‘పసిపాపను వదిలి పారిపోయా.. 16 ఏళ్ల తరువాత ఆ పాపే మళ్లీ జీవితాన్ని ఇచ్చింది’

కూతురు టేలర్ హుర్విట్జ్‌తో మట్జేమ్స్ మెట్సన్‌

ఫొటో సోర్స్, Tyler Hurwitz

ఫొటో క్యాప్షన్, కూతురు టేలర్ హుర్విట్జ్‌తో మట్జేమ్స్ మెట్సన్‌

భయంకరమైన కత్రినా హరికేన్‌లో సర్వం కోల్పోయి నిరాశ నిస్ఫృహలలో కొట్టుమిట్టాడుతూ జీవితం మీద ఆశ కోల్పోతున్న దశలో కళాకారుడు మట్జేమ్స్ మెట్సన్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది అతని కన్నకూతురు టేలర్. చిన్నతనంలోనే తను వదిలేసిన పాపాయి నుంచి ఊహించని ఫోన్ కాల్ అతనికి మళ్లీ బతుకు మీద ఆశనిచ్చింది.

16 యేళ్ల వయసులో మట్జేమ్స్, టేలర్ తల్లి సెలనీని కలిసారు.

"అమెరికా చరిత్ర గురించి క్లాసు జరుగుతుండగా తనొచ్చింది. మొదటి చూపులోనే ఆమె నన్ను ఆకర్షించింది. అక్కడే ఆ క్షణమే తన గురించి అన్ని వివరాలూ తెలుసుకోవాలన్నంత ఆతృత కలిగింది" అంటూ మట్జేమ్స్ ఆ తొలి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.

మట్జేమ్స్ తల్లిదండ్రులు కూడా కళాకారులే. అతని సవతి తండ్రి వివిధ ఆర్ట్ స్కూల్స్‌లో ఆర్ట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు.

"మేము ఎక్కువగా ఊళ్లు మారుతుండేవాళ్లం. ఎక్కడా కూడా ఎక్కువ రోజులు ఉండేవాళ్లం కాదు. అందుచేత నా స్నేహాలు కూడా ఎక్కువకాలం నిలిచేవి కావు. దాంతో నాకు దీర్ఘకాలం స్నేహం నిలుపుకునే అలవాటే పూర్తిగా పోయింది" అని మట్జేమ్స్ చెప్పుకొచ్చారు.

మట్జేమ్స్ కుటుంబం దక్షిణ ఫ్రాన్స్ నుంచి ఒహియో రాష్ట్రంలోని యెల్లో స్ప్రింగ్స్ అనే చిన్న పట్టణానికి మారింది. అక్కడే సెలనీని కలిసారు.

"మా మధ్య స్నేహం చిగురించింది. కొన్నేళ్లు మేము సహజీవనం చేశాం. మా బంధానికి గుర్తుగా సెలనీ కడుపులో ఓ జీవం ప్రాణం పోసుకుంది. అప్పటికి మాకింకా పెళ్లి కాలేదు. నాకు 18 ఏళ్లు. సెలనీ గర్భవతి అయ్యిందనే వార్త నన్ను చాలా కలవరపెట్టింది. నా ప్రపంచమే తలకిందులైపోయినట్టనిపించింది. 18 ఏళ్ల వయసులో ఓ బిడ్డకి తండ్రినవడం ఊహించలేకపోయాను. అంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత నేను తీసుకోగలననే నమ్మకం నాకు లేదు. చాలా భయమేసింది" అంటూ మట్జేమ్స్ ఆనాటి పరిస్థితిని వివరించారు.

సెలనీ ఒక చక్కని ఆడపిల్లకి జన్మనిచ్చారు. ఆ పిల్లకు టేలర్ అని పేరు పెట్టారు.

"పాప పుట్టాక సెలనీ నన్ను కలిసింది. పాపాయిని నా చేతుల్లో పెట్టింది. ఒక 30 సెకండ్లు కుడా ఎత్తుకోలేదు నేను. శారీరకంగా తను నా పాపే అని తెలిసినప్పటికీ మానసికంగా ఆ భావోద్వేగం నాలో కలగలేదు. ఆ వయసుకి ఆ చిన్నారి బరువు అనిపించింది. ఇంత బరునవుందేంటి, ఎలా ఎత్తుకోవాలి, ఏం చెయ్యాలి..ఇలా ఎన్నో సందేహాలు కలిగాయి".

"పారిపోయాను. ఆత్మాభిమానం అన్నదే లేకుండా అక్కడి నుంచీ పారిపోయాను. అప్పటి నుంచీ మొదలయ్యింది... అన్నిటినుంచీ దూరంగా పారిపోవడం మొదలుపెట్టాను" అని మట్జేమ్స్ అన్నారు.

మట్జేమ్స్ మెట్సన్

ఫొటో సోర్స్, Getty Images

కళాకారుడిగా గుర్తింపు

కొంతకాలం అక్కడా ఇక్కడా గడిపి, 20 యేళ్లకి మట్జేమ్స్ న్యూ ఓర్లీన్స్ చేరుకున్నారు.

"అప్పటికి నేను ఇంకా చిన్నవాడినే. ఈ కొత్త ఊరు విలక్షణంగా, దాక్కోవడానికి అనువైన ప్రాంతంగా అనిపించింది".

అయితే మట్జేమ్స్ పాపభీతి నుంచి దూరంగా పారిపోలేకపోయారు. తప్పు చేశానన్న బాధ వెంటాడుతూనే ఉండేది.

తరువాతి కాలంలో మట్జేమ్స్ తన జీవితాన్ని ప్రతిబింబించేలా ఒక బొమ్మల నవల రాసారు. అందులో పై సందర్భాన్ని సూచించేలా ఒక బొమ్మ ఉంటుంది...భుజాలపై చాలా పెద్ద బరువు మోస్తున్నట్టు, మట్జేమ్స్ వొంగిపోయి ఉన్నట్టు చిత్రీకరించారు.

ఈ బాధ నుంచి బయటపడడానికి అతనికి చాలా కాలం పట్టింది. మానసికంగా కృంగిపోయారు. కొంతకాలం చికిత్స పొందాక మామూలు మనిషి అవ్వగలిగారు.

అతని చేతిలో పెన్ను తప్ప ఇంకేం మిగల్లేదు. ఏ కాఫీ షాపుకో, బారుకో వెళ్లి కూర్చోవడం, బొమ్మలు గీయడం చేసేవారు. మొదటినుంచీ కళాకారుడు కావడంతో మట్జేమ్స్ దృష్టి మొత్తం ఆ కళ మీదనే పెట్టారు. మెల్లిమెల్లిగా అతను అక్కడ ఫేమస్ అయ్యారు.

మట్జేమ్స్‌కు నిర్దిష్టంగా ఒక నివాసం అంటూ ఉండేది కాదు. అతని కళ అంతా కాగితంపైనే పెటాల్సి వచ్చేది.

తరువాత అతను మెల్లిగా అక్కడే స్థిరపడడం మొదలుపెట్టారు. అప్పుడు శిథిలాలను జోడించే కళను ఎన్నుకున్నారు. శిథిలమైపోయిన వస్తువులను ఏరి కూర్చి చక్కటి శిల్పాలుగా మలచడం ఈ కళ విశేషం.

న్యూ ఓర్లీన్స్ అతనికి తరగని నిథిలా కనిపించింది. ఎటు చూసినా పాత వస్తువులు ఏవో ఒకటి కనిపించేవి. 100 యేళ్ల చరిత్రగల ఫొటోలు సేకరించేవారు. విరిగిపోయిన చెక్క వస్తువులు, కర్ర ముక్కలు ఏరుకొచ్చి, అన్నిటినీ జోడించి అందమైన శిల్పాలుగా మలిచేవారు.

ఈ కళలో మట్జేమ్స్ నిలదొక్కుకున్నారు. తను చేసిన వస్తువులతో ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు. కడుపు నింపుకోవడానికి బార్లలోనూ, పిజ్జా డెలివరీ బాయ్‌గానూ పనిచేసేవారు.

టేలర్ హర్విట్జ్

ఫొటో సోర్స్, Tyler Hurwitz

కూతురు టేలర్ హర్విట్జ్

మరోపక్క మట్జేమ్స్ కూతురు టేలర్ హర్విట్జ్ యెల్లో స్ప్రింగ్స్ పట్టణంలో తన తల్లి దగ్గర పెరుగుతున్నారు. తల్లి సెలనీ కూడా మంచి కళాకారిణి. టేలర్ నాలుగేళ్ల వయసునుంచే కళాభినివేశం కనబరిచేవారు.

"నేను పుట్టడమే సృజనాత్మక వాతావరణంలో పుటాను. కళ నా జీవితంతో పెనవేసుకుపోయింది" అని టేలర్ అన్నారు.

సెలనీ మరో పెళ్లి చేసుకుని ఇంకో ఆడపిల్లకి జన్మనిచ్చారు. తల్లి తండ్రి, చెల్లితో పాటు టేలర్ సంతోషంగా ఉండేవారు. తనకు జన్మనిచ్చిన తండ్రి గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు.

"మా కుటుంబం, బంధువులు, స్నేహితులతో హాయిగా సంతోషంగా ఉండేది. నాకెప్పుడూ నాకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు, ఎక్కడున్నారు, ఇక్కడ ఎందుకు లేరు అనే ఆలోచనలు రాలేదు. నేనెప్పుడూ మా అమ్మని కూడా ఈ విషయాలేవీ అడగలేదు. కాబట్టి నాకు నిజంగానే అతని వివరాలేమీ తెలీవు" అన్నారు.

తన తల్లిలాగే టేలర్ కూడా మంచి కళాకారిణి అయ్యారు. గృహోపకరణాలను కళాత్మకంగా తీర్చిదిద్దడంలో నైపుణ్యాన్ని సాధించారు.

కత్రినా హరికేన్

30 ఏళ్ల వయసు వచ్చేసరికి మట్జేమ్స్ న్యూ ఓర్లీన్స్‌లో మంచి కళాకారుడిగా గుర్తింపు పొందారు.

"అసలు నేను 30 ఏళ్లు జీవించగలుగుతానని ఎన్నడూ అనుకోలేదు" అని మట్జేమ్స్ అన్నారు.

ఇన్నాళ్లు పరిగెత్తింది చాలు, ఇంక నెమ్మదించాలని మట్జేమ్స్ అనుకున్నారు. న్యూ ఓర్లీన్స్ నుంచి వెళిపోయారు. మళ్లీ 2005లో వెనక్కు తిరిగొచ్చారు.

"నేనో ఇల్లు చూసుకుని సర్దుకోవడం మొదలుపెటాను. అప్పుడే కత్రినా హరికేన్ వచ్చింది" అని మట్జేమ్స్ గుర్తు చేసుకున్నారు.

2005 ఆగస్టులో కత్రినా హరికేన్ న్యూ ఓర్లీన్స్‌లో భీభత్సం సృష్టించింది. దాదాపు 2000 మంది చనిపోయారు. పది లక్షల జనాభా ఆవాసాలు కోల్పోయారు. శాంతి భద్రతలు విఛ్చిన్నం అయ్యాయి.

"అలాంటి వినాశనాన్ని నేనెప్పుడూ చూడలేదు. తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది. కళ్లు మూసుకుంటే చాలు ఆ భీభత్సం గుర్తొస్తుంది. భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా మరణాలు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. భారీ నష్టం చేకూరింది" అని మట్జేమ్స్ అన్నారు.

మట్జేమ్స్ ఇల్లు నీటితో నిండిపోయింది. అతని సామాన్లన్నీ చెల్లాచెదురైపోయాయి. అతని ఆర్ట్ వర్క్ అంతా నాశనమైపోయింది. 8 రోజులు ఆ విధ్వంసంలోనే గడిపి ఎలాగోలా బయటపడగలిగారు.

ఒక స్నేహితుని సహాయంతో లాస్ ఏంజిల్స్ చేరి ఒక చిన్న ఇంటిలో మళ్లీ జీవితం ప్రారంభించారు. ఒక ఆర్ట్ సప్ప్లై స్టోర్‌లో స్టాక్ బాయ్‌గా చిన్న ఉద్యోగం సంపాదించారు.

హరికేన్ విధ్వంసం మట్జేమ్స్‌ను చాలా కలచివేసింది. మానసికంగా కృంగిపోయారు. తన గదిలోనే టీవీ ముందు కూర్చుని ఎక్కువకాలం గడిపేవారు. అతను కళను మర్చిపోయారు. శిల్పాలు తయారు చేయలేదు. అతనికి జీవితం చివరికొచ్చేసిందనే భావన వచ్చేసింది.

‘‘జీవితం దుర్భరంగా అనిపించింది. ఇంక ఎంతోకాలం బతకలేననుకున్నాను. అప్పుడు ఆ ఫోన్ కాల్ వచ్చింది. అది నా జీవితాన్నే మార్చేసింది.’’

టేలర్ హర్విట్జ్

ఫొటో సోర్స్, Tyler Hurwitz

టేలర్ మొదటిసారి తండ్రితో మాట్లాడిన క్షణం

టేలర్‌కు 16 ఏళ్లు వచ్చాక, ఒకరోజు సెలీనా ఒక కాగితం తీసుకొచ్చి ఇచ్చారు. అందులో ఒక అడ్రస్, ఫోన్ నంబర్ ఉన్నాయి. అవి మట్జేమ్స్ వివరాలు.

"ఇది చాలా మములుగా జరిగింది. ఏవో పాత పేపర్లు వెతుకుంతుంటే ఇది కనిపించుంటుంది. టేలర్‌కు ఇద్దాం, ఒకవేళ తను కాంటాక్ట్ చెయ్యాలనుకుంటే చేస్తుంది అనుకుని అమ్మ నాకు ఇచ్చుంటారు."

"ఉత్తరం రాస్తే మంచిదని అమ్మ సూచించారు. కానీ నేను వెంటనే ఫోన్ చేసాను. అటునుంచి ఎవరైనా జవాబిస్తారని నాకు పెద్దగా నమ్మకం లేదు."

"నా తండ్రి గొంతు విన్నాక నేనెలాంటి భావోద్వేగానికీ గురవ్వలేదు" అని టేలర్ అన్నారు.

వారి సంభాషణ ఇలా సాగింది...

"టేలర్ పేరెప్పుడైనా విన్నారా?" అని టేలర్ అడిగారు.

"టేలర్, ఈ క్షణం కోసమే 16 ఏళ్లగా వేచి చూస్తున్నా" మట్జేమ్స్ జవాబిచ్చారు.

"నేనంటే మీకు కోపమా?" టేలర్ ప్రశ్న.

"లేదు, నువ్వంటే నాకేం కోపం లేదు. నేనంటే నీకు అసహ్యమా?" మట్జేమ్స్ అడిగారు.

"లేదు" టేలర్ జవాబు.

తరువాత మేము సంగీతం, కళలు ఇలా ఏవేవో మాట్లాడుకున్నాం అని మట్జేమ్స్ చెప్పారు.

కూతురు టేలర్ హుర్విట్జ్‌తో మట్జేమ్స్ మెట్సన్‌ రూపొందించిన సోఫా

ఫొటో సోర్స్, Tyler Hurwitz

తండ్రీ కూతుళ్ల కలయిక

మట్జేమ్స్‌కు అది జీవితాన్నే మార్చేసిన ఫోన్ కాల్. ఇన్నేళ్ల తరువాత కన్న కూతురు తనతో మాట్లాడడం అతనికి అమూల్యంగా తోచింది. కూతురుని ఆకట్టుకోవాలనుకున్నారు.

"నా ఇల్లు, ఉద్యోగం, బ్యాంక్ అకౌంట్ ఇవేమీ కాదు. కళ నా ఆస్తి. నా కూతురి కోసం నేను మళ్లీ గొప్ప కళాకారుడిని అవ్వాలని అనుకున్నాను" అని మట్జేమ్స్ చెప్పారు.

అతను మళ్లీ కళాసృష్టిలో నిమగ్నమయ్యారు. శిల్పాలు తయారు చేస్తూ ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు.

కొన్నేళ్ల తరువాత అతని ప్రదర్శన చూడ్డానికి టేలర్ లాస్ ఏంజెల్స్ వెళ్లారు.

"మొదటిసారి కన్నతండ్రిని కలుసుబోతున్నందుకు కాస్త టెన్షన్ పడ్డాను. కానీ వెంటనే మామూలైపోయాను. అతనితో మాట్లాడుతుంటే చాలా సహజంగా, మామూలుగా అనిపించింది."

"మా ఇద్దరికీ చాలా పోలికలునాయి. ఇద్దరికీ ఉంగరాల జుత్తు, ఒకేలాంటి చేతులు, ఆకుపచ్చ కళ్లు" అని టేలర్ వివరించారు.

మట్జేమ్స్, టేలర్‌కు మొట్టమొదట ఒక సంక్లిష్టమైన గోపురంలాంటి శిల్పాన్ని చూపించారు.

"ఆ తలుపు తీసి, లోపల ఒక గడియ తీసి, దీన్ని పక్కకు జరిపి అక్కడ లోపలికి జాగ్రత్తగా చూస్తే నా పేరు చెక్కి కనిపిస్తుంది. అతను చేసే శిల్పాల్లో ఎక్కడో ఒకచోట నా పేరు చెక్కుతాడు. మనం వెతుక్కోవాలి. ఇది చాలా సరదా కలిగించే విషయం" అని టేలర్ అన్నారు.

కళాకారుడిగా తన పని మళ్లీ ప్రారంభించడానికి టేలర్ అతనికి ఒక ప్రేరణగా నిలిచారు అని చెప్పడానికి ఇదొక సంకేతం.

ఈసారి తన ప్రదర్శన చూడానికి టేలర్, మట్జేమ్స్ ని ఒహియోకి ఆహ్వానించారు.

"నేను తప్పక వెళ్లాలనుకునాను. ఇన్నాళ్లూ అన్నిటినుంచీ దూరంగా పారిపోతూ వచ్చిన నేను స్థిరచిత్తుడిగా మారాను అని చెప్పడానికి ఇదొక సదవకాశంగా భావించాను" అని మట్జేమ్స్ అన్నారు.

అతను ఒహియో వెళ్లినప్పుడు టేలర్ ఒక సోఫాను కళాత్మకంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. మట్జేమ్స్ ఆ పనిలో సహాయం చేస్తూ కూతురు కళానైపుణ్యాన్ని కళ్లారా చూసి ఆనందించారు.

"గృహోపకరణాలను కళాత్మకంగా తీర్చిదిద్దే కళ నా తల్లినుంచీ నాకు వచ్చింది. ఆ సోఫా తయారీలో నా తండ్రి కూడా పాలుపంచుకోవడం వలన అది మా ముగ్గురి పనితనానికీ ప్రతీకగా నిలిచింది" అని 29 యేళ్ల టేలర్ అన్నారు.

అప్పటినుంచీ ఆ తండ్రీకూతుళ్ల బంధం నిరాటంకంగా సాగుతోంది. తన నాన్నమ్మ, తాతయ్యలు కూడా కళాకారులే అని తెలుసుకుని టేలర్ అబ్బురపడ్దారు.

కూతురు పుట్టాక ఎందుకు పారిపోయిందీ మట్జేమ్స్ వివరించి చెప్పారు. టేలర్ అతని పరిస్థితిని సహృదయంతో అర్థం చేసుకున్నారు.

‘‘కుటుంబం నుంచి పారిపోయే తండ్రుల పట్ల సమాజంలో ఒక నిరసన ఉంటుంది. ఆ సమయానికి అతను చేసినది అతని వరకూ సరైనదే. ఒక రకంగా చూస్తే నాకూ మంచే జరిగింది. దీన్ని నెగటివ్‌గా చూస్తూ అతనిపై కోపం పెంచుకోవడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. సానుకూలంగా స్పందించడం వలన నా కుటుంబం విస్తరించింది. కొత్త బంధాలు ఏర్పడ్డాయి. జీవితం ఆనందమయమైంది’’ అంటూ టేలర్ ముగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)