మొక్క తీసిన మొదటి సెల్ఫీ.. ప్రపంచంలో ఇదే తొలిసారి

ఫొటో సోర్స్, zsl
వృక్ష ప్రపంచపు మొట్టమొదటి సెల్ఫీని ఓ మొక్క తీసిందని జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ వెల్లడించింది.
శాస్త్రవేత్తలు పీట్ అని పేరు పెట్టిన ఈ ఫెర్న్ మొక్క.. వ్యర్థాల నుంచి ఉత్పత్తయ్యే శక్తినుపయోగించి ప్రతి 20 సెకండ్లకు ఓ సెల్ఫీ తీసుకుంటోంది. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఓ సాంకేతికత ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ సాంకేతికత సహాయంతో కీకారణ్యాల్లోని జీవవైవిధ్యంపై పరిశోధనలు చేయడానికి ఆస్కారమేర్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
అడవుల్లో వన్యప్రాణులపై పరిశోధనలకు వాడే కెమెరా ట్రాప్‌లు, సెన్సర్లను మొక్కల ద్వారా ఆపరేట్ చేసేలా ఈ సాంకేతికతను వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో జడ్‌ఎస్‌ఎల్ శాస్త్రవేత్తలు లండన్ జూకి చెందిన రెయిన్ ఫారెస్ట్ ఎగ్జిబిట్‌లో జీవ ఇంధన ఘటాలు (మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్స్) ఏర్పాటుచేశారు.
రసాయన శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే పరికరమే మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్. దీనిని బయలాజికల్ ఫ్యూయల్ సెల్ అని కూడా అంటారు. ఇది ఒక జీవ విద్యుత్ రసాయన వ్యవస్థ.

ఫొటో సోర్స్, XNOR.AI/ZSL
మొక్కలోని శక్తిని ఎలా ఉపయోగించుకుంటారు
సూర్యరశ్మి సహాయంతో మొక్కలు ఆకుల ద్వారా కార్బన్ డై ఆక్సైడ్, నీటి నుంచి ఆక్సిజన్, పిండిపదార్థాలను తయారుచేసుకుంటాయి. దీన్నే కిరణజన్య సంయోగక్రియ అంటారు.
ఈ పిండిపదార్థం ఆకుల్లోనే ఉండిపోకుండా మొక్క కాండం, వేళ్లు అంతటా ప్రసరిస్తుంది. ఒక్కోసారి అధిక మోతాదులో పిండిపదార్థాలు తయారైతే మొక్క దాన్ని వేళ్ల ద్వారా నేలలోకి విసర్జిస్తుంది.
మట్టిలో ఉండే సూక్ష్మజీవులు దీనిని విచ్ఛిన్నం చేస్తాయి. అలా విచ్ఛిన్నం చేసినప్పుడు శక్తి జనిస్తుంది.
ఈ శక్తిని ఆనోడ్, క్యాథోడ్‌ల సహాయంతో సంగ్రహించి సూపర్ కెపాసిటర్‌ను దాంతో చార్జ్ చేస్తారు. ఆ సూపర్ కెపాసిటర్ పూర్తి చార్జింగ్ అయిన తరువాత దాన్నుంచి విడుదలయ్యే శక్తి(డిశ్చార్జ్)ని ఉపయోగించుకుని దానికి అనుసంధానంగా ఉండే కెమెరా ఫొటో తీస్తుంది. ఈ విధానంలోనే ఫెర్న్ మొక్క సెల్ఫీ తీసుకుంది.

ఫొటో సోర్స్, zsl
జడ్ఎస్ఎల్ కన్జర్వేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ అల్ డేవిస్ మాట్లాడుతూ.. ''మొక్కలు ఎదుగుతున్న కొద్దీ జీవపదార్థాన్ని పోగు చేస్తాయి. ఆ జీవ పదార్థం మట్టిలో ఉండే బ్యాక్టీరియా ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇంధన ఘటాల ద్వారా సృష్టించే శక్తిని మారుమూల ప్రాంతాల్లో సెన్సర్లు, పర్యవేక్షణ ప్లాట్‌ఫామ్‌లు, కెమెరా ట్రాప్‌లు ఆపరేట్ చేయడానికి వాడొచ్చు'' అన్నారు.
అయితే, సూర్యరశ్మి తక్కువగా ఉండే ప్రాంతాల్లోని మొక్కల నుంచి శక్తి జనించేలా చేయడం, దాన్ని సంగ్రహించడం చాలా కీలకమన్నారాయన.
''శక్తి వనరుల్లో చాలావాటికి అనేక పరిమితులుంటాయి. సోలార్ ప్యానళ్ల నుంచి శక్తిని పొంది నిల్వ చేసుకునే బ్యాటరీలు వాడాలనుకున్నా దానికి సూర్యరశ్మి కావాలి. కానీ, మొక్కలు సూర్యరశ్మి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సూర్యరశ్మి సోకే వైపు వ్యాపించి తమ ఇంధన వనరును అందుకుంటాయి. కాబట్టి వాటి నుంచి శక్తి సంగ్రహించడమనేది పరిమితుల్లేని ప్రక్రియ'' అంటారాయన.
ఒక ఫ్యూయల్ సెల్ నుంచి 0.1 మిల్లీవాట్ల శక్తి లభిస్తుంది, ఫెర్న్ మొక్కతో చేసిన ప్రయోగంలో ఫ్యూయల్ సెల్స్‌ను ఒకదాంతో ఒకటి అనుసంధానించి 20 సెకన్లకు ఒక ఫొటో తీసేందుకు సరిపడేంత శక్తిని సంగ్రహించారు.
ఇవి కూడా చదవండి
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- పొలార్ స్టెర్న్ నౌక: ఆర్కిటిక్ మంచు సముద్రంలో వాతావరణ మార్పులపై 600 మంది శాస్త్రవేత్తల పరిశోధన
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- వైద్య పరీక్షల కోసం దానమిచ్చిన శవాన్ని ఏం చేస్తారు...
- పక్షవాతంతో కదలలేనివాళ్లు ఈ రోబో సూట్‌తో నడవొచ్చు
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








