దీంతో బీజేపీలో ఆశలు పెరిగాయి. అయితే బీజేపీతో పాటు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం వ్యూహాలను కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంది.

“గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కేటీఆర్‌ వ్యూహం రచించారు. తనయుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సీఎం చంద్రశేఖరరావు కోరుకుంటున్నారు. అయితే సీఎం మేనల్లుడు హరీశ్‌‌రావు నుంచి కేటీఆర్‌కు పార్టీలో గట్టి పోటీ ఉంది. హరీశ్‌‌రావును పక్కకు తప్పించడానికి కేసీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కేటీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ 99 కార్పొరేషన్‌ సీట్లు గెలుచుకుంది. ఈసారి కూడా గెలిస్తే కేటీఆర్‌కు పార్టీలో ఎదురు లేకుండా పోతుంది. కానీ దుబ్బాక పరాజయం టీఆర్‌ఎస్‌ను నిరాశపరిచింది’’ అని జర్నలిస్ట్ దినేశ్‌ ఆకుల అభిప్రాయపడ్డారు.

అసదుద్దీన్ ఒవైసీ

ఈ ఎన్నికలు బీజేపీకి ఎందుకు కీలకం?

ఈ ఎన్నికల్లో బీజేపీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఒక దెబ్బతో రెండు పిట్టలను కొట్టాలన్నది బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది.

ఇందులో మొదటిది బీజేపీని పంచాయితీ నుంచి పార్లమెంటు దాకా విస్తరించాలన్న ప్రణాళిక. ఇది 2017లో బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా నిర్దేశించిన లక్ష్యం. దీన్ని సాధించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

రెండోది, టీఆర్‌ఎస్‌ బలహీనతలను సొమ్ము చేసుకోవడం. పార్టీలో కొంత అసమ్మతి ఉన్నందున, ఆ పార్టీని దెబ్బకొట్టడానికి ఇదే మంచి అదనుగా బీజేపీ భావిస్తోంది.

మూడోది, ఇటీవల రెండుసార్లు కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించగా అధికార పార్టీ మీద విమర్శలు వచ్చాయి. దుబ్బాక పరాజయం దీనికి తోడైంది. దీన్ని తనకు అనువుగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.

మరో కీలక అంశం కాంగ్రెస్‌ను పక్కకునెట్టి బీజేపీ రెండో స్థానంలో నిలవాలని భావిస్తోంది. దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ స్థానాన్ని తాను ఆక్రమించాలన్నది బీజేపీ ఆలోచన.

ఇక ఇతర రాష్ట్రాలలో ఎంఐఎం తనకు బి-టీమ్‌ అని ప్రచారం జరుగుతుండటంతో ఈ విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని కూడా బీజేపీ భావిస్తోంది.

ఈ ఎన్నికల్లో గెలిచిన వారు రాష్ట్రంలో అధికారానికి చేరడం సులభం అన్న భావన ఉంది. సుమారు రూ. 5.5 వేల కోట్ల బడ్జెట్‌ ఉన్న జీహెచ్‌ఎంసీని సాధించడం పార్టీలకు కీలకమని విశ్లేషకులు అంటున్నారు.

తేజస్వి సూర్య

ఫొటో సోర్స్, TEJASVI SURYA / TWITTER

బీజేపీ వ్యూహాలు

తెలంగాణపై పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు తీవ్రతరం చేసిందని రాజకీయ విశ్లేషకులు నాగరాజు అన్నారు. తొలిసారి హైదరాబాద్‌కు చెందని వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారని, ఇదొక వ్యూహమని నాగరాజు అన్నారు.

“బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌ వ్యక్తి. లోక్‌సభ సభ్యుడు కూడా. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు ఆయనకే అప్పజెప్పారు’’ అన్నారు నాగరాజు.

దుబ్బాక ఎన్నికల్లో బండి సంజయ్‌ వ్యూహం ఫలించిందని, అందువల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని బీజేపీ భావిస్తోందని నాగరాజు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఓట్లను పోలరైజ్‌ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

“టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లేనని బండి సంజయ్‌ అన్నారు. అలాగే హైదరాబాద్‌లో రోహింజ్యాల గురించి మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్‌ వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ఆఖరికి స్మృతి ఇరానీ కూడా ఇదే భాషలో మాట్లాడారు. అంటే ప్రజలను పోలరైజ్‌ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది’’ అని రాజకీయ విశ్లేషకులు నాగరాజు వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ యువమోర్చా నేత తేజస్వీ సూర్య కూడా అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. “అభివృద్ధి గురించి అసద్‌, అక్బర్‌లు మాట్లాడటం హాస్యాస్పదం. పాతబస్తీలో రోహింజ్యా ముస్లింలను బాగు చేయడానికే వారిద్దరూ పని చేశారు’’ అని తేజస్వీ సూర్య అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ “రోహింజ్యాలు, పాకిస్తానీలు ఇక్కడ నివసిస్తుంటే కేంద్ర మంత్రిగా పని చేస్తున్న కిషన్‌ రెడ్డి ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.

“ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విద్యుత్‌, రోడ్లు, నీటి గురించే చర్చ జరిగింది. కానీ తొలిసారి ముస్లింలు, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, రోహింజ్యాలు, సర్జికల్ స్ట్రైక్స్‌ గురించి మాట్లాడుతున్నారు’’ అన్నారు నాగరాజు.

బండి సంజయ్ కుమార్

ఫొటో సోర్స్, BANDI SANJAY KUMAR / TWITTER

గెలుపు మీద బీజేపీ ఆశలు

తెలంగాణలో బీజేపీ ఇంత వరకు బలమైన పార్టీగా ఎదగ లేదు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 119 సీట్ల అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు, కాంగ్రెస్‌కు 19, ఎంఐఎంకు 7, బీజేపీకి ఒక ఎమ్మెల్యే సీటు దక్కాయి.

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలవడంతో బీజేపీ బలం రెండుకు చేరుకుంది. టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు 87 సీట్లున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 9 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 3, ఎంఐఎంకు ఒక సీటు దక్కాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఇప్పుడే ఊహించలేమంటారు నాగరాజు.

“కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంది. ఇక్కడ మానసిక యుద్ధంలో గెలిచింది. ఈ రోజు కాంగ్రెస్‌ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. టీఆర్‌ఎస్‌ అంటే ఇష్టం లేనివారు బీజేపీకి ఓటేస్తారు. కాబట్టి ఆ పార్టీకి అవకాశాలు ఉన్నాయి’’ అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)