బ్రిటన్‌లో నల్ల జాతి యువతి కెల్సీ: 'నా ఆఫ్రికన్ జుట్టును ఎలా చూడాలో నా తెల్లజాతి తల్లితండ్రులకు తెలియలేదు'

Kelsey Rickards as a child on the left, Kelsey now

ఫొటో సోర్స్, KELSEY RICKARDS / BBC THREE

ఫొటో క్యాప్షన్, కెల్సీ రికార్డ్స్ చిన్నప్పుడు... ఇప్పుడు

కెల్సీ రికార్డ్స్, వయసు 26 ఏళ్ళు.

అద్దం ముందు నిల్చున్నా. నా తలకు చుట్టుకున్న టవల్‌ను ఒక్కసారిగా విదిలించా. నిజానికి అది టవల్ కాకుండా చిన్నప్పుడు నేను కలలు కన్న పొడవైన, మెరిసే జట్టు అయితే ఎంత బాగుంటుందో కదా అనుకున్నా.

నేను నిల్చుంటే చూడ్డానికి ఓ రకంగా పొడవైన జడ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ, నిజమేంటన్నది నాకు తెలుసు. ఒక్కసారిగా టవల్ తియ్యగానే అసలు సంగతి బయటపడుతుంది. అబ్బాయిల స్టయిల్లో నా పొట్టి జట్టు కనిపిస్తుంది.

జుట్టు అంటే జుట్టే.. అందులో ఏముంది? అని మీరు అనుకోవచ్చు. కానీ, నా వరకు నా కేశాలే నా ఉనికిని, నా సంస్కృతిని తెలియజేస్తాయి. నా నల్లజాతి సంస్కృతికి నా జుట్టుకు సంబంధం ఉంది. అయితే చిన్నప్పుడు నేను లివర్‌పూల్‌లో పెరగడంతో నాకు దాని గురించి అంతగా అవగాహన లేదు.

ఈ రోజుల్లో అమ్మాయిలు జుట్టు విషయంలో అనవసర భేషజాలకు పోవడం లేదు. సహజ సిద్ధంగా ఉండటాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. #naturalhairstyles అని ఇనిస్టాగ్రామ్‌లో వెతికితే 27 లక్షల ఫలితాలు చూపిస్తోంది. అందులో ఎక్కువగా బ్రైడ్స్‌ నుంచి ఆఫ్రోస్ వరకు అన్ని స్టైల్స్‌లోనూ నల్లజాతి మహిళల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే నా వరకు వస్తే నా సహజ సిద్ధమైన హెయిర్ స్టైల్ కోసం నేను చేసిన ప్రయాణం అంత సులభంగా ఏం సాగలేదు.

Childhood photos of Kelsey Rickards

ఫొటో సోర్స్, Kelsey Rickards / BBC Three

ఫొటో క్యాప్షన్, కెల్సీ చిన్నప్పటి ఫోటోలు

జింబాబ్వే నుంచి లివర్ పూల్ వరకు

నేను 1994లో జింబాబ్వేలో పుట్టాను. నేను నా కన్న తల్లిని వెతుక్కునే ప్రయత్నంలో భాగంగా 2017లో ఆమెను చూసేంత వరకు నన్ను చిన్నప్పుడు దత్తత ఇవ్వడానికి కారణాలేంటన్నది పెద్దగా తెలియదు. సరిగ్గా ఏడాది క్రితం నేను పుట్టిన దేశానికి వెళ్లి నా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకోసం నేను అవసరమయ్యేంత డబ్బును దాచుకోవడం మాత్రమే కాదు.. ఆ మార్గంలో వచ్చే కష్ట, నష్టాలను ఎదుర్కొనే విషయంలోనూ ముందుగానే మానసికంగా సిద్ధమయ్యాను.

అదృష్టవశాత్తు నా దత్తతకు సంబంధించిన పత్రాలను కొద్ది నెలల్లోనే సంపాదించాను. అలా నా కన్న తల్లి పేరు నాకు తెలిసింది. అక్కడ నుంచి ఆమె కోసం నేను ఫేస్ బుక్‌లో వెతకడం మొదలుపెట్టాను. చివరకు నాలాగే ఉన్న ఓ మహిళను చూశాను. నేను ఆమెకు మెసేజ్ చేశాను. ఎలాగైతేనేం ఎట్టకేలకు నా పుట్టుకకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియబోతున్నాయన్న భావన నాకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. ఆమె తిరిగి నాకు మెసేజ్ పెట్టారు. అక్కడ నుంచి మేం తరచుగా మాట్లాడుకునే వాళ్లం.

ఆమె బల్గేరియాకు చెందిన తెల్ల జాతీయురాలు. జింబాబ్వేలో ఉంటున్నారు. నా తండ్రితో కలిసి రెండేళ్లు ఉన్నట్టు ఆమె నాకు చెప్పారు. ఆయన గురించి పూర్తి వివరాలు నాకు చెప్పకపోయినప్పటికీ ఆమె మాటల వలన బహుశా ఆయన మిశ్రమ జాతికి లేదా నల్ల జాతికి చెందిన వ్యక్తి అని తెలిసింది.

ఆమె 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఆ కడుపులో పడ్డాను. 8 నెలలు నిండేవరకు వదులైన దుస్తులు ధరించి ఎలాగోలా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలిశాక వాళ్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం చెందారు. నన్ను ఎలాగైనా తనతో ఉంచుకోవాలని ఆమె అనుకుంది. కానీ నన్ను పెంచి పోషించడం ఎలాగో తెలియలేదు. అదే సమయంలో నా తండ్రి ఆమెను వదిలేశాడు. అందుకే ఏడు రోజుల వయసులోనే నన్ను దత్తత ఇచ్చారు.

నన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తెల్లజాతీయులు. నేను పుట్టే ముందే వాళ్లు జింబాబ్వేకు వలస వెళ్లారు. నా మారు తల్లికి పిల్లలు లేరు. చాలా సార్లు ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆరేళ్ల వయసు వరకు అక్కడే పెరిగాను. మంచి స్కూలుకి వెళ్లేదాన్ని. స్నేహితులు ఉండేవారు. అంతా బాగానే ఉందని అనుకున్నా. నాకు నీలి కళ్లతో అందంగా మెరిసిపోయే ఓ సోదరి కూడా ఉంది. ఆమెను కూడా దత్తత తీసుకున్నారు.

Kelsey Rickards with her family

ఫొటో సోర్స్, Kelsey Rickards / BBC Three

మైఖేల్ జాక్సన్‌లా ఉన్నానని అన్నారు

సరిగ్గా మూడేళ్ల వయసునుంచే నా జుట్టు సహజంగా రింగులు తిరగడం మొదలయ్యింది. నా మారు తల్లికి జుత్తు పొడవుగా కొద్దిగానే ఉండేది. నా జుట్టు పెరుగుతున్న కొద్దీ నాకు జడవేయడం, తలకు స్నానం చేయించడం ఇటువంటి పనులు ఆమెకు కష్టమయ్యేవి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఆమె ఈ తరహా జుట్టుకు పోషణ చేయడంలో అనుభవం లేదు. నా జుట్టును ఆమె దువ్వుతుంటే గట్టిగా నేను అరిచేదాన్ని. అంతే, అప్పట్లో ఆమెకు నా జుత్తును కత్తిరించడం తప్ప మరో మార్గం కనిపించలేదు.

నాకు ఆరేళ్ల వయసు వచ్చేసరికి అంటే సరిగ్గా 2000 సంవత్సరంలో జింబాబ్వేలో రాజకీయ సంక్షోభం మొదలయ్యింది. దాంతో మేం బ్రిటన్ వచ్చేశాం. నా మారు తల్లి కుటుంబం ఉంటున్న లివర్ పూల్‌లో స్థిరపడ్డాం.

కొన్ని రోజులకే నేను చదువుతున్న స్కూల్లో అందరి పిల్లల్లా నా రూపం లేదన్న విషయం నాకు అర్థమయ్యింది. మొదటి రోజు నా చేరిన కొత్త పాఠశాలలోని విశ్రాంతి గదిలో కూర్చొని అక్కడ చదువుతున్న అమ్మాయిల్ని, అబ్బాయిల్ని గమనించాను. అందరు అమ్మాయిలకు చక్కగా పొడవైన జుట్టు ఉంది. నాలా మరో నల్లజాతి అమ్మాయిని నేను ఆ స్కూల్లో చూడలేదు. క్రాప్ చేసిన నా జుట్టును నేను తడుముకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇక్కడ మనిషి కాదని నాకు అప్పుడు అనిపించింది. చాలా కోపం వచ్చింది కూడా. మా అమ్మ కూడా నాకు చెప్పలేదు. బహుశా నేను అందంగా ఉన్నానని భావించేదనుకుంటా. ఆమె స్నేహితులు కూడా అలాగే చెప్పేవారు. కానీ నాకు మాత్రం ఎందుకో అలా అనిపించేది కాదు.

వారానికొకసారి మా హెయిర్ డ్రెసర్ ఆంటీ ఇంటికి వచ్చేవారు. హాల్లో కూర్చోబెట్టి అబ్బాయిలా కనిపించకుండా చాలా జాగ్రత్తగా జుట్టును కత్తిరించేవారు. నా హెయిర్ కట్ నన్ను చాలా నిరాశ పరిచేది.

ఓ అబ్బాయి నా పక్క నుంచే పరిగెత్తుతూ నన్ను చూసి మైఖేల్ జాక్సన్ అంటూ పిలవడం నాకు ఇప్పటికీ గుర్తుంది.

అయితే నా ఆఫ్రికన్ కేశాలకు ఎటువంటి ఉత్పత్తులు వాడాలో నా హెయిర్ డ్రెసర్ ఆంటీ కెస్లీ రికార్డ్స్‌కు తెలుసు. కానీ అవి చాలా ఖరీదైనవి. నా తల్లిదండ్రులు అంత ఖర్చును భరించలేరు. అందుకే మళ్లీ మళ్లీ నా జుట్టును కత్తిరిస్తునే ఉండేవారు. నా నల్లని జుట్టు నేలంతా పరచుకొని పడుతూ ఉంటే నాకు చాలా చికాకుగా ఉండేది.

అదే సమయంలో నా సోదరి తన పొడవైన ఒత్తయిన జుట్టును రక రకాలుగా ముడులు వేసుకోవడం, అల్లుకోవడం నాకు చాలా అసహనాన్ని కల్గించేది. చాలా బాధపడేదాన్ని. మరోవైపు నా స్కూల్లో కొన్ని సార్లు నన్ను పొరపాటున అబ్బాయిగా భావించేవారు. దాంతో నాకు స్నేహితులు దొరకడం కూడా కష్టమైపోయేది. అది నన్ను మరింత ఒంటరితనానికి గురి చేసేది.

Kelsey Rickards

ఫొటో సోర్స్, Kelsey Rickards / BBC Three

హైస్కూల్లోనూ వేధింపులు

ప్రాథమిక పాఠశాలలో ఎంతో కొంత నయం. సెకండరీ స్కూల్‌కి వచ్చేసరికి అదో సరికొత్త యుద్ధ క్షేత్రంగా నాకు అనిపించేది. మొత్తం 1500 మంది పిల్లలు ఉండేవారు. ఇతర జాతుల వారు చాలా తక్కువగా ఉండేవారు. అనేక రకాలుగా నేను వేధింపులకు గురయ్యేదాన్ని. కొందరు అబ్బాయిలు నన్ను క్లాసులో ఎన్(నీగ్రో)అని పిలిచేవారు. అలా వేధింపులు ఎదుర్కొన్న ప్రతి సారి నేను ఈ ప్రాంతానికి చెందినదాన్ని కాదు అనిపించేది.

ఆ తరువాత కూడా నా జుట్టును కత్తిరిస్తునే ఉన్నారు. దాంతో రోజు రోజుకీ కోపం, చికాకు పెరిగిపోతూ ఉండేవి. కేశ పోషణ ఎలా చెయ్యాలో నేర్చుకోవాలనుకునేదాన్ని. కానీ అందుకోసం ఏం చెయ్యాలో నాకు తెలిసేది కాదు. నాకు 13 ఏళ్ల వయసులో అనుకుంటా ఓ రోజు అమ్మ దగ్గరకు వెళ్లి నేను ఇకపై హెయిర్ కట్ చేయించుకోను స్పష్టంగా చెప్పేశాను. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఉపశమనాన్ని కల్గించింది. ఇక పెద్దయ్యావు కనుక నీ జుట్టు నీ ఇష్టం అన్నారు. కావాలంటే పెంచుకోమని కూడా చెప్పారు.

Kelsey Rickards

ఫొటో సోర్స్, Kelsey Rickards / BBC Three

ధైర్యంగా చెప్పేశాను

అప్పటి నుంచి నాకు అమ్మ మద్దతు పూర్తిగా దొరికింది. ఎందుకు నా జుట్టును ఎప్పుడూ కత్తిరించేసేదానివి అంటూ ఆమెను ఓ సారి అడిగేశాను కూడా. అప్పుడు తాను కూడా చాలా వరకు ఆ పని చెయ్యకుండా ఉండేందుకు ప్రయత్నించానని బాధపడుతూ చెప్పింది.

నా వంపులు తిరిగిన కురులు చాలా త్వరగానే పెరిగిపోయాయి. క్రిస్మస్ సందర్భంగా కొన్ని చవకైన సవరాలను(హెయిర్ ఎక్స్‌టెన్షనర్స్)ను ఆర్డరిచ్చాను. క్రిస్మస్ సెలవుల తర్వాత ఓ రోజు స్కూల్‌కి వెళ్లాను. ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తే. పొడవైన నా జుత్తును చూసి ఒకప్పుడు హేళన చేసిన వాళ్లే ఆ సమయంలో నన్ను మెచ్చుకోలుగా చూశారు.

నా 14 ఏళ్ల వయసులో తొలిసారిగా నా బోయ్ ఫ్రెండ్‌ను కలిశాను. మై స్పేస్ ద్వారా చాటింగ్ చేసుకునే మేం లివర్ పూల్ సిటీ సెంటర్‌లో కలిశాం. ఆ అబ్బాయి నన్ను తన కుటుంబానికి పరిచయం చేసేందుకు తీసుకొని వెళ్లడానికి ఎంతో కాలం పట్టలేదు. వాళ్ల అమ్మ, సోదరిలా అతను కూడా కూడా నల్లగానే ఉన్నాడు. వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ల అమ్మ, సోదరి ఇద్దరికీ ఉన్న నల్లని ఉంగరాల జుత్తును నేను చూశాను. వాళ్లిద్దరూ చూడటానికి చాలా అందంగా ఉన్నారు. నా కేశాలను ఎందుకలా అలంకరించుకోకూడదని నాకు అనిపించింది. అనవసరంగా నేను ఇన్నాళ్లూ నా జుట్టు పొడవుగా ఉండాలని కోరుకునేదాన్ని అని అనుకున్నాను.

అప్పటి వరకు నాకు తెలియని నల్ల జాతీయుల సంస్కృతి , వారు రాసిన పుస్తకాలు, సంప్రదాయ వంటలు, సంగీతం ఇలా ఎన్నో విషయాలను పరిచయం చేశారు నా బోయ్ ఫ్రెండ్. ఓ రోజు నీకుండే సహజమైన కేశాలతోనే నువ్వు అందంగా కనిపిస్తావని అన్నారు. నిజానికి అటువంటి ప్రోత్సాహమే నాకు కావాల్సింది కూడా. వెంటనే నా సవరాలను పక్కన పడేశాను. కానీ ఎవరు ఎలా విమర్శిస్తారో అని భయపడ్డాను. అయినా సరే ఎలాగైనా వాటిని వదిలేసి ముందుకెళ్లాలని అనుకున్నాను.

అప్పటి నుంచి నేచురల్ హెయిర్‌కి సంబంధించిన వివిధ రకాల బ్లాగులు, యూ ట్యూబ్ వీడియోలు చూస్తూ ఎన్నో విషయాలను నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఎటువంటి ఉత్పత్తులను వాడాలి, రింగుల జుత్తును ఎలా దువ్వాలి ఇలాంటి అంశాలను నేర్చుకునేందుకు గంటల కొద్దీ నా గదిలో గడిపేదాన్ని. అలా 9 నెలలు గడిచిన తర్వాత ఒత్తుగా, రింగులు తిరుగుతూ నా జుట్టు పెరిగింది. నా జీవితంలో మొదటిసారిగా నా జుట్టు నాకు చాలా చాలా నచ్చింది.

Kelsey Rickards

ఫొటో సోర్స్, Kelsey Rickards / BBC Three

న్‌స్టాగ్రామ్‌లో హెయిర్ స్టైల్ టుటోరియల్స్

నా వరకు మన కురులు అంటే చూడ్డానికి కేవలం పొడవుగా లేదా వంపులు తిరిగి ఉండటం మాత్రమే కాదు. నల్ల జాతీయులు, మిశ్రమ జాతుల మహిళ విషయంలో దాని పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. చాలా చోట్ల నల్ల జాతి మహిళలు తమ వంపులు తిరిగిన కేశాలను పొడవుగా చేసుకోవాలని వాళ్లు పని చేసే సంస్థలే సూచిస్తున్నట్టు ఎన్నో నివేదికలు వచ్చాయి. అంతేకాదు కొన్ని ప్రముఖ కేశాలంకరణ ఉత్పత్తుల్లో వాడుతున్న రసాయనాలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు, వంధ్యత్వానికి కారణమవుతున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి.

అప్పటి నుంచి నాలా యువతులంతా తమ కేశాలను ప్రేమించేలా చెయ్యాలనుకున్నాను. సొంతంగా నేను రూపొందించిన హెయిర్ టుటోరియల్స్‌ను ఇనిస్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు నన్ను 20 వేల మంది ఫాలో అవుతున్నారు. రోజూ చాలా మంది యువతులు తమ కేశాలంకరణ విషయంలో చాలా సాయం చేసానంటూ మెసెజ్‌లు పెడుతూ ఉంటారు.

నాకు పిల్లలు పుడితే కచ్చితంగా నా జీవితంలో నా జుట్టు విషయంలో జరిగిన ప్రతి అంశాన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటాను. వాళ్లకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్‌ జడ వేసుకొని బడికి వెళ్లవచ్చు. వాళ్ల జీవితంలో వాళ్లను ఎవరూ మైఖేల్ జాక్సన్ అని పిలవకూడదనే ఆశిస్తున్నా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)