GDP: ఆర్థిక మందగమనం... 7.5 శాతం పడిపోయిన భారత జీడీపీ

ఆర్థికవ్యవస్థ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి 7.5 శాతం కుచించుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) ఇదే కాలంతో పోలిస్తే ఈ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ తేడా నమోదైంది.

గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ 35.84 లక్షల కోట్లుగా ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అది 33.14 లక్షల కోట్లకు తగ్గినట్లు కేంద్ర గణాంకశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

అంటే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి నమోదు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ 7.5 శాతం కుచించుకుపోయింది.

అయితే.. 2020-21 మొదటి త్రైమాసికంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడింది.

ఈ ఏడాది ప్రారంభంలో విధించిన రెండు నెలల లాక్‌డౌన్ భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసింది. ఏప్రిల్-జూన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ 24 శాతం సంకోచిందింది. గత 40 ఏళ్లల్లో భారతదేశం ఇంత ఆర్థిక పతనాన్ని చూడలేదు. జీ20 దేశాలలో అథమ స్థాయిలో ఉన్న దేశం కూడా ఇదే.

మార్చి నుంచి మే నెల వరకూ కొనసాగిన రెండు నెలల లాక్‌డౌన్ తరువాత ఆర్థిక పరిస్థితి ఎంతవరకూ పుంజుకున్నదనే విషయం తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుత త్రైమాసికంలో పారిశ్రామిక రంగం 2.1 శాతం క్షీణిస్తే.. మైనింగ్ రంగం 9.1 శాతం, నిర్మాణ రంగం 8.6 శాతం క్షీణించాయి.

అయితే వ్యవసాయ రంగం, తయారీ రంగాలు స్వల్పంగా మెరుగుపడ్డాయి. వ్యవసాయ రంగంలో 3.4 శాతం వృద్ధి నమోదైతే, తయారీ రంగంలో 0.6 శాతం వృద్ధి నమోదైంది.

అయినప్పటికీ.. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ తిరోగమనంలో ఉంటం.. భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయాన్ని సాంకేతికంగా నిర్ధారించింది.

ఆర్థిక వృద్ధి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ కొన్ని ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవేమిటో తెలుసుకోబోయే ముందు ఆర్థిక పరిస్థితి ఎంత కుంటుపడింది, తరువాత ఎలా పుంజుకుంటోంది అనే విషయాలు పరిశీలిద్దాం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో.. దేశంలో గరిష్ట ఉపాధిని కల్పించే నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగం వరుసగా 50%, 40% సంకోచం చవిచూసాయి. అంటే లాక్‌డౌన్ కారణంగా మానవవనరులను ఎంతమేరకు నష్టపోయామో స్పష్టమవుతోంది.

ఆర్థిక వృద్ధికి గరిష్టంగా దోహదపడే ఆర్థిక వినియోగం సగానికి సగం పడిపోయింది. ఆదాయం తగ్గడం, నిరుద్యోగం పెరగడంతో ప్రజలు ఖర్చులు తగ్గించారు. వ్యాపార సంస్థలు పెట్టుబడులు తగ్గించాయి. దాంతో వినియోగం తగ్గి, వృద్ధి రేటు కుంటుపడింది.

అయితే, జూన్‌ నుంచి ఎకానమీ తెరుచుకోవడంతో నిర్మాణ, పారిశ్రామిక రంగాలు పుంజుకున్నాయి. ఈ సమయంలో ఆర్థిక వృద్ధి మెరుగవ్వడానికి ఈ రెండు రంగాలూ దోహదపడతాయని భావిస్తున్నారు.

"వర్క్ ఫ్రం హోం పెరిగిన తరువాత, ఇళ్లల్లో ఆఫీస్ కోసం ప్రత్యేకంగా గది లేదా ప్రత్యేక స్థలాన్ని కేటాయించవలసిన ఆవశ్యకతను ప్రజలు గ్రహించారు. ఈ వసతులన్నీ ఉండేలా మెరుగైన ఇళ్లు కొనుగోలు చెయ్యాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మరోవైపు, గత రెండు మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ ధరలు పెరగకపోవడంతో పాటు.. ద్రవ్యోల్బణం కారణంగా ఇళ్ల ఫ్లాటుల ధరలు తగ్గాయి" అని నిర్మాణ రంగంలో ప్రఖ్యాతిగాంచిన హీరానందాని గ్రూపు ఎండీ నిరంజన్ హీరానందాని తెలిపారు.

నరేంద్రమోదీ, నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

మరోపక్క అద్దె ఇళ్లల్లో ఉండేవారు కూడా సొంత ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు. కోవిడ్ కారణంగా చాలా మంది తమ ఇళ్లల్లో అద్దెకు ఉన్నవారిచేత ఇళ్లు ఖాళీ చేయించేస్తున్నారు. లేదా బంధువులు, స్నేహితులు రాకూడదని షరతులు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లూ అద్దె ఇళ్లల్లో ఉన్నవారు కూడా ఇప్పుడు సొంత ఇల్లు ఉంటే బావుంటుందని ఆలోచిస్తున్నారు.

"ఈ కారణాల వల్ల అద్దెకు ఉంటున్నవారికి మనశ్శాంతి కరువవుతోంది. అలాంటివారు చాలామంది సొంత ఇళ్లు కొనుక్కునేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ పెరిగింది" అని హీరానందాని తెలిపారు.

అంతే కాకుండా, సిమెంట్, స్టీల్‌లాంటి 300 రంగాలు కూడా నిర్మాణ రంగంలో వృద్ధికి దోహదపడతాయి. ఈ రంగాల్లో కనిపిస్తున్న వృద్ధి వేగం మొత్తం ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది.

ఇండియా జీడీపీలో సుమారు 7 శాతం నిర్మాణ రంగం నుంచి వస్తుంది. వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా ఉద్యోగావకాశాలు కల్పించే రంగం ఇదే. సాధారణంగా నిర్మాణ రంగంలో వృద్ధి, దేశ ఆర్థిక ఆర్థికాభివృద్ధిలో ప్రతిబింబిస్తుందని భావిస్తారు. అయితే, ఇది తప్ప మిగతా రంగాలు ఇంకా కోలుకుంటున్నట్లు కనిపించట్లేదు.

ఆర్థికవ్యవస్థ

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న చిన్న చిన్న వ్యాపారాలు ఇంకా అథమ స్థితిలోనే ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆభరణాల దుకాణం నిర్వహించే పంకజ్ చోప్రా.. లాక్‌డౌన్ ప్రారంభంనుంచీ తన వ్యాపారం బాగా దెబ్బతిన్నదని అంటున్నారు. ఇటీవల పండుగ సీజన్ కారణంగా కొంత మెరుగైనప్పటికీ అది స్థిరమైన పెరుగుదల కాదని ఆందోళన చెందుతున్నారు.

"ఈ వ్యాపార రంగంలో పరిస్థితులు మారుతాయని ఆశ లేదు. నిరుద్యోగం, జీతాల్లో కోతలు విధిస్తుంటే ప్రజలు ఆభరణాలు ఎందుకు కొంటారు? దేశంలో అన్ని రంగాలూ పుంజుకుని ఆర్థికాభివృద్ధి పట్టాలెక్కితే తప్ప మా పరిస్థితి మెరుగుపడదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

పంకజ్ చోప్రాలాంటి చిన్న వ్యాపారస్థులు ఋణాలు పెరగడంతో వ్యాపారాలను కుదించవలసి వస్తోంది.

"ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పుడున్నది మూసివేసి, మరో రకమైన వ్యాపారాన్ని చూసుకోవలసి వస్తుంది" అని పంకజ్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆయన స్నేహితులు చాలామంది తమ వ్యాపారాలను ఎత్తేసారని, తనకి అదొక హెచ్చరిక అని పంకజ్ భావిస్తున్నారు.

జీడీపీలో ప్రతికూల వృద్ధి రేటు మైనస్ 23.9 శాతం నుంచి మైనస్ 9.5 శాతానికి మెరుగవుతుందని ఇంఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) అంచనా వేసింది.

అది మైనస్ 7.5 శాతానికి మెరుగుపడినట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది.

అయితే, అసంఘటిత రంగం నుంచి డాటా లేనప్పుడు జీడీపీ గణాంకాలు, ఆర్థిక వ్యవస్థ పూర్తి చిత్రాన్ని చూపించకపోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో సగభాగమైన అసంఘటిత రంగం ఇంకా అథోగతిలోనే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.

"అసంఘటిత రంగానికి ప్రాతినిధ్యం వహించే గణాంకాలు లభ్యం కాకపోవడం వలన సంఘటిత రంగం (ఫార్మల్ సెక్టర్)లో ఆశిస్తున్న, జరుగుతున్న వృద్ధి, జీడీపీలో వృద్ధిని పెద్దదిగా చేసి చూపించే అవకాశం ఉంది" అని ఐసీఆర్ఏలో ప్రిన్సిపల్ ఎకానమిస్ట్‌గా పని చేస్తున్న అదితి నాయర్ తెలిపారు.

ఆర్థికవ్యవస్థ

ఇటీవల జీడీపీలో కనిపిస్తున్న ఈ పెరుగుదల కూడా స్థిరంగా కొనసాగుతుందో లేదో అని నిపుణులు సందేహం వ్యక్తపరుస్తున్నారు.

"ప్రస్తుతం ఉన్న పండుగ సీజన్ అయిపోయిన తరువాత కూడా ఈ వృద్ధి కొనసాగుతుందో లేదో చూడాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని నిర్థారించుకోవడానికి ఇది చాలా ముఖ్యం" అని అదితి నాయర్ తెలిపారు.

మొత్తంగా తగ్గిన డిమాండ్ వలన వినియోగంలో కొరత, పండుగ సీజన్‌లో పెరిగిన వ్యయాన్ని కూడా ఈ రెండవ త్రైమాసిక గణాంకాలలో పరిగణలోనికి తీసుకుంటారు.

కోవిడ్ 19 కట్టడిచెయ్యడం, వ్యాక్సీన్ వార్తల ఫలితంగా పుంజుకుంటున్న ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంది. కానీ ఎదుర్కోవలసిన సవాళ్లు ఇంకా అనేకం ఉన్నాయి.

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రభుత్వ వ్యయం పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వం అధిక స్థాయిలో పెట్టుబడులు పెడుతూ, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఉద్యోగాలు పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా వినియోగం పెరుగుతుంది.

వినియోగం పెరిగితే ఆర్థికాభివృద్ధి పట్టాలెక్కుతుంది. అయితే, ప్రభుత్వం కూడా నగదు కొరతను ఎదుర్కొంటున్న ఈ సమయంలో వెంటనే వ్యయాన్ని పెంచడం కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)