నైరోబీ బ్లాక్ మార్కెట్లో పసి బిడ్డల వ్యాపారం... పెంచుకునేందుకు, బలి ఇచ్చేందుకు పిల్లల్ని అమ్ముతున్నారు

- రచయిత, పీటర్ మురిమి, జోయెల్ గంటర్ , టామ్ వాట్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కెన్యాలోని నైరోబిలో ఉంటారు రెబెక్కా. ఆమె కొడుకు లారెన్స్ వయసు 10 ఏళ్లు. కానీ, ఇప్పుడు అతడు నైరోబీలో ఉన్నాడో? మరో చోట ఉన్నాడో? అసలు ఈ లోకంలోనే ఉన్నాడో, లేడో కూడా ఆమెకు తెలియదు.
చిన్న వయసులో ఉండగానే రెబెక్కాను ఆమె తల్లి వదిలేశారు.
వీధిన పడ్డ రెబెక్కాకు ఓ వృద్ధుడు పరిచయమయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను మోసం చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చారు. లారెన్స్ పుట్టాడు.
అతడు పుట్టే సమయానికి రెబెక్కా వయసు 15 ఏళ్లే. ఒక సంవత్సరం పాటు ఆమె ఆ బిడ్డను పెంచింది.
రెబెక్కా భిక్షమెత్తుకుంటూ బతుకుతున్నారు. ఈ పని చేయడానికి ధైర్యం కోసం జెట్ ఇంధనాన్ని మత్తులా పీల్చుకోవడం ఆమెకు అలవాటు.
2011 మార్చిలో ఓ రోజు ఆమె ఇలాగే మత్తులో ఉండగా, లారెన్స్‌ను ఎవరో ఎత్తుకువెళ్లిపోయారు. ఇక, అప్పటి నుంచి తన బిడ్డను ఆమె మళ్లీ చూడలేదు.
‘‘నాకు వేరే పిల్లలు కూడా పుట్టారు. కానీ, వాడు నా మొదటి బిడ్డ. వాడి జాడ కోసం పిల్లల కేంద్రాలున్న ప్రతి చోటా వెతికాను. కానీ, వాడు దొరకలేదు’’ అని రెబెక్కా ఉబికి వస్తున్న కన్నీళ్లతో చెప్పారు.

రెబెక్కా ఇప్పటికీ అదే వీధుల్లో ఉంటున్నారు. ఆమెకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రెబెక్కా నివసిస్తున్న ఆ వీధిలో చాలా మందివి ఆమె లాంటి కథలే.
2018 ఆగస్టులో ఏస్థర్ కొడుకు మూడేళ్ల వయసులో ఉండగా అపహరణకు గురయ్యాడు.
కారోల్ రెండేళ్ల కొడుకుని కూడా ఐదేళ్ల క్రితం ఎవరో ఎత్తుకుని పోయారు. తన కొడుకును తనకు వెనక్కి ఇస్తే, వారిని తాను క్షమిస్తానని ఆమె అంటున్నారు.
పిల్లల అక్రమ రవాణా వ్యాపారం చేసేవారు నైరోబిలో ఉన్న ఇలాంటి నిస్సహాయ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బీబీసీ ‘ఆఫ్రికా ఐ’ ఈ వ్యవహారం గురించి ఏడాది పాటు పరిశోధన చేసింది.
నిరాశ్రయులైన తల్లుల నుంచి పిల్లలను కొందరు ఎత్తుకుపోయి, భారీ లాభాలకు అమ్ముకుంటున్నట్లు ఇందులో ఆధారాలు లభించాయి.
వీధుల్లో ఉండే క్లినిక్‌ల్లో పిల్లలను దొంగలించి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర విక్రయిస్తున్నట్లు కూడా మా పరిశోధనలో తెలిసింది.
ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి కార్యకలాపాలకు సహకరిస్తున్న వారి గుట్టు లాగేందుకు, పిల్లలను కొనేవారిలా నటిస్తూ మేం ఒక అధికారిని సంప్రదించాం.

‘నన్ను నమ్మారు... అంతే’
పిల్లలను దొంగిలించే వారిలో నిస్సహాయులైన అవకాశవాదుల నుంచి వ్యవస్థీకృత నేరస్థుల వరకు రకరకాల వాళ్లు ఉంటారు. కొన్ని సార్లు వీళ్లు కలిసి పని చేస్తూ ఉంటారు.
ఇలాంటి అవకాశవాదుల్లో మద్యం, మాదక ద్రవ్యాల వాడకానికి అలవాటు పడిన అనిటా అనే మహిళ ఒకరు. ఆమె కూడా ఇదే వీధుల్లో తిరుగుతూ రెబెక్కా లాంటి మహిళల దగ్గర నుంచి డబ్బులు దొంగలిస్తూ బతుకు వెళ్లదీస్తూ ఉంటారు. ఆమె మూడేళ్ళ లోపు పిల్లలున్న తల్లులను లక్ష్యంగా చేసుకుంటారు.
అనిటా స్నేహితురాలి ద్వారా ఆమె గురించి వివరాలను ఆఫ్రికా ఐ సేకరించింది.
వీధుల్లో పిల్లలను దొంగిలించడానికి అనిటా వివిధ పద్ధతులను అవలంబిస్తారని ఆమె గురించి వివరాలు ఇచ్చిన ఆమె స్నేహితురాలు ఎమ్మా (పేరు మార్చాం ) చెప్పారు.
‘‘పిల్లలను దొంగిలించడానికి అనిటా దగ్గర చాలా మార్గాలున్నాయి. కొన్ని సార్లు ఆమె ముందుగానే ఆ తల్లులతో మాట్లాడతారు. కొన్ని సార్లు వారికి మత్తు ఇచ్చి, పిల్లలను ఎత్తుకువెళ్తారు’’ అని ఎమ్మా చెప్పారు.
పిల్లలను కొనుక్కోవాలనుకుంటున్నట్లు చెబుతూ ఆఫ్రికా ఐ బృందం అనిటాను ఒక పబ్‌లో కలిసింది.
తన యజమాని నుంచి ఎక్కువ మంది పిల్లలను దొంగలించాలనే ఒత్తిడి వస్తున్నట్లు ఆమె మాతో చెప్పారు. పిల్లలను ఎత్తుకువెళ్లేందుకు ఇటీవల కాలంలో తాను అనుసరించిన పద్ధతి గురించి కూడా ఆమె వివరించారు.
‘‘వీధుల్లో ఒకామె కొత్తగా కనిపించారు. ఆమెకు అక్కడ పరిస్థితులన్నీ అయోమయంగా ఉన్నాయి. తన బిడ్డ విషయంలో నన్ను నమ్మారు. నాకొక బిడ్డ దొరికేసింది" అని అనిటా అన్నారు.
తన యజమాని చిన్న చిన్న నేరస్థుల నుంచి దొంగలించిన పిల్లలను కొనుక్కుని వారిని తిరిగి లాభాలకు అమ్ముతుంటారని అనిటా చెప్పారు.
‘‘కొంత మంది పిల్లలు లేని తల్లులు పెంచుకునేందుకు వారిని కొనుక్కుంటారు. ఇంకొందరు బలి ఇవ్వడానికి కొనుక్కుంటారు’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty
ఒక సారి అమ్మేశాక ఆ పిల్లలు ఏమవుతారో అనిటాకు కూడా తెలియదు. అమ్మాయి అయితే 34,391 రూపాయలు (350 పౌండ్లు), అబ్బాయి అయితే 53,990 రూపాయలు (550 పౌండ్లు) చెల్లిస్తారని ఆమె చెప్పారు.
పిల్లలతో వ్యాపారం చేస్తున్నట్లు ఆ స్థానికి వ్యాపారి ఒప్పుకోరని ఎమ్మా అన్నారు.
మేం మొదటి సారి అనిటాను కలిసిన తర్వాత త్వరగానే మరో సారి కలవడానికి ఆమె ఏర్పాట్లు చేశారు. మేము అక్కడకు చేరే సరికి ఆమె 5 నెలల పాపతో కూర్చుని ఉన్నారు. కొన్ని క్షణాల క్రితమే ఆ పాపను దొంగలించినట్లు ఆమె చెప్పారు. ఆ పాపకు ఒక వ్యక్తి 53,990 రూపాయలు చెల్లిస్తానని అన్నారని ఆమె చెప్పారు.
ఆ పాపను కొనుక్కోవడానికి మరోసారి సమావేశం ఏర్పాటు చేశాం. ఆ పసి పాప ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఆఫ్రికా ఐ పోలీసులకు సమాచారం అందించింది. ఆ బిడ్డను రక్షించి, అనిటాను అరెస్ట్ చేసేందుకు ఒక రహస్య ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందించింది. అనిటాను పట్టుకోవడానికి మాకు ఇదే ఆఖరి అవకాశం. కానీ, అనిటా ఆచూకీ చిక్కకుండా పోయారు.
చాలా రోజులు ప్రయత్నించినప్పటికీ అనిటా మాకు దొరకలేదు. చివరకు ఎమ్మా ఆమెను పట్టుకోగలిగారు.
ఎక్కువ డబ్బులు ఇచ్చి, బిడ్డను కొనుక్కునే వాళ్ళు దొరకడంతో అనిటా ఆ బిడ్డను అమ్మేసి... ఆ డబ్బుతో రెండు గదుల రేకుల ఇల్లు కట్టుకున్నారని ఎమ్మా చెప్పారు.
కానీ, ఆ బిడ్డ ఆచూకీ కూడా లేదు. పోలీసుల దగ్గర అనిటా కేసు ఇంకా తెరిచే ఉంది.
కెన్యాలో పిల్లల అక్రమ రవాణా గురించి గణాంకాలు కానీ, ప్రభుత్వ నివేదికలు కానీ, జాతీయ సర్వేలు కానీ సరిగ్గా లేవు. తప్పిపోయిన పిల్లలను వెతికి తెచ్చి, ఇలాంటి అక్రమ రవాణా వ్యవహారాలను గుర్తించే సంస్థల్లో తగినంత మంది సిబ్బంది లేరు.

‘సామాజిక రుగ్మతలా చూడటం వల్ల...’
ఇలా తప్పిపోయిన పిల్లలను ఆదుకునేందుకు మర్యాన మున్యేన్దో అనే ఆవిడ 'మిస్సింగ్ చైల్డ్ కెన్యా 'అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు.
నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 600 కేసులను పరిష్కరించినట్లు మున్యేన్దో చెప్పారు.
బాధితులు ఎక్కువగా నిస్సహాయ వర్గాలకు చెందినవారే కావడం వల్ల సాంఘిక సంక్షేమ ప్రణాళికల్లో ఈ అంశానికి తగినంత ప్రాధాన్యత లభించట్లేదని ఆమె అన్నారు. మీడియా దృష్టిని ఆకర్షించే, అధికారులపై చర్యలు తీసుకునే విధంగా చేసే శక్తి కూడా ఆ వర్గాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
"పిల్లలు లేకపోవడాన్ని సామాజిక రుగ్మతలా చూడటం కూడా ఈ అక్రమ వ్యాపారం పెరగడానికి ఓ కారణం. ఆఫ్రికాలో సంతానం లేని మహిళలను అరిష్టంగా చూస్తారు. మహిళలపై పిల్లలను కనాలని, అందులోనూ అబ్బాయిలనూ కనాలని ఒత్తిడి ఉంటుంది. పిల్లలను కనలేకపోతే ఇంటి నుంచి బయటకు తరిమేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మహిళలు పిల్లల అక్రమ వ్యాపారం చేసేవారిని సంప్రదిస్తారు. ఆ వ్యాపారులు అనిటా లాంటి వారిని వాడుకుని ఆ పని చేసిపెడతారు’’ అని మున్యేన్దో అన్నారు.

ఫొటో సోర్స్, TONY KARUMBA
పిల్లల అక్రమ రవాణా ముఠాలు నైరోబి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నడుస్తున్నట్లు ఆఫ్రికా ఐ పరిశోధనలో తెలిసింది.
మామ లూసీ కిబాకి హాస్పిటల్లో పని చేసే ఒక సామాజిక కార్యకర్త ఫ్రెడ్ లెపరన్‌ని మేం కలిశాం.
ఈ ఆసుపత్రిలో పుట్టిన నిస్సహాయ పిల్లల బాగోగులు చూసుకోవడం ఫ్రెడ్ బాధ్యత. కానీ, ఆయనకు నేరుగా ఈ అక్రమ రవాణా వ్యాపారంతో సంబంధాలున్నాయని మాకు కొందరు సమాచారం అందించారు.
సంతానం లేని ఓ మహిళకు పెంచుకునేందుకు ఓ బిడ్డ కావాలంటూ మేం ఫ్రెడ్‌ను సంప్రదించాం.
"నా దగ్గర ఒక బాబు ఉన్నాడు. కానీ, తర్వాత నేను చిక్కుల్లో పడకుండా నాకో ప్రణాళిక కావాలి" అని ఫ్రెడ్ మాతో అన్నారు. ఆయన సంభాషణను మేం రికార్డ్ చేశాం.
తాను అమ్మిన పిల్లలు ఏమవుతారో ఫ్రెడ్‌కు కూడా తెలియదు.
ఆఫ్రికా ఐ సిబ్బందిలో ఒకరు రోజ్ అనే మారు పేరుతో, వేషం మార్చుకుని ఫ్రెడ్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆసుపత్రికి దగ్గరగా ఉండే ఒక ఆఫీసులో వారిద్దరూ కలుసుకున్నారు. రోజ్‌ను ఫ్రెడ్ కొన్ని ప్రశ్నలు అడిగారు.
‘‘నాకు పెళ్లైంది. కానీ, పిల్లలు పుట్టలేదు. భర్త కుటుంబం నుంచి ఒత్తిడి వస్తోంది’’ అని ఫ్రెడ్‌కు రోజ్ చెప్పారు.
బిడ్డ ఖరీదు 1,96,333 రూపాయిలు ( 2000 పౌండ్లు) వరకూ ఉంటుందని ఫ్రెడ్ ఆమెతో అన్నారు. తాను ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా మాత్రమే ఉంటానని చెప్పారు.

‘అనధికార క్లినిక్‌ల్లో...’
ఆఫ్రికా వీధుల్లో అనధికారికంగా నడిచే క్లినిక్‌ల్లో ప్రసూతి గదులు ఉంటాయి. పిల్లల అక్రమ రవాణాకు ఇవి ప్రముఖమైన కేంద్రాలు.
స్థానిక విలేకరి జ్యూడిత్ కనైథ సహాయంతో ఆఫ్రికా ఐ కయోల్ ప్రాంతంలో ఉండే ఒక క్లినిక్‌కు వెళ్లింది. ఇక్కడ పిల్లల అక్రమ రవాణా విరివిగా జరుగుతోందని జ్యుడిత్ మాకు చెప్పారు.
మేరీ ఆమ అనే ఆవిడ నిర్వహిస్తున్న క్లినిక్‌కు మేం వెళ్లాం. నైరోబిలో కొన్ని పెద్ద హాస్పిటళ్లలో మేరీ నర్స్‌గా పని చేశారు.
జ్యుడిత్ ఆమె దగ్గర బిడ్డను కొనుక్కోవడానికి వచ్చినట్లు నటించారు. అప్పటికే క్లినిక్‌లో ఇద్దరు మహిళలు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు.
వాళ్లలో ఒకరికి పుట్టబోయే బిడ్డను 30,922 రూపాయలకు (315 పౌండ్లు) అమ్ముతానని మేరీ చెప్పారు.
గర్భంతో ఉన్న ఆవిడ ఆరోగ్యం గురించి మేరీలో పెద్దగా పట్టింపు కనిపించలేదు
‘‘డబ్బులు అందగానే ఆమె వెళ్ళిపోతారు. తిరిగిరాకుండా మేం చూసుకుంటాం’’ అని మాతో అన్నారు. ఆ బిడ్డ తల్లికి 6,871 రూపాయలు (70 పౌండ్లు) ఇస్తానని మేరీ చెప్పినట్లు తెలిసింది.
అయితే, ఆ తల్లి తన బిడ్డను చివరికి ప్రభుత్వానికి అప్పగించింది.
ఓ రోజు తన దగ్గర ముగ్గురు పిల్లలున్నారని, అందులో ఒకరిని అమ్ముతానని ఫ్రెడ్... రోజ్‌కు ఫోన్ చేశారు. ఆ ముగ్గురినీ నిజానికి ఆయన చిల్డ్రన్ హోమ్‌కు పంపించాలి. ఆఫ్రికా ఐ బృందం ఆ పిల్లలను సురక్షిత స్థలాలకు చేర్చేందుకు సహాయ పడింది.
ఆ తరువాత ఫ్రెడ్ డబ్బులు చెల్లించమని ఫోన్ చేశారు. బీబీసీ బృందం ఆయన్ను ఈ విషయమై నిలదీసింది. ఫ్రెడ్ నుంచి ఎలాంటి స్పందనా లేదు.
అయితే, ఫ్రెడ్‌పై ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇంకా ఆయన అదే ఉద్యోగంలో కొనసాగుతున్నారు.
"పిల్లలను కోల్పోయిన తల్లులకు ఎప్పటికీ ఓ పరిష్కారం ఉండదు. తిరిగి తమ పిల్లలను కలిసే అవకాశం లక్షలో ఒక్కరికి కూడా దక్కకపోవచ్చు. ఈ వీధుల్లో ఉన్న తల్లులు ఒకప్పుడు దిక్కులేని పిల్లలే. వారి నిస్సహాయతను అవకాశవాదులు ఉపయోగించుకున్నారు. వాళ్లకు మనోభావాలు ఉండవని, వాళ్లకు న్యాయం అక్కర్లేదని చాలా మంది అనుకుంటారు. కానీ, ఓ సాధారణ తల్లికి బిడ్డను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో, వీరికి కూడా అంతే బాధ ఉంటుంది’’ అని మర్యాన మున్యేన్దో అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








