కౌన్ బనేగా కరోడ్‌పతి: భర్త కలను నెరవేర్చడానికి కేబీసీలో ‘కోటీశ్వరి’ అయిన మోహితా శర్మ

ఫొటో సోర్స్, Sony TV
- రచయిత, మధుపాల్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-12లో రెండో ‘కోటీశ్వరి’గా నిలిచారు.
కౌన్ బనేగా కరోడ్‌పతికి రావాలన్నది తన కోరిక కాదని, తన భర్త కల అని 30 సంవత్సరాల మోహితా వెల్లడించారు. కొద్దిరోజుల కిందటే ఝార్ఖండ్‌కు చెందిన నాజియా నాసిమ్ కేబీసీ సీజన్-12లో తొలి ‘కోటీశ్వరి’గా నిలిచారు.
మోహితా శర్మ ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. “కేబీసీకి రావడం చాలా సాహసోపేతం. యూపీఎస్సీ పరీక్ష నా స్వప్నం. ఆ కల నెరవేరడానికి ఐదేళ్లు పట్టింది. నాలుగుసార్లు ఫెయిలై, ఐదోసారి విజయం సాధించాను’’ అని మోహితా శర్మ బీబీసీతో అన్నారు.
కేబీసీలో పాల్గొనడం తన భర్త స్వప్నమని, ఆయన గత 20ఏళ్లుగా దీని కోసం ప్రయత్నిస్తున్నారని మోహితా వెల్లడించారు.“ఆయన చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారి నీ మొబైల్ నుంచి ప్రయత్నించి చూడమని అన్నారు. అలాగే ప్రయత్నించాను. చివరకు ఇక్కడికి వచ్చాను’’ అన్నారామె.

ఫొటో సోర్స్, SONY TV
లాక్‌డౌన్‌లో భర్తతోకలిసి కేబీసీ చూసి...
మోహితాశర్మ భర్త రుషల్ గార్గ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. వీరిద్దరు ఏడాది కిందటే పెళ్లి చేసుకున్నారు. “2019 అక్టోబర్‌లో మేం పెళ్లి చేసుకున్నాం. తర్వాత మాకు వేర్వేరుచోట్ల పోస్టింగ్‌లు వచ్చాయి.
ఆయన జమ్మూకశ్మీర్‌లో, నేను మణిపూర్‌లో ఉన్నాం. మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా కలుసుకున్నప్పుడు కేబీసీ చూశాం. పోటీలో సరైన సమాధానాలిచ్చాం" అని మోహితా శర్మ వెల్లడించారు.
“ఇద్దరం సివిల్ సర్వీస్ పరీక్షలు రాసినవాళ్లమే. కేబీసీలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మాకు అవగాహన ఉంది. అందుకే ఇద్దరం కలిసి కేబీసీ గెలవడానికి ప్రయత్నించాం. లాక్‌డౌన్ కారణంగా కొన్నాళ్లు కలిసున్నాం. తర్వాత నేను మణిపూర్ వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడు దేవుడి దయవల్ల నేను కూడా జమ్మూకశ్మీర్‌కు బదిలీ అయ్యాను. ఇద్దరం కలిసి ఉంటున్నాం" అని మోహితా శర్మ తెలిపారు.

ఫొటో సోర్స్, MOHITHA SHARMA
రూ.కోటి ప్రశ్నకురెండు లైఫ్‌లైన్‌లు
కోటి రూపాయల బహుమతినిచ్చే ప్రశ్న వచ్చేసరికి పోటీదారులు చాలామంది లైఫ్‌లైన్‌లు వాడుకుంటారు. ఒక లైఫ్ లైన్ ఉండటమే అరుదు. కానీ మోహితకు రెండు లైఫ్‌లైన్‌లు మిగిలి ఉన్నాయి.
“కోటి రూపాయల ప్రశ్నకు నాకు ఫ్లిప్ ది క్వశ్చన్, ఎక్స్‌పర్ట్ అడ్వైస్ లైఫ్‌లైన్‌లు మిగిలి ఉన్నాయి. నేను ఫ్లిప్ ద క్వశ్చన్ ఆప్షన్ వాడుకుందామని, రూ.7కోట్ల ప్రశ్నకు ఎక్స్‌పర్ట్ అడ్వైస్ లైఫ్‌లైన్ తీసుకుందామని అనుకున్నాను. కానీ రూ.7కోట్ల ప్రశ్నకు లైఫ్‌లైన్‌లు వాడటం కుదరదని అమితాబ్ చెప్పారు. దీంతో నేను ఎక్స్‌పర్ట్ అడ్వైస్ ఆప్షన్‌వైపు మొగ్గు చూపాను. ఎందుకంటే నిపుణుల సలహా కచ్చితంగా పనికొస్తుంది. నాకు అదే జరిగింది’’ అని మోహిత తెలిపారు.

ఫొటో సోర్స్, Sony TV
గెలిచినప్పుడుఎంత సంతోషమో అంత బాధ
కోటి రూపాయలు గెలుచుకున్నానన్న ఆనందం ఉన్నా, అమితాబ్ బచ్చన్‌తో షేక్‌హ్యాండ్ తీసుకోలేక పోయినందుకు బాధగా ఉందని మోహితా శర్మ అన్నారు.
“కరోనా కారణంగా కేబీసీ చాలా డిఫరెంట్‌గా సాగింది. అంతకు ముందు పోటీలో పాల్గొనేవారంతా అమితాబ్ జీతో షేక్‌హ్యాండ్ తీసుకునేవారు, హత్తుకునేవారు. కానీ ఈసారి ఆయన రాకకు ముందే నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. కెమెరా మావైపు ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ను పలకరించగలిగాను. అమితాబ్‌తో మాట్లాడటం, షేక్‌హ్యాండివ్వడం కుదరలేదు. ఇది నాకు చాలా నిరాశ కలిగించింది” అన్నారు మోహితా.
అమ్మా, నాన్నప్రోత్సాహం
షో జరుగుతున్నంత సేపు మోహితా చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. “నేను పోటీ నుంచి అంత త్వరగా తప్పుకోను. అన్ని మార్గాలు మూసుకుపోయినా నా మీద నాకు నమ్మకం తగ్గదు’’ అన్నారు మోహితా.
“మా అమ్మా నాన్నలకు నేనొక్కతే కూతురిని. వారి కృషివల్లే నేను ఇంతదాన్ని అయ్యాను. యూపీఎస్సీలో 4సార్లు విజయం సాధించలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. కానీ అమ్మానాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు’’ అన్నారామె.
“నేను కేబీసీలో రూ.కోటి గెలవడంపై మా అమ్మానాన్నలు, అత్తగారు చాలా సంతోషించారు. నాకు అభినందనలు వెల్లువెత్తాయి’’ అని ఆనందంతో చెప్పారు.
షో సందర్భంగా అమితాబ్ బచ్చన్ “ఇప్పుడు మనతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూర్చున్నారు. కానీ ఆమెకు నేను భయపడను’’ అని సరదాగా అన్నారు.
డ్యూటీలో కూడా మీరు ఇంతే మృదువుగా ఉంటారా అని అమితాబ్ అడిగారు. “విధుల్లో ఉన్నప్పుడు నేను కఠినంగా ఉంటాను. నిబంధనల విషయంలో ఏమాత్రం రాజీపడను. ఎవరినీ భయపెట్టడానికి ప్రయత్నించను. నేను ఇంత వరకు ఎవరినీ కొట్టలేదు. చెడుగా మాట్లాడలేదు. చట్టప్రకారం నా విధులు నిర్వర్తిస్తానని చెప్పాను’’ అన్నారామె.
“మీరు ఏదైనా మైలురాయిని చేరుకుంటే ముందు మీ కాళ్లను నేల మీద ఉంచండి. తర్వాత ఎంత పైకెగరాలనుకుంటే అంత పైకి ఎగరండి’’ అని ఆమె మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని బోధించారు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ
- 'జో బైడెన్ నాకు అయిదు సార్లు ప్రపోజ్ చేశారు' - అమెరికా ప్రథమ మహిళ కాబోతున్న జిల్
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








