ఆఫ్రికా దేశాల బానిసల వర్తకం ప్రస్తుత జనాభాపై జన్యుపరంగా ఎలాంటి ప్రభావం చూపించిందంటే...

ఫొటో సోర్స్, Reuters
అమెరికా ఖండంలోని వివిధ ప్రాంతాలకు కోటి మందికిపైగా ఆఫ్రికన్లను బానిసలుగా తీసుకురావడం ప్రస్తుత జనాభా జన్యు సమూహంపై ఎలాంటి ప్రభావం చూపిందన్నదాన్ని గుర్తించేందుకు ఒక భారీ అధ్యయనం జరిగింది.
దాదాపు 50 వేల మంది ఇందులో పాల్గొన్నారు.
1515 నుంచి 19వ శతాబ్దం మధ్య వరకూ పెద్ద ఎత్తున బానిసల వర్తకం జరిగింది. అట్లాంటిక్ సముద్రం మీదుగా 1.25 కోట్లకుపైగా ఆఫ్రికన్లను అమెరికా ఖండాల్లోని వివిధ ప్రాంతాలకు బానిసలుగా తీసుకువచ్చారు.
దాదాపు 20 లక్షల మంది వచ్చే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిణామం జనాభా స్వరూపంపై జన్యుపరంగా చూపించిన ప్రభావాన్ని గుర్తించేందుకు 23 అండ్‌మీ అనే ఓ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. దీని ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్‌లో ప్రచురితమయ్యాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బానిసల వర్తకంలో భాగంగా ఆఫ్రికన్లను తీసుకువచ్చిన నౌకల వివరాలు, ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్న జన్యు సమూహానికి సరిపోలుతున్నాయో, లేదో తమ అధ్యయనంలో పరిశీలించామని జనాభా జన్యు శాస్త్రవేత్త స్టీవెన్ మిష్లెటీ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.
‘‘ఆఫ్రికా నుంచి బానిసల తరలింపుకు సంబంధించిన చారిత్రక ఆధారాలతో చాలా ఫలితాలు సరితూగాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం పూర్తిగా భిన్నమైన ఫలితాలు కనిపించాయి’’ అని ఆయన చెప్పారు.
చాలా వరకూ ఆఫ్రికన్ వారసత్వం ఉన్న అమెరికన్ల మూలాలు ప్రస్తుత అంగోలా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రాంతాల్లో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
బానిసల వర్తకానికి ప్రధానంగా ఉపయోగించిన మార్గం కూడా ఇదే.
అయితే, ఆశ్చర్యకరంగా నైజీరియన్ మూలాలున్న వాళ్లు అమెరికాలో, లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కువగా కనిపించారు. కానీ, చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే మాత్రం ఆ ప్రాంతం నుంచి అక్కడికి వచ్చిన వారి సంఖ్య అంతగా లేదు.
1619 నుంచి 1807 మధ్య వలసపాలన సమయంలో అంతర్గతంగా సాగిన బానిసల వర్తకం ఇందుకు కారణం కావొచ్చని పరిశోధకులు అంటున్నారు.
అట్లాంటిక్ మీదుగా బానిసల వర్తకంపై నిషేధం కారణంగా, బ్రిటీష్ కరీబియన్ ప్రాంతం నుంచి బానిసలుగా ఉన్న నైజీరియన్లను మిగతా ప్రాంతాలకు తరలించి ఉంటారని వారు అభిప్రాయపడ్డారు.
సెనెగల్, గాంబియా లాంటి ప్రాంతాల మూలాలు కలిగినవాళ్లు మాత్రం తక్కువగా కనిపించారు. మొదటగా బానిసలుగా జనాలను తీసుకువచ్చింది ఈ ప్రాంతాల నుంచే.
వరి చేనుల్లో పనికి పెట్టడంతో వీరిలో చాలా మంది మలేరియా, ఇతర ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల చనిపోయారని, ఆ తర్వాత కొన్నేళ్లు పెద్ద సంఖ్యలో చిన్నారులను బానిసలుగా తరలించారని, వారిలో చాలా మంది మధ్యలోనే చనిపోయారని పరిశోధకులు తెలిపారు.
అమెరికా ఖండాల్లోని వివిధ ప్రాంతాల్లో బానిస మహిళల పట్ల అనుచిత ప్రవర్తన ప్రభావం కూడా జన్యు సమూహంపై కనిపించిందని గుర్తించారు.
బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ మహిళలపై వాళ్ల యజమానులు, ఇతరులు చేసిన లైంగిక దోపిడీ ఇందుకు కారణమై ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
లాటిన్ అమెరికాలో జన్యు సమూహంలో ప్రతి ఆఫ్రికన్ పురుషుడి భాగస్వామ్యానికి 17 మంది ఆఫ్రికన్ మహిళల భాగస్వామ్యం ఉందని పరిశోధకులు తెలిపారు.

ఆఫ్రికన్ మూలాలను ప్రత్యుత్పత్తి ద్వారా తగ్గించేందుకు యురోపియన్ పురుషుల వలసలను ఎక్కువగా ప్రోత్సహించడం కూడా ఇందుకు కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
బ్రిటీష్ వలస పాలనలో ఉన్న అమెరికాలో మాత్రం జన్యు సమూహంలో ప్రతి ఆఫ్రికన్ పురుషుడికి ఇద్దరు ఆఫ్రికన్ మహిళల భాగస్వామ్యం ఉంది. ఇక్కడ లైంగిక దోపిడీ తక్కువగా ఉంది.
‘‘అట్లాంటిక్ మీదుగా బానిసల వర్తకంపై నిషేధం వల్ల... అమెరికాలో బానిసలను పిల్లలను కనేందుకు ప్రోత్సహించారు. పని చేసేందుకు తగినంత మంది బానిసలు ఉండాలని ఇలా చేశారు. అమెరికాలో సంతానాన్ని కన్నందుకు బదులుగా మహిళలకు బానిసత్వం నుంచి విముక్తి కూడా కల్పిస్తుండేవారు. భిన్న జాతులవారి కలయికను వ్యతిరేకించే విధానాలు మాత్రం ఉండేవి’’ అని పరిశోధకులు తెలిపారు.
బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం ఆఫ్రికన్ అమెరికన్లపై, ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికన్ మూలాలున్నవారిపై వలసవాదం, బానిసత్వం చూపిన దుష్ప్రభావాలను చర్చించుకునేలా చేసింది.
బానిసత్వాన్ని గొప్పగా చూపించేలా ఉన్నాయంటూ చాలా మంది ఆందోళనలకు దిగడంతో... చాలా చోట్ల బానిసల వర్తకం చేసినవారికి ఇదివరకు పెట్టిన విగ్రహాలను తొలగించారు.
ఇవి కూడా చదవండి:
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








