టీనేజర్లకు వల వేస్తున్న నయా నాజీ మిలిటెంట్ సంస్థలు

ఫొటో సోర్స్, PROPAGANDA IMAGE
- రచయిత, డానియెల్ డీ సిమోన్, అలీ విన్‌స్టన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
టీనేజీ యువకులను తీవ్రవాద కూపంలోకి లాగేందుకు ప్రయత్నించిన ఓ నయా నాజీ మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలు స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డాయి.
‘ద బేస్’ అనే ఈ బృందంలోని సీనియర్ సభ్యులు.. యువ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేస్తుండటం, ఆ కుర్రాళ్లను అతివాదులుగా మార్చటం ఎలా అనేది చర్చించటం ఈ ఆడియో టేపుల్లో రికార్డయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెల్ల జాత్యహంకారులను ఒకతాటిపైకి తీసుకొచ్చి యుద్ధానికి కాలు దువ్వాలని గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది.
బీబీసీ వన్ పనోరమాతోపాటు అమెరికాలోని మానవ హక్కుల సంస్థలు, సదరన్ పావర్టీ లా సెంటర్‌లకూ ఈ గ్రూప్‌కు సంబంధించిన రికార్డులు అందాయి.
47ఏళ్ల అమెరికన్ రొనాల్డో నజారో ఈ గ్రూప్‌ను స్థాపించారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఓ అపార్ట్‌మెంట్ నుంచి ఆయన సంస్థను నడిపిస్తున్నట్టు ఈ ఏడాది మొదట్లో బీబీసీ బయటపెట్టింది.
ఓ ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా యువకులతో ఈ గ్రూప్ వీడియో కాన్ఫెరెన్స్‌లు నిర్వహించేది. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, జాతి, అతివాదంలోకి ఎలా వచ్చారు, ఆయుధాల ఉపయోగంలో అనుభవంపై ప్రశ్నలను ఓ ప్యానెల్‌తో కలిసి నజారో అడిగేవారు.

ఫొటో సోర్స్, Social Media
అడాల్ఫ్ హిట్లర్ మెయిన్ కాంఫ్‌తోపాటు ఏ పుస్తకాలు చదివారని ముఖాముఖిలో అడుగుతారు. తెల్లజాతి అధిపత్య సిద్ధాంతాలను పూర్తిగా ఔపోసన పట్టాలనీ సూచిస్తారు. ఘర్షణలు రెచ్చగొట్టడం, సామాజిక బంధాలు చిన్నాభిన్నం చేసేందుకు సిద్ధంచేయడంతోపాటు జాతుల మధ్య వైరాన్ని పెంచేలా సూచనలూ ఇస్తారు.
ఇతర అతివాద సంస్థల సభ్యులకూ నజారో స్వాగతం పలుకుతున్నట్టు కాల్స్‌లో వినిపిస్తోంది.
వేర్వేరు పేర్లతో ఫోన్లు మాట్లాడే యువకులు ఫోన్‌కాల్స్‌లో తమ సైద్ధాంతిక అవగాహనతోపాటు ఆన్‌లైన్ వీడియోలు, ఇతర సమాచారంతో అతివాద బాటలోకి ఎలా వచ్చారో వివరిస్తారు.
ముఖాముఖి పూర్తయ్యాక యువత కాల్ కట్‌చేసిన వెంటనే...వారి నేపథ్యం, సంసిద్ధతపై గ్రూప్‌లోని సీనియర్ సభ్యులు చర్చించుకుంటారు.
సామాజిక బంధాల విచ్ఛిన్నమే లక్ష్యం
పశ్చిమ దేశాల సైనికులను తమలో కలుపుకునేందుకు ఈ గ్రూప్ ఎక్కువగా పనిచేస్తుంది. యుద్ధ శిక్షణలో నైపుణ్యంతోపాటు ఆయుధాలను వారి ద్వారా తెప్పించుకోవాలని ప్రయత్నిస్తోందని కాల్ రికార్డింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఎఫ్‌బీఐకి డేటా అనలిస్ట్‌గా, పెంటగాన్‌కు కాంట్రాక్టర్‌గా పనిచేసిన నజారో.. సామాజిక బంధాల విచ్ఛిన్నమే తమ లక్ష్యమని ఓ బ్రిటిష్ టీనేజీ యువకుడితో చెబుతున్నట్లు ఆడియోలో వినిపిస్తోంది.
ఏదైనా అధికార శూన్యం ఏర్పడితే సామాజిక బంధాలు విచ్ఛిన్నం చేయడం సాధ్యమేనని ఆ యువకుడికి నజారో చెబుతున్నారు.
మొదటగా వీలైనన్ని ప్రాంతాల్లో ఇద్దరు లేదా ముగ్గురితో బృందాలు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఓ టీనేజీ యువకుడికి చెబుతున్నట్లు రికార్డింగ్‌లలో వినిపిస్తోంది. బ్రిటన్‌లో ఇలా చేయడానికి చాలా అవకాశాలున్నాయని దీనిలో చెబుతున్నారు.
ముఖాముఖి అనంతర చర్చల్లో ఒక 17ఏళ్ల యూరప్ యువకుడికి తను నమ్మే సిద్ధాంతాలను మరింత మెరుగు పెట్టాలని ఓ పెద్దవయసు వ్యక్తి సూచిస్తున్నారు. సిద్ధాంతపరంగా 17ఏళ్ల బాలుడు ఇంకొంచెం పనిచేయాలని, ప్రస్తుతం సరైన దిశలోనే వెళ్తున్నాడని నజారో కూడా చెబుతున్నారు.
ఆ బ్రిటిష్ యువకుడు సిద్ధాంతం పరంగా ఇంకా రాటుదేలాలని నజారో వివరిస్తున్నారు.
ఇవి చాలా అసాధారణమైన పరిణామాలని రికార్డులను విన్న అనంతరం సదరన్ పావర్టీ లా సెంటర్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ డాక్టర్ సెస్సీ మిల్లర్ వ్యాఖ్యానించారు. చాలా విధాలుగా యువతను అతివాదంలోకి లాగుతున్నట్లు వీటిని బట్టి తెలుస్తోందని అన్నారు.
భిన్న రకాల నేపథ్యమున్న యువత గ్రూప్‌లోకి చేరుతున్నట్లు ఆమె విశ్లేషించారు.
"చాలా సాధారణ నేపథ్యమున్న యువత కూడా ఈ గ్రూప్‌లో చేరడం ఆశ్చర్యంగా అపినిస్తోంది"
"ఉగ్రవాదులు లేదా అతివాద భావజాలమున్న గ్రూపుల్లో చేరేవారిలో కనిపించే లక్షణాలేవీ వీరిలో కనిపించట్లేదు."
"రాజకీయంగా వర్గాలుగా విడిపోయిన సమాజానికి వీరు ప్రతిబింబాలుగా కనిపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది."

ఫొటో సోర్స్, POLICE HANDOUT
అమెరికాలోని జార్జియా స్టేట్‌లో.. ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ జంటను ఈ గ్రూప్‌కు చెందిన ముగ్గురు హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అంతర్జాతీయ నియో-నాజీ నెట్‌వర్క్ నుంచి పుట్టిన కొత్త అండర్‌గ్రౌండ్ సంస్థ ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఐరన్ మార్చ్‌గా పిలుస్తున్న ఒకప్పటి వెబ్ వేదిక నుంచి ఇది పుట్టినట్లు వివరిస్తున్నారు.
బ్రిటన్‌లో నిషేధం ఎదుర్కొంటున్న నేషనల్ యాక్షన్, సోనెన్‌క్రీగ్ డివిజన్ గ్రూప్‌లతోపాటు, అమెరికాలో దేశ వ్యాప్తంగా నిషేధం ఎదుర్కొంటున్న ఆటమ్‌వాఫెన్ డివిజన్ కూడా ఇలాంటి గ్రూపే.
గ్రూప్‌లో సీనియర్ సభ్యుడిగా కొనసాగడంతోపాటు బ్రిటన్‌లో ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఓ ఆన్‌లైన్ వేదికను నడిపిస్తున్న ఆయన వివరాలు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డాయి.
దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన 25ఏళ్ల నిరుద్యోగి మాథ్యూ బకారీ.. అందరికీ మథియాస్‌గా సుపరిచితుడు. అతడు ఫాసిస్ట్ ఫోర్జ్‌గా పిలిచే ఓ కరడుగట్టిన వెబ్‌సైట్‌ను నడిపిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌లో ఉగ్రవాదంతోపాటు లైంగిక హింసనూ ప్రోత్సహిస్తుంటారు.
గ్రూప్ కాల్స్‌లో మాథ్యూ మాటలు వినిపిస్తుంటాయి. తమ వెబ్‌సైట్ ఉపయోగించమని ఆయన చెబుతుంటారు. అయితే భద్రతా సంస్థల నిఘా ఎక్కువ కావడంతో ఈ ఏడాది మొదట్లో వెబ్‌సైట్‌ను ఆయన ఆఫ్‌లైన్ చేశారు.

ఫొటో సోర్స్, PROPAGANDA IMAGE/UNKNOWN
బ్రిటన్‌లో ఉగ్రవాద దాడికి కుట్రపన్నిన కేసులో దోషిగా నిరూపితమైన డర్హమ్‌కు చెందిన 16ఏళ్ల యువకుడు కేసుతో ఈ గ్రూప్ వెలుగులోకి వచ్చింది.
ఫాసిస్ట్ ఫోర్జ్‌కు చెందిన మరో ఇద్దరు బ్రిటిష్ యువకులపై 25కుపైగా ఉగ్రవాద కేసులున్నాయి.
ప్రశ్నలు అడిగేందుకు బీబీసీ వెళ్లినప్పుడు మాథ్యూ... బయటకు వచ్చేందుకు నిరాకరించారు.
తమపై దొరికిన ఆధారాలను జతచేస్తూ పంపిన లేఖలకూ మాథ్యూ, నజారో స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- జోసెఫ్ స్టాలిన్: హిట్లర్నే భయపెట్టిన ఈయన హీరో మాత్రమే కాదు, నియంత కూడా
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- ‘పసిగుడ్డుని వదిలి పారిపోయా.. 16 ఏళ్ల తరువాత ఆ పాపే మళ్లీ జీవితాన్ని ఇచ్చింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








