బరాక్ ఒబామా తన పుస్తకంలో మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్ గురించి ఏం రాశారు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వీయ అనుభవాలతో రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం ఇప్పటికే భారతదేశంలో చిన్నపాటి కలకలాన్ని రేపింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గురించి సూటిగా రాసిన తీరు రాహుల్ అభిమానుల మనోభావాలను రగిలించగా, ఆయన ప్రత్యర్థులను ఆనందపరిచింది.
ఒబామా రాజకీయ జీవిత అనుభవాలను పొందుపరిచిన ఈ పుస్తకం మొదటి భాగం మంగళవారం విడుదల అయింది. స్పష్టంగా ఉన్న ఈ రచన వేగంగా చదివించేలా ఉంది. ఆయన 2010 నవంబరులో భారతదేశ సందర్శనకు వచ్చినప్పటి అనుభవాలను రాయడం కోసం కనీసం 1,400 పదాలను కేటాయించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల ఆయనకు కలిగిన భావాలను పుస్తకంలో పొందుపరిచారు.

ఫొటో సోర్స్, Getty Images
మన్మోహన్ సింగ్ గురించి:
భారతదేశంలో ముస్లింల పట్ల పెరుగుతున్న వ్యతిరేకత హిందూ జాతీయవాద పార్టీ ప్రభావాన్ని బలపరుస్తుందనే భయాన్ని మన్మోహన్ సింగ్ తనతో వ్యక్తం చేసిన విషయాన్ని ఒబామా గుర్తు చేసుకున్నారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండేది.
"ముంబయి తీవ్రవాద దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ పై దాడులు చేయాలనే పిలుపుల పట్ల మన్మోహన్ సింగ్ స్పందించకపోవడం కూడా ఆయనకు రాజకీయంగా దెబ్బ తీసింది" అని ఒబామా రాశారు.
"కొన్ని అనిశ్చిత పరిస్థితుల్లో మత, జాతి పరమైన సంఘీభావం ఉద్రేకపరిచేదిగా ఉంటుంది. అలాంటి పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం రాజకీయ నాయకులకు కష్టం కాదు, అది భారతదేశంలో అయినా, మరింకెక్కడైనా" అని సింగ్ ఆయనతో చెప్పినట్లు రాశారు. మన్మోహన్ సింగ్ మాటలతో ఒబామా ఏకీభవించారు.
ఈ సందర్భంగా ఒబామా ప్రేగ్ దేశ సందర్శనకు వెళ్ళినప్పుడు వెల్వెట్ విప్లవం తర్వాత జెక్ రిపబ్లిక్ కి తొలి అధ్యక్షుడు అయిన వాక్లవ్ హావెల్ తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ యూరోప్‌లో ఉదారవాదం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గురించి హెచ్చరించినట్లు గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
"ధనిక దేశాలలో ప్రపంచీకరణ, చారిత్రక ఆర్ధిక విపత్తు లాంటి అంశాలు ఇలాంటి పరిణామాలకు ఆజ్యం పోస్తుంటే, ఇలాంటి పరిస్థితులను నేను అమెరికాలో టీ పార్టీలో కూడా చూస్తుంటే , ఇండియా వీటికి లోను కాకుండా ఎలా ఉండగలదు" అని ఒబామా అంటారు.
ఒబామా దిల్లీలో ఉన్నప్పుడు మన్మోహన్ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రోజు ఆకాశంలో కమ్ముతున్న మబ్బుల గురించి సింగ్ స్వేచ్ఛగా మాట్లాడారని ఒబామా రాశారు.
మందగిస్తున్న ఆర్ధిక పరిస్థితి , 2007లో అమెరికాలో ఏర్పడిన సబ్ ప్రైమ్ మార్ట్‌గేజ్ విపత్తు అన్నీ కలిపి ప్రపంచ ఆర్ధిక పరిస్థితి తల కిందులవ్వడానికి దారి తీశాయని కూడా సింగ్ అన్నట్లు రాశారు. ఆయన న్యూక్లియర్ ఆయుధాలు సమకూర్చుకుంటున్న పాకిస్తాన్ తో పెరుగుతున్న ఉద్రిక్తతల పట్ల కూడా విచారం వ్యక్తం చేసినట్లు గుర్తు చేసుకున్నారు.
"ముంబయిలో 2008 లో చోటు చేసుకున్న తీవ్రవాద దాడుల పై విచారణ చేపట్టడానికి పాకిస్తాన్ భారతదేశంతో కలిసి పని చేయడంలో విఫలమవడం, దీనికి బాధ్యులైన లష్కర్ -ఈ - తైబా సంస్థ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ తో సంబంధాలు కలిగి ఉందని భావించడం కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచడానికి దారి తీశాయి" అని ఒబామా రాశారు.
భారతీయ ఆర్ధిక పరివర్తనకు మన్మోహన్ సింగ్ ప్రధాన రూపకర్త అని వ్యాఖ్యానిస్తూ ఆయనను "తెలివైన, ఆలోచన కలిగిన, నిజాయితీ కలిగిన నాయకునిగా" ఒబామా అభివర్ణించారు.
"మన్మోహన్ సింగ్ ప్రజల భావావేశాలను రగిల్చి కాకుండా వారి జీవన ప్రమాణాలను పెంచి అవినీతి లేని నాయకునిగా పేరు పొంది వారి నమ్మకాన్ని చూరగొన్నారు" అని ఒబామా అభిప్రాయ పడ్డారు.
అయితే, విదేశాంగ విధానం పట్ల ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని , చారిత్రకంగా అమెరికా వైఖరి పట్ల అనుమానాస్పదంగా చూసే భారతీయ ప్రభుత్వ విధానాలను దాటడానికి సుముఖత చూపరని అన్నారు. అయితే ఆయనతో నేను గడిపిన సమయంలో ఆయన అసాధారణ జ్ఞానం, హుందాతనం కలిగిన వారనే భావన కలిగిందని ఒబామా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సోనియా గాంధీ గురించి...
అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీని 60 ఏళ్ల వయసులో సంప్రదాయ చీరను ధరించి, తన తీక్షణమైన కళ్ళతో, ప్రశాంతమైన ఠీవితో ఆకర్షణీయంగా ఉన్న మహిళగా అభివర్ణించారు.
భర్త మరణానికి ముందు ఇంటి పట్టునే ఉన్న ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈ యూరోపియన్ మహిళ కడివెడు దుఃఖం నుంచి బయటకు వచ్చి ఒక జాతీయ నాయకురాలిగా ఎదగడం కుటుంబ వారసత్వపు బలానికి నిదర్శనంగా నిలుస్తోందని రాశారు. ఆమె భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 లో ఎల్ టి టి ఇ ఆత్మహత్య దళం చేతిలో బాంబు దాడులకు గురయి మరణించారు. సోనియా గాంధీ ఇటలీ దేశస్థురాలు.
డిన్నర్ చేస్తుండగా సోనియా మాట్లాడటం కన్నా ఎక్కువగా వినడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. " అలా అని మన్మోహన్ సింగ్ విధాన నిర్ణయాల పట్ల విబేధించాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని, ఆమె ఎక్కువగా సంభాషణను ఆమె కొడుకు వైపు మరల్చారు" అని రాశారు.
ఆమెకున్న అపారమైన తెలివితేటలూ, విచక్షణా జ్ఞానం వలనే ఆమెకు అధికారం లభించిందని నాకు స్పష్టంగా అర్ధం అయిందని ఒబామా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, PTI
రాహుల్ గాంధీ గురించి...
"రాహుల్ గాంధీ చురుకుగా, గంభీరంగా ఉండి, ఆయన తల్లిని పోలి ఉన్నారు" అని అంటూ, భవిష్యత్తులో ఉండబోయే ప్రగతిశీల రాజకీయాల గురించి రాహుల్ తన ఆలోచనలను పంచుకుంటూ నా 2008 ఎన్నికల ప్రచారం గురించి కొన్ని ప్రశ్నలు వేశారని, ఒబామా తన పుస్తకంలో రాశారు.
"కానీ, ఆయనలో ఇంకా తనదైన వ్యక్తిత్వం పూర్తిగా రూపొందలేదు. అతను పాఠాలన్నీ చదివేసి టీచర్ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థిలా ఉంటారు. కానీ, ఒక అంశం పై పూర్తి అవగాహన సాధించడానికి కావల్సిన జిజ్ఞాస కానీ, ఆసక్తి కానీ లేనట్లుగా కనిపించారు" అని రాహుల్ గురించి రాశారు ఒబామా.
రాహుల్ గాంధీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు న్యూ యార్క్ టైమ్స్ లో చీమమండ గోజి అడిచి రాసిన రివ్యూలో రావడంతో అవి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించాయి. ఇందుకు నిరసనగా ఒబామాను ట్విటర్ లో అనుసరించడం మానేశానని ఒక పార్టీ నాయకుడు ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత భవితవ్యం పై...
"మారుతున్న ప్రభుత్వాలతో, రాజకీయ పార్టీల మధ్య నడిచే వైరంతో, అనేక సాయుధ వేర్పాటువాద ఉద్యమాలతో, ఇంకా అన్ని రకాల అవినీతి కుంభకోణాలను ఎదుర్కొంటూ ఆధునిక భారతదేశం ఒక విజయ గాథగా నిలిచింది" అని ఒబామా రాశారు.
"వృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యం , స్వేచ్ఛాయుత ఆర్ధిక వ్యవస్థ ఉన్నప్పటికీ , దేశం ఇంకా " మహాత్మా గాంధీ కలలు కన్నసమానత్వం, శాంతియుత , స్థిరమైన సమాజ ఏర్పాటుకు కొంత వరకే దగ్గరగా వెళ్లగలిగింది. అసమానత్వం సర్వసాధారణంగా ఉంది. భారతీయుల జీవితంలో హింస భాగంగా ఉంది" అని అన్నారు.
ఆ రోజు సాయంత్రం మన్మోహన్ సింగ్ ఇంటి నుంచి బయటకు వచ్చాక 78 సంవత్సరాల ఈ ప్రధాని పదవి నుంచి వైదొలిగాక ఏమి జరుగుతుందనే ఆలోచనలో పడ్డానని వివరించారు.
"సోనియా పరిచిన బాటను అందిపుచ్చుకుని, బీజేపీ రేపుతున్న జాతీయవాదంపై కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను నిలుపుకుంటూ, ఈ కోటను విజయవంతంగా రాహుల్ కి అప్పగిస్తుందా అన్న సందేహం తనకు కలిగందని ఒబామా చెప్పుకొచ్చారు.
"నాకెందుకో అనుమానంగా ఉంది. అది మన్మోహన్ సింగ్ తప్పు కాదు. ఆయన కోల్డ్ వార్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలు పాటిస్తున్న విధానాలను అనుసరిస్తూ, రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి, నిత్యం పనులకు హాజరవుతూ, స్థూల జాతీయ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తూ, సామాజిక భద్రతను విస్తరిస్తూ ఆయన బాధ్యతను నిర్వహించారు" అని రాశారు.
"నేనైనా, ఆయననైనా వివిధ జాతులు, మతాలకు నివాసమైన భారతదేశం, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాల నుంచి ఇంత కంటే ఏమాశిస్తాం" అని అన్నారు.
"అయితే, ఆ హింస, దురాశ, అవినీతి, జాతీయవాదం, జాత్యహంకారం, మతపరమైన అసమానతలు , అసహనం, అనిశ్చితి, మరణాలు , ఇతరులను తక్కువగా చూడటం వంటి జాడ్యాలను పూర్తిగా తొలగించడం వంటివి ఏ ప్రజాస్వామ్యం లోనూ సాధ్యం కాని పనులు" అని రాసుకొచ్చారు ఒబామా.
"ఇలాంటివన్నీ ప్రతి చోటా ఉంటాయి. ఎప్పుడైనా అభివృద్ధి స్తంభించిపోయినప్పుడు, ప్రజా సమూహాలలో మార్పులు సంభవించినప్పుడు , లేదా ఆకర్షణీయమైన నాయకుడు ప్రజల భయాలను, ఆగ్రహాలను ఆసరాగా చేసుకుని స్వారీ చేయాలనుకున్నప్పుడు అవి వెంటనే మొలకెత్తుతాయి" అని ఒబామా రాశారు.
ఒబామాలో మెదిలిన ప్రశ్నకు హిందూ జాతీయవాద పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో సమాధానం లభించింది.
2015లో కూడా ఒబామా భారతదేశాన్ని సందర్శించారు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగా భారతదేశానికి రెండు సార్లు వచ్చిన అధ్యక్షుడు ఆయనొక్కరే.
ఒబామా రాసిన పుస్తకం మొదటి భాగం 2011లో ఒసామా బిన్ లాడెన్ మరణంతో ముగిసింది.
రెండవ భాగంలో ఆయనకు మోదీ పట్ల కలిగిన భావనలు ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కమలాహారిస్‌పై ఫేస్బుక్లో జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలు... బీబీసీ ఫిర్యాదుతో తొలగింపు
- కరోనావైరస్: వూహాన్ కరోనా వార్తలు రాసిన సిటిజన్ జర్నలిస్టుకు పోలీసుల వేధింపులు
- నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
- కరోనా కాలంలో మహిళలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారా
- జీఆర్ గోపీనాథ్: ఆకాశంలోని విమానాలను నేలకు దించిన కెప్టెన్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ మానేస్తే కానీ... ఆ దేశంలో స్మోకింగ్ తగ్గదా?
- Contempt of Court: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి విధించే శిక్షలు ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








