అమెరికా ఎన్నికలు: కమలాహారిస్‌పై ఫేస్‌బుక్‌లో జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలు... బీబీసీ ఫిర్యాదుతో తొలగింపు

కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహారిస్‌పై జాత్యహంకారం, మహిళలను కించపరిచేలా ఉన్న కామెంట్లను, పోస్టులను, మీమ్స్‌లను ఫేస్‌బుక్‌ తొలగించింది.

బీబీసీ ఇచ్చిన సమాచారం మేరకు ఫేస్‌బుక్‌ ఈ చర్యలు తీసుకుంది. తమ పేజీలలో కమలాహారిస్‌పై నిరంతరం ద్వేషపూరిత కామెంట్లు చేసే మూడు గ్రూపులు ఉన్నాయని బీబీసీ ఫేస్‌బుక్‌కు తెలిపింది.

ద్వేషపూరిత కంటెంట్‌లో 90శాతాన్ని ఫిర్యాదు రావడానికి ముందే తాము తొలగిస్తామని ఫేస్‌బుక్‌ ఈ సందర్భంగా తెలిపింది. అయితే కమలా హారిస్‌పై కామెంట్లను తొలగించినప్పటికీ, ఆ గ్రూప్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆ సంస్థ తెలిపింది.

“ఒక మీడియా సంస్థ ఫిర్యాదు చేసేదాక అలాంటి కంటెంట్‌ ఫేస్‌బుక్‌లో కొనసాగుతోందంటే, ఆ సంస్థ నిబంధనలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు’’ అని మీడియా మ్యాటర్స్‌ అనే మీడియా వాచ్‌డాగ్‌ సంస్థ ప్రెసిడెంట్‌ ఏంజెలో కరుసోస్‌ వ్యాఖ్యానించారు.

కమలా హారిస్

ఫొటో సోర్స్, EPA

కమలా హారిస్‌ భారతీయతపై కామెంట్లు

అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షురాలి జాతీయతపై ఫేస్‌బుక్‌లో కుప్పలుతెప్పలుగా కామెంట్లు, సెటైర్లు ఉన్నాయి. దీనికి కారణం ఆమె తల్లి భారతీయురాలు, తండ్రి జమైకా దేశస్తుడు కావడమే.

కొందరు “ఆమె ఇక అన్నీ ఇండియాకే రిపోర్ట్‌ చేస్తారు’’ అని కామెంట్‌ చేశారు. ఆమె పేరును చాలామంది ఎగతాళి చేస్తూ మీమ్స్‌ చేశారు.

ఫేస్‌బుక్‌లోని ఒక పేజీలో 4,000 మంది సభ్యులున్నారు. మరొకదాంట్లో 1,200 మంది ఉన్నారు. ఈ రెండు గ్రూపుల నుంచి కమలాను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ కామెంట్లు కనిపించాయి.

కొన్నిసార్లు ఆమెపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా కనిపించాయి. వాటిని ఫేస్‌బుక్‌ తొలగించింది.

ఫేస్‌బుక్‌ అడ్వర్టయిజర్లు, పౌరహక్కుల సంఘాలు గత కొద్దికాలంగా ఆ సంస్థపై విమర్శలు చేస్తున్నారు. ద్వేషపూరిత కంటెంట్‌ను తొలగించడానికి ఫేస్‌బుక్‌ సరైన చర్యలు తీసుకోవడంలేదని వారు ఆరోపించారు.

ఇందుకు నిరసనగా ఈ ఏడాది ఆగస్టులో వందల కంపెనీలు ఫేస్‌బుక్‌కు ప్రకటనలను నిలిపేశాయి.

కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

ద్వేషపూరిత వ్యాఖ్యలు

కమలా హారిస్‌ ఎపిసోడ్‌కు ముందు నుంచీ ద్వేషపూరిత కంటెంట్‌ విషయంలో ఫేస్‌బుక్‌పై విమర్శలున్నాయి. ఫేస్‌బుక్‌ దగ్గరున్న మోడరేషన్‌ సిస్టమ్‌ ద్వేషపూరిత కంటెంట్‌ను గుర్తించలేక పోతోందని కొందరు నిపుణులు విమర్శించారు. పైగా ఫేస్‌బుక్‌ అలాంటి వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తుందని కూడా ఆరోపించారు.

“ద్వేషపూరిత కామెంట్‌ చేసేవారిని ఆకర్షించే విధంగా ఫేస్‌బుక్‌ తన అల్గారిథమ్స్‌ను డెవలప్‌ చేసింది’’ అని స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్ అనే గ్రూప్‌కు చెందని రిషద్ రాబిన్సన్‌ బీబీసీతో అన్నారు.

“ఆగస్టులో జరిగిన ఆడిట్‌ సమావేశంలో ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో దారుణమైన నిర్ణయాలను ప్రకటించింది’’ అని ఆ గ్రూప్‌ వ్యాఖ్యానించింది.

గతవారం జో బైడెన్‌ అనుచరుడు ఒకరు కూడా ఫేస్‌బుక్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక హింసను ప్రేరేపించేందుకు కొందరు ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకున్నారని, కానీ ఆ సంస్థ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

మన ప్రజాస్వామ్య వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి ఫేస్‌బుక్‌ సమాధానం చెప్పాలి’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)