కరోనావైరస్: వూహాన్ కరోనా వార్తలు రాసిన సిటిజన్ జర్నలిస్టుకు పోలీసుల వేధింపులు

ఝాంగ్ ఝన్

ఫొటో సోర్స్, Youtube/Screenshot

ఫొటో క్యాప్షన్, సిటిజన్ జర్నలిస్ట్ ఝాంగ్ ఝన్ ను మే నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు

కరోనావైరస్‌ తొలిసారి బైటపడ్డ వూహాన్‌ నగరంలో ఓ మహిళా సిటిజన్‌ జర్నలిస్టు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. లాయర్‌గా పనిచేసిన 37 సంవత్సరాల ఝాంగ్‌ ఝన్‌, కరోనావైరస్‌పై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై మే నెలలో అరెస్టయ్యారు.

వివాదాలకు కారణమవుతున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపణల చేస్తూ ఉద్యమకారులపై చైనా అధికారులు తరచూ కేసులు పెడుతుంటారు. ఝాంగ్‌ ఝన్‌ను కూడా అవే ఆరోపణల కింద అరెస్టు చేశారు.

కరోనావైరస్‌ పుట్టినిల్లయిన వూహాన్‌ నగరంలో ఇలాంటి ఆరోపణలపై అరెస్టయిన సిటిజన్‌ జర్నలిస్టు ఝాంగ్‌ ఝన్‌ ఒక్కరే కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కనీసం ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోయారు.

వారిలో లీ జెహువా అనే పేరు సిటిజన్‌ జర్నలిస్టు తాను క్వారంటైన్‌లో ఉన్నట్లు ఏప్రిల్‌లో తెలిపారు. మరో జర్నలిస్టు చెన్ కిషీ ప్రభుత్వ నిఘా కింద ఉండగా, మూడో జర్నలిస్టు ఫాంగ్‌ బిన్‌ ఎక్కడున్నారో, ఏమయ్యారో తెలియరాలేదు.

ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వార్తలను ప్రచారం చేసేవారిని, ఉద్యమకారులను తీవ్రంగా అణచివేస్తారని చైనా అధికారులకు పేరుంది.

చైనా

ఫొటో సోర్స్, Meituan

ఫొటో క్యాప్షన్, వూహాన్ నగరం

నిరాహార దీక్ష

ఝాంగ్‌ ఝన్‌ వూహాన్‌కు వెళుతుండగా అదుపులోకి తీసుకున్నామని ఫిబ్రవరిలో ఆమె అరెస్టుకు దారి తీసిన పరిణామాలపై రాసిన ప్రభుత్వ నివేదికలో అధికారులు తెలిపారు.

వూహాన్‌లో పరిస్థితులపై ఆమె అనేక కథనాలు రాశారు. వైరస్‌ బాధితుల కష్టాలు, వాటిని కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపై అణచివేతలను కూడా ఆమె తన కథనాల్లో పేర్కొన్నారని చైనీస్‌ హ్యూమన్‌ రైట్స్‌ డిఫెండర్స్‌ (సీహెచ్‌ఆర్‌డీ) పేర్కొంది.

మే 14 నుంచి ఝాంగ్‌ ఝన్‌ కనిపించకుండా పోయారని సీహెచ్‌ఆర్‌డీ వెల్లడించింది. తనను షాంఘైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంతకు ముందు రోజే ఆమె చెప్పారని సీహెచ్‌ఆర్‌డీ తెలిపింది.

జూన్‌ 19న షాంఘైలో ఆమెను అధికారికంగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడైంది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే సెప్టెంబర్ 9న ఆమెకు తన లాయర్‌ను కలుసుకునే అవకాశం కల్పించారు.

అక్రమంగా తనను బందీని చేశారని ఆరోపిస్తూ ఝాంగ్‌ ఝన్‌ నిరాహారదీక్ష చేస్తున్నారని సీహెచ్‌ఆర్డీ తెలిపింది. సెప్టెంబర్‌ 18న ఆమెపై నేరాపణలు మోపినట్లు ఆమె లాయర్‌కు పోలీసులు తెలిపారు. గత శుక్రవారం ఆమెపై చార్జిషీట్‌ దాఖలు చేశారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, EPA

ఆమెపై ఆరోపణలేంటి?

“ఝాంగ్‌ ఝన్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వీచాట్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ల ద్వారా తప్పుడు సమాచారాన్ని, వీడియోలను ప్రచారం చేస్తున్నారు’’ అని ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

వూహాన్‌లో వైరస్‌వ్యాప్తిపై విదేశీ మీడియా సంస్థలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారని ఈ చార్జిషీటులో వెల్లడించారు. ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించాల్సిందిగా అధికారులు కోర్టుకు సూచించారు.

ఝాంగ్‌ ఝన్‌కు అధికారుల నుంచి వేధింపులు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదని సీహెచ్‌ఆర్డీ వెల్లడించింది. హాంకాంగ్‌లో ఉద్యమకారులకు అనుకూలంగా మాట్లాడారన్న ఆరోపణలపై 2019 సెప్టెంబర్‌లో పోలీసులు ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమెకు బలవంతంగా మానసిక పరీక్షలు చేస్తున్నారని కూడా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)