న్యూరోఫైనాన్స్ అంటే ఏమిటి? కొందరు కష్టపడకుండా సులభంగా డబ్బు ఎలా సంపాదిస్తారు?

నగదు, భారీగా నగదు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మార్గరీటా రోడ్రిగేజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వంద రూపాయలు సంపాదించినపుడు ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కానీ, అదే వంద రూపాయలు నష్టపోతే, దానివల్ల ఎంత సంతోషం కలిగిందో, దానిని మించి బాధ కలుగుతుంది.

దీనికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ కార్డిఫ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ ప్రొఫెసర్ అర్మాన్ ఎష్రఘాయ్ మెదడు మాగ్నటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ) ద్వారా బీబీసీకి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు.

లాభం వచ్చినపుడు మెదడులో సంతోషంతో స్పందించిన కేంద్రాల కంటే, డబ్బు నష్టపోయినప్పుడు (సమాన మొత్తం) మెదడులో, నెగటివ్ ఎమోషన్లతో సంబంధం ఉన్న కేంద్రాల్లో ఎక్కువ యాక్టివిటీ ఉన్నట్టు ఆ ఎంఆర్ఐ రిపోర్టుల్లో కనిపించింది.

గతంలో మెదడు అధ్యయనంపై ప్రధానంగా వైద్య రంగం మాత్రమే దృష్టి పెట్టేది. కానీ, గత కొన్ని దశాబ్దాలుగా ఫైనాన్స్ లాంటి ఇతర రంగాలు కూడా మెదడు స్పందనల గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి.

మెదడు ఒక్కటే కాదు, మన నాడీ వ్యవస్థ, హార్మోన్లను కూడా పరిశీలించడం ద్వారా పెట్టుబడిదారులు, వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించడానికి ఆర్థికశాస్త్రం ఇప్పుడు న్యూరో సైన్స్‌తో కలిసిపోయింది.

అవి రెండూ కలిసి, కొత్తగా 'న్యూరోపైనాన్స్' అనేది ఆవిర్భవించింది.

మెదడు

ఫొటో సోర్స్, Getty Images

"సంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాలకు న్యూరోసైన్స్, సైకాలజీ ప్రావీణ్యాన్ని జోడించడం ద్వారా ఆర్థిక నిర్ణయాల గురించి తెలుసుకోడానికి ఇది ఒక కొత్త పద్ధతిగా మారింది" అని యూనివర్సిటీ ఆఫ్ జెనీవా న్యూరోపైనాన్స్, న్యూరో ఎకనామిక్స్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ కెర్‌స్టిన్ ప్రిశ్చాఫ్ చెప్పారు.

"ఆర్థిక ముప్పు, అనిశ్చితి ఉన్న వాతావరణంలో ఈ నాడీ అవగాహన చాలా ముఖ్యం. అక్కడ సాధారణంగా మనం మొదట స్పందించి, తర్వాత విశ్లేషిస్తుంటాం" అని ఫైనాన్షియల్ సైకాలజీ నిపుణులు, ఆర్థిక సలహాదారు జోలిన్ క్వింటెరో అన్నారు.

ఆర్థిక లావాదేవీల గురించి నిర్ణయాలు తీసుకోడానికి ఈ న్యూరోఫైనాన్స్ మనకు ఉపయోగపడుతుంది.

న్యూరో ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

భావోద్వేగాలను గుర్తించారు

మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఒక భావోద్వేగ అంశం ఉంటుందనే వాస్తవం నుంచి మన స్వభావం మనల్ని తప్పించుకోకుండా చేస్తుంది.

అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్ మేనేజర్లు కూడా విచక్షణతో ఆలోచించాకే నిర్ణయాలు తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

సాంకేతికతలోని పురోగతి మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన మెదడులో జరిగే రసాయన, విద్యుత్ ప్రక్రియలను న్యూరో సైంటిస్టులు గుర్తించగలిగేలా చేసింది.

పైన చెప్పిన వంద రూపాయల ఉదాహరణ విషయానికి వస్తే, దానిని 'నష్టం వల్ల వచ్చే విరక్తి' అంటారని నిపుణులు ఇప్పటికే గుర్తించారు.

కానీ, ఆ సమయంలో మన మెదడులో నిజంగా ఏం జరుగుతుందనేది ఇప్పుడు న్యూరోఫైనాన్స్ పరిశీలించేలా చేసింది.

న్యూరో ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

మెరుగైన ఆర్థిక నిర్ణయాలు ఎలా

మనం తరచూ నిదానంగా, జాగ్రత్తగా, బాగా ఆలోచించి మెరుగైన ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటూ ఉంటామని ఎష్రఘాయ్ అంటున్నారు.

అయితే ఈ సమీకరణలో మనం భావోద్వేగాల ప్రమేయాన్ని తీసిపారేయలేం. కానీ, వాటి గురించి మనం కొంత తెలుసుకోవాలి.

ఉదాహరణకు షేర్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు, సాధారణంగా దూరంగా ఉండడం, వాటికి సంబంధించిన వివరాలు చూడకుండా ఉండడం మంచిది.

దానికి కారణం మన మెదడులోని వైరింగ్. అది విశ్లేషణాత్మకంగా ఉన్నప్పటి కంటే అస్థిరంగా ఉన్నప్పుడు ఎక్కువ ఆవేశంగా స్పందిస్తుంది.

న్యూరో ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

దేనికైనా సిద్ధంగా ఉండాలి

కొన్ని రకాల నిర్ణయాలకు మనకు సంఖ్యా నైపుణ్యం అవసరం. ఇవి ఉన్న వారు, ఈ నైపుణ్యం లేనివారి కంటే గణనీయమైన ప్రయోజనం పొందుతారు.

అంటే, మీరు క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు జరిపినా, పొదుపు చేసినా చక్రవడ్డీ గురించి తెలిసి ఉండడం అనేది ఒక పెద్ద వ్యత్యాసం తీసుకొస్తుంది.

చక్రవడ్డీ గురించి చాలామందికి సరిగా తెలీదు. కానీ లావాదేవీలు జరుపుతుంటారు. అది చాలా ప్రమాదం.

మనకు కొంత లాభం వచ్చి, కాస్త నష్టపోతే, అలాంటి వాటికి మన భావోద్వేగ స్పందన కూడా చాలా తక్కువే ఉంటుంది. ఈసారీ మెరుగైన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపిస్తుంది.

నగదు సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏది జరిగినా దానికి సిద్ధంగా ఉండడం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారేలా ఉండడం కూడా చాలా ముఖ్యం.

న్యూరో ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

కోటీశ్వరులు ఏం చేస్తారు?

"ది ట్రిక్: వై సమ్ పీపుల్ కెన్ మేక్ మనీ, అండ్ అదర్ పీపుల్ కాంట్" అనే పుస్తకం రాసిన జర్నలిస్ట్ విలియమ్ లీత్ తన పరిశోధనలో భాగంగా కొంతమంది కోటీశ్వరుల గురించి లోతుగా స్టడీ చేశారు.

"నేను ఇంటర్వ్యూ చేసిన వారు ఎలాగోలా ధనవంతులు అయ్యారు. ఏది ముప్పు, అది తరచూ ఎంత ప్రతికూలత అవుతుంది అనే విషయంలో అవగాహన పెంచుకున్నారు. అది చాలా అవసరం, కానీ, అక్కడ ఇంకొకటి కూడా ఉంది. వారంతా ఎన్నో వైఫల్యాలను రుచిచూశారు. వాటి నుంచి నేర్చుకున్నారు. తమను మార్చుకుని, మళ్లీ ముందుకెళ్లారు" అని ఆయన బీబీసీకి చెప్పారు.

వారిలో కొందరు ఏదైనా అనుకుంటే అందులో విజయం సాధించేవరకూ, అది ఎలా పనిచేస్తుందో చూద్దామని, ప్రతిసారీ దానికి కాస్త దగ్గరగా వచ్చారు. వారి సక్సెస్‌కు అదే కారణం. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కరూ విఫలం కాగానే వాటిని వదిలేస్తారు. పదే పదే వైఫల్యాలు ఎదురైతే చాలా మంది భరించలేరు.

ఎక్కువ మంది చేయని పనులు చేయడానికి లేదా అందరూ ఇది పనికిరాదు, ప్రమాదం అనుకునే వాటిని చేయడంలోనే అసలు సక్సెస్ దాగుంది.

ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవచ్చు అనే కోణంలోంచి చూడాలి. మీ మనసు చెప్పేది వినకుండా, మెదడు చెప్పే దారిలో వెళ్లాలి.

మీరు ఒక వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే, అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది, ఏమేం మారుతోంది అనేది చూడాలి. మీకోసం మీరు అవన్నీ తెలుసుకోవాలి.

ఎందుకంటే మీరు చదివే పుస్తకాలు మీకు నిన్నటివరకూ ఉన్న ప్రపంచాన్ని చూపిస్తాయి. అందుకే మీరు బయటకు వెళ్లాలి, దానిని ప్రారంభించాలి.

మీకోసం ఆలోచించండి. నేను దీన్ని ఎలా మెరుగుపరచగలను అనుకోండి. చాలామంది సక్సెస్ అయ్యేది అలాగే. అలాంటి ఆలోచనలతో వారు మిగతా అందరికంటే ప్రత్యేకంగా నిలిచారు.

న్యూరో ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎలా స్పందించాలి?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విజయవంతమైన తన అనుభవాలను ఆర్థిక సలహాదారు క్వింటెరో బీబీసీతో పంచుకున్నారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఎందుకంటే, మన చుట్టూ ఇలా జరుగుతోందే అని వారు గమనించడం ఆపేశారు.

ఈ మహమ్మారి సమయంలో మీరేం చేస్తారు అని మనం ఒక ఫైనాన్షియర్‌ను అడిగితే, ఆయన తన ఖర్చులు కోత పెట్టుకోవడం గురించి చెబుతారు. వీలైనంత వరకూ నష్టాలను తగ్గించుకోవడం ఎలాగో వివరిస్తారు.

అంటే మనం స్వయంగా అదుపు చేయలేని ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, వెనక్కి తగ్గడం, అంతా అయిపోయింది అనే ధోరణిలో పడిపోతాం. చాలాసార్లు అది బయట ఉన్న అవకాశాలు కనిపించకుండా మన కళ్లను కప్పేస్తుంది.

న్యూరో ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

కొత్త పరిస్థితులకు ఉదాహరణ

ఈ కొత్త పరిస్థితుల్లో ఆత్మగౌరవం అనేది కూడా ఉండాలి.

చాలామందికి నచ్చని పనిని చేయబోతున్నారని మీకు తెలిసినప్పటికీ.. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీకున్న గ్యారంటీ మీరే. బయటి వారి విశ్వాసం పొందడానికి బదులు, ఒక ఆలోచన, ఒక ప్రాజెక్ట్ గురించి మీకు మానసికంగా ఒక స్పష్టత రావాలి. దానికి కచ్చితంగా ఫలితం ఉంటుంది.

"చాలా మందిలాగే, నష్టాలకు మనం వీలైనంత దూరంగా ఉండాలని అనుకుంటాం. గెలుపో, ఓటమో చూసుకుందాం అని ముందుకెళ్లడం ఒక ప్రక్రియ. అలా చేయడం వల్ల మనం మన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు" అని క్వింటెరో చెప్పారు.

"ఉదాహరణకు నేను ఈ ఏడాది నెలకు 7 శాతం లాభాలు వస్తాయనుకుంటే, ఒక నెలలో నేను 10 శాతానికి చేరుకుంటే, ఇంకో నెలలో అది 5 శాతమే రావచ్చు. నేను దాన్ని వైఫల్యంగా అనుకోకుండా, నేర్చుకోడానికి అవకాశంగా భావిస్తే, మరోసారి నేను పెట్టుబడి పెట్టడం, ఆదా చేయడం, కొనుగోలు చేయడం చేయచ్చు. నేను ఒక నేర్చుకుంటున్న వ్యక్తిలా ముందుకెళ్తాను. విఫలమైనట్టు భావించను".

న్యూరో ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

మన ఫీలింగ్ కూడా ముఖ్యమే

న్యూరోసైన్స్ విషయానికి వస్తే, మనకు ఉన్న అనుభవం మన కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే ఒక కోడింగ్ లాంటిది. అది మనలో కలిగిన స్పందనల నుంచి మనం నేర్చుకునేలా చేస్తుంది.

కొన్ని సందర్భాల్లో నేను మరీ దూకుడు ధోరణి చూపిస్తున్నట్లు అనిపిస్తే, నేను ఆ ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తాను. దానిని ప్రేరేపించేవి ఏవో ఏవో గుర్తించి, దానికి తగిన ఒక వ్యూహం ఏర్పరుచుకుంటాను.

న్యూరో ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువ సంపాదన ఎలా?

కొందరు మిగతా వారికంటే సులభంగా డబ్బు ఎలా సంపాదిస్తారో తెలుసుకోవాలంటే అత్యంత కీలకమైనది, అనిశ్చితిని ఊహించి, దానిని సరిదిద్దుకోవడం.

ఆర్థిక ప్రపంచంలో నష్టం అనేది ఒక ముఖ్యమైన అంశం. అది ఒక విశ్లేషణాత్మక ఏరియా. నష్టం అనేది ఫలితాలు పెంచడానికి మనం లెక్కలు వేసుకునేలా చేస్తుంది.

మన భావోద్వేగాలు ఆ అనిశ్చితితో అనుసంధానమై ఉంటాయి. మనం దానికి ఎలా స్పందిస్తే, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సాంస్కృతికంగా ఆ ప్రభావం కనిపిస్తుంది.

ఆర్థికంగా ఎదురయ్యే ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. దాన్ని తప్పించుకుని బయటపడేందుకు, మన శరీరం, మన బయోకెమిస్ట్రీ మనల్ని సన్నద్ధం చేస్తుంటాయి.

జీవితంలో అన్నిటిలాగే, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ముఖ్యం. ప్రతి సక్సెస్ స్టోరీకి తనదైన ప్రత్యేకతలు ఉంటాయి. అందుకే, డబ్బు ఎలా సంపాదించాలి అనేదానికి కచ్చితమైన ఫార్ములా అంటూ ఏదీ లేదు. ఎన్నో లోపలి, బయట అంశాలను బ్యాలెన్స్ చేయడం అనేది ఇక్కడ ప్రధానం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)