ప్లాస్టిక్ సీసాలలో బంధించి చిలుకల అక్రమ రవాణా

ప్లాస్టిక్ సీసాలలో బంధించి చిలుకల అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Getty Images

తూర్పు ఇండోనేసియా ప్రాంతంలో పపువా దగ్గర లంగరు వేసిన ఒక ఓడలో ప్లాస్టిక్ సీసాలలో బంధించిన డజన్ల కొద్దీ చిలకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓడలో ఉన్న డబ్బాల నుంచి శబ్దాలు వినిపించడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేయగా ఇవి బయటపడ్డాయి. ఇందులో 64 చిలకలు సజీవంగా ఉండగా, 10 చిలకలు చనిపోయాయి.

ఆసియాలోనే అత్యధికంగా అంతరించిపోతున్న పక్షి జాతులకు ఇండోనేసియా ఆవాసంగా ఉంది. పక్షుల అక్రమ రవాణా కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతోంది.

దేశీయంగా కొన్ని పెద్ద పెద్ద మార్కెట్లలో వీటి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. కొందరు విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తారు.

"గురువారం ఉదయం ఓడలో లభించిన ఈ చిలుకలను ఎక్కడికి రవాణా చేస్తున్నారనే సమాచారం ఇంకా తెలియలేదు" అని స్థానిక పోలీసు అధికారి దోడిక్ జునైది ఏఎఫ్ పీ వార్తా సంస్థకు తెలిపారు.

"ఓడలో ఉన్న డబ్బాలలోంచి వింత శబ్దాలు వస్తుండటంతో ఓడలోని సిబ్బందికి అనుమానం వచ్చింది" అని ఆయన చెప్పారు.

parrots

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఈ ఓడలో దొరికిన పక్షులను బ్లాక్ క్యాప్డ్ లోరీస్ గా గుర్తించారు. ఇవి న్యూ గినియా ప్రాంతంలోనూ నైరుతి పసిఫిక్ మహాసముద్రానికి దగ్గర్లో ఉన్న దీవులలోనూ కనిపిస్తాయి.

"ఇవి ఇండోనేసియాలో రక్షిత పక్షుల జాబితాలో ఉన్నాయి. అక్రమ రవాణా చేసేందుకు ఈ పక్షులకు బాగా గిరాకీ ఉంది" అని వైల్డ్ లైఫ్ ట్రేడ్ పరిశీలన సంస్థకు చెందిన ఎలిజబెత్ జాన్ చెప్పారు.

"ఈ ప్రాంతంలో పక్షుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ఇండోనేసియా ప్రయత్నిస్తోంది. కానీ, మరింత కఠినంగా వ్యవహరించాలి. పక్షులను మార్కెట్లకు తరలించే దోషులను అరెస్ట్ చేయాలి" అని ఆమె బీబీసీకి చెప్పారు.

ప్లాస్టిక్ సీసాలలో పక్షులు దొరకడం ఇది మొదటి సారి కాదు. 2015లో అరుదైన 21 ఎల్లో క్రెస్టెడ్ కొకాటూ పక్షులను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని ఇండోనేసియా పోలీసులు అరెస్టు చేశారు. అవి కూడా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాయి.

ఇండోనేసియా అధికారులు 2017లో డ్రైనేజీ పైపులలో బంధించిన 125 విదేశీ పక్షులను పట్టుకున్న కేసులో చాలా అరెస్టులు కూడా జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)