సంతానలేమి: వీర్యంలో శుక్రకణాలు లేకపోతే అది మగతనంలో లోపమా? అజూస్పెర్మియా అంటే ఏంటి?

సంతానలేమి

ఫొటో సోర్స్, bambam kumar jha/getty images

    • రచయిత, అజీజుల్లా ఖాన్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి, పెషావర్‌

అతావుల్లా ( పేరు మార్చాం) రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన భార్య ఇంత వరకు గర్భం దాల్చలేదు. ఆమెకు చిన్న ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో చికిత్స చేయించారు. కానీ అది గర్భాన్ని అడ్డుకునేంత సమస్య కాదు.

వైద్యుల సలహాతో అతావుల్లా కూడా టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయన అజూస్పెర్మియా (Azoospermia) అనే సమస్యతో బాధపడుతున్నారని తేలింది.

వీర్యంలో శుక్రకణాలలేమినే వైద్య పరిభాషలో అజూస్పెర్మియా అంటారు. దీనిని సరి చేయకపోతే సంతానం పొందడం సాధ్యం కాదు.

“పరీక్షలు నిర్వహించినప్పుడు నా భార్యలో ఎలాంటి సమస్యా కనిపించ లేదు. లోపం నాలోనే ఉందని తేలింది. నేను అజూస్పెర్మియాతో బాధపడుతున్నాను” అని అతావుల్లా వెల్లడించారు.

సంతానలేమి

గిరిజన ఆచారాలకు విరుద్ధం

అతావుల్లా పాకిస్తాన్‌లో మారుమూలన ఉన్న గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నారు. వైద్య పరీక్షల్లో లోపం తనలోనే ఉందని తేలినప్పుడు ఆయన ధైర్యంగా ఆ విషయాన్ని బంధువులకు తెలిపారు. తన భార్యలో ఎలాంటి లోపం లేదని వెల్లడించారు. ఇలా చెప్పడం అక్కడి గిరిజన సంప్రదాయానికి విరుద్ధం.

ప్రస్తుతం ఆయన పెషావర్‌లోని ఒక వైద్యసంస్థకు చెందిన ఇన్‌ఫెర్టిలిటీ విభాగంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. “లైంగికంగా నాలో ఇతర సమల్లేవు. నా వీర్యంలో శుక్రకణాలు లేకపోవడమే సమస్య. దీనికి చికిత్స పొందడానికి సిగ్గు పడటం లేదు’’ అని అతావుల్లా అన్నారు.

లైంగిక సామర్ధ్యం, సంతానలేమి చికిత్సలపై పాకిస్తాన్‌లో ఎక్కడ చూసిన ప్రకటనలు, వాల్‌ పోస్టర్లు కనిపిస్తుంటాయి. కానీ ఇతర వ్యాధుల గురించి అలాంటి ప్రకటనలు ఎక్కడా కనబడవు.

ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి సమస్యలకు చికిత్సలు లభించకపోవడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. తక్కువ ధరలో చికిత్స అందిస్తామంటూ బాధితుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తుంటారు.

సంతానలేమి

ఫొటో సోర్స్, Getty Images

సామాజిక సమస్య

మగవాళ్లు తండ్రులు కాలేకపోవడం పాకిస్తాన్‌లో క్రమంగా పెరుగుతూ సామాజిక సమస్యగా మారుతోంది. ఇలాంటి సమస్యల చికిత్సకు చాలామంది పురుషులు ఇష్టపడరు. తమ మగతనంలో లోపంగా భావిస్తారేమోనని వెనకాడతారు.

పాకిస్తాన్‌లో చాలామంది మగవాళ్లు సంతానలేమికి సంవత్సరాల తరబడి భార్యలకు చికిత్స చేయిస్తారు తప్ప, తాము మాత్రం ప్రాథమిక పరీక్షలు కూడా చేయించుకోరని పలువురు ఆరోగ్య నిపుణులు బీబీసీతో అన్నారు.

ఇటీవల పెషావర్‌లోని హయతాబాద్‌ మెడికల్‌ కాంప్లెక్స్‌లో పాకిస్తాన్‌లోనే తొలిసారిగా లైంగిక సామర్ధ్యం, వ్యాధులు, సంతానలేమి సమస్యల చికిత్సకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసారు. స్పెషలిస్టులైన వైద్యులను నియమించారు.

అయితే పాకిస్తాన్‌లో సంతానలేమికి చికిత్స చేసే నిపుణులకు కొరత ఉందని, ఈ తరహా చికిత్స ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులలోనే చేస్తారని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తొలి కేంద్రమని ఇందులో పని చేస్తున్న డాక్టర్‌ మీర్‌ అబిద్‌ జాన్‌ బీబీసీతో అన్నారు.

సంతానలేమి

పిల్లలను కనలేకపోవడం మగతనంలో లోపమా ?

సంతానలేమితో బాధపడుతున్న భర్తలలో 90 శాతం మంది తమ భార్యలకు చికిత్స గురించే మాట్లాడతారని డాక్టర్‌ అబిద్‌ జాన్‌ అన్నారు.

కొందరు తమలో ఏ లోపం లేదని రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటుంటారని, తర్వాత విషయం గ్రహించి తమ వద్దకు వస్తున్నారని ఆయన వెల్లడించారు.

పురుషులలో సంతానం ఉత్పత్తి చేయలేని పరిస్థితినే అజూస్పెర్మియా అంటారని డాక్టర్‌ అబిద్‌ తెలిపారు.

సంతానలేమి

ఫొటో సోర్స్, Getty Images

సంతాన లేమి సమస్య

ప్రపంచవ్యాప్తంగా సగటున 15శాతం జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లో ఇది ఇంకా ఎక్కువని డాక్టర్‌ అబిద్‌ అన్నారు. మానసికస్థితితో సహా అనేక కారణాల వల్ల లైంగిక అనారోగ్యం కలుగుతుందన్నారాయన.

“యువకులు కూడా ఈ సమస్యకు గురవుతారు. 40 ఏళ్లు దాటిన వారిలో 50శాతంమందికి పైగా ప్రజలు వివిధ రకాల లైంగిక వ్యాధులబారిన పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల లైంగిక క్రియలు సాగించలేకపోతున్నారు” అని అబిద్‌ చెప్పారు.

సెక్స్‌ ఎడ్యుకేషన్‌ లేకపోవడం వల్ల పాకిస్తాన్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు.

పాకిస్తాన్‌లో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే డ్రగ్స్‌ఫై నిషేధం ఉంది. ఈ మందులను దుర్వినియోగం చేస్తారన్నది ప్రభుత్వం చెబుతున్న కారణం. దీంతో సమస్య అలాగే ఉండిపోతోందని అబిద్‌ అన్నారు.

“ప్రొఫెషనల్ వైద్యుల సలహా మేరకు ఈ మందులను రోగులకు ఇవ్వొచ్చు. కానీ దుర్వినియోగం పేరుతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అలా అనుకుంటే పాకిస్తాన్‌లో చాలా మెడిసిన్‌లు దుర్వినియోగం అవుతున్నాయి. వాటిని ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోంది?” అని అబిద్‌ ప్రశ్నించారు.

సంతానలేమి

ఫొటో సోర్స్, Getty Images

మగ బాధితులు చికిత్స కోసం వస్తారా?

మగవాళ్లు లైంగిక సమస్యల మీద దృష్టిపెట్టడం, వాటికి చికిత్స కోసం రావడం ఇటీవలి కాలంలో కొంత పెరిగిందని డాక్టర్‌ అబిద్‌ అంటున్నారు.

“పెళ్లికి ముందే కొందరు పరీక్షలు చేయించుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు” అని అబిద్‌ వెల్లడించారు.

“కొన్ని కుటుంబాలు కూడా ముందుకు వస్తున్నాయి. పెళ్లికి ముందే అవసరమైన టెస్టులు,చికిత్సలు చేయించుకోవాలని అమ్మాయిలు, అబ్బాయిలను కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తున్నారు. సమస్య ఉందేమో తెలుసుకోవడం తప్పేమీ కాదు’’ అన్నారు అబిద్‌.

టెస్టులకు ఇష్టపడని మగవాళ్లపై వారి భార్యలు ఒత్తిడి చేసి చికిత్సకు పంపిస్తున్నారని అబిద్‌ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కపుల్‌ థెరపిస్టులు అమ్మాయిలకు, అబ్బాయిలకు లైంగిక సమస్యలకు చికిత్సలు, మార్గనిర్దేశం చేస్తుంటారని చెప్పారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)